గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 26: కొల్లిపర

0
4

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 26” వ్యాసంలో కొల్లిపర లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ము[/dropcap]న్నంగినుంచి 7 కి.మీ.ల దూరంలో వున్న కొల్లిపరకి చేరుకునేసరికి ఉదయం 8-45 అయింది. ఈ ఊళ్ళో ఒక విష్ణ్వాలయం, ఒక శివాలయం చూశాము. ముందుగా విష్ణ్వాలయం గురించి…

శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయం

ఇది బహు పురాతనమైన ఆలయమైనా తగు శ్రధ్ధ తీసుకోవటం వల్లనేమో నూతన ఆలయంలాగా వుంది. అక్కడ పూజారిగారు శ్రీ పరాశరం జగన్నాధాచార్యులుగారు (వీరి వంశంవారు పది తరాలనుంచీ ఈ స్వామిని సేవిస్తూ వున్నారుట) స్ధల పురాణాన్ని వివరించారు. దాని ప్రకారం నారద మహర్షి అష్టాదశ జనార్దన స్వాములను ప్రతిష్ఠించారుట. అష్టాదశ శక్తి పీఠాలులాగానే జనార్దనుడికోసం 18 ఆలయాలు నిర్మించారు. (ఈ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది) అందులో ఇది ఒకటి. పూర్వం దీనిని జనార్దన దిబ్బ అనేవాళ్ళు. పెద్ద దిబ్బ దానిమీద చిన్న ఆలయం. చుట్టూ కృష్ణానది వుండేది. నదికి వరదలు వచ్చినప్పుడు ప్రజలు వచ్చి ఇక్కడ తల దాచుకునేవాళ్ళు. అలా అలా ఊరుగా మారి, ఊరు పెరిగింది.

కృష్ణదేవరాయలు వంశీకుడు, సదాశివరాయలు 233మంది చేతి వృత్తులు చేసుకునేవారికి ఈ గ్రామం దానంగా ఇచ్చారు. అందుకని సదాశివ పురంగా పిలువబడింది. కాలక్రమేణా నదిలో నీరు తగ్గి ఇసుక పఱ్ఱలేర్పడటం, గోవులు తిరగటంతో గోవు పఱ్ఱ, ఇసుక పఱ్ఱ, కొవ్వు పఱ్ఱగా పిలువబడి చివరికి కొల్లిపరగా మారింది.

ఆలయానికి ఎదురుగా రోడ్డుకవతల గరుడ స్తంభం పైన నంది, నాగరి లిపిలో శాసనం వున్నాయి. దీనితో ఆలయం అంతకు ముందు అక్కడదాకా వుండివుండచ్చు, మధ్యలో రోడ్డు తర్వాత వచ్చి వుండచ్చనిపిస్తుంది. ఇదివరకు వచ్చిన భారతి మాస పత్రికలో ఈ ఆలయం శాసనం ప్రచురించారుట.

   

ఆలయంలో జనార్దనస్వామి కుడివైపు పారాడే చిన్ని కృష్ణుని నల్లరాతి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ఎడమవైపు ఆంజనేయస్వామి. ఈ పారాడే చిన్ని కృష్ణుని ఆలయం కర్ణాటకలో ఒక్కచోటే వున్నదని మా కర్ణాటక పర్యటనలో వాళ్ళు చెప్పారుగానీ, గుంటూరు జిల్లా పర్యటనలో మేము రెండు ఆలయాలు చూశాము. ఇది ఒకటి, చంఘీజ్ ఖాన్ పేటలో ఒకటి. అక్కడైతే ముఖ్య దైవమే పారాడే కృష్ణుడు. దాని గురించి తర్వాత.

విశేషం

ఈ ఆలయంలో ఏ కార్యక్రమం విశేషంగా జరిగినా గరుడ పక్షులు వస్తాయట. సరిగ్గా ముహూర్తం సమయంలో వచ్చి తర్వాత అదృశ్యమవుతాయట. 2009లో ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనూ, 2018 ఫిబ్రవరిలో రాజగోపురం నిర్మాణం సమయంలో కూడా ఆ పక్షులు వచ్చాయి. తర్వాత అదృశ్యమవటం అనేక వేలమంది భక్తులు చూశారుట. స్వామి ఇక్కడ వున్నారనటానికి దీనిని నిదర్శనంగా గ్రామ ప్రజలు భావిస్తారు.

సంతాన ప్రాప్తి కోసం, కుటుంబంలో భార్యా భర్తల మథ్య విబేధాలు తొలగటం కోసం, పిల్లల విద్యా బుధ్ధుల కోసం ఈ స్వామిని సేవించి కళ్యాణం చేయిస్తే మంచి ఫలితాలుంటాయంటారు.

అక్కడనుంచి శివాలయానికి బయల్దేరాము. మున్నంది శివాలయంలో చెప్పారు. ఈ శివాలయం కూడా పురాతనమైనదని.

శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వరాలయం

సన్నగా, పొడుగ్గా వున్న ఈ ఆలయ గోపురం చూస్తూనే ఆకర్షించిన విశేషం గోపురం మీద చెక్కిన మేస్త్రీ పేరు. “…సున్నపు పని మేస్త్రీ కౌతరపు కోటిలింగం వలన చేయంబడినది..“ అని వున్నది. దీనిని చూసిన వెంటనే నాకేమనిపించిందంటే, అత్యద్భుతమైన శిల్పకళతో అలరారుతున్న ఎన్నో దేవాలయాలుగానీ, ఇతర కట్టడాలుగానీ, కట్టించినవారి పేరు చెప్పుకుంటున్నాముగానీ, ఎంతో కష్టపడి ఆ సుందర ఆకృతులను తీర్చిదిద్దిన వారి పేరు ఎక్కడా వుండదుకదా. చిత్రకారుడు చిత్రం పూర్తి చేసిన తర్వాత కింద తన పేరు రాసుకున్నట్లు శిల్పులు పేర్లు కూడా ఎక్కడన్నా వుంటే శిల్పాలతోపాటు వారి పేర్లుకూడా చిరస్ధాయిగా వుంటాయికదా.

ఆ రోజు సంకష్టహర చతుర్ధిట. గణపతికి పంచామృతాభిషేకాలు చేస్తున్నారు. ఆలయం మధ్యలో శివుడు. ఎత్తయిన పానవట్టంమీద మూడు అడుగుల లింగం. విభూతి రాసి, కుంకుమ బొట్టుపెట్టి చాలా ఆకర్షణీయంగా వున్నారు శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వరస్వామి. పక్కనే ఉపాలయంలో అభయ హస్తంతో అమ్మ పార్వతీదేవి.

 

   

దర్శనానంతరం 9-25కి అక్కడికి ఒక కిలో మీటరు దూరంలో వున్న తూములూరు బాట పట్టాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here