భూమి నుంచి ప్లూటో దాకా… -5

    0
    3

    [box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

    అధ్యాయం 11: చంద్రయానం

    [dropcap]చ[/dropcap]కచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. అంగారక గ్రహంలోని అరుణ భూములలో నేను గడిపిన రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. మాంత్రిక చక్రవర్తి సమూరా నన్ను నిర్బంధించి బలవంతంగా నన్ను ఒక మిషన్‌పై ఒలింపస్‌కి పంపడం జ్ఞాపకమొచ్చింది.

    ఇప్పుడీ మిషన్‌ని ఏర్పాటు చేసింది నా స్వంత జాతి.. భూగ్రహంపై మానవ జాతి… నాకిష్టం లేదని నేను చెప్పలేను. అదృశ్య దుష్టశక్తులకు బలైన నా తల్లిదండ్రులు నారా మరియు నయానా ఆమ్రపాలికి తగిన శ్రద్ధాంజలిగా నేను ఈ మిషన్‌కి అంగీకరించాను.

    ఇది నేను నిర్వర్తించవలసిన బాధ్యత. స్వచ్ఛందం సంకల్పంతో, మరింత అంకితభావంతో మరియు ఉత్సాహంగా బాధ్యత నిర్వహించాల్సిన సమయం.

    ఇందుకు నా భార్య ప్రకృతి అభ్యంతరం చెప్పకపోవడం నా అదృష్టం. ఎందుకంటే, ఆమెకి జరిగినదంతా తెలుసు. ఆమె ఆమ్రపాలికి చెందినది, పిసియుఎఫ్‌లు ఎదుర్కునే కష్టాల గురించి తనకి తెలుసు. నా కుటుంబం యొక్క విషాదమూ తెలుసు.

    కాబట్టి మేమీ విషయంలో ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాం, ఎటువంటి సందిగ్ధత లేకుండా ముందుకు సాగాం.

    న్యూ హోప్ నగరంలోని ఓ హోటల్‌లో ఎర్త్ కౌన్సిల్ ప్రతినిధులతో మరియు గ్రహాంతర వ్యవహారాలు మరియు ప్రయాణాల శాస్త్రీయ సలహాదారుతో జరిగిన మా మొదటి సమావేశంలో మిషన్‍కి సంబంధించిన మౌలిక ఏర్పాట్ల గురించి చర్చించాం.

    ***

    అది ఓ పెద్ద హాల్. అయితే అరుణ భూములలోని గ్రాండ్ హాల్ వలె సందర్భానికి తగినట్టుగా విస్తరించేది కాదు, నక్షత్రాలను మరియు గ్రహాలను దర్శింపజేసే బహిరంగ పైకప్పును కలిగి ఉన్న హాలు కాదు.

    అది ఎర్త్ కౌన్సిల్ యొక్క సాంకేతిక సలహాదారుతో మా మొదటి సమావేశం.

    చంద్రగ్రహం, షాక్లెటన్ బిలంలో ఏర్పాటు చేసిన ఎర్రగా మెరుస్తున్న కాలనీలు మరియు సైనిక స్థావరాలు మరియు కక్ష్యలో ఉన్న గ్రహాలతో ఉన్న ఓ పెద్ద మ్యాప్ ఎల్లప్పుడూ మానిటర్లో ఉంటుంది.

    ఈ మిషన్ యొక్క లక్ష్యం చంద్రుడిపైకి వెళ్లి షాక్లెటన్ బిలంలోని అమృతా కాలనీలో ఉంటూ అక్కడికి చేరుకున్న గ్రహాంతర తాంత్రికుల కోసం అన్వేషణ ప్రారంభించడం.

    “బానే ఉంది, కానీ ఇదంతా గడ్డిమోపులో సూది కోసం వెతుకుతున్నంత క్రూరమైన సరదాగా ఉంది.”

    చాంద్, చంద్రుడిపై నివాసం ఉంటున్న మానవుడు – గొంతు సవరించుకున్నాడు.

    “మీరు అక్కడకు వచ్చిన తర్వాత, మీకు కొన్ని సంకేతాలు కనబడచ్చు. నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఉదాహరణకు, నిగూఢమైన సంఘటనల కోసం, గ్రహాంతర మాంత్రికుల ఏవైనా మాయలు చేసినప్పుడు వెలువడే తరంగాల కోసం మీరు మూన్-నెట్‌ని శోధించవచ్చు, ఇమ్మిగ్రేషన్ సెంటర్లో సంఘటనను దర్యాప్తు చేయడం కోసం అక్కడి వ్యక్తులను ప్రశ్నించడం ద్వారా విచారణ చేయవచ్చు” అన్నాడు.

    నేను ఆలోచనల్లో పడ్డాను.

    నా కల. చంద్రుడి యొక్క చీకటి వైపు, ఇగ్లూ ఆకార నిర్మాణాలు. తల వెనక్కి తిరిగి ఉన్న మొండెంతో… సయోని యొక్క వికారమైన శరీరం…

    “మేము చంద్రుని మరో వైపుకు వెళ్ళలేమా?” అడిగాను.

    అక్కడ నిశ్శబ్దం తాండవించింది.

    చాంద్ నవ్వాడు. “ఎందుకు?, ఇది మరీ అసాధ్యమేమీ కాదు. బాగా చల్లగా, చీకటిగా ఉంటుంది, అంతేకాదు, అక్కడ ఎటువంటి ఆవాసాలు లేవు. కనీసం మ్యాపులు కూడా లేవు.” అన్నాడు.

    ఏనిమాయిడ్ గుర్రుగుర్రుమన్నాడు.

    డిమిట్రీ సైగ చేసింది. “నేను మాట్లాడచ్చా?” అని అడిగింది.

    “సరే” అన్నాను.

    “మీ తర్కాన్ని ఉపయోగించి చూస్తే, మార్స్ యొక్క గ్రహాంతర తాంత్రికులు పారిపోతున్నారు. సమూరా అన్ని శక్తులను కోల్పోయాడు. అతనిప్పుడు తనకి మళ్ళీ శక్తులనిచ్చే ఏడు అద్బుత వస్తువుల కోసం వెతుకుతున్నాడు. అందుకే అతను అన్ని గ్రహాలలోనూ శోధిస్తున్నాడు. ఇప్పటికే భూగ్రహం లోని భైరవాలయం నుండి వెండి కొవ్వొత్తిని సంపాదించాడు.”

    తార్కికంగా ఆమె గ్రహించినది సరైనదని నేను అన్నాను. “నాకు అర్థమైంది. ఎన్‌సైక్లోపీడియా గెలాక్టికాలో వ్రాసిన విధంగా, అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం (సిండికేట్ ఆఫ్ సీనియర్ విజార్డ్స్) చంద్రునిపై దాచిన వస్తువు కోసం సమూరా వెదుకుతుంటాడు.”

    “అవును!” అన్నాడు అంగారక గ్రహవాసి వాన్ కు జాక్, మా సంభాషణలో జోక్యం చేసుకుంటూ. పెద్ద కళ్ళు, తల మీద యాంటెన్నాలతో ఉన్న వాన్ మాట్లాడుతూ, “చంద్రునిపై యూనివర్సల్ మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ దాచి ఉంచారని – ఒకసారి మా చక్రవర్తి మీరోస్‌తో కలసి నేనూ చదివాను… దయచేసి ధృవీకరించండి.”

    చంద్రగ్రహానికి చెందిన చాంద్ అన్నాడు – “ఇవన్నీ మీరు నిజంగానే నమ్ముతున్నారా? ఇంటర్ గెలాక్టిక్ ట్రావెల్ యొక్క ఈ అంతరిక్ష యుగంలో మీరో పిచ్చి అద్దం ఉందని భావిస్తున్నారా?”.

    “ఓ విజర్డ్‌గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంది.” అన్నాను నేను. “సైన్స్, టెక్నాలజీ లాగానే ‘ఫోర్స్’ లేదా తాంత్రికత లేదా ప్రత్యామ్నాయ శక్తి యొక్క ప్రపంచం తన సొంత మార్గంలో పరిణామం చెందుతోంది. వాళ్ళు కూడా ఆవిష్కరణ, శక్తి మరియు ఆనందం కోసం అన్వేషిస్తున్నారు. వారు గొప్ప పురోగతి సాధించారు. ఈ అద్దాన్ని కనుక్కోవటం అంటే మంత్రశక్తితో ఒక కెమెరాతో ఉపగ్రహాన్ని సంపాదించటంలా ఉంటుంది. అతను తన మంత్రశక్తితో అద్దాలు, చీపురు కర్రలు, పానీయాల వంటి ఉపకరణాలతో విశ్వమంతా వెదుకుతాడు. సాధారణ మానవులకి వింతగా అనిపించే పనికిరాని వస్తువులు వారికి అత్యంత విలువైనవిగా ఉంటాయి.” అన్నాను.

    “అవును. మొబైల్ లోని ఓ చిన్న చిప్ లేదా ఉపగ్రహంలోని ఒక ట్రాన్స్‌పాండర్‌లు అద్భుతాలు సృష్టించగలవు!” అంది ప్రకృతి.

    టైటాన్ సుందరి డిమిట్రీ మళ్ళీ అంది – “అందుకే మనం చంద్రుడి పైకి వెళ్దాం. ఫోర్స్ ఉపయోగిస్తున్న సంకేతాలను అన్వేషిద్దాం. మనకు సహాయపడేందుకు చంద్రగహ గూఢచర్య సంస్థలు ఉండవచ్చు. మన స్వంత శక్తులతోనే మనం చంద్రుడి చీకటి వైపున్న ప్రాంతంలో సాహసోపేత అన్వేషణ ఎందుకు చేయకూడదు?”

    “చీకట్లో గుడ్లగూబలా! లేదా గబ్బిలంలా! నేను గతంలా ఓసారి గ్వానిమేడ్‌లోని భూగర్భ గుహలలో ఇలానే చేశాను. హా! హా! అది చాలా సరదాగా ఉంటుంది! ప్రమాదం కూడా!” అని మధ్యమ స్వరంలో చెప్పాడు ఏనిమాయిడ్.

    ***

    ఇటువంటి రౌండ్ టేబుల్ చర్చలు, ఎర్త్ కౌన్సిల్ యొక్క ప్రణాళికలు, వివరాలు మరియు లాజిస్టిక్స్ గురించి మా మధ్య అనేక సమావేశాలు జరిగాయి. చంద్రుని ప్రస్తుత భౌగోళిక స్థితి, నాగరికత, కాలనీలు మరియు స్థలాకృతిని మేం తెలుసుకున్నాం. చంద్రుడి షాక్లెటన్ బిలంలో మానవుల అతిపెద్ద కాలనీ ఉంది. ఉల్కాపాతం నుండి తప్పించుకోవడానికి లోతైన బిలాలలో ఆవాసాలు నిర్మించబడ్డాయి. చంద్రుడికి తన స్వంత కక్ష్యలో తిరిగే స్పేస్ ఫ్లాట్‌ఫాం ఉంది. సౌర ఫలకాల సాయంతో సూర్యకాంతిని విద్యుచ్ఛక్తిగా, శక్తిగా మార్చి ప్రసారం చేసే కొన్ని ఉపగ్రహాలు ఈ కక్ష్యలో ఉన్నాయి. ధ్రువ ప్రాంతాల నుండి నీటిని తీసుకువచ్చి భారీ నీటి రిజర్వాయర్లును ఏర్పాటు చేసుకున్నారు. ధ్రువ ప్రాంతాల మంచులో ఉండే హైడ్రోజన్, ఆక్సీజన్ నుంచి ఆక్సీజన్ తయారుచేసేందుకు కొన్ని ఆక్సిజన్ తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి.

    చంద్రుడి కాలనీలలోకి ప్రధానంగా అత్యంత నాగరికులైన అమెరికన్, బ్రిటీష్ మరియు ఇతర ఐరోపా ప్రజలే వలసొచ్చారు. సౌర వ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన మొట్టమొదటి మానవ కాలనీ చంద్రుడిపైనే ఉంది. అక్కడ ఒక ప్రజాస్వామ్య, అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉన్నట్లు నేను చదివాను. వారు పర్యాటకం, కమ్యూనికేషన్, గ్రహాంతర ప్రయాణాలు మరియు అభివృద్ధి యొక్క వ్యవస్థలపై ఆధారపడ్డారు. ఓ వారం పాటు చర్చలు జరిగి ప్రణాళికలు రూపొందించాకా, మా చంద్రయానం ప్రారంభమయ్యే తేదీ నిర్ణయించబడింది. ముందుగా ఒక స్పేస్ షిప్‌లో భూమి యొక్క లా టెర్ స్పేస్ ప్లాట్‌ఫాంపైకి వెళతాం, అక్కడ ఆగుతాం.

    లా టెర్ నుండి చంద్రునిపైకి వెళ్ళడానికి మాకు స్పేస్ షిప్ ఏర్పాటుచేయబడింది.

    ఇది మాకు మాత్రమే పరిమితమైనది, ఎర్త్ కౌన్సిల్ నుండి మా సలహాదారుడు హెచ్చరించినట్లుగా ఇది అత్యంత రహస్యమైనది.

    “మిమ్మల్ని గమనిస్తూంటాం, తగిన సహాయమూ చేస్తాం. కానీ ఎక్కువగా మీరు స్వతంత్ర్యంగా ఉంటారు. దౌత్య సంబంధాలు సున్నితంగా ఉన్నందున మీకు మీరే సహాయం చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రుని ప్రభుత్వం సహకరిస్తుంది.

    కానీ వారు మీడియా దృష్టిని లేదా మానవ కాలనీకి బెదరింపులను కోరుకోరు.”

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here