99 సెకన్ల కథలు – పుస్తక పరిచయం

2
11

[ప్రముఖ రచయిత, పాత్రికేయులు, సీనియర్ సంపాదకులు శ్రీ జి. వల్లీశ్వర్ రచించిన ‘99 సెకన్ల కథలు‘ పుస్తకావిష్కరణ సభలో శ్రీ పాణ్యం దత్తశర్మ చేసిన ప్రసంగ పాఠం].

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత, పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్ గారి ’99 సెకన్ల కథలు’ కథా సంకలనం, సాహిత్య రంగంలో ఒక వినూత్న ప్రయోగం. కేవలం ఒకటిన్నర నిమిషాల్లో (9 సెకన్లు ఎక్కువ) చదవగల కథలను ఆయన వ్రాశారు. సంచిక ఎడిటర్, సోదరులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ఆ కథలను గురించి చెప్పినప్పుడు వాటిని వెంటనే చదవాలని నాకు కుతూహలం కలిగింది. ఆ సంకలనాన్ని పరిచయం చేస్తూ మాట్లాడలని ఆయన చెప్పినప్పుడు మరింత సంతోషించాను.

‘Brevity is the soul of wit’ అని విలియమ్ షేక్‌స్పియర్ అన్నారు. ‘క్లుప్తతే మేధస్సుకు ఆత్మ’ అని ఆయన క్లుప్తంగా సాహిత్య పరమార్థాన్ని చెప్పారు. ‘Small is beautiful’ అన్నారు జాన్ కీట్స్. ఈ రెండు సూక్తులూ వల్లీశ్వర్ గారి కథలకు సరిగ్గా సరిపోతాయి.

Francis Bacon అను వ్యాస రచయిత ఉన్నారు. Well-knit, crispy and thought provoking వాక్యాలను, అవీ చిన్న చిన్నవి వ్రాసి, ఆయన పాఠకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన వాక్యాలు ఇలా ఉంటాయి:

‘Envy takes no holidays’.

‘Some books are to be tasted, others to be swallowed, and a few to be chewed and digested.’

వల్లీశ్వర్ గారి కథలు కూడా అలాగే ఉంటాయి. చెప్పే theme లోతైనది ఐనా, దాన్ని lighter vein లో చెప్పడం ఆయన ప్రత్యేకత. ‘పుస్తకాలు ఎలా చదవాలి’ అన్న దాని గురించి బేకన్ చెప్పిన మాటల్లో, మూడవ రకానికి చెందుతాయి ఈ కథలు. బాగా నమిలి, మ్రింగి, జీర్ణం చేసుకోవాల్సిన కథలు ఇవి. అందులోని పరమార్థం self explanatory గా ఉండడం సామాన్యమైన విషయం కాదు. వెన్న కలిపి చేసిన మురుకుల్లా కరకరలాడుతూ ఉంటాయి.

ప్రతీ కథ ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే. Personality development ను abstract గా, theoretical గా చెబితే దాని ప్రభావం అంతగా ఉండదు. కాని దాన్ని fiction గా మార్చి చెబితే పాఠకులు త్వరగా ప్రభావితులవుతారు. అరిస్టాటిల్ మహాశయుడు తన ‘Politics’ అనే లాక్షణిక గ్రంథంలో, సాహిత్య ప్రక్రియ ఏదైనా, దాని import (అంటే పాఠకుడిపై దాని ప్రభావం) అద్భుతంగా ఉండాలని చెప్పాడు. మన లాక్షణికులు ‘కావ్యాదర్శము’లో

‘కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే

కాంతాసమ్మితయోపదేస యుజే.’

అని కావ్య ప్రయోజనాన్ని చెప్పారు. ‘Politics’ లో అరిస్టాటిల్ చెప్పిన import అంటే ఇదే. అంటే ‘pleasure aspect’ ను glorify చేయడం జరిగింది.

డా. జాన్సన్ ఇలా అన్నారు.

‘Poesy instructs as it delights’

పానుగంటి వారి ‘సాక్షి’ ఉపన్యాసాలు, చిలకమర్తి వారు ‘గణపతి’, గురజాడ వారి ‘కన్యాశుల్కం’, విశ్వనాథ వారి ‘హాహాహుహు’, ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ ఇందుకు ఉదాహరణలు.

మానవ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో, జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో, వల్లీశ్వర్ గారి కథలు మనకు నేర్పుతాయి ఎంతో ఆహ్లాదకరంగా. ఆ క్రమంలో ఆయన భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా భారతీయ సనాతన ధర్మంలోని అంశాలను తీసుకుని, సందర్భోచితంగా తమ కథల్లో జొప్పిస్తారు. ఆయన కథల్లో ఈ క్రింది అంశాలను నేను గమనించాను.

  1. సమస్యలకు పరిష్కారం (Problem Solving)
  2. క్లిష్ట పరిస్థితుల నిర్వహణ (Crisis Management)
  3. ఉపశమన దాయిత్వం (Solace – giving)
  4. అనుభవం ద్వారా ఉపదేశం (teaching through experience)

ఇవన్నీ denotative గా కాకుండా connotative చెబుతారు వల్లీశ్వర్ గారు.

ఇంచుమించు చాలా కథల్లో ‘శేషయ్య’ గారే హీరో. Charles Dickens గారి Mr. Pickwick లాంటి వాడు ఈయన. ‘సాక్షి’ వ్యాసాల్లో జంఘాల శాస్త్రి లాంటివాడు. ఇలాంటి ‘సూత్రధారి’ ఐన character ను ఆంగ్ల సాహిత్యంలో protagonist అంటారు.

శేషయ్య గారిలో మనకు హితోపదేశ గురువైన ఒక విష్ణుశర్మ కనబడతాడు. మానవ మనస్తత్వాలను కాచి వడబోయడంలో ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్ కనబడతాడు. ఆధ్యాత్మిక కోణాలను ఆవిష్కరించేటపుడు ఒక బెర్ట్రండ్ రస్సెల్ కనబడతాడు. ‘Literature teaches science its duty’ అన్న మహానుభావుడు. వినాలనిపించేట్లు కథ చెప్పడంలో ఒక విద్యాప్రకాశానందగిరి స్వామి కనబడతారు.

కథలు చదివేటప్పుడు ఎక్కడా “ఇదెలా కుదురుతుంది? అలా అవటానికి వీలు లేదే?” అన్న అనుమనాలు మనకు రానే రావు. అన్ని కథలు flesh and blood తో down to earth గా ఉంటాయి. శేషయ్యగారు గొప్ప సైకాలజిస్టు, సామాజిక కౌన్సిలర్. ఎవరినైనా, ముఖ్యంగా తప్పుదారిలో వెళ్ళేవాళ్ళను logical గా, convincing గా చెప్పి, వారిని మంచి మార్గంలోకి మళ్ళించగలడు. అలా గొప్ప reformist ఆయన.

ఆయన స్వతహాగా నిజాయితీపరుడు. వాక్కులలో స్థితప్రజ్ఞత ఆయన సొంతం. శ్రీరామలక్ష్మణులు తొలిసారి ఆంజనేయస్వామి వారిని కలుసుకున్నప్పుడు ఆయన వారితో మాట్లాడిన తొలి మాటలు ఎంత balanced గా, ఎంత measured గా ఉన్నాయో రామచంద్రుడు తన తమ్మునితో చెబుతాడు. శేషయ్య గారి మాటలు కూడా సమతౌల్యత తప్పకుండా, సూటిగా ఉంటాయి. నా అనుమానం ఏంటంటే ఈ శేషయ్య గారు ఎవరో కాదు, మన వల్లీశ్వర్ గారే అని. ‘No writer can escape from his self’ అని Charles Dickens గారన్నట్లు ఏ రచయిత ఐనా తన వ్యక్తిత్వాన్ని తన రచనల్లో ప్రతిఫలింపజేయకుండా ఉండలేడు కదా!

ఇక కొన్ని కథలను గురించి చర్చిద్దాం.

ఒక కథలో ‘ఆత్మీయులు చనిపోతే ఏడవడం’ అంత మంచిది కాదని చెప్పారు. ‘మరణాంతాని వైరాణి’ అన్న సంస్కృత సూక్తిని, ‘జాతస్యహి ధ్రువో మృత్యుః’ అన్న గీతా సూత్రాన్ని ఈ కథలో వివరించారు. అంత్యక్రియల ప్రాముఖ్యతను చెబుతూ, చనిపోయిన జీవికి కూడా ఆకలి ఉంటుంది, దాని ఆహారం ఇవ్వాలి, కన్నీళ్ళు కాదు అంటారు. ప్రసాద్ చిన్నాన్నను పిలిపించమంటారు శేషయ్యగారు. వాళ్ళు రారేమో, నాన్నకు చిన్నాన్నకు గొడవలున్నాయంటే – “రావణాసురుడికి విభీషణుడికి ఉన్న శత్రుత్వం కంటే పెద్దవా ఈ విభేదాలు?” అంటారాయన. అయినా విభీషణుడు అవన్నీ మరచి, రాముని ఆదేశం మేరకు అన్నకు అంత్యక్రియలు, అపరకర్మలు నిర్వహించాడని చెప్పి ప్రసాద్‍కు కర్తవ్య బోధ చేశారు.

ఇక ‘తెలుగు భాష వైభవం’ అనే కథ తెలుగు భాషకు పట్టిన దుర్గతిని హాస్యస్ఫోరకంగా వివరిస్తుంది. నందనరావు అనే NRI అమెరికాలో తెలుగు లెక్చరర్‍గా పదవీ విరమణ చేసి ఇండియా కొస్తాడు. అక్కడ ఒక్క తెలుగు వేదిక ఉంటుంది. దాని అధ్యక్షుడు సర్వమంగళరావు. ఆయన పేరులో కూడా హాస్యం, ఔచిత్యం ఉన్నాయి. భాషను ‘సర్వమంగళం’ పాడిస్తాడన్న మాట. ఇక పత్రికల్లో పదాలను తప్పుగా రాయడం ప్రస్తావిస్తాడు.

‘ఆహూతులు’కు బదులు ‘ఆహుతులు’;

పత్రికా సంపాదకుడొకాయన ‘ఉచ్ఛారణ’ అని రాస్తాడు.

‘ఐంద్రజాలికుడు’ అనే పదం తెలియక ‘ఇంద్రజాలికుడు’ అంటారు.

నేను ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రతి ఆదివారం ఎడిట్ పేజీలో ‘దత్తవాక్కు’ అనే కాలమ్ గత రెండు నెలలుగా వ్రాస్తున్నాను. దానిలో ‘తెలుగా, తెగులా?’ అనే ఆర్టికల్ వ్రాశాను. అదీ ఇలాంటిదే. త్వరలో వస్తుంది. సినిమాల్లో విలన్ పాత్రల ఊత పదాలను (ఉదా: తగ్గేదేలే!) పతాక శీర్షికలకు పెట్టడాన్ని; ప్రారంభం అయిందనడానికి ‘షురూ’ అనడాన్ని; సాక్షాత్తు ప్రధాని అంతటివాడు సమావేశానికి ‘డుమ్మా’ కొట్టాడని రాయడాన్ని వ్యంగ్యంగా విమర్శించాను. Punctuation Marks సరిగా లేకపోతే ఎలాంటి విపరీతార్థాలు వస్తాయో రంగనాయకమ్మ గారు ‘ఇదీ తెలుగేనా?’ అన్న వ్యాసంలో విమర్శించారు. ముఖ్యంగా నక్సలైట్ల తెలుగును ఆమె ఎగతాళి చేశారు. ఒక గోడ మీద ఇలా రాసి ఉందట

“స్త్రీలు, దళితులపై దాడులు చేస్తున్నారు. దీన్ని ఖండించాలి!”

స్త్రీలపై, దళితులపై.. అని ఉండాలి!

ఇంకో కథలో ఫల్గుణరావనే ప్రొఫెసర్ ఉంటారు. ఆయన కూతురి పెళ్ళి జరుగుతూంటుంది. వియ్యంకుడు బ్రహ్మశ్రీ యాజ్ఞవల్క్యుడు గారు. కాబోయే కోడలికి మెల్లకన్ను ఉందని, పెళ్ళిచూపుల్లో దాన్ని దాచిపెట్టి పెళ్ళి చేస్తున్నారని, ఈ పెళ్ళి ‘ఏ రకంగా’ చేస్తాడో చూస్తానని రంకెలు వేస్తుంటాడు. అప్పుడు మన protagonist రంగ ప్రవేశం చేస్తారు. ధర్మశాస్త్రాలు అన్నీ పుక్కిట పట్టినవారు, మీకు ఒకరు చెప్పాలా? అంటారు. వ్యాస-ధర్మజ సంవాదంలో, ఏ పరిస్థితుల్లో ‘బొంకవచ్చు నధిప’! అని వివరిస్తారు. హాని చేయని అసత్యాలు ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో నిషిద్ధం కావని ఆ ఉద్దండ పండితుడిని శాంతపరుస్తారు. చివర్లో ఆయన పెళ్ళి ‘ఏ రకంగా’ చేస్తాడో అనలేదని, ‘ఏ స్థాయిలో’ అన్నాడని సర్దేస్తాడు. కథ సుఖాంతం. వల్లీశ్వర్ గారి అన్ని కథలూ సుఖాంతాలే. పాజిటివ్ దృక్పథం ఆయన కథలకు ప్రాణం.

‘ఛెళ్లుమన్న మాట’ అన్న కథలో, టైటిల్ లోనే కొరడాతో కొడితే వచ్చే శబ్దాన్ని సూచించారు. ‘ధ్వని’ని పదంగా మార్చడాన్ని ఇంగ్లీషులో ‘onomatopoeia’ అంటారు. బావమరిది పరాంకుశం, బావ వేంకటేశానికి పాపయ్య అనే తమ పాలేరు ద్వారా మామిడిపళ్ళు పంపుతున్నాననీ, అతనికి సిటీ కొత్త కాబట్టి, కాస్త స్టేషన్‍కు వచ్చి రిసీవ్ చేసుకొమ్మని ఫోన్ చేస్తాడు. వేంకటేశం మరచిపోతాడు. పాపయ్య అతనికి ఫోన్ చేస్తే, తమ యింటికి ఎలా రావాలో కొండ గుర్తులు చెబుతాడు. అవి రోడ్డు మీద దుకాణాలు. అవి కనబడక తికమకపడి ‘పచ్చమేడ’ అని చెప్పాడు కాబట్టి, ఎవరో విదేశీయుల ఇంట్లోకి వెళతాడు. వాళ్ళు ఆ అమాయకుడిని పోలీసుకులకు అప్పచెబుతారు. పోలీసులు వేంకాటేశానికి ఫోన్ చేసి, అతన్ని తీసుకుపొమ్మంటారు. అదంతా సరే, చివర్లో పాపయ్య వేంకటేశానికి ఇలా చెబుతాడు “అయ్యా దుకాణాలు మారతాయి గాని దిక్కులు మారవు. సూరీడు మారడు. మేం పల్లెటూరి వాళ్ళం. తూర్పు, పడమర ఇలా చెప్పి ఉంటే మీ యిల్లు సులభంగా కనుక్కుని ఉండేవాణ్ణి”. ఆ మాటే ఛెళ్లుమని తగులుతుంది. “ప్రకృతి శాశ్వతం, మనిషి చేసే ప్రపంచం అశాశ్వతం” అని పాపయ్య ద్వారా చెప్పించారు.

‘శేషయ్య భారతం’లో ధర్మరాజు యక్ష ప్రశ్నలకు ఇచ్చే జవాబులో “బ్రతికి ఉండీ చచ్చినవారితో సమానమెవరు?” అన్నదానికి “అతిథులను, తల్లిదండ్రులను సేవించనివాడు” అని శేషయ్య మురళికి చెబుతారు. మురళి తన తండ్రికి ‘భీమరథశాంతి’ జరిపేటప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. కాలక్రమంలో విస్మరింపబడుతున్న ‘భీమరథశాంతి’, ‘సహస్రచంద్రదర్శనం’ లాంటి events యొక్క ప్రాశస్త్యం ఈ కథలో తెలిపారు రచయిత.

ఇక ‘దంతధావనం’, నవ్విస్తూనే ఆలోచింపజేసే కథ. ఈ కాలం పిల్లలకు ఇంగ్లీషెక్కువయి పోయి, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అపురూపమైన పదాలంటే ఏమిటో తెలియవు. డెబ్భై ఏళ్ళ సీతారామయ్య. ఒక మనవడు, ఒక మనవరాలు. ఆయన అన్నీ సత్సంప్రదాయపు మాటలే మాట్లాడతాడు. దంతధావనం, శయ్య, దూర్వాణి, సులోచనాలు, అల్పాచమానం, అలా.. ఆ మాటకొస్తే, పెద్దల కెంత మందికి తెలుసు? పాశ్చాత్య పోకడలు పోయే ఆ పిల్లలు తాతగారి మాటలు అర్థం కాక బిక్కమొగాలు వేస్తారు. స్కూలు ఫైనల్ వరకు తెలుగును నిర్బంధ భాషగా ఉంచాలనీ, ఇంగ్లీషు కూడా ముఖ్యమే కాని తెలుగును మరచిపోకూడదనీ ఈ కథ చెబుతుంది. దీన్ని చదువుతుంటే మా నాన్నగారు శతావధాని, పౌరాణిక రత్న, పాణ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు నాకు గుర్తొచ్చి, కళ్లు చెమర్చాయి. ఆయన సంస్కృతాంధ్రాల్లో మహా పండితుడు. తులసి చెట్టు రెమ్మలను ‘ప్రరోహాలు’ అనేవారు. పసుపును ‘హరిద్రం’ అనీ, అక్షింతలను ‘అక్షతలు’ అనీ అనేవారు. వర్షం పడుతుంటే ‘సుభిక్ష సూచన’ అని సంతోషపడేవారు. ఆయన తిట్టే తిట్లు కూడా పాండిత్యస్ఫోరకంగా ఉండేవి. అశక్త దుర్జనుడు, కాష్టకుడ్యాశ్మసన్నిభుడు, అవిచారితరమణీయం, అవ్యున్నత ప్రాతిపదిక.. అట్లాగ.

‘కథశక్తి’ అన్న కథలో సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ పవక్ తననెప్పుడో ప్రతికూల వ్యాఖ్యలు (Adverse Remarks) వ్రాసి అవమానించిన జి.కె. రావ్ అనే అధికారిని, తానూ అలాగే చేసి, అతడు చీఫ్ సెక్రటరీ కాకుండా అడ్డుకుని, పగ తీర్చుకుందామనుకున్నాడు. మరి మన శేషయ్య గారున్నారు కదా! ఆయన కలాంటివి నచ్చవు. హనుమంతునికి సీతమ్మవారు చెప్పిన పులి-మనిషి-భల్లూకం కథ పవన్‍కు చెబుతారాయన. అపకారం చేసినవారికి సైతం ఉపకారం చేయడమే ఉత్తమ సంస్కారం అని చెబుతారు.

“పగయడగించు టెంతయు శుభంబడి తెల్ల్స,

యడంగునే పగన్ పగ” అన్న తిక్కన గారి పద్యాన్ని కథగా మలిస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. హితోపదేశం నిండా ఇలాంటి కథలే. వాటిని సోషియలైజ్ చేయడంలో వల్లీశ్వర్ ఘనులు.

‘నిశ్చలమైన నీళ్ళు’ అనే కథ ‘మనిషి అంతర్ముఖుడు కావడం ద్వారా, ఫలితానికి సిద్ధమవటం ద్వారా, భయం పోయి, మనసు నిశ్చలమై, అది పరిష్కారాన్ని చూపగలుగుతుంది. నిశ్చలమైన నీటిలో మనిషి ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది’ అని crisis management పాఠాన్ని అరటిపండు ఒలిచి తినిపించినట్లు చెప్పారు. ‘Accept life as it is’ అన్న సూత్రాన్ని పాటిస్తే మనిషికి ఉద్విగ్నత నశిస్తుందని వివేక్ పాత్ర ద్వారా నిరూపించారు. ‘దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః’ అని గీతలో చెప్పాడు భగవంతుడు. శేషయ్యగారికి అఫీషియల్ ప్రొసీజర్స్‍లో కూడా మంచి పట్టు ఉంది. చెక్ మీద సంతకం పెట్టిన జి.ఎమ్. ఫైనాన్స్, కంప్యూటర్లు కొనే డబ్బుతో ఉడాయించిన పర్ఛేజ్ ఆఫీసర్ కుమ్మక్కు అయినారని, వివేక నిర్దోషి అనీ తేలేలా మార్గదర్శనం చేస్తారు protagonist.

చివరగా ‘గీతోదయం’ అన్న కథను విశ్లేషించి, ముగిద్దాం. నవనీతం, గీత దంపతులు. ఇద్దరూ ఉద్యోగస్థులే. Package లు, హోదాల విషయంలో వారి మధ్య ‘clash of egos’ వచ్చి, గొడవ పడుతూంటారు. వారిని ‘తత్త్వవిదానందస్వామి’ వారి అనుగ్రహభాషణానికి తీసుకుపోతారు శేషయ్యగారు. పేరు చూడండి, ఎలా పెట్టారో. ‘తత్త్వం తెలిసిన స్వామి’ ఆయన. మానవ జీవిత తత్త్వం. ఆయన భగవద్గీతను ఉటంకిస్తారు. ఎంతటి స్వాముల వారయినా భగవద్గీతను విస్మరించలేరు కదా!. “కోపం నుండి మోహం, మోహం నుండి స్మృతి విభ్రమం, తద్వారా బుద్ధి నాశం కలుగుతాయి. కోపం విచక్షణా శక్తిని హరిస్తుంది.”

నవనీతం అంగీకరించడు. ఆత్మగౌరవం కలవాడు కోపగించుకోకుండా ఉండలేడంటాడు. తిరుగు ప్రయాణంలో కారు డ్రైవింగ్‌లో ఒక యాక్సిడెంట్ కాకుండా చూస్తాడు నవనీతం. ఎలా చేయగలిగినావని శేషయ్య ప్రశ్నిస్తే, ‘పరిశీలన, సాధన వల్ల’ అని జవాబిస్తాడు.

“సంభాషణ కూడా డ్రైవింగ్ లాంటిదే” అంటారు శేషయ్యగారు. ‘మాట తూలితే’ మానవ సంబధాలు మంట కలుస్తాయి. వాగ్యుద్ధాలు అదుపు తప్పకూడదని హితవు పలుకుతారు. నవనీతం realize అవుతాడు.

షెరిడాన్ రాసిన ‘Ways of the World’ అనే నాటకంలో ఇలాంటి clash of egos గురించి విశ్లేషిస్తూ Bonamy Dobree అనే విమర్శకుడు ఇలా అంటారు:

“Marriages can be successful only when the ‘otherness’ of the other individual is recognised and respected”.

ఈ తరం భార్యాభర్తలకు eye-opener ఈ కథ.

ఈ కథలను సమీక్షించి, నా పరిశీలనకు పదునుపెట్టుకునే అవకాశం ఇచ్చిన ‘సంచిక’కు కృతజ్ఞతలు.

***

99 సెకన్ల కథలు (కథాసంపుటి)
రచన: జి. వల్లీశ్వర్
ప్రచురణ: ఎమెస్కో బుక్స్, హైదరాబాద్
పుటలు: 272
వెల: ₹175
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, విజయవాడ. 0866-2436643
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

ఆన్‌‍లైన్‌లో

https://www.amazon.in/99-Seconla-Kathalu-%E0%B0%B8%E0%B1%86%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/dp/B0BB2DGK6J/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here