దీపావళి – అక్షర రమ్యత!!

0
4

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘దీపావళి – అక్షర రమ్యత!!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

దీపావళి

దీపావళి!! ఎంత చక్కని పేరు!!ఎంత ఉజ్జ్వలమైన పదము! ఈ కాంతి మూర్తి పరివేషము ఇంతింతని చెప్పగలమా?!

యోగీశ్వరేశ్వరుడు, దురతిక్రమ విక్రముడు, కేవల మౌన దృక్కులతో జగతిని శాసించగల జగన్నేత, శ్రీకృష్ణుని స్థిరత, ధ్యాన నిమగ్న అంతర్ముఖీనత కన్పించవూ, ఈ వెలుగు తోరణపు తొలి దివ్వె ‘దీ’ అక్షరంలో!!

దీపావళి

సాత్రాజితీ దేవి శృంగార వీర రూపము, లోకాతిశయ దర్పము కనుల ముందు కదలి;

నారి సారించి తాటంక దీధితులతో కలిసి దుష్ట నరకుని దునుమటానికి దూసుకుని వచ్చే, సత్యా ధనుర్ముక్త శర పరంపర సాక్షాత్కరించటల్లేదూ –

జ్యా ధ్వనితరంగ స్ఫోరకంగా నిల్చియున్న ఈ దీర్ఘాక్షరం ‘పా’ లో, పాపాంధ నాశని అయినట్టు!!

దీపావళి

ఇక ‘’ అంటే వరుసకూ, క్రమశిక్షణకు మారుపేరు కాదూ!

దీపాల వరుస, ఆశల అమరిక, వెలుగు పూల మాలికా- ఇది కనులకు కట్టించే మనోజ్ఞ దృశ్యం,ఇదీ!!

దీపావళి

చివరగా, ‘గుడి’ తో పాటు ‘ళి’!

పదిలంగా పండుగ చేసుకుని, ఇంటినీ, గుండెను, గుడి చేసుకుని పది కాలాల పాటు నెమ్మదిగా ఉండమని చెప్పే దేవుడి నిలయము గల మహదక్షరం!!

అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందీ అన్నారుగా! నిజమే, చివరకు, ఎటు చూసినా కృష్ణమయమే, ఆ భావనలో లీనమైన మహానుభావులకు!!

కృష్ణమయమే జగమంతా, ఈ జనమంతా కూడా వారి దృష్టిలో!!

అదీ, ‘దీపావళి’, అక్షరార్థ పారమ్యతా, రమ్యతా!!

ఇంకే పేరుతో పిలిచినా, ఏదో ఒక రేక తగ్గినట్టు, ఒక కళ కొరతగా ఉన్నట్టూ అనిపించదూ, ఈ వెలుగుల రోజుకు, ఈ ఆశల పొద్దుకు!

కనుక, ఇది నిస్సందేహంగా ‘దీపావళి’ మాత్రమే!! దీనికి ఇదే, సరియైన సార్థక నామధేయం!!

గతాన్ని వెనక్కి తోసి, ప్రస్తుతాన్ని నిత్య జాగరూకతతో వాడుకునే వారి మది వెలిగిన, నూత్నకాంతుల అక్షర జ్యోతి!!

అందరికీ దీపావళి శుభాకాంక్షలతో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here