[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సత్యజిత్ రే బెంగాలీ సినిమా ‘నాయక్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘నాయక్’ (బెంగాలీ)
ఓ సినిమా చూస్తున్నప్పుడు ఓ ఎడతెగని అనుభూతేదో ప్రధానమై బలంగా పెనవేసుకుంటుంది. ఆ అనుభూతి సాంకేతికంగా జనించింది కావొచ్చు, కథాపరంగా ప్రాణం పోసుకున్నది కావొచ్చు. సినిమా అంటే శబ్దమని ఏనాడో సాంకేతికంగా అర్థం మార్చుకున్నాక, మూకీలు అదృశ్యమైపోయాయి. అయినా సినిమా అంటే నిశ్శబ్దమేనన్న మౌలిక నిర్వచనాన్ని పునఃస్థాపించే ప్రయత్నం చేస్తే, అదొక ఆధునిక మూకీ అయి విస్మయ పరుస్తుంది కమర్షియల్ టాకీల కాలంలో. సినిమాలకి శబ్ద ప్రసార కేంద్రాలు మూడుంటాయి: సంభాషణలు, నేపథ్య సంగీతం, శబ్ద ఫలితాలు అనేవి. శంకరాభరణం, ముత్యాలముగ్గు, మేఘ సందేశం, సితారలలో సంభాషణల్ని సంక్షిప్తం చేయడం వల్ల ముప్పాతిక శాతం శబ్ద ప్రకంపనలు ఆ సినిమాల్లో తగ్గిపోయాయి. అయినా అవి పెద్ద హిట్టయ్యాయి. అదుపులో లేని శబ్దకాలుష్యంతో బయట ట్రాఫిక్ ఎంత హిట్టవుతుందో, ఇది మోటారు పరిశ్రమకి ఎంత వీనుల విందుగా వుంటుందో, నియంత్రించిన శబ్దంతో సినిమాలూ అంతే హిట్టయి, సినిమా పరిశ్రమ అంతే పరవశిస్తుందని పై నాల్గు క్లాసిక్స్ నిరూపించాయి. ఇది సంభాషణల పరంగా శబ్ద నియంత్రణ. ఇదే నేపథ్య సంగీత పరంగా, శబ్ద ఫలితాల పరంగా చేస్తే? అదింకో అనుభూతి అవుతుంది. వెండి తెరమీద అపూర్వ అనుభూతి. రెండు గంటల సేపు ఇదలా కూర్చో బెట్టేస్తుందంతే. మేకింగ్ సాంకేతికాలు భారీ పెట్టుబడులతో కమర్షియల్ సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. ఇంతకంటే గొప్పపేరు స్వల్ప పెట్టుబడితో సమాంతర సినిమాలూ సాధిస్తాయి – సత్యజిత్ రే వంటి కాలాని కతీతుడైన దార్శనికుడుంటే.
‘నాయక్’ – ‘రే’ ఎక్స్ రే దృష్టి. 1966 నాటి ‘నాయక్’ ఐదు దశాబ్దాలు గడిచినా కాలదోష గ్రహచారం పట్టకుండా వుందంటే, 2014 లో డిజిటలీకరణ చెంది మళ్ళీ విడుదలయిందంటే, ఇది ఎవర్గ్రీన్ క్లాసిక్ అయినందువల్లే. ది ఎకనామిక్ టైమ్స్, ది హిందూ, ది హిందూస్తాన్ టైమ్స్, లైవ్ మింట్ వంటి ప్రముఖ పత్రికలూ ఇంకా ‘నాయక్’ గురించి వ్యాసాలు అందిస్తున్నాయంటే ఇదిక కాలాన్ని జయించినట్టే. అయితే దీన్నుంచి ప్రయోజనాలు పొందే వర్గాలేవి? టీవీ తెరలపై ఇంకా కాస్తో కూస్తో ఉత్తమాభిరుచులు మిగుల్చుకున్న ప్రేక్షకులు ఒకటికి పదిసార్లు దీంతో ఆత్మిక దాహాన్ని తీర్చుకోవచ్చు. కానీ దీన్నుంచి తెలుసుకుని, కళ్ళు తెర్చి, కొత్త తరాలకి ఒకటికి పది ఇలాటి మాస్టర్ పీసులు అందించే మేకర్లు వుండాలిగా? మేకర్లని అర్థం జేసుకునే నటులు, నిర్మాతలు వుండాలిగా?
సింగీతం శ్రీనివాసరావు వంటి సీనియర్ దర్శకుడైతే, కమల్ హాసన్‌ని ‘పుష్పక విమానం’ లాంటి పూర్తి స్థాయి కమర్షియల్ మూకీకి క్రియేటివ్ జీనియస్‌గా ఒప్పించుకోగలరు. ఇలా కమర్షియల్ సంగతులు తెలిసిన క్రియేటివ్ జీనియస్సులు కాకుండా, కమర్షియల్ మాస్ మసాలాలే తెలిసిన గజచర్మాలకి శబ్ద సౌందర్యాలే మర్థమవుతాయి.
‘నాయక్’ శబ్ద సౌందర్యమంతా రైలు ప్రయాణంతోనే వుంది. రైలు ప్రయాణంలో అలాటి పాత్రలుండడం వల్ల శబ్ద సౌందర్యమలా కుదిరింది. 1960లలోనైనా ఇప్పుడైనా, సంపన్న సమాజం రణగొణ ధ్వనులకి దూరంగా, ఏసీ గదుల్లో నిశ్శబ్ద వాతావరణంలో, నింపాదిగా జీవనం సాగించుకుంటుంది. ఏసీ రైల్లో కూడా అంతేకదా? సంపన్నులు ఏసీ ట్రైన్లో ప్రయాణిస్తూ, వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వుంటే అంతటా సైలెన్సే కదా? దీన్నర్ధం జేసుకుంటేనే కదా దర్శకుడు రిచ్ క్లాస్ సొసైటీ కథని దాని తాలూకు నేపధ్యంలో, ప్యూరిటీతో మనకి అందించి మైమరపించగలడు?
అప్పటి కలకత్తా ఢిల్లీల మధ్య ప్రయాణించే ఏసీ డీలక్స్ ట్రైన్లో ఈ కథ జరుగుతుంది. తర్వాత ఈ ట్రైను పేరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా మారింది. ఈ ట్రైను నిజమైన ట్రైనే అన్న భ్రమ కల్గిస్తుంది. కానీ ఇది స్టూడియోలో నిర్మించిన ట్రైన్ సెట్ మాత్రమే. బన్సీ చంద్ర గుప్తా అనే కళా దర్శకుడి సృష్టి. ట్రైను లోపలి దృశ్యాలు, ట్రైను ఊగడం వగైరా నిజమైన ట్రైనే అన్పించేలా ఆప్టికల్ ఇల్యూషన్ టెక్నిక్‌తో సాధించారు. అద్దాలు దించిన ఏసీ కూపే ల్లోంచి కదిలిపోయే బయటి దృశ్యాలు సెట్లో వేసినవి కాక రియల్ దృశ్యాలే. ఇదొక మ్యాజిక్.
ఇక బయటి శబ్దలేవీ అస్సలు విన్పించవు, ఇంజన్ శబ్దంగానీ, పట్టాల శబ్దం గానీ ఏ మాత్రం వుండవు. రైలు కూత కూడా వుండదు. కూపేల ఇంటీరియర్స్ చూపించి ఇది ట్రైనూ అని డిటెయిల్స్ ఇచ్చేశాక, మళ్ళీ ఇది ట్రైనే అన్పించేందుకు అనవసరంగా శబ్దాలతో సెకండరీ డిటెయిల్స్ ఏవీ ఇవ్వలేదు. చాలా సేపటి తర్వాత, లోపల చోటుచేసుకుంటున్న కథానుసారంగా మాత్రమే – అదీ రెండు మూడు షాట్లలోనే – పరిగెడుతున్న రియల్ ట్రైనుని బయటి నుంచి షూట్ చేశారు. ఇంకో చోట గ్రామీణ స్టేషన్లో ఆగినప్పుడు బయటి నుంచి రియల్ ట్రైన్ చూపించారు. ఇది చూపించడం కూడా హీరో దిగి టీ తాగుతున్నాడు కాబట్టే. రైలు ఆగినప్పుడు గానీ, బయల్దేరుతున్నప్పుడు గానీ రైలు కూతే వుండదు. గ్రామీణ స్టేషన్ కాబట్టి జానాలే వుండరు, కోలాహలమే వుండదు. టీ కాఫీలంటూ కేకలే వుండవు. పూర్తి నిశ్శబ్దం.
ఇక రైలు పట్టాలు క్లయిమాక్స్ దాకా కనపడనే కనపడవు. ఆ కన్పించినప్పుడు కూడా కథానుసారం ఒకే పట్టా కన్పిస్తుంది. హీరో బయటికి వంగిపోయి, అవతలి ట్రాకులో వెనక్కి పరిగెడుతున్న ఒక్క పట్టానే చూస్తూంటాడు. ఎందుకంటే తనది జోడు పట్టాల జీవితం కాదు. కథలో ఏం జరుగుతోందో, పాత్రకేం జరురుగుతోందో అది తప్ప, అప్పుడు తప్ప, ఇంకెప్పుడూ ఇంకేం చూపించరాదన్న సినిమా సైన్స్ సత్యజిత్ రే సొంతం.
శబ్దాన్ని ఎగవేయడానికి – మొదట్లో ట్రైన్ ఎక్కడానికి స్టేషన్ లోంచి హీరో వస్తున్న దృశ్యాన్ని కూడా ఏసీ కూపే దించిన అద్దాల్లోంచే చూపించారు. దీంతో సహజంగానే బయటి శబ్దాలు వినపడకుండా అయింది. ట్రైను ప్రయాణం మొదలయ్యేప్పుడు బయటి నుంచి ఇది ఛుక్ ఛుక్ రైలు బండీ అని ప్రేక్షకులకి అర్ధమవ్వాలని, బయటి నుంచి ట్రైను మాస్టర్ షాట్ వేసి పెద్ద బాల శిక్ష చెప్పలేదు. మసాలా డైరెక్టర్ వీరోచితంగా ఇదే పని చేసి చెడగొడతాడు. అసలు కథలోకి మొట్ట మొదట రైలు దృశ్యం వచ్చినప్పుడు, నేరుగా కూపేల్లో రిచ్ ప్రయాణీకుల రాక తో, ఇంటీరియర్స్ లోనే ఓపెనవుతుంది.
ట్రైను నిశ్శబ్దంగా స్మూత్‌గా సాగిపోతూంటే, మనం కూడా కథతో పాటు అంతే స్మూత్‌గా ఆహ్లాదంగా సాగిపోతూంటాం. ట్రైను లోపల ఎవ్వరూ స్వరం పెంచికూడా మాట్లాడరు, అరవరు, కేకేసి కేటరింగ్ని పిలవరు. ఇది ట్రైను కాదు, విమానం అన్నట్టు ఎక్స్‌క్లూజివ్‌గా వుంటుంది సంపన్న జీవుల కథ కోసం. ఇక నేపథ్య సంగీతం ఎప్పుడుంటుందో, వున్నప్పుడు విన్పిస్తోందే లేదో అన్నంత పొదుపుగా వుంటుంది. శబ్ద నియంత్రణతో ఈ సాంకేతిక ఔనత్యాన్ని, ఇదిచ్చే అనుభూతినీ ఇక్కడ తెలుసుకోవడం కంటే, చూసి అనుభవించాలి.
‘నాయక్’ బెంగాలీ స్టార్ ఉత్తమ్ కుమార్ (1926 -1980) నటించిన వందల సినిమాల్లో ఒకే ఒక్క వరల్డ్ క్లాసిక్. తను హిందీలో నటించిన ‘అమానుష్’ తెలుగులో ఎన్టీఆర్ – వాణిశ్రీలతో ‘ఎదురీత’గా రీమేకయింది. సత్యజిత్ తీసిన ‘నాయక్’ కథ సినిమా స్టార్ కథే. 24 గంటల రైలు ప్రయాణంలో ఉత్తమ్ కుమార్, షర్మిలా టాగూర్ల మధ్య జరిగే కథ. ఈ అందమైన కథ నవలీకరణ అయి గత సంవత్సరం పాఠకుల్లోకి వెళ్ళింది కూడా. అమెజాన్‌లో అందుబాటులో వుంది. సినిమా ఇంకెక్కడా వెతుక్కోకుండా, సబ్ టైటిల్స్‌తో యూట్యూబ్‌లో వుంది. దీని కథాకథనాలు, పాత్రల తీరుతెన్నులూ వచ్చేవారం చూద్దాం.