ఆ గంటలో..

0
11

[box type=’note’ fontsize=’16’] కేట్ చొపిన్ రచించిన, 1894లో ప్రచురితమైన అమెరికన్ కథ ‘ది స్టోరీ ఆఫ్ యాన్ అవర్’ని తెలుగులో అందిస్తున్నారు డాక్టర్ పార్థసారథి చిరువోలు. [/box]

[dropcap]మ[/dropcap]ల్లార్డ్ గుండెజబ్బు బాధితురాలు. ఆ విషయం తెలిసి భర్త మరణవార్తను ఆమె చెవిలో వేయటానికి చాలా జాగ్రత్తలే తీసుకున్నారు.

చెల్లెలు జోసిఫిన్ ఈ విషయాన్ని చెప్పీచెప్పనట్టుగా ముక్కలు ముక్కలుగా చెప్పింది. ఆమె భర్త స్నేహితుడు రిచర్డ్స్ కూడా ఆ సమయంలో పక్కనే ఉన్నాడు. అతను ఏదో పత్రికలో పనిచేస్తున్నాడు. రైలు ప్రమాదంలో మృతుల జాబితాలో బ్రెంట్లీ మల్లార్డ్ ఉన్న విషయం అతనికి తెలిసింది. ఆ సమాచారాన్ని నిర్ధారణ చేసుకోటానికి రెండో టెలిగ్రామ్ వచ్చేవరకూ అతను ఎదురుచూశాడు. ఆ తర్వాత విచారకరమైన సందేశాన్ని మోసుకుని అక్కడకు వచ్చాడు.

ఆ వార్త విన్న మల్లార్డ్ మిగతా ఆడవాళ్ల మాదిరిగా, వాస్తవాన్ని అంగీకరించలేనట్టు తీవ్రంగా కంపించిపోలేదు. సోదరి చేతుల్ని దగ్గరకు తీసుకుని ఒక్కసారి తీవ్రమైన పరితాపానికి గురైంది. ఆ తర్వాత దుఃఖం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపించటంతో, అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్లిపోయింది. ఆమెను మరెవరూ అనుసరించలేదు.

అక్కడ తెరిచి ఉన్న కిటికీ ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలో కూలబడింది. సౌకర్యవంతంగా కుదురుకుని ఒక్కసారిగా భారంగా నిట్టూర్చింది. దాంతో శరీరాన్ని చుట్టుముట్టిన అలసట అంతా ఒక్కసారిగా ఆత్మలోకి జారిపోయిన భావన ఆమెకు కలిగింది. కిటికీలో నుంచి కనిపిస్తున్న చెట్లు వసంత శోభతో ఆశావాదానికి, అవకాశానికి సంకేతంలా కనిపించాయి. వాన రాకకు సూచనగా గాలి చల్లదనాన్ని సంతరించుకుంది. పిచ్చుకల కిచకిచ ధ్వనులు వినిపిస్తున్నాయి. కింద ఎవరో పిల్లాడు సైకిలు మీద అరుస్తూ ఏదో సామాను అమ్ముతున్నాడు. దూరాన ఎవరో పాడుతున్న పాట తరంగాలుగా వచ్చి చెవిన పడుతోంది.

నీలాకాశంలో అతుకులు వేసినట్టుగా ఉన్న మబ్బులు ఒకదానికొకటి చేరువ కావటానికి ఆరాటపడుతున్నాయి.

ఆమె కుర్చీలో వెనక్కి జారి తలను కొసకు ఆన్చి కళ్లు మూసుకుంది. ఆ తర్వాత అటూ ఇటూ కదలలేదు. ఒక్కసారిగా గొంతులో నుంచి తన్నుకొచ్చిన దుఃఖం, ఏడుస్తూ నిద్రపోయిన పసివాడు కలలో మరోమారు ఎక్కిళ్లు పెట్టినట్టు, ఒక్కసారి ఆమె కుదిపివేసింది.

ఆమెకు అంత వయసు లేదు. ఆమె ముఖంలో ప్రశాంతత, అణచివేతను, నిర్దిష్టబలాన్ని సూచించేలా ఉన్నాయి. ఇప్పుడు ఆమె కళ్లలో బలహీనమైన చూపులు దూరంగా ఆకాశంలో ఉన్న మేఘాల అతుకులను చూడసాగాయి. అవి చూపుల ప్రతిబింబం కాదు. తార్కికమైన ఆలోచనలకు దూరంగా అవి సాగిపోతున్నాయి.

ఏదో ఆమె సమీపానికి వస్తోంది. భయంభయంగా ఆమె దాన్ని అందుకోటానికి ప్రయత్నిస్తోంది. అదేమిటో ఆమెకు తెలియదు. దాన్ని గుర్తించటం, వర్ణించటం కష్టం. నీలాకాశంలో నుంచి జారి గాలిలో చుట్టుముట్టిన ధ్వనులు, సుగంధం, రంగు ద్వారా ఆమె దాన్ని తన భావనల్లోకి తెచ్చుకోగలుగుతోంది.

ఊహించని విధంగా మనసులో నుంచి తన్నుకొచ్చిన ఉత్సాహంతో గట్టిగా ఊపిరితీసుకుంది. తనను స్వాధీనం చేసుకోవటానికి సమీపిస్తున్న ఆ శక్తిని ఆమె గుర్తించగలుగుతోంది. దాన్ని భరించటానికి సత్తువను కూడగట్టుకోసాగింది. ఆ తర్వాత రెండు పెదాల మధ్య నుంచి మంద్రస్వరంతో ఒక మాట బయటికొచ్చింది. ఆ పదాన్ని మళ్లీ మళ్లీ ఉచ్ఛరించసాగింది. ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ’. శూన్యంగా కనిపించిన చూపుల్లో దాని ప్రతిఫలానాలు కనిపించసాగాయి. అవి ఉత్సాహభరితంగా ప్రకాశవంతంగా మారాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. వేడిరక్తం శరీరం అంతా వ్యాపించింది. శరీరంలో ప్రతి అణువు విశ్రాంతిస్థితికి చేరుతోంది,

తనను కుదిపేస్తున్నది భయంకరమైన ఆనందం అవునా కాదా అన్న ప్రశ్న ఆమెలో మెదిలింది. ఆమెకు కలిగిన స్పష్టమైన, ఉన్నతమైన అవగాహన ఆమె సూచనను అల్పమైనదిగా కొట్టిపారేసింది.

ఎప్పుడూ తనను ప్రేమతో చూడని ఆ ముఖం.. బూడిద రంగులోకి మారిపోయి, ఇప్పుడు మృత్యువు ఒడిలో సేదతీరుతోంది. ఆ రూపం మళ్లీ కంటపడగానే మళ్లీ దుఃఖం చుట్టుముడుతుందన్న విషయం ఆమెకు తెలుసు. కానీ ఆమె ఆలోచిస్తున్నది ఆ చేదు క్షణాల గురించి కాదు. ఒంటరిగా తను గడపబోయే, భవిష్యత్తులో పూర్తిగా తన సొంతానికి మిగిలిపోయే క్షణాల గురించి. తను రెండు చేతులను బార్లగా జాపి వాటిని ఆత్మీయంగా స్వాగతించింది.

రాబోయే రోజుల్లో తన కోసం ఎవరూ ఉండరు. తన కోసమే తను జీవిస్తుంది. ఆమెలో కలిగిన శక్తివంతమైన సంకల్పం తోటి జీవిపై వ్యక్తిగత ఇష్టాన్ని విధించే హక్కు తమకు ఉందని స్త్రీపురుషులు సహజంగా నమ్మే అభిప్రాయాన్ని ఎదిరించటానికి సిద్ధపడింది.

ఆ వెలుగులో తనను తాను చూసుకోవటం క్రూరమైన ఉద్దేశమని కూడా ఆ నిముషంలో ఆమెకు అనిపించింది.

అతన్ని కొన్ని సార్లు ప్రేమించింది. మరికొన్ని సార్లు ప్రేమించలేదు. అదేమంత పెద్ద విషయం కాదు. ప్రేమ అనేది ఎప్పటికీ పరిష్కరించలేని రహస్యం. ఈ స్వీయధృవీకరణలో ఆమె హఠాత్తుగా తన ఉనికికి సంబంధించిన బలమైన ప్రేరణను గుర్తించింది.

‘స్వేచ్ఛ… శరీరం, ఆత్మ స్వేచ్ఛ పొందాలి’ ఆమె మనసులో నెమ్మదిగా అనుకుంది.

జోసెఫీన్ మూసిఉన్న గది వెనకాల మోకాళ్ల మీద కూలబడి ఉంది. ఆమె పెదాలను కీ హోల్ దగ్గరగా ఉంచి ఆమెను పిలుస్తోంది. “లూయిస్, తలుపు తెరు. లోపలేం చేస్తున్నావ్, త్వరగా తలుపు తెరువు. లేకపోతే నీ జబ్బు తీవ్రమవుతుంది. నా మాట విను”.

“నువ్వు అవతలకు వెళ్లు. నేనేం జబ్బును పెంచుకోవటం లేదు” లోపల ఉన్న ఆమె జవాబిచ్చింది. తెరిచి ఉన్న ఆ కిటికీ ద్వారా జీవితం తాలుకు మధురిమలను ఆమె గ్రోలుతోంది.

రాబోయే రోజులు, పూర్తిగా తనకు మాత్రమే సొంతమైన రోజులు, వసంతం, వేసవి అన్నీ కళ్ల ముందు మెదిలాయి. ఆమె గాఢంగా నిశ్వసించి జీవితం సుదీర్ఘంగా సాగాలని ప్రార్థించింది. ఆశ్చర్యకరంగా ఆ ముందు రోజునే ఇలాంటి ఆశ ఆమెలో ప్రవేశించింది.

ఆమె లేచి నిలబడి తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఆమె కళ్లల్లో గెలుపు తాలూకు చిహ్నాలు. విజయం సాధించిన దేవతలాగా ఆమె కనిపించింది. చెల్లెలి నడుం చుట్టూ చేతులు వేసి నెమ్మదిగా మెట్లు దిగసాగింది. మెట్ల కింద రిచర్డు వారి కోసం ఎదురుచూస్తున్నాడు.

ఆ సమయంలో అక్కడ ఎవరో తలుపు తోసుకుని లోపలకు వస్తున్నారు. వచ్చింది బ్రెంట్లీ మల్లార్డ్. చాలా దూరం ప్రయాణం చేసి అలిసినట్టుగా ఉన్నాడు. చేతిలో గొడుగు కనిపిస్తోంది. అక్కడి దృశ్యం చూసి అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని చూపులు భార్య మీదుగా.. ఏడుస్తున్న జోసెఫీన్, ఆమె వైపు చకచకా కదులుతున్న రిచర్డు పైన కదలాడాయి.

రిచర్డు రావటం కొద్దిగా ఆలస్యమైంది.

అప్పుడే వచ్చిన డాక్టర్లు ప్రకటించారు.

గుండె జబ్బు వల్ల మల్లార్డ్ చనిపోయిందని..

భరించలేనంత సంతోషం ఆమె ప్రాణం తీసిందని..

మూలం : కేట్ చొపిన్

అనువాదం : డాక్టర్ పార్థసారథి చిరువోలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here