[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 28: తేలియాడే శుక్రగ్రహ కాలనీలు -1
[dropcap]స్పే[/dropcap]స్‌షిప్‌లో పగలూ, రాత్రీ ఒకేలా ఉన్నాయి. జారిపోకుండా మంచానికి బెల్ట్‌లు కట్టుకోడం, నిద్రపోవడం. కాలకృత్యాలు తీర్చుకోడం కోసం అడ్డదిడ్డంగా తేలుతూ బాత్‌రూమ్‍కి వెళ్ళడం. చక్రవర్తి సమూరా దయతలచి ఇచ్చిన ఆహారం తీసుకోడం. గడ్డకట్టిన బిస్కట్లు, పాలు, చల్లని మాంసం, యాపిల్స్.. కావాలంటే గ్రావిటీ మీట నొక్కి, కృత్రిమ గురుత్వాకర్షణని ఏర్పరుచుకుని సౌకర్యవంతంగా నడవవచ్చు. ఈ వివరం… తల మీద యాంటినా ఉండి, పదునైన చూపులు కలిగి, శంఖాల్లాంటి చెవులున్న, చిన్ని కళ్ళు, ఇరుకైన లోపలి కనురెప్పలు కల్గి ఉన్న స్టెవార్డ్ ఒకతను చెప్పాడు.
కానీ నేనూ, ప్రకృతి వ్యోమగాముల్లా తేలడాన్ని సాధన చేశాము, ఎందుకంటే అంతరిక్షయానానికి మేము బాగా అలవాటు పడాలనుకున్నాం. ప్రధాన కమాండ్ గదిలో కృత్రిమ గురుత్వాకర్షణ ఉన్నది. అక్కడ ఓ గద్దె మీద కూర్చుని పెద్ద తెరలపై అన్నీ గమనిస్తున్నాడు సమూరా. అతని కుమార్తె యువరాణి సయోని, ఆల్ఫా సెంటారి వ్యవస్థకి చెందిన వింత తాంత్రికులు వ్యూహాల గురించి చర్చించుకున్నారు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయితే విద్యుచ్ఛక్తిని పొదుపు చేయడానికి అన్ని ప్రయాణీకుల గదులలో కృత్రిమ గురుత్వాకర్షణ ఐచ్ఛికంగానే కల్పించారు.
జరిగినదాని గురించి, భవిష్యత్తు గురించి నేనూ ప్రకృతి ఎడ తెగకుండా మాట్లాడుకున్నాం. ప్రకృతి తండ్రి, గ్రామపెద్ద మహాతో మాట్లాడనిచ్చారు, ఆయనకి ఇదంతా నచ్చలేదు.
“ఆ దుర్మార్గులు నన్ను నా ఇంటి నుండి ఎత్తుకొచ్చి, ఓ అరణ్యంలోకి తీసుకెళ్ళి నా మెడపై కత్తి పెట్టారు! ఇందులో నీ ప్రమేయం ఉందని నేను ఊహిస్తున్నాను. హనీ, నువ్వు కూడా చెడు ఆత్మలు, గ్రహాంతరవాసులతో ఆటలాడుతున్నావు, మీ నాన్నలా! వాళ్ళు 10 రోజుల నన్ను బెదిరించి, నన్ను నా ఇంట్లో వదిలేస్తారు. ఏం జరుగుతోంది? నువ్వు చేస్తున్నదానిని ఆపేయ్. త్వరలో తిరిగి వచ్చేయ్!” అంటూ నామీద అరిచారు మహా, ఐజి నెట్ ఫోన్‌లో. ప్రకృతి తన తండ్రిని సముదాయించేందుకు ప్రయత్నించింది. కానీ ఇదంతా చాలా జటిలమైనది… ఆయనికి వివరించడం కష్టం.
ఈ బ్లాక్‌మెయిల్‍లో అనేక రహస్య విషయాలు ఉన్నాయి: ప్రతీకారం, అంతర్ గ్రహ కుట్ర, సౌర వ్యవస్థ యొక్క గ్రహ కాలనీలను, వనరులను జయించాలనే ఓ వృద్ధ మాంత్రికుడి ఆశయం.
ఎన్నో గంటల పాటు వీటి గురించే సుదీర్ఘంగా యోచించాను.
ఇప్పుడు మాత్రం కేవలం ఆలోచిస్తున్నాను.
ఏ కలలు, ఏ పీడకలలు లేవు. తర్కం, విశ్లేషణ మాత్రమే ఉంది.
సమూరా లాంటి ముదుసలి, తన వికారమైన కుమార్తె సయోనితో కలిసి అరుణభూములను తిరిగి జయించటానికి ఎలా ప్రయత్నిస్తాడు? కొన్ని శక్తులు కలిగిన ఇద్దరు ఆల్ఫా సెంటౌరి మాంత్రికులు మాత్రమే వాళ్ళకి సాయంగా ఉన్నారు. వారి లక్ష్యం అద్భుత వస్తువులను చేజిక్కించుకోడమే.
అయితే వాళ్ళు అన్ని సౌర వ్యవస్థల కాలనీలను జయించగలమని వాదించడం ఎంత హాస్యాస్పదం?
వారు మిగిలిన అద్భుత వస్తువులను స్వాధీనం చేసుకున్నారని అనుకున్నా.. వాళ్ళెలా ముందుకు వెళతారు?
అరుణభూములలోని మాంత్రికులంతా ఇప్పుడు మీరోస్ నియంత్రణలో ఉన్నారు. కుజుడి మానవ కాలనీలో అధ్యక్షుడు కాన్‌స్టంట్‌టైన్, జనరల్ గ్యాని ఎలాగూ సమూరాకి బలీయమైన ప్రత్యర్థులే!
భూమి విషయానికొస్తే ఎర్త్ కౌన్సిల్ పూర్తిగా భూమిని మరియు దాని ప్రజలను, వ్యవస్థలను తన అదుపులో ఉంచుకుంది.
చంద్రుడి, గనీమీడ్‌లోని భూగర్భ కాలనీలలోని నాయకులు తటస్థంగా ఉంటారు లేదా తాంత్రికులకు వ్యతిరేకంగా ఉంటారు.
ఇక శుక్రగ్రహం.. ఇంకా టైటాన్.
మానవ వలసరాజ్యాలకు శుక్రగ్రహం అనుకూలించదు. ఇది 3000 సెంటీగ్రేడ్‌ల పైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది, దానికి మించి వాతావరణంలో 200 మైళ్ళ పైన మందమైన మేఘాలు ఉంటాయి.
అయితే, శుక్రగ్రహ ఆకాశంలో 31 మైళ్ళ ఎత్తున తేలియాడే ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని నేను బ్రౌజింగ్ ద్వారా తెలుసుకున్నాను, వాటిలో అన్వేషణ, సాహసాలు, పరిశోధన, ఇంకా విలక్షణ జీవనం కోసం అక్కడ స్థిరపడిన గ్రహాంతర సమూహాల కాలనీలు ఉన్నాయి.
ఈ కాలనీలకు సూర్యకాంతి నిరంతరాయంగా లభిస్తుంది, ఇవి శుక్రుడి చుట్టూ ఒక కక్ష్యలో తిరుగుతూంటాయి, సూర్యుడి నుంచి కాంతిని, శుక్రుడి నుండి ఖనిజాల పొందుతాయి. కొన్ని కాలనీలు విచిత్రమైన లోహాల వ్యాపారం, ఎక్సోటిక్ టూరిజం ద్వారా వృద్ధి చెందాయి.
శని గ్రహానికి ఉపగ్రహమైన టైటాన్ డిమిట్రీ స్వస్థలం. అక్కడ భూగర్భ కాలనీలు ఉన్నాయి, నీరు పుష్కలంగా లభ్యమవుతుంది.
ఈ రెండు చోట్లా దాచి ఉంచిన అద్భుత వస్తువులను సమూరా సాధించాడనే అనుకుందాం, అప్పుడతను అరుణభూములని తిరిగి ఎలా గెలుస్తాడు? తన మునుపటి కాలనీ అయిన కుజగ్రహాన్నే గెలవలేనప్పుడు మొత్తం సౌరవ్యవస్థని ఎలా ఆక్రమించుకోగలడు?
అతని ప్రణాళికలేమిటో… చాలా జటిలంగా ఉన్నాయి. నా మామూలు మానవ మేధకి అందడం లేదు.
ఈ పాపిష్టి పనిలో నన్ను వాడుకోవాలనుకునే ఈ మూర్ఖత్వం ఎందుకు?
ఈ రకంగా ఆలోచిస్తూ, తప్పించుకోడానికి ప్రణాళిక వేస్తూ.. నేను ప్రకృతి తోనూ, విశ్వసనీయమైన నా రోబో యురేకస్‌తోనూ మిగిలిన ప్రయాణాన్ని గడిపాను.
ఎట్టకేలకు, శుక్రగ్రహాన్ని సమీపించాము.