ఆ చీకటి రోజుల్లో….

0
8

[dropcap]రా[/dropcap]మం ఏమి చేస్తున్నాడో అని తలుపు అతి కొద్దిగా తీసి వంటింటి లోకి తొంగి చూసింది రాధిక. రామం గుడ్డు ఒలుస్తున్నాడు. అతనికి సరిగా చాతకావటం లేదు. అస్తమాను చేతిలోంచి జారిపోతోంది. మళ్ళీ మళ్ళీ చేతులోకి తీసుకుంటున్నాడు. చితికి పోకుండగా కింద నీళ్ళతో గిన్ని పెట్టుకున్నాడు. పడితే అందులోనే పడుతుంది కదా. ఇది అతని స్నేహితుని సలహా.

రాధిక కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.

పాపం రామం. గుడ్డు తినటం మాట అటుంచి కనీసం ముట్టుకునేవాడు కూడా కాదు. ఒకసారి అతనికే జబ్బు చేసింది. డాక్టర్ ఎగ్ తింటే త్వరగా కోలుకుంటావని నీరసం ఉండదని చెప్పాడు. కానీ వినలేదు. ‘నాకు ఆ బలం కంటే ఈ నీరసమే నయంగా అనిపిస్తుంది’ అన్నాడు. అది తప్పని కానీ, విమర్శ కోసమని కానీ కాదు. అది అతను పెరిగిన వాతావరణం. అంతే.

ఇప్పుడు తప్పటం లేదు. చాతకాక ఒక్కోసారి అవి సరిగ్గా ఉడకవు. ఒక్కోసారి పగిలిపోతాయి. అవి మళ్ళీ ఉడక పెట్టటంతో పాటు వాసన వచ్చే ఆ గిన్నెలు శుభ్రం చేయటం మరో పని. అయినా విసుక్కోడు, చిరాకుపడడు. కరోనా బాధితురాలు అయ్యింది తను. తప్పనిసరిగా ఎగ్ తినమని వైద్యుల సలహా. ఈ పనంతా తన కోసమే.

పనిమనిషి రావటం లేదు. తమకి వంటమనిషి కూడా ఉంది. ఆవిడా రావటం లేదు కరోనా వల్ల. అతనే వండి వార్చటం, గిన్నెలు తోమటం. బట్టలు,ఇంటి శుభ్రం. ఒకటేమిటి అన్నీ తనే.

మామూలు వంటే కాదు. మధ్య, మధ్యలో తనకి సూపులు, పళ్ళరసాలు ఇవ్వటమే కాక, క్రుంగిపోతున్న తనకి ధైర్యం చెప్పటం ఇంకో పెద్ద పని.

తెగని, తగని పనులెన్ని మీద పడ్డా పాపం ఎంతో ఓపికగా, నిదానంగా ఆడవాళ్ళ కన్నా ఓర్పు చూపిస్తూ చేసుకు పోతున్నాడు. మామూలు పనుల కంటే అదనపు పనులు ఎన్నో తోడయ్యాయి. వచ్చిన సామాన్లు ఉప్పు నీళ్ళతో కడగటం, కుదరనివి శానిటైజ్ చెయ్యటం, తాగటానికి వేడినీళ్ళు కాచి ఇవ్వటం, గంటకోసారి నీరసం రాకుండా ఏదో ఒకటి ఇవ్వటం, తనకి షుగర్ కూడా ఉంది. అప్పుడప్పుడు ప్రత్యేకంగా చెయ్యాలి తనకు. ఒక పని కాదు పాపం.

ఎప్పుడూ తన ఆఫీస్ పని తప్పితే ఇంటి గురించి పట్టించుకోవటానికి టైం ఉండని మనిషి. ఇప్పుడు ఇల్లే సర్వం లాగా చేస్తున్నాడు, పైనించి ఇంటినుంచి పని వల్ల పెరిగిన ఆఫీస్ పని. అన్నీ ఒంటిచేత్తో నిర్వహిస్తున్నాడు.

“వదినా” అంటూ వచ్చింది ఎదురింటి పంకజం. భయపడింది రాధిక. ఈమె వచ్చిందంటే అడగక్కరలేదు. ఎక్కడా లేని ఆరాలు. భర్తకి కంపెనీలో పని. పొద్దున్న 7 గంటలకి పోతే మళ్ళీ రాత్రి ఏడింటికి వస్తాడు, కంపెనీ లోనే భోజనం. అందువల్ల పగలల్లా ఈమెకి పెత్తనాలే. పని ఉండదు. ఎక్కడో కాఫీ. ఎక్కడో టిఫిన్. ఏ టైంకి ఎవరింటిలో ఉంటే వారు పెట్టకుండా తినలేరుగా. మూడొంతులు వాటితోనే గడిపేసి రాత్రికే వంట. లేదా అంటే రాత్రి ఎక్కువ అన్నం వండుకుని పొద్దున్న తినేస్తుంది, మొత్తానికి పగటి పూట ఒంట ఉండదు. చెయ్యదు.

ఇంకా “నీ చేతి పులుసు రుచి ఎక్కడా ఉండదు. బెల్లం కూరలు నువ్వు చేస్తేనే రుచి. పచ్చడి నువ్వు చేసినట్లు నాకు రాదు” అని పొగిడి అందరిళ్లల్లో ఏదో ఒకటి పట్టుకుపోయి రాత్రి కూడా ఎక్కువసార్లు అన్నం మాత్రం వండుతుంది. మొత్తానికి పగటి వంట మాత్రం ఉండదు చెయ్యదు. పోనీ అని పెట్టింది తినో, పట్టుకునో పోతుందా అంటే అదీ లేదు. ఆరాలు, వంకలు. ఇక్కడి మాటలు అక్కడా అక్కడి మాటలు ఇక్కడా చెబుతుంది.

“అదేమిటి అన్నయ్యా! నువ్వు చేస్తున్నావు వంట. వదిన లేదా? అయినా ఈ కరోనా టైంలో ఎక్కడికి వెళ్తుంది?” అంది వింతగా.

మొదలెట్టింది. ఎప్పుడు వెళ్తుందో ఏమో! తమవి మూడు గదులు ‘ఎల్’ షేపులో. హాల్‌కి కుడి వైపు బెడ్ రూమ్, హాల్ తరువాత కిచెన్. తను నీళ్ళు మొదలైనవి అందించటం కష్టమని, ఒక పక్కకి ఉంటుందని అటాచ్డ్ బెడ్ రూమ్‌లో ఉంటోంది.

ఇప్పుడు కరోనా తగ్గి హోం క్వారంటైన్. తలుపులు మూసి ఉంచుకోవటం వల్ల తనని చూడలేదు. కానీ తలుపు మధ్యలో చిన్న గ్యాప్ వల్ల, హాల్ కనిపిస్తూనే ఉంటుంది. గొంతుని బట్టి వచ్చిన వాళ్ళనీ గ్రహించవచ్చు.

“లేదులే స్నానానికి వెళ్ళింది. కూర మాడిపోతుందని కలుపుతున్నాను” అన్నాడు కొంచెం తడబాటుగా.

“వచ్చాకే మొదలు పెట్టచ్చుగా. అయినా నీలాంటి భర్త దొరకటం అదృష్టం. మా ఆయనా ఉన్నాడు. ఏం లాభం, వీసమెత్తు సాయం చేయడు.” అంది వెటకారంగా.

వింటున్న రాధికకి కోపంతో బాటు నవ్వు కూడా వచ్చింది.

అసలు ఈమెకే పని ఉండదు. ఇంకా ఆయన సాయం కూడానా!

‘ఈమె ఎప్పుడు పోతుందో. ఎవరూ చేసేది ఏమీ లేకపోగా ఎన్నో ఎదురుకోవాల్సి వస్తోంది. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా బాధే కాక, ఇదొక సంఘ బహిష్కరణ లాగా కూడా అవుతోంది. కానీ తన ఇంటిలో తను ఉండక ఎక్కడకు పోతుంది? పోనీ అనవసరంగా ఎవరినీ ఎక్కడికీ, ఎవరింటికీ వెళ్ళద్దని, రావద్దని ప్రభుత్వం చెబుతున్నా చాలామంది వినరు. పైనించి కోపాలు. ఇంకా తను అదృష్టవంతురాలు. ఆర్థిక సమస్య లేదు. అర్థం చేసుకుని ఆదరించే భర్త. ఇవి లేనివాళ్ళు పడే బాధలు తలుచుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది.’ అనుకుంది.

ఎలాగో వెళ్ళింది పంకజం. ‘అమ్మయ్య’ అనుకుందో లేదో “అక్కా” అని వినిపించింది.

రేణుక వచ్చినట్లుంది.

‘చచ్చాం’ అనుకుంది రాధిక. పంకజం ఒక రకం అయితే ఈమె మరో రకం.

ఆమె అన్నీ అడిగే రకం అయితే ఆమె అన్నీ చెప్పే రకం.

నిత్య తాంబూలం ఇచ్చే రేణుక. అన్నీ పేర బెట్టుకుని ఎప్పుడో తెస్తుంది. అదీ గబగబా ఇవ్వదు. వెళ్ళిన చోటల్లా కబుర్లు. దాంతో మళ్ళీ మిగిలిపోతాయి. ఏ రోజుకారోజు ఇవ్వచ్చుగా అంటే “ఎక్కడ కుదురుతుంది” అంటుంది.

ఉత్తప్పుడు రోజుల తరబడి ఆపుతుంది గాని కరోనా మొదలయ్యాకా రోజూ ఇస్తోంది. కొన్నాళ్ళు ఆపమ్మ అంటే వినదు. చాలా సార్లు మాస్క్ కూడా పెట్టుకోదు. ఎలాగూ బయటకి వచ్చాను అని అన్నిపనులు చక్కబెట్టుకుని చివరలో తమింటికి వస్తుంది. చివరలో అయితే కాసేపు కూర్చోవచు కదా అని ఆఖరులో వచ్చా అంటుంది. ఉత్తప్పుడు ఫరవాలేదు కానీ ఇప్పుడు?  పైగా అన్నిచోట్ల మాస్క్ లేకుండా తిరిగి వస్తే కష్టం కదా. ఏమైనా అంటే కోపం.

ఇలాంటి మొహమాటాల వల్లే తనకి వచ్చిందేమో అనిపిస్తుంది. బొట్టు కూడా మూడు వేళ్ళతో నిండుగా తీసి, నుదుటన మూడో వంతు నిండేలా పెట్టేస్తుంది. అది కళ్ళల్లో పడటం, తనకి ఎలర్జీ వల్ల కళ్ళు నీరు కారటం, మండటం. ఈ రోజుల్లో స్వచ్ఛమైన కుంకుమ, పసుపు ఎక్కడ దొరుకుతున్నాయి. కొద్దిగా తీసి పెట్టమ్మా అంటే తనకి ఫాషన్ అనీ ప్రచారం.

వేరే ఆప్షన్ లేదు కదా. అందుకని భర్త మళ్ళీ తను స్నానం చేస్తోందని చెప్పాడు.

“సర్లెండి. కూర్చుంటాను.” అని టేబుల్ మీద మాగజైన్ చేతులోకి తీసుకుంది. తనకి పుస్తకాల అభిరుచి వల్ల చాలా వరకు కొంటుంది. ఇప్పుడు ముట్టుకోవటం ఎందుకులే అని వరసగా గూటిలో పెట్టించింది. అవో నాలుగు తీసుకుంది. మళ్ళీ వస్తాయా రావో వచ్చినా ఏ రూపంలో వస్తాయో అనుమానమే. కొత్త మాగజైన్ చేతిలోకి తీసుకుంది. రామం కంగారు పడ్డాడు. అది చదివేవరకూ కదలదు. రాధికకి సూప్ ఇవ్వాలి.

“కావాలంటే తీసుకెళ్ళండి. తను ఇప్పుడే రాదు. తలంటు.” అన్నాడు.

“ఇది కొత్తదికదా….తను చదవకుండా..” అంది సభ్యత ఉట్టి పడుతున్నట్లు “ఇవాళేగా వచ్చింది” అంది వదలకుండా.

“ఫరవాలేదు. చదివేసింది. చదివే స్నానానికి వెళ్ళింది” అన్నాడు.

“అందుకా ఇప్పుడు స్నానం.” అని అదోలా నవ్వుతూ అంటూ లేచింది. తను అవన్నీ పొద్దుటే ముగిస్తుంది పవిత్రురాలు అని ఆ నవ్వు అర్థం. కారం తిన్నట్లు అనిపించినా ఏమి మాట్లాడలేదు కదా.

మధ్యాహ్నం ఉత్తరం. పినమామ గారి కొడుకు కోడలు. ఏదో పెళ్లి ఉందిట బస్సు వేశారుట వస్తున్నారట. దిగటం తమ ఇంటిలోనే అని రాసారు. అయన ఫోన్ ఎక్కువ వాడడు. అర్ధరూపాయతో పోయేదానికి ఎందుకని పోస్ట్ కార్డు. నిట్టూర్చారు. చదువుకున్నా, ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పెడ చెవిని పెడతారు కొందరు. తమకే కాక ఇతరులకీ ఆపదే అని అర్థం చేసుకోరు. ఇప్పుడీ ప్రయాణం అవసరమా? ఇది తమ ఇంటి పెళ్లి కూడా కాదు. బస్సు ఊరికే వస్తోందని ఊర్లు తిరగటం సరదా.

ఈ కరోనాలో ఏమి చూస్తారు. పెళ్ళిలో ఎంతమందిని కలుస్తారో? తనకి క్వారంటైన్ ముగిసినా కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు డాక్టర్. మళ్ళీ తమకి వచ్చినా, వాళ్లకి వొచ్చినా కష్టమేగా? అందుకే కోపం వస్తుందని తెలిసినా ఈ కరోనా హడావిడి తగ్గేవరకు రావద్దని ఫోన్ చేసి చెప్పేశారు. వాళ్లకు కోపం వస్తుందని తెలుసు. రాకపోకలు ఇకముందు కొంతకాలం ఉండకపోవచ్చు కూడా. అయినా తప్పదు.

వస్తే తన పరిస్థితి కూడా అందరికీ తెలుస్తుంది. చెప్పితే బాధ పడటం తప్పిస్తే ఎవరూ చేసేది, వచ్చేదీ ఏమీ లేదు కదా అని ఎవరికీ చెప్పలేదు తాము. కానీ అదీ నిష్ఠూరమే.

“రాధికా! అమ్మయ్య. నీ క్వారంటైన్ రేపటితో సరి. పాపం చాలా కష్టపడ్డవు ఒంటరిగా.. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. అదృష్టం ఈ మాత్రంగా బయట పడ్డాం” అన్నాడు రామం.

పాపం నిజానికి కష్టపడింది అతనే. తనతో పాటు అతనూ క్వారంటైన్ చేసినట్లే గడిపాడు. “నీలాంటి తోడు దొరికితే యముడు కూడా దగ్గరకు రాడులే, మగ సావిత్రివి నువ్వు. చీకటిలో కాంతి రేఖవి నాకు” అంది నవ్వుతూ రాధిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here