అండమాన్ అనుభూతులు-6

0
3

[box type=’note’ fontsize=’16’] అక్కడ అడుగుపెడితే ‘హెవెన్ లో లాక్’ అయినట్లే అని భావించే హేవలాక్ ద్వీపం గురించి వివరిస్తున్నారు ఎన్.వి. హనుమంతరావు. [/box]

“హెవెన్ లాక్” లో విహారం-1:

[dropcap]అం[/dropcap]డమాన్ ద్వీపసమూహంలో అడుగుపెట్టిన ప్రతివారు తప్పనిసరిగా చూడాల్సిన, చూడదగ్గ ప్రదేశం “హేవలాక్” ద్వీపం. ఇక్కడకు వచ్చిన కొత్తలో దీని గురించి తెలుసుకుందామని మా ఆఫీసులో ఓ మిత్రుడిని కదిలించాను. ఇది హేవలాక్ కాదు అక్కడ అడుగుపెడితే “హెవెన్ లో లాక్” అయినట్లే అని చమత్కరించాడు. తప్పకుండా చూడమని ప్రోత్సహించాడు. అంత అందమైన ప్రదేశానికి ఒంటరిగా ఎందుకు వెళ్ళటమని వేసవి వరకు ఆగాను. హేవలాక్ లోని “రాధానగర్ బీచ్” ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో ఆసియా ఖండంలోని టాప్ 10 బీచ్‌ల గురించి ఓ పెద్ద వ్యాసం చదివాను. ఆ పదిలో ఈ “రాధానగర్ బీచ్“ వుండటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ నేను ఇక్కడకు వస్తానని ఆ రోజు కూడా అనుకోలేదు. అంతా విధి లిఖితం. సరే మే నెలలో నా మేనకోడలు గాయత్రితో పాటు మా కుటుంబం దిగింది. ఇక సందడే సందడి. ఇక ప్రయాణ ఏర్పాట్లు మొదలు పెట్టాము.

పోర్ట్ బ్లయర్‌లోని ఫోనిక్స్ బే జెట్టీ నుండి ప్రయాణం. ఈ హేవలాక్ ద్వీపానికి వెళ్ళాలంటే రెండు రకాల సాధానాలు వున్నాయి. ఒకటి ప్రభుత్వం వారి ఫెర్రీ. దీని వెల ఐదు వందలు. ఇక రెండవది ప్రయివేటు వ్యవస్థల క్రూయిజ్. దీని ఖరీదు పదుకొండు వందలు. రేటు ప్రకారం సౌకర్యాలు వుంటాయి. ప్రస్తుతానికి నేను ఇక్కడ లోకల్ కాబట్టి మాకు ప్రభుత్వ ఫెర్రీలో తక్కువ ధరకే టికెట్ దొరుకుతుంది కాబట్టి అందులోనే బయలుదేరాము.

ఒక రోజు అక్కడ బస చేయాటానికి నిర్ణయించుకుని “ఎల్ డెరాడో (El deraado)” అనే హోటల్‌లో ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాను. ఒక శనివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా హేవలాక్‌లో దిగాము. ముందుగానే ఆ ప్రాంతం గురించి తెలుసుకోవటం, కొంత చదవటం వలన పెద్దగా కంగారు పడలేదు. ఆ ప్రాంతం అంతా యాత్రికులతో సందడిగా, కోలాహలంగా వుంది.

మొత్తం రెండు రోజులు అన్నీ చూడటానికి ఒక కారు మాట్లాడుకుందామనుకున్నాను. కానీ వాళ్ళ రేట్లు చూసి కళ్ళు తిరిగిన మాట వాస్తవం. చివరకు ఓ ఆటో అబ్బాయితో బేరం కుదిరింది. అతని పేరు తన్మయ్. బెంగాలీ బాబు. అన్నీ దగ్గరుండి చూపించి తిరుగుప్రయాణంలో జట్టీ దగ్గర దించుతానన్నాడు. ఈ నిర్ణయం నిజంగా మాకు బాగా ఉపయోగపడింది. హేవలాక్‌లో “స్కూబా డైవింగ్” చాలా ప్రసిద్ది. సముద్రం లోపలికి వెళ్ళి అక్కడి అందాలు చూసే అద్భుత అవకాశం. జెట్టీ దగ్గరే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మూడువేలు చెల్లించి టికెట్ కొనుక్కోవాలి. మనం ఎక్కడ స్కూబా డైవింగ్ చేయాలో అందులో వుంటుంది. అలా మా గాయత్రి కోసం ఒక టికెట్ తీసుకుని సరాసరి హోటల్ కెళ్ళాము. ఆటో మమ్మల్ని దించి ‘మీరు టిఫిన్ కూడా ఇక్కడే చేయండి ఓ గంట తరువాత వస్తాన’ని తన్మయ్ మాయమయ్యాడు.

సముద్రపు ఒడ్డున హోటల్ చాలా ప్రశాంతంగా వుంది. గదులన్నీ చిన్న చిన్న huts మాదిరిగా వున్నాయి. వున్నంతలో శుభ్రంగానే వున్నాయి. రెస్టారెంటులో దొరికింది తిని మళ్ళీ ఆటో కోసం రోడ్డుమీదకొచ్చి నిలబడ్డాము. రోడ్డు విశాలంగా నిర్మానుష్యంగా వుంది. పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు. ఆటో గురించి చేసిన నిరీక్షణలో అనుమానం మొదలయ్యే లోపు తన్మయ్ ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఆ తరువాత మళ్ళీ అతన్ని గురించి అనుమానించాల్సిన అవసరం రాలేదు. అక్కడనుండి సరాసరి మమ్మల్ని స్కూబా డైవింగ్ దగ్గర దించాడు. ఇక్కడ ఒక గంటపడుతుంది, ఒకవేళ త్వరగా అయిపోతే ఫోన్ చేయండి అని మొబైల్ నెంబరు ఇచ్చి వేరే బేరం చూసుకోవటానికి వెళ్ళాడు. రోడ్డు పక్కన దట్టమైన చెట్లు. వంద గజాలు లోపలికి వెళ్ళగానే సముద్రం.

మా దగ్గర వున్న టికెట్ చూపించగానే మా అమ్మాయిని అక్కడ వున్న శిక్షకులు స్కూబా డైవింగ్ కోసం తయారు చేసి సముద్రంలోకి తీసుకెళ్ళారు. ఓ గంటసేపు నేను, మా ఆవిడ, మా అబ్బాయి ఆ చెట్లలో సముద్రపు ఒడ్డున కాలక్షేపం చేసాము. ఆ తరువాత మా గాయత్రి చాలా ఆనందంగా, ఉత్తేజంగా బయటకు వచ్చింది. సముద్రం లోపల శిక్షకుడు తన కెమెరాతో వీడియో తీస్తాడు. దాన్ని తన మొబైల్ లో download చేసి ఇచ్చాడు. వాటిని చూస్తూ ఆనందిస్తూ ఫోన్ చేయగానే ఆటో వచ్చింది. అక్కడనుండి మళ్ళీ మమ్మల్ని జెట్టీ దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడనుండి “ఎలిఫెంటా” ద్వీపానికి వెళ్ళాలి. ఇక హేవలాక్‌లో మా అసలయిన విహారం మొదలయింది.

“హెవెన్ లాక్” లో విహారం-2:

ఎలిఫెంటా బీచ్ వెళ్ళటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి రోడ్డు మార్గం. అది బాగా చుట్టు తిరిగి వెళ్ళాలిట. అందరూ జల మార్గాన్ని ఎన్నుకుంటారు. ఇది దాదాపు ముప్పావు గంట ప్రయాణం. జెట్టీ పక్కనే చిన్న మర పడవలుంటాయి. మనిషికి 750 రూపాయలు. అప్పటికే బాగా ఆలస్యం అవటం వలన బోటు నిండే సూచనలు కనపడలేదు. కౌంటరులో ఓ అబ్బాయి చార్టెడ్ బోటు తీసుకోమని సలహా ఇచ్చాడు. నలుగురికి కలిపి మూడు వేల రూపాయలు. ఇక చేసేదేమీలేక అలాగే బయలుదేరాము. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ బీచ్‌కు చేరాము. ఆ పడవ నడిపే అబ్బాయి గైడ్‌గా వున్నాడు.

ఎలిఫెంట్ బీచ్ చాలా చిన్నది. పూర్వకాలంలో ఓ ఏనుగు ఆ ప్రాంతంలో ప్రజలను (?) భయబ్రాంతులకు గురిచేసిందిట. అప్పటినుండి ఆ ప్రాంతానికి “ఎలిఫెంట్“ బీచ్ అనే పేరు పెట్టారుట. చిన్నదిగా వున్నా చూడముచ్చటగా వుంది. చాలా మంది యాత్రికులతో కళకళాడుతోంది. సముద్రపు లోతుల్లోని అందాలు చూడటానికి ఇక్కడ కూడా “స్నోర్ కెల్లింగ్” హడావుడి బాగానే వుంది. ఇంతకుముందే స్కూబా డైవింగ్ చేయటం వలన మా గాయత్రి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఇక మా అబ్బాయి కౌండిన్య నీళ్ళలోకి రావటానికి ఇష్టపడలేదు.

మా ఆవిడను సామాన్లకు కాపలా పెట్టి ముగ్గురం సముద్రంలో జలకాలు మొదలు పెట్టాము. ఓ అందమైన మరాఠీ వనిత మెడలో ట్యూబ్ వేసుకుని నీళ్ళలో వయ్యారాలు పోతోంది. నేను మా అబ్బాయి భయం పోగొట్టటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు అమె నాతో మాటలు కలిపింది. మమ్మల్ని కూడా అలాంటి ట్యూబులు తెచ్చుకుని ఆడుకోమని సలహా ఇచ్చింది. మాకు కొంచెం దూరంలో నీళ్ళలో ఒక ట్యూబ్ మీద తేలియడుతున్న తన ఆరేళ్ళ పాపను చూపించి మ అబ్బాయికి ధైర్యం చెప్పింది. ఒక్కో ట్యూబు అద్దె వంద రూపాయలు. అయినా సరే నేను రెండు ట్యూబులు తీసుకుని మేమిద్దరం అలా అలా అలల మీద చాలా సేపు తేలియాడాము. కొద్దిసేపు తరువాత ఒడ్డుకు వచ్చి నేను యథాప్రకారం ఆ ఏనుగు బీచ్‌ను పరిశోధించటం మొదలుపెట్టాను. ఇంతలో మాకు తిరుగు ప్రయాణానికి పిలుపు వచ్చింది. గబగబా సర్దుకుని బోటు ఎక్కాము.

అండమాన్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ పావుగంట సరదాగా సాగిన తరువాత వాన జల్లులు పలకరించాయి. మా దగ్గర గొడుగులు కూడా లేవు. పడవ ప్రయాణం కూడా సాఫీగా సాగటం లేదు. మా గైడు ధైర్యం చెబుతూనే వున్నాడు. వాన పెద్దది అయితే ఎలారా దేవుడా అనుకున్నాను. దేవుడు నా మొర ఆలకించాడు. హఠాత్తుగా వచ్చిన వర్షం అంతే హఠాత్తుగా ఆగిపోయింది. ఇవన్నీ అలవాటయిన పడవ నడిపే అబ్బాయి నవ్వుకున్నాడు. ఎలాగయితే నేమి ఒడ్డుకు చేరగానే మా కోసం తన్మయ్ ప్రత్యక్షమయ్యాడు. మరో పావుగంటకల్లా మమల్ని హోటల్ దగ్గర దించి రాధా నగర్ వెళ్ళటానికి మూడు గంటల కల్లా రెడీగా వుండమన్నాడు. హోటల్‌లో భోజనం ముందే ఆర్డర్ ఇవ్వటం వలన మా ఐటమ్స్ అన్నీ రెడీగా వున్నాయి. గబ గబా తినటం ముగించి మనదేశంలోని అద్బుతమయిన బీచ్ చూడబోతున్నామన్న ఉత్సాహంతో మళ్ళీ రోడ్డు మీదకొచ్చి తన్మయ్ కోసం ఎదురుచూస్తున్నాము.

“హెవెన్ లాక్” లో విహారం-3:

ఆసియాలో అందమైన బీచ్ వేపుగా ఆటోలో మా ప్రయాణం సాగింది. అందమైన రోడ్డూ ఆహ్లదకరమైన వాతావరణంలో రెండు కి.మీ. వెళ్ళగానే ఓ రకమైన పరిమళంతో కూడిన సముద్రపు గాలుల సువాసనలు మా ముక్కులను తాకాయి. ఇంతలో ఆటో కుడివైపు తిరిగి ఓ గతుకుల రోడ్డులో దిగి మమ్మల్ని కూడా ఈ లోకంలోకి తెచ్చింది. అప్పుడు తన్మయ్ చెప్పాడు ఈ ప్రాంతాన్ని “కాలా పత్తర్” అంటారు, ఇక్కడ కూడా ఓ బీచ్ వుంది. రేపు మా ఆఖరి షెడ్యుల్ అదే. మరో ఐదు నిమిషాల్లో రాధానగర్ బీచ్ చేరుకున్నాము. అక్కడ వందల సంఖ్యలో వాహనాలు అంతకు మించి జనం. అంతా కోలాహలంగా వుంది. రోడ్డుకు పక్కగా అన్నీ దుకాణాలు. తన్మయ్ మాకోసం అక్కడే వుంటానన్నాడు. ఐదుగంటల కల్లా బీచ్ ఖాళీ చేయిస్తారు ఈ లోపలే బయటకు రమ్మన్నాడు. సరే అని మేమంతా ఓ పెద్ద ఆర్చ్‌లో నుండి బీచ్ దగ్గరకు వెళ్ళాము.

   

ఎదురుగా ఓ అద్భుత సౌందర్యం. కనుచూపు మేర ఎటు చూసినా సముద్రం. దాదాపు ఆరు అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న అలలు. అ అలల్లో తేలియాడుతున్న ఆబాలగోపాలం. ఎందుకు ఈ బీచ్ మాత్రమే ప్రపంచ ప్రసిద్దిగాంచినది. అది మాటలకందని మధుర భావన. ఆ సౌందర్యాన్ని కనులారా వీక్షించి ఆనందించటమే మనం చేయవలసిన పని. నేనూ అదే చేశాను. తెల్లని ఇసుక. అర్ధ చంద్రాకారంలో ఇరువైపులా ఓ కిలోమీటరు పొడుగు వుండచ్చు. పక్కగా పొడవాటి చెట్లు. మధ్యలో అనంతమైన సముద్రపు హోరు.

అందరం సముద్రంలో దిగాము. ఆరడుగుల అలల చేతిలో బాగా దెబ్బలు తిన్నాము. వాటితో పొరాడాము. ఓ అరగంట తరువాత ఓడిపోయి అలసిపోయి, డస్సిపోయి అనిర్వచనీయమైన ఆనందంతో బయటపడ్డాము. ఆ సంధ్యా సమయంలో సూర్యాస్తమయం దృశ్యం ఒక గొప్ప అనుభూతి. రెండు దశాబ్దాల క్రితం కన్యాకుమారిలో చూసిన సూర్యాస్తమయం గుర్తుకొచ్చింది. కాని ఇది అంతకంటే అందమైన అనుభవం. కుటుంబం అంతా బాగా enjoy చేసారు. మళ్ళీ ఆటోలో హోటల్ రూమ్‌కు చేరుకున్నాము. ముందుగా చెప్పక పోవటం వలన మాకు భోజనం దొరకలేదు. అందరం స్నానాలు చేసి మళ్ళీ రోడ్డు మీద పడ్డాము. రాత్రి వేళ చల్లని గాలిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ ఊళ్ళోకి ప్రవేశించగానే “ఆహార్” శాఖాహార భోజనశాల కనపడింది. మంచి రుచికరమైన భోజనంతో అ రాత్రి సుఖంగానే గడిచింది. మరుసటి రోజు అందరం ఐదు గంటలకే నిద్ర లేచి అరగంటలో బ్రష్ చేసుకుని టీ తాగటానికి రెస్టారెంట్‌కు పరుగుతీసాము. అక్కడనుండి పది అడుగుల దూరంలో గుబురు చెట్ల మధ్యనుండి సముద్రం కనపడుతుంది. అది మిస్ కాకూడదనే అక్కడికి చేరాము. అలా టీ తాగుతూ అక్కడి అందాలను కూడా ఆస్వాదించాము. సరిగ్గా ఏడున్నరకు మా ఆటో డ్రైవరు తన్మయ్ ప్రత్యక్షమయ్యాడు. మరో పావుగంటలో “కాలా పత్తర్” బీచ్‌లో వున్నాము. అది ఒక అందమైన చిన్న బీచ్. గుబురుగా వున్న వృక్షజాలం. సేద తీరటానికి చిన్న గుడిసెలు, అందులో బెంచీలు. మాకు కూడా ఎక్కువ సమయం లేకపోవటంవలన సరిగ్గా ఆస్వాదించలేకపోయాము. ఆ నీరెండలో సముద్రపు ఒడ్డున కొన్ని ఫోటోలు తీసుకున్నాము.

అండమాన్‌లో సమృద్ధిగా దొరికేది కొబ్బరి. ఇక్కడి కొబ్బరి నీళ్ళ రుచే వేరు అని అందరూ అంటారు. అందుకే అందరికి వీటి రుచి చూపించాను.

 

ఆ చిన్న ప్రదేశంలో సరదాగా గడిపిన తరువాత మమ్మల్ని దాదాపు ఎనిమిది గంటలకు మళ్ళీ జెట్టీ దగ్గర దింపాడు. ఈ రెండు రోజులు అతని సహాయాన్ని మరచిపోలేము. మా దగ్గర ఒక్క రూపాయికి కూడ ఎక్కువ మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ తీసుకోలేదు. స్నేహ పూర్వకంగా వీడ్కోలు తీసుకున్నాడు. అక్కడే వున్న హోటలులో టిఫిన్ తిని సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here