అశ్రుభోగ-1

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ కావ్యం.. దుఃఖం అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దీనిలో ప్రజ్ఞావాదం లేదు. ‘నష్టోమోహః స్మతిర్లబ్దా’ అన్న దశ లేదు. ‘అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యష్యామి’ అనే జగద్గురువు అభయహస్తం కోరుకుంటున్నారు కవి కోవెల సుప్రసన్నాచార్య. [/box]

ఏ దుష్కర్మ ఫలంబు చుట్టుకొనెనో ఏ దిక్కునన్ చూచినన్
పాదై పాపము మొల్కలైత్తినదొ ఆపన్మేఘ వర్షంబుగా
ఏ దౌర్బల్యమొ కామగర్తమున నన్నీడ్చెన్ జనుస్సంఘ మా
పాదించెన్ కృపనేలుకో, వికట పాపౌఘంబు భస్మంబుగా

త్వరపడివచ్చి నా ఎడద తలపులు విచ్చితి నబ్బురంబుగా
దురితమే పున్నెమో ఎరుగుదున్ నను వంచన చేసికొంటి సం
బరమిది పొంగులై దురిత పంకములోనికి జారిపోదునో
ఉరగశయా హృదంతర నియుక్తదయానిధి శ్రీనృకేసరీ

ఆధారంబును వీడి శూన్యమున మాయావర్త మందూగుచున్
స్వాధీనస్థితి కోలుపోయి వివశత్వంబల్లుకో నొక్కడన్
బోధల్ గాథలు బాధలున్ ముసరగా పుణ్యాధ్యదూరుండనై
వ్యాధిగ్రస్తుని వోలె మృత్యునికటప్రాంతంబునన్ జేరితిన్

బుద్దికెరుంగవచ్చు శ్రుతి బోధలు నేర్చిన నేమినిల్చు సం
బద్దుడ నింద్రియంబులకు, మాయకు, సర్వ విష ప్రవృత్తికిన్
విద్ధ వివేకుడన్, తెలిసి వేగిరపాటున దారితప్పితిన్
ఉద్ధతవైరిసంహరణ వ్యోమజటాలక శ్రీనృకేసరీ

పాపదవాగ్ని నిన్నెరుగు పట్టున సూర్యుడవై సుదర్శన
వ్యాపృతివై, అనింధన మహాగ్నివినై యెదనేలుకొందు వ
ద్ధా!, పదయుగ్మమిమ్ము హృదయంబున నిల్పెద నీవ దేశిక
ప్రాపకమూర్తి నీదయిన రాజ దీప్తిని చిల్కరింపవే

ఏనస్సంతతి తట్టుకోదగినదా? ఈనాడు నీకై జనుస్
స్థానంబందున తప్పిపోయితి, వయస్సాయంతనంబందునన్
ప్రాణారణ్యములన్ జరించునెడలన్ త్రయ్యంత రమ్యాక్షరా!
ఈ నీవిప్పుడు బుద్దికందని గుణహ్రీచిత్ర భాగుండవై

పరివారంబున చిమ్మచీకటులు దుర్వ్యాధుల్ దరిద్రంబులున్
పరివారంబున నీర్ష్యలున్ పగలు దుర్వారంబులౌ దుఃఖముల్
చెరయందున్నటులున్న దీ పరిధి అర్చిర్మూర్తి! దేవ ప్రియా!
దురితాబ్దిన్ తరియింపనిమ్ము సురబంధూ, దైన్యమున్ బాపవే

తరుముచువచ్చు కామమయ దైత్యవిమానిత లొంగిపోయి సం
బరపడినానో, కొంతవడి, తత్ఫలమిప్పుడు క్లేశరూపమై
తెరచెను చీకటిండ్లు, కడజేర్చక తప్పదు నీవ వచ్చి యా
తురుడను నీదు మార్గమున త్రోసుకువచ్చెద కావవే శివా!

చూపులతోడ కామమును శుష్మదృగంశుల కాల్చినావొ పా
పాపగలెండబెట్టితివో ప్రాణచిదంబర దీపమూర్తి! నీ
ప్రాపున జేరితిన్ మనసు బంధము లూడ్చవె నాగసేవితా
నీ పదయుగ్మమందదుకనిమ్ము ధరారథరమ్య! శ్రీగళా!

ఎంగిలి పడ్డదో తనువు ఈశ్వర భావన కప్పువడ్డ వే
ళం గమనంబు తప్పినదొ లాస్య మనోహర మృత్యుభావనా
లింగిత మృత్కణంబుల వెలింగిన దివ్య కణంబులన్ తనూ
సంగతి కూర్పవే అఘము సంగతి దూరము దూరమై చనన్

అఘసంహారక! సంశ్రితావన! హృదబ్దాదిత్య నారాయణా!
మఘవాదుల్ మును పాపభావమున దుర్మానంబులం బొందరే
స్వఘసంతాపమునోర్వలేను, కరుణాసమ్మోహ నన్నేలుకో
లఘుకృత్‌సర్వజగత్క! సర్వతరణా! లక్ష్మీపతీ! రక్షవై

ఇంతటి దుఃఖపుం జలధు లెన్నియొ దాటితి నీవు కానరా
వంత సుసూక్ష్మమూర్తివో వియత్తయి పుట్టిన ఆత్మదీప్తివో
భ్రాంతుడనై దిశల్ పది విపన్నుడ మన్మథవృత్తినుంటి నా
చెంతకు చేరవచ్చెదవో చిత్త సరోజ మిళిందనాదమై

అకుటిల వృత్తి పోయెడు ప్రయత్నము సాగక రెప్పపాటు తీ
రికయును లేమి సిక్తమగు ప్రీతిని చేర్చిన దప్పి తీరదే,
సుకృతము సుంతయేమిగులు చొప్పది పూర్వజనుస్సులోని ఏ
యొక చిరుపున్నెమేని ఫలమొప్పదో నిన్ దలపోయలేదొకో

కల్లలుబల్కునాల్కయు, సుఖంబును ముచ్చిలు చిత్తవృత్తి, కం
పిల్లెడు భీ ప్రవృత్తి, పృథివీతలమంతయు నాదె యన్న లో
భోల్లసనంబు నింద్రియసమూహములాగెడి దుష్పథంబు నన్
చెల్లనినాణె మన్నటులు చేసెను, రక్షయొనర్పవే దయన్

సద్యస్ స్నిగ్ధము సద్య ఉగ్రము వచస్ సామ్రాజ్య వేల్లితం
బుద్యోగించెడు దారి యేర్పడదు ఏదో పాప నిర్మాల్యమై
ఆద్యావాపృథివీ సమావృత విశిష్టాకార రక్షింపవే
పద్యంబిప్పుడు నిన్ను తాకగలదా ప్రాలేయరుణ్మోహనా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here