కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 24

0
3

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

బిర్లా టెంపుల్‌:

[dropcap]బె[/dropcap]నారస్‌ హిందూ మహా విశ్వ విద్యాలయం మధ్యలో నాలుగు రోడ్ల కూడలిలో నిర్మించిన అతి పెద్ద పాలరాయి టవరుతో కూడిన దేవాలయము చాలా ప్రత్యేకమైనది. దానినే బిర్లా టెంపుల్ లేదా నయా విశ్వనాథ దేవాలయమని అంటారు. ఈ దేవాలయము పూర్తిగా పాలరాయితో కట్టబడింది. ఆ దేవాలయపు గోపురము 77 మీటరులు (253 అడుగు)లతో  ప్రపంచములో ఎతైన దేవాలయ టవరుగా పేరు తెచ్చుకున్నది. ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ కన్నా ఈ టవరు ఎత్తుగా వుంటుంది.

ఇది కాశీలో ప్రముఖ శివాలయాలలో ఒకటి. దేవాలయ గోడల మీద భగవద్గీతలోని శ్లోకాలతో నిండి వుంటుంది.

1930లో హిందూ విశ్వవిద్యాలయము నిర్మించిన మదన్‌ మోహన్‌ మాలవ్యా  విద్యాలయ ప్రాంగణములో ఒక దేవాలయము నిర్మించాలని తలచారు. అంతకు పూర్వము ఎన్నో సార్లు కాశీవిశ్వనాథుని దేవాలయము ముట్టడికి గురైనది. అలాంటి ముంపుకు తావులేకుండా విశ్వవిద్యాలయము మధ్యలో విశాలముగా దేవాలయము నిర్మించాలని మాలవ్యా తలచారు. బిర్లా కుటుంబము పాలరాయితో నిర్మించటానికి ముందుకు వచ్చారు. బిర్లా వారు ఒక కమిటీగా ఏర్పడి పూర్తి పాలరాయితో, కాశి విశ్వనాథుని దేవాలయ మోడల్లో నిర్మించారు. ఇది నిర్మించటానికి 30 సంవత్సరములు పట్టింది.

ఈ దేవాలయములోకి కుల మత జాతి తేడాలు లేకుండా అందరూ వెళ్ళవచ్చు. శివునికి అభిషేకము చెయ్యవచ్చు. ఈ దేవాలయములోని పెద్ద హాల్లో ఎంత మంది వచ్చినా సరిపోగలరు. ఇక్కడి శివుడ్ని నయా విశ్వనాథుడని అంటారు. అప్పట్నించి కాశీలోని విశ్వనాథుడి ఆలయమును బంగారు దేవాలయమని పిలవటము మొదలెట్టారు. ఇక్కడ శివలింగము కూడా చాలా పెద్ద లింగము. పార్వతీ మాత, హనుమంతుల వారు, దుర్గా, గణపతి, మాధవుడు వంటి దేవతలతో పాటు అతి పెద్ద నంది కూడా ఇక్కడ వున్నారు. దేవాలయ ప్రాంగణము పూలతోటలు, విశాలమైన రహదారులతో చాలా అందముగా వుంటుంది. ఈ దేవాలయము ఉదయము 4 గంటల నుంచి తెరిచే వుంటుంది. ఇక్కడి శివునికి ఆరు హారతులు ఇస్తారు. మధ్యాహ్నము ఒక గంట మాత్రము మూసివేస్తారు. ఇక్కడ కాశీ వచ్చిన యాత్రికులతో నిత్యము జన సందోహముతో కళకళలాడుతూ వుంటుంది. ఈ దేవాలయములో కాశీదేవునికి చేసే అన్ని పండుగలు చేస్తారు. శివరాత్రి, నవరాత్రి, జన్మాష్టమి మరింత వేడుకగా చేస్తారు. కాశీ వెళ్ళే ప్రతి వారు తప్పక దీనిని దర్శిస్తారు.

నేను ఈ మహావిద్యాలయానికి రెండు సార్లు వెళ్ళాను. మొదటి సారి దేవాలయానికి చూడటానికి వెళ్ళాను. తరువాత యూనివర్సిటీలో గ్రంథాలయము చూడటానికే వెళ్ళాను. మొదటి సారి వెళ్ళినప్పుడు మూసి వుంది. రామ్‌నగర్ వెడుతూ ఇక్కడ ఆగి స్వామిని దర్శించి, గ్రంథాలయములో కొంత సేపు కూర్చొని వెళ్ళాను. దేవాలయములో మనసు శుద్ధి, గ్రంథాలయములో అజ్ఞానము శుద్ధితో హిందూ మహావిద్యాలయము సందర్శకులకు తప్పక నచ్చుతుంది. అక్కడ మనకు గంగ వడ్డున వున్న ఇరుకు సందులు, మురికి వుండవు. విశాలమైన రోడ్డు, ప్రశాంతమైన విద్యాలయ వాతావరణము, రాజసముగా నిలచి, చరిత్రను చెబుతూ, నిలబడ్డ ఆ భవనాలు మనలను ప్రశాంతచిత్తులుగా చేస్తాయి. దేవాలయము గేటు దాటగానే మనకు మదన్‌ మోహన్‌ మాలవ్యా విగ్రహము కనపడుతుంది. ఆయన విగ్రహము క్రింద వారు ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు చేసిన కృషి గురించి వుంటుంది. భారతీయులలో ఆత్మవిశ్వాసానికి ఆయన ముందుచూపుగా విద్య మీద దృష్టి నిలిపి మనలకు మొదటి సోపానముగా కట్టిన ఆ విద్యాలయానికీ, ఆయనకు వున్న ముందుచూపుకు నేను నమస్కారాలు సమర్పించాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here