48. బిందాస్ ఫ్యామిలీ – ఇక్కడంతా అదో టైపు!

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

నా మాట

[dropcap]ప్ర[/dropcap]తి వ్యక్తికీ యవ్వనంలో పెళ్ళికి ముందు కొద్దో, గొప్పో అనుబంధాలూ/అనుభవాలూ ఉండడం సహజమే! కానీ, వివాహానంతరం లౌక్యంగా వాటికి దూరమవడం విజ్ఞతతో కూడిన పని. లేకుంటే, అవి కుటుంబ పునాదులనే కదిలించే ప్రమాదం ఉంది.

ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది అందరికీ తెలిసిందే! అలా ఇమడ్చాలనుకోవడం శుద్ధ అవివేకం కూడా! ఒక వేళ, ఒక కుటుంబంలోని సభ్యులంతా తమ ‘పాత’ వ్యవహారాలను కొనసాగిస్తే… ? అన్న చిలిపి ఊహకు అక్షర రూపమే… ఈ “బిందాస్ ఫ్యామిలీ – ఇక్కడంతా అదో టైపు!” కథ.

ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు. ఈ పాత్రల ప్రవర్తనా సరళి ఎంత మాత్రం సమర్థనీయమూ, అభిలషణీయమూ కావు. వీటి సృష్టి కేవలం పాఠకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించడానికి మాత్రమే ఉద్దేశించబడింది! కనుక, రంధ్రాన్వేషణ చెయ్యవలదని మనవి చేస్తున్నాను.

– రచయిత.

***

అది విశాఖపట్నంలోని ‘సీ వ్యూ హైట్స్’ గేటెడ్ కమ్యూనిటీ, ఫ్లాట్ నంబర్ 777. లివింగ్ రూమ్ రివాల్వింగ్ ఛెయిర్లో విలాసంగా అటూ, ఇటూ ఊగుతున్నాడు చంద్రశేఖర్. గుబురు గెడ్డం, ఆటోవాలా డ్రెస్‍లో ఉన్న అతని మోహంలో ఓ వింత తేజస్సు ఉట్టిపడుతూంది. “పుణ్య భూమి నా దేశం” పాటలో పూర్తిగా లీనమై దానిని ఆస్వాదిస్తున్నాడతను. మరో పక్క సోఫాలో.. అతని విడో తల్లి పార్వతమ్మ – విడో అయినా ఎప్పుడూ కలర్ ఫుల్ శారీస్‌లో, స్లీవ్‌లెస్ జాకెట్‍లో జాలీగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఐఫోన్లో వాట్సాప్ మెసేజీలు పెడుతూ, మధ్య మధ్యలో పేస్‌బుక్ పోస్ట్‌లకి కామెంట్స్ రాస్తూ యమ బిజీగా ఉంది.

ఇక, డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిల్చొని క్రాఫ్ దువ్వుకుంటూ, కుదరక చెరిపేసి మరోలా దువ్వుతూ తంటాలు పడుతున్నాడు చంద్రశేఖర్ ఏకైక వారసుడు అఖిలేష్. ఈ ఆరడుగుల బుల్లెట్ అంటే ఆ కమ్మూనిటీ లోని ప్రతి అమ్మాయీ పడి చస్తుంది. లోపలికి పోయిన దవడలతో, మిలట్రీ క్రాఫ్‌తో, ఫ్రెంచి మీసంతో తనో టాప్ మేల్ మోడల్లా ఉంటానని అతని ప్రగాఢ విశ్వాసం. మోకాళ్ళ దగ్గర చిరిగిన ఫేడెడ్ జీన్స్, ఇంపోర్టెడ్ టీషర్ట్, మెడ చుట్టూ ఎర్రని గుడ్డ మీద గ్రీన్ డాట్స్ పెద్ద కర్చీఫ్ – ఇదే అతని ఐడెంటిటీగా చెప్పుకోవచ్చు. మూడొచ్చినప్పుడల్లా చేతిలోని కీచైన్ గిరగిరా తిప్పుతూ, తరువాత గుండ్రంగా తిరుగుతూ గాల్లోకి ఎగరడం, చుట్టూ ఉన్న వాళ్లంతా భయం భయంగా ఆ ఫీట్ చూస్తుండగా, నవ్వుతూ ల్యాండవ్వడం, అతనికి కిక్ ఇచ్చే పనుల్లో ఒకటి. అతని కొంటె చేష్టలకి ఏ అమ్మాయయినా బొక్కబోర్లా పడాల్సిందే! అతని కళ్ళలో ఏదో మెగా మేజిక్ ఉందని అతని ఆవారా గ్యాంగ్ ఉచితంగా విస్తృత ప్రచారం చేస్తుంటారు

“ఇదిగోరా తమ్ముడూ … నీకిష్టమైన పెసరట్టు, ఉప్మా.. జీడిపప్పు, నెయ్యి దట్టించి మరీ చేసింది అమ్మ. పీకల్దాకా లాగించెయ్!” ప్లేటు పెట్టి కిచెన్ లోకి తుర్రుమంది చందన. మామూలుగా తమ్ముడనీ, ముద్దొచ్చినప్పుడు ‘బ్రో’  అని పిలుస్తూ ఉంటుంది. అమ్మను కూడా అంతే – గారాలు పోయేటప్పుడు మమ్మీ అని ముద్దుగా పిలుచుకుంటుంది.

“పెసరట్.. పెసరట్… ఈ దిక్కుమాలిన పెసరట్టు తప్పించి ఈ కొంపలో వేరే టిఫినే ఉండదా? అయినా, అనాల్సింది మిమ్మల్ని కాదు. హోల్‌సేల్‌గా రుబ్బేసి ఇందులోనే కదూ తోసేస్తున్నారు!” అంటూ ఫ్రిజ్‌ని సమీపించి – “దీన్ని… దీన్ని… ఇవాళ ఎలాగైనా ఆర్కేబీచ్ లో విసిరేసి రాకపోతే నా పేరు అఖిలేషే కాదు. ట్రస్ట్ మీ సిస్!” అన్నాడు ఆవేశంగా. బాగా ఎమోషనల్‌గా ఉన్నప్పుడు చందనని ‘సిస్’ అని అలా ముద్దుగా పిలుస్తుంటాడతను.

“ఒన్ మినిట్ బ్రో!” అని వెనుతిరిగి మరుక్షణంలో బ్రెడ్, బటర్‌తో ప్రత్యక్షమయింది. అక్క సమయస్ఫూర్తికి ముగ్ధుడై “అపురూపమైన అనురాగానికి అడ్రస్ నువ్వే నా బెహెనా!… నన్ను ఆశీర్వదించవే!” అంటూ ఆమె పాదాలు తాకి, మరుక్షణం స్ప్రింగులా పల్టీలు కొడుతూ పైకెగిరి స్లోగా లాండై, కళ్లప్పగించి అబ్బురంగా చూస్తున్న చందనను పట్టి కుదిపాడు.

తను మార్చిన ప్రొఫైల్ పిక్చర్‌కి ఎన్ని లైకు లొచ్చాయోనని చెక్ చేస్తున్న పార్వతమ్మ ఆ థండర్‌కి ఉలిక్కిపడి భుజాలెగరేసి, ” ఓహ్ మైగుడ్నెస్, యూ గాయ్స్ ఆర్ సో క్రేజీ!” అని కితాబిచ్చి, మొహాన్ని చేటంత చేసుకొని, “ఏమేవ్ కోడలు పిల్లా… ఉన్న పళాన ఇలా లగెత్తుకురా” అని గొంతెత్తి అరిచింది.

ఆ అరుపు విని తుళ్ళిపడి, స్టవ్ మీద పాలగిన్నెను దించబోయి, గాభరాలో వాటిని కాస్తా తన కాళ్ళ పైనే వంపేసుకుంది విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖర్. కాళ్లపై బొబ్బలు తేలి మంటలు పుడుతున్నా “ఆ.. వస్తున్నా అత్తయ్యగారూ!” అంటూ కుంటుకుంటూనే డ్రాయింగ్ రూమ్ లోనికి పరుగులు తీసింది.

“చూసావా విజ్జూ, నా మనవడి స్టయిల్! ఆ వాడి, ఆ వేడి, ఆ స్పీడ్ – అచ్చమ్ స్టయిలిష్ స్టార్లా లేడూ!… యూ ఆర్ రియల్లీ రాకింగ్ రా అక్కూ!” అంటూ ఓ ఫ్లైయింగ్ కిస్ విసిరింది.

“థాంక్యూ గ్రానీ!” అని, “ఇప్పటికైనా అర్థమైందా.. సిస్, నా రేంజ్ ఏమిటో!” అంటూ చిరంజీవిలా రెండు చేతులతో కాలర్ని పైకి ఎగదోశాడు అఖిలేష్. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని కొడుకుని ఆబగా చూస్తూ ఉండి పోయింది విజయలక్ష్మి. అత్తయ్య వైపు తిరిగి – ” వీడిని చూడ్డానికి నా రెండు కళ్ళూ చాలడం లేదంటే నమ్మండి అత్తయ్య గారూ” అని, “ఇలారా.. నా బుజ్జికన్నా…” అంటూ అఖిలేష్ డొక్కు మొహాన్ని రెండు చేతులతో తడిమి – “అయ్యో.. అయ్యో .. నా మతి మండిపోనూ.. అబ్బాయికి నా దిష్టే తగిలేట్టుంది… ఈ కమ్యూనిటీ మొత్తం కళ్లన్నీ నీ మీదే ఉంటాయిరా…  ఒక్క నిమిషం… ఇలారా.. దిష్టి తీస్తాను” అంటూ మెక్కుకుంటూ బాల్కనీ వైపు పరుగు తీసింది.

“వాట్ మమ్మీ… నువ్వూ, నీ చాదస్తమూ.. ఒక్క మాట చెప్పనా.. ఈ గెటప్‌లో నువ్వెంత ముద్దుగా ఉన్నావో తెలుసా!… మైలవ్లీ మమ్మీ… యూ ఆర్ రియల్లీ ఆసమ్!” అంటూ ఆమె రెండు బుగ్గలూ చిదిమి, “ పెదవే పలికే మాటల్లో తీయని… ” హమ్మింగ్ చేస్తూ బొంగరంలా తిరిగి, పల్టీలు కొట్టి, గాల్లోకెగిరి, దభీమని లాండయ్యాడు.

ఇంతలో ఫోన్ శబ్దం విని, స్క్రీన్ వైపు చూసిన చందన కళ్ళు క్షణంలో శివకాశీ మతాబుల్లా వెలిగాయి. వెంటనే సర్దుకొని, “ఎక్స్‌క్యూజ్ మీ.. బ్రో..” అంటూ ప్రక్కనున్న బెడ్రూమ్‌లోకి దూరి తలుపేసుకుంది. కిలకిలా నవ్వుకుంటూ పరుగెత్తి, అమాంతం మంచమ్మీద దూకేసి, చేతికందిన దిండుని గట్టిగా నలిపేస్తూ – “ఓ.. అభీ.. మై డార్లింగ్…. కోపమొచ్చిందా… ఏమ్మా… ఒక్క నిమిషం కూడా ఆగలేవా! ఏం చెప్పమంటావులే నా దుస్థితి.. ఒక వైపు తమ్ముడు.. మరో వైపు డాడీ.. ఛీ.. పో…. నీకెప్పుడూ అదే ధ్యాస… వట్టి పోకిరీ…. సరే సరే .. ఓకే అన్నాగా…. ఆర్కే బీచ్… అయిదింటికి… సేమ్ స్పాట్.. బై.. సీ యూ!… మ్మ!’ అని కిస్ చేసి, ఏమీ ఎరగని నంగనాచి నత్తగుల్లలా హాల్లోకి ఎంటరయింది.

అప్పటికి పాటల పర్వం పూర్తయి, పేపర్లో లీనమై ఉన్న చంద్రశేఖర్ తలెత్తి.. “ఎవరమ్మా.. ఫోను?” వాత్సల్యం ఉట్టిపడేలా అడిగాడు. బదులుగా చున్నీని అటూ, ఇటూ మెలిపెట్టి తిప్పుతూ, కుడి కాలి బొటన వేలితో నేల మీద సున్నాలు చుడుతూ – “అదీ… అదీ… నా ఫ్రెండ్ నీహారిక డాడీ… సాయంత్రం కంబైన్డ్ స్టడీస్ కని రమ్మంటూంది. వెళ్ళనా నాన్నగారూ!” వినమ్రంగా అడిగింది. డాడీని ఎప్పుడైనా ఇంప్రెస్ చెయ్యాల్సి వస్తే, అలా ‘నాన్నగారూ’ అని గారాలు పోతూ పిలుస్తుంటుంది.

“వెళ్ళమ్మా … వెళ్ళు …. నువ్విలాగే బాగా చదువుకొని సివిల్స్ పాసవ్వాలన్నదే నా చిరకాల వాంఛ. ఈ తండ్రి కోరిక తీరుస్తావు కదూ!” గాద్గదికంగా అన్నాడు.

నాన్నకు దగ్గరగా వెళ్లి  – ” అలాగే డాడీ… అకుంఠిత దీక్షతో అహర్నిశలు శ్రమించయినా సరే మీ అభీష్టాన్ని నెరవేరుస్తాను. ఇట్సె ప్రామిస్! ఐపిఎస్ పాసై నేరస్తుల గుండెల్లో దడ పుట్టిస్తాను. ఆడపిల్లలంటే అబలలు కారని, సృష్టికి ప్రతిసృష్టి చేసే సబలలని నిరూపించి, ఆకతాయిల పాలిట సింహస్వప్నమై, సంఘ విద్రోహులందరినీ చెడుగుడు ఆడిస్తాను… నన్ను ఆశీర్వదించండి నాన్నగారూ!” అంటూ కాళ్ళకు నమస్కరించింది. ఆ దృశ్యం చూసిన పార్వతమ్మ – “చూడరా శేఖర్… ఆ వినయం… ఆ విధేయత…… నా మనుమరాలు మేలిమి బంగారంరా… పెద్దలంటే తల్లికి ఎంత గౌరవం.. ఎంత భక్తి!” అంటూ మెటికలు విరిచి, పేస్‌బుక్‌లో ములిగిపోయింది.

హాల్లో అటూ, ఇటూ తిరుగుతూ – “ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ… ” అని హమ్మింగ్ చేస్తూ ఊగుతున్న కొడుకుతో – “దాన్ని చూసయినా కాస్త బుద్ధి తెచ్చుకోరా వెధవా… ఇంకా ఎన్నేళ్లు వెలగబెడతావురా ఆ బోడి బీకామ్?… ఆ గజనీ, ఘోరీలు సైతం నిన్ను గనక చూస్తే, మరచెంబులో తలెట్టుకొని చావడం మటుకు ఖాయం. అచ్చోసిన ఆంబోతులా ఆ తొట్టి గ్యాంగ్‌తో బేవార్సు తిరుగుళ్ళూ నువ్వూనూ… నలుగురిలో తలవంపులు తెచ్చే నీలాంటి కొడుకుని కన్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి!” అంటూ చెప్పు కోసం కోపంగా అటూ, ఇటూ వెతికి, దగ్గర్లో అది కానరాక, చేసేది లేక చివరికి చేత్తోనే నుదిటిపై కొట్టుకున్నాడు.

ఇంతలో, వంటింట్లోంచి హైరానా పడుతూ పరిగెత్తుకొచ్చిన విజయలక్ష్మి వగరుస్తూ – “చెట్టంత కొడుకుని పట్టుకొని ఏమిటండీ ఆ మాటలు.. ” అంది.

“అంతేనే! వయసు మీరుతున్న తల్లిదండ్రులకు, కొడుకు చెట్టులా నీడనిస్తాడంటారు. కానీ… కానీ… వీడు మనకి పీడను తప్ప ఏమిచ్చాడే!” అంటూ కుమిలిపోసాగాడు.

ఆ మాటలన్నీ వింటున్న అఖిలేష్ కోపంగా చేతిలోని గ్లాసును విసిరేసి, పెద్దగా శబ్దం వచ్చేలా చేతులు రెండూ జోడించి – “అమ్మా, ఆయన్ని కాస్తా ఊరుకోమంటావా ప్లీజ్… ప్రతి రోజూ ఆ సోది వినలేక చస్తున్నామని చెప్పు ఆ పెద్దాయనకి… చూడండీ, నాకూ ఓ రోజొస్తుంది… అప్పుడు తెలుస్తుంది నా పవర్ ఏమిటో!” ఉక్రోషంగా అన్నాడు.

“ఆ రోజు వస్తుందో, రాదో తెలీదు గానీ, ఒక్కటి మాత్రం గ్యారంటీగా వొస్తుంది…. అదేరా… నీ నెత్తి మీద బాల్డ్ హెడ్డు!” చంద్రశేఖర్ మాటలకు కిసుక్కున నవ్వింది చందన.

“హూ .. ఇది ఇల్లు కాదు నరకం!” అంటూ గట్టిగా అరచి, తలుపుని ధభీమని మూసి బయటికెళ్లిపోయాడు అఖిలేష్. అదే క్షణం చంద్రశేఖర్ మొబైల్ రింగయింది.

స్క్రీన్ మీద పేరు చూసి తత్తరపడి కట్ చేసాడు. పక్కనే ఉన్న విజయలక్ష్మి – “ఎవరండీ అది… ఎందుకలా టెన్‌షనవుతున్నారు?” ఆరా తీస్తున్నట్లుగా అడిగింది. అతను మౌనంగా ఉండటంతో అతని చేతిలోని ఫోన్ లాక్కొని కాల్ డేటా చూడబోతుండగా చంద్రశేఖర్ దాన్ని తిరిగి లాక్కొని, భావరహితంగా మాస్టర్ బెడ్రూమ్ వైపుగా నడవసాగాడు. అతనిని ఫాలో అవుతూ – “నా మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆ ఇందిరాదేవి ఫోనే కదూ!” కుంటుతూనే అతని వెంట నడవసాగింది. నడుస్తూనే, “నా దేవుణ్ణి మాత్రం నాకు దూరం చెయ్యకు స్వామీ!”అంటూ మాంగల్యాన్ని కళ్ళకద్దుకొంది.

“అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన మీ అర్ధాంగి దగ్గర కూడా దాపరికాలా… నోరు విప్పండీ… ప్లీజ్!” అంటూ అతన్ని గట్టిగా ఊపసాగింది. వేదాంతిలా తల పంకించి, కిటికీ దగ్గరికి నడిచాడు చంద్రశేఖర్.

నమ్రతగా ఆతని వెంట వచ్చిన శ్రీమతితో.. “దూరంగా కనిపిస్తున్న ఆ కొండల్ని చూడు లక్ష్మీ! బడబాగ్నిలో రగులుతున్నట్లున్నాయి కదూ!… వాటినే ఈ గాగుల్స్ తో చూడు… చల్లగా, హాయిగా ఉన్నట్లు అనిపిస్తాయి. తేడా ఆ కొండల్లో లేదు లక్ష్మీ… మనలోనే ఉంది. ఇక్కడ్నుంచి నునుపుగా కనిపించే ఆ పర్వత శ్రేణులు దగ్గరగా వెళ్లి చూస్తే .. ఎగుడు దిగుడుగా మారిపోతాయి. మనిషి జీవితమూ అంతే! విధి ఆడిన వింత నాటకంలో మనమంతా పావులమే. నన్ను నమ్ము, నమ్మకపో .. ఒక్కటి మాత్రం నిజం .. నా హృదయపు కోవెలలో ఫస్ట్ టైమ్ గుడి కట్టింది మాత్రం నీకే!” అన్నాడు.

చంద్రశేఖర్ మాటలకు విజయలక్ష్మి కళ్ళ నుంచి అశ్రువులు జలజలా రాలాయి.

“దూరంగా ఉన్న ఆ కొండల్ని ఏం చూస్తారు గానీ, వెనకున్న మీ శ్రీమతిని చూడండి సార్!” అంటూ తనవైపుకి తిప్పుకొని.. “ఇప్పుడు చెప్పండి.. నా కళ్ళలో ఏం కనిపిస్తోంది?” అడిగింది చిలిపిగా.

“అరే.. ఆశ్చర్యంగా ఉందే!… నీ రెండు కనుపాపల్లోనూ నా ఇమేజే కనిపిస్తూంది!” కొంటెగా అన్నాడు. “మనసా, వాచా, కర్మణా.. హిందూ స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవమండీ!” అంది అతని ఛాతీ మీది వెంట్రుకలను కెలుకుతూ. “నేనెంత అదృష్టవంతుణ్ణి లక్ష్మీ!” అంటూ ఆర్తిగా ఆమెను గుండెలకు హత్తుకొని, పెదవులపై ముద్దు పెట్టుకోబోయాడు.

“అబ్బా… వదలండి… ప్లీజ్!.. చూడబోతే, రోజురోజుకీ మీరు మరీ శోభనం పెళ్లికొడుకై పోతున్నారు. అటు హాల్లో.. అత్తయ్యా వాళ్ళూ… ప్లీజ్!” అంటూ చెయ్యి విదిలించుకొంది. ఇంతలో చంద్రశేఖర్ ఫోన్ మళ్ళా రింగయింది.

“ఆవిడే… నువ్వు అనుమతిస్తేనే సుమా!” అన్నాడు లౌక్యంగా.

“చూడండీ! మన పెళ్లయి ఇన్నాళ్లయినా, ఏనాడయినా మీకెదురు చెప్పానా! ఒక వేళ చెప్పినా, నా మాట ఎప్పుడు చెల్లింది గనక!…. త్వరగా ముగించి రండి. ఇవాళ మీకిష్టమైన గుత్తి వంకాయ వండాను” భర్త వైపు మరో సారి ఆరాధనగా చూసి కిచెన్ వైపు కుంటుతూ వెళుతున్న భార్య వైపు చూసి జాలిగా నవ్వాడు చంద్రశేఖర్.

***

వంటింట్లోకి తిరిగొచ్చిన విజయలక్ష్మితో – “ఇందిరాంటీ అంటే ఎవరమ్మా!” ఆరా తీస్తున్నట్లుగా అడిగింది చందన.

“ఓహ్… అదా… అదో పెద్ద కధమ్మా … సమయం వొచ్చినపుడు చెప్తాను గానీ, అక్కడ పోపు మాడిపోతుంది, చూడు!” అంటూ తప్పించుకోబోయింది.

“నో వే మమ్మీ … ఇప్పుడే చెప్పాలి … నీ మాంగల్యం మీద ఒట్టు … అంతే!” అంటూ పకపకా నవ్వింది. “అమ్మని ఎక్కడ కొట్టాలో, అక్కడే కొట్టావు కదుటే.. ఇక చెప్పక తప్పుతుందా!” అంది తిరగమోత పెడుతూ.

కిటికీ వెంటిలేటర్ గుండా శున్యంలోకి చూస్తూ, భారంగా చెప్పసాగింది విజయలక్ష్మి.

“అది నైన్ టీన్ ఎయిటీ టూ.. ఫిబ్రవరి ట్వంటీ టూ… ” ఎఫెక్ట్ కోసం అన్నట్లు కాసేపు ఆగింది.

“ఓహ్.. లవ్ స్టోరీనా… అవంటే నేను చెవులతో పాటు నాలుక కూడా తెగ్గోసుకుంటాను. సస్పెన్స్ తో చంపక త్వరగా చెప్పవే ప్లీజ్!” అంది చందన.

“అప్పట్లో… నేనూ, హేమలత చాలా క్లోజ్… ఇద్దరం ఎయిత్ ఫెయిలై, మాట్నీ సినిమాలు చూస్తూ, మధుబాబుని, యద్దనపూడిని చదువుతూ, మధ్యలో బఠాణీలు తింటూ.. బంగారు కలలు కంటూ ఉండే వాళ్ళం. మా ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని సినిమా కధలు చెప్పుకుంటూ పుల్ల ఐస్ తినడమంటే నాకు చచ్చేంత ఇష్టం. ఎప్పుడు ఐస్ బండి వస్తుందాని రోజూ ఎదురు చూసే వాళ్ళం. ఆ క్రమంలోనే పుల్ల ఐస్ అమ్మే రాముడితో నాకు పరిచయమయింది. అనతికాలంలోనే అది ప్రేమగా మారింది. ఏ రోజైనా రాముడు రాకపోయినా, రావడం లేటయినా, విలవిలలాడేదాన్ని. కండలు తిరిగిన రాముడు నా కంటికి ఎన్టీవోడులా కనిపించి కలవరపరిచేవాడు. నేను ముద్దుగా వాణ్ని ‘పుల్లోడా’ అని పిలిచేదాన్ని.

ఒక రోజు రాముడు నన్ను ‘బండరాముడు’ మేట్నీకి పిలిచాడు. సినిమాహాల్లో నా వొళ్ళంతా కితకితలు పెట్టాడు. నేను భయంతో వణికిపోయాను. సినిమా పూర్తి కాకుండానే ఇంటికొచ్చేసాం.” ఊపిరి పీల్చుకుంది విజయలక్ష్మి.

“తర్వాత… తర్వాత ఏవయింది మమ్మీ?” ఆత్రంగా అడిగింది చందన.

“రోజులు సాఫీగా నడుస్తుండగా ఒక రోజు.. అమ్మా, నాన్నా పెళ్ళికని రాజమండ్రి వెళ్ళారు. నాకు తోడుగా హేమలతను ఉంచారు… ఆ రాత్రి భోజనాలయ్యాక, కబుర్లు చెప్పుకుంటుండగా, ఎవరో తలుపు కొట్టారు. నా ఫ్రెండ్ తలుపు తీసి – “లోపలికి రా.. రాముడూ..” అంటూ ఆహ్వానించింది. రాముడు నావైపు అదోలా చూడసాగాడు.

“నేను పక్కన శివాలయంలో హరికథ విని, ఓ గంటాగి వస్తానే.. ఆల్ ద బెస్ట్!” అంటూ ఎంత చెప్పినా వినకుండా తుర్రుమంది హేమలత. మా ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికే తనలా వెళ్లిపోయిందని అర్థమయింది. మా ఇద్దరి అవస్థకు ప్రకృతి కూడా సహకరించింది. కాసేపటికి భోరుమని వర్షం… ఎక్కడో పిడుగు పడ్డ శబ్ధం… ఇంతలో కరెంట్ కూడా పోయింది. నేను భయం భయంగా పుల్లోడి కౌగిలిలో ఒదిగిపోయాను. మా ప్రణయానికి ప్రతిఫలంగా నువ్వు పుట్టావమ్మా! ఈ రహస్యాన్ని నీ గుండెల్లోనే సమాధి చేస్తానని నాకు మాటివ్వు తల్లీ!” అంటూ కళ్ళు తుడుచుకుంది విజయలక్ష్మి. అమ్మ కథ విన్న చందన నిలువెల్లా కదిలిపోయింది.

“ఇంతటి అగ్ని పర్వతాన్ని నీ గుండెల్లో దాచుకొని ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా… నువ్వు… నువ్వు నిజంగా మా పాలిట దేవతవమ్మా… దేవతవు! ఇదంతా విన్నాక, అర్జంటుగా నా కన్న తండ్రిని కనులారా చూడాలని నా మనసు తహతహలాడుతుందమ్మా… ఆ అమృతమూర్తిని ఒక్కసారి నాకు చూపిస్తావు కదూ… ప్లీజ్!” అంటూ భోరుమంది.

ఇంతలో, సడన్ గా ఏదో గుర్తొచ్చినట్లయి, “అన్నట్లు నేనడిగింది ఇందిరాంటీ ఎవరని కదా… మధ్యలో ఈ పుల్ల ఐస్ కథేంటి… నాకంతా అయోమయంగా ఉంది మమ్మీ!” అంది చందన గోముగా.

గుత్తివంకాయకు మసాలా అద్దుతూ- “చూడమ్మా చందూ! ఏదైనా అర్థమైతే వృత్తాంతం.. అదే అర్థం కాకపోతే వేదాంతం అవుతుంది తల్లీ… జీవితమనే బ్లాక్‌బోర్డ్ మీద రాసుకున్న బంగారు కలలనే అక్షరాలపై విధి అనే సర్పం విషాన్ని కక్కి కర్కశంగా వాటిని చెరిపేస్తే, చివరికి మిగిలేది ఏముంటుంది తల్లీ… అంతా శున్యం తప్ప! కానీ ఒక్కటి మాత్రం నిజం.. మనం నవ్వినా, ఏడ్చినా వచ్చేవి కన్నీళ్లేనమ్మా… తమాషా ఏమిటంటే, రెండూ ఉప్పగానే ఉంటాయి… ఏ కన్నీటెనకాల ఏ వ్యథ దాగుందో, కార్చేవాడికి తప్ప చూసేవాడికి ఏం తెలుస్తుందమ్మా!” చీర కొంగుతో కళ్ళొత్తుకుంది.

“కష్టసుఖాలు నాణానికి రెండు ముఖాలని నీ కథ విన్నాక అర్దమయ్యిందమ్మా… లోకమంతా ఎదిరించినా సరే, నీకు నేను తోడుంటానమ్మా! నేను నీ కూతురినమ్మా!” అంటూ అమ్మను మరోసారి కౌగలించుకుంది చందన. తన కళ్ళ నుండి జలపాతంలా కారుతున్న కన్నీటిని తుడుచుకోడానికి చున్నీ కోసం వెదికింది. అభిరాంతో మాట్లాడుతుండగా, తాను నలిపేసిన దిండు కింద అది ఇరుక్కుపోయిందని గుర్తొచ్చి, చేసేది లేక అమ్మ కొంగుతోనే వాటిని తుడిచేసుకొంది. పనిలో పని అన్నట్లుగా, ప్రక్కన వేలాడుతున్న కర్టెన్‌తో ముక్కుని కూడా చీదేసింది.

ఇదిలా జరుగుతుండగా… హాల్లో, కాలు కాలిన పిల్లిలా అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు చంద్రశేఖర్. “ఒసేవ్! నాకసలు భోజనం పెట్టేది ఉందా లేదా? అవతల స్కూల్ వదిలే టైమయింది. నా ఆటో కోసం పిల్లలు ఎదురు చూస్తూంటారు.”

చంద్రశేఖర్ అరుపు విన్న విజయలక్ష్మి.. “అయ్యో… నా మతి మండిపోనూ!” అంటూ కుంటుతూనే భర్తకు లంచ్ ఎరేంజ్ చేసింది.

***