కష్టము సుఖమను స్థితులవి
నిష్టములో కాదొ వచ్చునెప్పుడునైనన్
దృష్టి వివేకము ధైర్యము
నష్టము గాకుండ భువిని నడువగ జాలున్.
మనసున నున్నట్టి పలుకు
లనినను నొకచో సమస్యలటుగాకున్నన్
మనసును తెలుపకనున్నను
ననిలో నరులకు సమస్యలప్పుడునైనన్.
ఆశనిరాశల నూగుచు
పాశవిమోచనము లేక పడుదుము వలలో.
లేశము లేదిట చింతన,
రాశులు సంపదలును ననురక్తులు పెక్కుల్.
అనుదినము తపించుచునే
మనకయి జీవించువారి మన్ననఁ జేతుమె?
ఘనముగ తలచుచు నుంతుము
ననిశము పరులఁ దలపైన నక్కరతోడన్.
నశ్వరమైనది లోకము
శాశ్వతమంచును శ్రమలను సలుపగనేలా?
విశ్వ ప్రయత్నముఁ జేసిన
నశ్వైత్యము మాపగలమె నటులే ముగియున్