ఆ పాట (పాత) మధుర జ్ఞాపకాలు..

0
10

[dropcap]పా[/dropcap]త రోజుల్లో ఏ పెళ్ళిచూపుల్లోనూ అందరూ సాధారణంగా అడిగే అడిగే ప్రశ్న అమ్మాయికి ఏమైనా సంగీతం నేర్పించారా అనీ.. అంటే అమ్మాయికి చదువు లేకపోయినా సంగీతంతో పాటు కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్య కళలు నేర్పిస్తే ఆ అమ్మాయి సాంప్రదాయ పద్ధతిలో పెరిగినట్లు లెక్క. వంట చేయడంతో పాటు పాటలు పాడడం, లేదంటే సాంప్రదాయ నృత్యం నేర్చుకొని ఉండడం అప్పట్లో ఆడపిల్లలకు అడిషనల్ క్వాలిఫికేషన్. అందుకే ఆడపిల్లలకు సంగీతం నేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహాన్ని చూపించేవారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆడపిల్లలు స్టేజీల మీద ప్రదర్శనలు ఇవ్వడానికి మాత్రం అస్సలు ఒప్పుకునేవారు కాదు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏమోగానీ ఆడపిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోవడం జరిగేది కాదు. అయినా సంగీతం నేర్పే గురువులు త్యాగరాయ ఆరాధనోత్సవాల్లోనో, శ్రీరామ నవమి ఉత్సవాలల్లోనో, గీతా సప్తాహాల్లోనో, గుళ్ళల్లో అన్నమయ్య కీర్తనలు, ఇతర భక్తి గీతాలు పాడేందుకు ఆడపిల్లలను తీసుకెళ్ళేవారు. అదీ తల్లిదండ్రుల అనుమతితోనే. కానీ ఎనభై దశకం నుంచి తల్లిదండ్రుల ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. ఆడపిల్లలను ప్రోత్సాహించడం ప్రారంభించారు. ఆడపిల్లలను వాళ్ళకు అభిరుచి ఉన్న కళలను అంటే సంగీతం, చిత్రలేఖనం, భరతనాట్యం, కూచిపూడి లాంటివి నేర్పించి బయట ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా అనుమతి ఇచ్చేవారు..

కట్ చేస్తే..

పందొమ్మిది వందల అరవైకి ముందు నల్గొండ టౌనులో శాస్త్రీయ సంగీతం నేర్పించే గురువులు చాలా తక్కువగా ఉండేవారు. కానీ అప్పటికే మిర్యాలగూడ, హుజూర్ నగర్, సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాలు శాస్ర్తీయ సంగీతం, నాటకాలు, జానపద గీతాలు, సినిమా పాటలు పాడడం వంటి అంశాల్లో ముందున్నాయి.

బూరుగడ్డ వాస్తవ్యులు ముడుంబై సీతారామానుజాచార్యులు సంగీత మిత్ర మండలి అనే సంస్థను స్థాపించి అప్పట్లో నల్గొండలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన అప్పట్లో భక్త జయదేవ సినిమాలో ఘంటసాల గారితో కలిసి పాటలు పాడినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన తమ్ముడు అప్పలాచారి మంచి వయొలనిస్ట్. ఈయన ఎస్.పీ. ఆఫీసులో పనిచేసేవాడు. సీతారామానుజాచార్యులు ఇంకో తమ్ముడు లక్ష్మణాచార్యులు అప్పట్లో రామాలయంలో భజనలు, కీర్తనలు పాడుతూ హార్మోనియం కూడా వాయించేవారు. ఈయన పిల్లలకు సంగీతం పాఠాలు బోధించేవారు. ఆ తరువాత రోజుల్లో మంత్రి శేష భూషణ్ రావు, లలిత గీతాలు, విప్లవ గీతాలు, పాడేవారు. టౌన్ హాల్‌లో జరిగిన ఎన్నో కార్యక్రమాలలో ఆయన పాటలు పాడేవారు. పందొమ్మిది వందల అరవై ఎనిమిది – డెబ్భై దశకంలో నాగార్జున డిగ్రీ కళాశాలలో చదివిన లక్ష్మీనర్సింహా రావు పాటలు అద్భుతంగా పాడేవారు. అదే సంవత్సరాలలో కనకాచారి సార్ ఆధ్వర్యంలో అభ్యుదయ సంగీత బృందం మొదలైంది. ఆ బృందం అప్పట్లో లైట్ మ్యూజిక్‌లో కచేరీలు చేసేవారు. ఆ బృందం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు, జగ్గయ్యపేట వరకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ బృందంలో ముఖ్య గాయకుడిగా యూసూఫ్ ఉండేవాడు. ఈయన ముఖేష్, మహమ్మద్ రఫీ పాటలు అద్భుతంగా ఆలాపించేవాడు. ఆ బృందం, మహా కవి శ్రీశ్రీ గారి కవితలను పాటలుగా ట్యూన్ చేసి తమ ప్రదర్శనలలో పాడేవారు. అప్పట్లో రామగిరి గర్ల్స్ హైస్కూల్‌లో సంగీతం టీచర్‌గా పనిచేసిన గోవర్ధనం వెంకట రామానుజాచార్యులు పిల్లలకు సంగీతం నేర్పించేవారు. ఆ తరువాత రోజుల్లో గురువు గారు కొల్లోజు కనకాచారి కోరిక మేరకు ఆయన నల్గొండ బాల భవన్‌లో పిల్లలకు సంగీతం పాఠాలు బోధించారు. ఆయన కూతుర్లు ఇందిర, జానకి కూడా సంగీతం నేర్చుకున్నారు.

ఇందిర తెలుగు విశ్వవిద్యాలయం మ్యూజిక్ విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆ తరువాత ముడుంబై పురుషోత్తమాచార్యులు నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక మంది విద్యార్థులకు సంగీత పాఠాలు బోధించి వాళ్ళతో ప్రదర్శనలు చేయించేవారు. త్యాగరాయ ఆరాధానోత్సవాలు, అన్నమయ్య జయంతి ఉత్సవాలు, ఘంటసాల జయంతి ఉత్సవాలను నల్గొండ రామగిరిలోని రామాలయం, కనకదుర్గ గుడి, టౌనుహాల్, జిల్లా పరిషత్ గ్రౌండ్స్, మొదలైన స్థలాల్లో ఆయన తన శిష్యులతో కలిసి వందల ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన చేసిన కార్యక్రమాల్లో సంగీత కచేరీలు ఉన్నాయి, లలిత గీతాలు, జానపద గీతాలు, ఘంటసాల సినిమా పాటలను శిష్య బృందం ఆలాపించిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అప్పట్లో నాగార్జున సాగర్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న మదన్ మోహన్ ఇద్దరు ఆడపిల్లలు సాగర్ నుంచి వారానికి రెండు రోజులు సంగీతం నేర్చుకోవడానికి పురుషోత్తమాచార్యులు దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళతో గురువు గారు కచేరీలు కూడా చేయించారు. ప్రస్తుతం వాళ్ళు కర్నూలులో ఉంటున్నారు. పురుషోత్తమాచార్యులు గారి గురించి రాస్తే అది ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఆయన గీతా విజ్ఞాన మందిర్ స్కూలులో తెలుగు బోధకుడిగా చాలా కాలం పని చేసి రిటైర్ అయ్యారు. ఈ మద్య ఆయన జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. యావత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు గర్వించదగ్గ సంగీత విద్వాంసులు ఆయన.

కట్ చేస్తే..

పందొమ్మిది వందల డెభై మూడు, నాలుగు సంవత్సరంలో రామగిరిలోని పులిజాల రాఘవ రంగారావు ఇంటి పక్కన  ఇంట్లో ఒక రూం కిరాయికి తీసుకుని దాసరి అంజన్ బాబు, ధరణికోట విజయ్ కుమార్‌లు మూన్ లైట్ అనే ఆర్కెస్ట్రాను ప్రారంభించారు. అంజన్ బాబు గీతా విజ్ఞాన మందిర్ స్కూలు లాండ్ ఓనర్ దాసరి నారాయణ రెడ్డి గారి కొడుకు, మంచి డ్రమ్మర్. ధరణీకోట విజయ్ కుమార్ ఉపాధ్యాయులు. ఆయన జాజ్ అద్భుతంగా ప్లే చేసేవారు. జానపద గీతాలు అత్యద్భుతంగా పాడేవారు. ఎలీషా గిటార్, పియానో వాయిద్యాలు వాయిస్తూ బృందం సభ్యుడిగా ఉండేవారు. మూన్ లైట్ ఆర్కెస్ట్రా బృందంలో గొబ్బూరి దినకర్ రావు, రాధాకృష్ణ రావు జూనియర్ విజయ్ కుమార్‌లు పాటలు పాడేవారు. అప్పుడప్పుడు సెయింట్ ఆల్ఫాన్సెస్ స్కూలులో టీచర్‌గా పనిచేసే జయప్రకాష్ రెడ్డి కూడా పాటలు పాడేవారు. అప్పట్లో ఫిమేల్ సింగర్స్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. నల్గొండ చర్చిలో ప్రార్థనా గీతాలు పాడే శిరోమణి అప్పుడప్పుడు పాడేది. అంతే కాకుండా ఆ బృందానికి సరైన వాయిద్యాలు దొరికేవి కావు. దేవరకొండ రోడ్డులో ఉన్న లెప్రసీ హెల్త్ సెంటర్ ఉండేది. ఆ హెల్త్ సెంటర్‌లో ఉన్న బ్రదర్ ఫిజోనీ దగ్గర ఎకార్డియన్ వాయిద్యం ఉండేది. దాన్ని ఈ బృందం అవసరమున్నప్పుడు అడిగి తీసుకునేవారు. ఆ ఎకార్డయన్ వాయిద్యాన్ని ఎజ్రా శాస్ర్తి ఎలీషాలు వాయించేవారు.ఎజ్రా శాస్ర్తీ ఇంకా కీబోర్డ్ హార్మోనియం, వంటి వాయిద్యాలు వాయిస్తూ పాటలు కూడా పాడేవారు. ఆయన కొడుకు జోయల్ శాస్ర్తి ఇటీవల సామజవరగమన కార్యక్రమంలో గిటార్ ప్లే చేసాడు. ఎజ్రాశాస్ర్తి ప్రస్తుతం క్రిస్టియన్ కమ్యూనిటీలో లీడింగ్ మ్యుజీషియన్ కొనసాగుతున్నారు. తబలా బాలకృష్ణ, పాల్ వాయించేవారు. మూన్ లైట్ ఆర్కెస్ట్రాలో గాయకులు గొబ్బూరి దినకర్ రావుది మాల్ దగ్గర తక్కెళ్ళపల్లి గ్రామం. ఆయన పందొమ్మిది వందల డెభై మూడు నుంచి ఎనభైవ సంవత్సరం వరకు నల్గొండలో పని చేసారు. డెభైమూడవ సంవత్సరంలో వచ్చిన కన్నెవయసు సినిమాలో మహాకవి దాశరథి రాసిన పాట ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఈ పాటను సంగీత దర్శకుడు సత్యం స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా అద్భుతంగా పాడారు. ఇదే పాటను ఫిమేల్ వెర్షన్‌లో జానకి గారు ఎస్పీబీ కంటే చాలా బాగా పాడిందని సంగీత దర్శకుడు సత్యం గారన్నట్టు వార్త. ఈ పాటను దినకర్ రావు గారు అప్పట్లో చాలా బాగా పాడేవారు. సాక్షాత్తూ ఎస్పీబీ గారే పాడుతున్నారా అన్న ఫీలింగ్ కలిగించేవారు. ఆ తరువాత పూలు గుసగుసలాడేనులే.. నా హృదయంలో నిదురించే చెలీ.. కుర్రాళ్ళోయ్.. కుర్రాళ్ళు.. వంటి ఎన్నో ఆ పాత మధురాలను ఆయన పాడారు. దినకర్ గారు ఆ తర్వాత రోజుల్లో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మాధ్యమాల్లో అనేక పాటలు పాడి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంట్లో ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలు అందరూ మంచి గాయకులు.. ఈ ఆర్కెస్ట్రాలో ఇంకో గాయకుడు రామరాజు రాధాకృష్ణ రావు. ఈయనది సూర్యాపేట దగ్గర ఆత్మకూరు(ఎస్). డెభై అయిదు సంవత్సరంలో ఆంద్రా బ్యాంకు ఉద్యోగంలో చేరారు. ఇక అప్పటి నుంచి మూన్ లైట్ ఆర్కెస్ట్రాలో, పురుషోత్తమాచార్యులు గారి ప్రోగ్రాం లలో, పురుషోత్తమాచార్యులు గారి అధ్యక్షతన కొలనుపాక రవి కుమార్, అక్కినెపల్లి శ్రీనివాస్ రావులు ప్రారంభించిన శ్రీకృష్ణ దేవరాయ కల్చరల్ అసోసియేషన్ తరఫున, ఆ తరువాత రోజుల్లో ప్రారంభించిన నల్గొండ యూత్ కల్చరల్ అసోసియేషన్ కార్యక్రమాల్లో ఆయన పాడారు. ఘంటసాల పాటలు అద్భుతంగా ఆలాపించేవాడు. ఆ తరువాత రోజుల్లో రాధాకృష్టారావు వంశీ ఆర్ట్స్ థియేటర్స్, రసమయి ఆర్ట్స్ ప్రోగ్రాంలలో అనేక పాటలు పాడారు, గొప్ప గాయకులు.

అప్పట్లో నల్గొండలో ఫిమేల్ సింగర్స్, ఇతర మ్యుజీషియన్స్ కొరత మూలంగా హైదరాబాద్ నుంచి సినీ మ్యుజీషియన్స్ యూనియన్/హైదరాబాద్ ఫిలిమ్ టాలెంట్స్ గిల్డ్‌కి సంబంధించిన వాయిద్య కళాకారులను, గాయనీ గాయకులను పిలిపించేవారు. ఆ బృందంలో మనోజ్ కుమార్, కృష్ణ రామానుజం, విమలా ప్రభాకర్, శారదా రెడ్డి, విజయలక్ష్మి.. పాటలు పాడేవారు, గురురాజ్ గిటార్ వాయించేవారు. అప్పట్లో టౌనుహాల్‌లో సౌండ్ సిస్టం ప్రాబ్లం వల్ల నటరాజ్ టాకీస్‌లో ప్రోగ్రాం నిర్వహించేవారు. ఆ కార్యక్రమానికి నల్గొండ కలెక్టర్ నాగరత్నం, ఆ తరువాత రోజుల్లో విలియమ్స్, ఎస్.పి.వ్యాస్, ఆయన సతీమణి అరుణా వ్యాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యేవారు. ఆ తరువాత పందొమ్మిది వందల డెభై ఎనిమిదిలో జగిని భీమయ్య గారి అధ్యక్షతన ధరణికోట విజయ్ కుమార్ గారు డైరెక్టర్‌గా నల్గొండ యూత్ కల్చరల్ అసోసియేషన్ ప్రారంభం అయ్యింది. ఈ బృందంలో గొబ్బూరి దినకర్ రావు, రాధాకృష్ణ రావు, జూనియర్ విజయ్ కుమార్.. ఇంకా కొంత మంది పాటలు పాడేవారు. రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన శివరంజని సినిమాలోని మీ అమ్మవాడు నాకోసం.. అన్న పాటను నటుడు కే.వీ.చలం మీద చిత్రీకరించారు. ఆ పాటను జూనియర్ విజయ్ కుమార్ స్టేజీపై అద్భుతంగా పాడేవారు. సుధీర్ కుమార్ ఫ్లూటు, జోసెఫ్ తబల వాయించేవారు. అప్పట్లో పంకజ్ ద్వివేది భువనగిరిలో సబ్ కలెక్టర్‌గా పనిచేసేవారు, ఆయన పదోన్నతిపై మహబూబ్ నగర్‌కి వెళ్ళే సందర్భంగా ఉద్యోగులు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసారు. అందులో నిప్పులాంటి మనిషి సినిమాలోని స్నేహమేరా జీవితం.. అనే పాటను దినకర్ రావు పాడితే పంకజ్ ద్వివేది గారి తండ్రి సంతోషంతో ఒక గిఫ్ట్ కవర్ ఇచ్చారు..

అప్పట్లో నల్గొండ లేడీస్ క్లబ్ చాలా యాక్టివ్‌గా ఉండేది. దాని నిర్వాహణ కరుణా రెడ్డి, అప్పటి డీపీఆర్ఓ సజ్జన్ సింగ్ సతీమణి తారామతి చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఇద్దరూ బాగా పాటలు పాడే గాయనీ గాయకులను ప్రోత్సాహిస్తుండేవాళ్ళు. లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో జడ్.పీ. గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో కొత్త గాయనీ గాయకులతో పాటలు పాడించేవారు.

కట్ చేస్తే..

పాటలు పాడడంలో పులిజాల బ్రదర్స్‌కి నల్గొండలో ప్రత్యేక స్థానం ఉంది. వాళ్ళు అయిదుగురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్.. అందరూ గొప్ప గాయకులే. ఘంటసాల దగ్గరి నుంచి ఎస్పీబీ వరకు అన్ని పాటలను చాలా అద్భుతంగా పాడేవారు. వారిలో పులిజాల విజయలక్ష్మి, పృద్వీధర్ రావు, పులిజాల గిరిధర్ రావు, పులిజాల ఉష, పులిజాల యుగంధర్ రావు, పులిజాల చక్రధర్ రావులు, ఇప్పటికీ పాడుతున్నారు. ఈ బ్రదర్స్ నల్గొండలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళు పాడే పాటలు.. అవి ఘంటసాలవే అయినా ఎస్పీబీ పాటలు అయినా చాలా అద్భుతంగా పాడేవారు.. ఇప్పటికీ పాడుతున్నారు. వీళ్ళే కాదు వీళ్ళ పిల్లలు కూడా సంగీతం నేర్చుకున్నారు. పాటలు అద్భుతంగా పాడుతున్నారు. పులిజాల పృద్వీధర్ రావు గారి కూతురు సుమలత నకిరేకల్‌లో ఉంటూ అన్నమయ్య కళా సమితి అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పిల్లలకు ఆన్‌లైన్‌లో సంగీత పాఠాలు బోధిస్తున్నారు. పులిజాల గిరిధర్ రావు గారి అమ్మాయి వీణ కూడా సంగీతం నేర్చుకుంది. తండ్రితో పాటు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురువు గారు పురుషోత్తమాచార్యులు నాద బ్రహ్మ సంగీత నిలయం సంస్థలో అనేక పాటలు పాడారు.

ప్రస్తుతం పాత, కొత్త తరాల గాయనీగాయకులు జయంత్ కుమార్ ఆధ్వర్యంలో జనరంజని అనే గ్రూపును ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ పాటలు పాడుతున్నారు.

పాత తరం గాయనీ గాయకులలో రాజారత్నం, మంత్రి శేష భూషణ్ రావు, పులిజాల విజయలక్ష్మి, పులిజాల ఉష, కాంచనపల్లి సునంద, యూసుఫ్, ధరణికోట విజయ్ కుమార్, గొబ్బూరి దినకర్ రావు, రామరాజు రాధాకృష్ణ రావు, చిన్న విజయ్ కుమార్, ఎన్.జి.కాలేజ్ స్టూడెంట్ సీతారాములు, మిర్యాలగూడకు చెందిన ఆర్టిస్ట్ సుదర్శన్, రామానుజారి (ఈ రామానుజాచారి హాయి, హాయిగా ఆమని సాగే.. అనే ఘంటసాల పాటను చాలా బాగా పాడేవారు), కెనరా బ్యాంక్ లో పనిచేసే ఎల్లాప్రగడ అమరేశ్వర రావు, పులిజాల బ్రదర్స్, అద్భుతంగా పాడేవారు. మంత్రి శేష భూషణ్ రావు వారసులు కూడా తరువాత రోజుల్లో పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతున్నారు. వాళ్ళు మంత్రి రవిందర్ రావు, మంత్రి నవీన్ కుమార్, మంత్రి శ్రీదేవిలు. పందొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలంగాణ స్పందన జానపద కళా సమితిలో మంత్రి శ్రీదేవితో పాటు నవీన్ మంత్రి, ఎర్రయ్య, కంది వెంకట్, పురుషోత్తమాచారి, దుబ్బ దేవ కుమార్, కాకర్ల రజనీ, ఓవేటి నీరజ, మోహన్ కుమార్.. ఈయన పాటలు పాడుతూనే డోలక్, డ్రమ్స్, పియానో, కంజెర వాయిద్యాలు వాయించే వాడు. మంత్రి శ్రీదేవి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా పనిచేసింది. ఆమె ఇప్పటికీ ప్రతి సభలోనూ తన ప్రసంగాన్ని పాటతోనే మొదలు పెడుతుంది. ఎనభై ఆరులో దింగరి శ్రీనివాసాచార్యులు.. మౌనమే నీ భాష ఓ మూగ మనసా..అనే పాటను చాలా బాగా పాడేవాడు. గర్స్ జూనియర్ కాలేజీలో పనిచేసిన యుగంధర చక్రవర్తి, సావర్కర్ బొమ్మ దగ్గర ఉండే అమ్మదయ భక్తుడు రవి, నీరజ, సారాభాయ్ మధు సతీమణి సుగుణ నిమ్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు, రంగారావు గారి అమ్మాయి శోభ, పాటలు పాడేవారు. ఇంకా చాలా మంది గాయనీ గాయకులు సరైన గుర్తింపు లేక వెలుగులోకి రాలేకపోయారు.

కట్ చేస్తే..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here