ఆ పాత మధురం

0
11

[dropcap]ఒ[/dropcap]క తరం వెనక్కు వెళితే బామ్మ అంటే సోమిదేవమ్మ. బెత్తెడు అంచు ఉన్న ఏడుగజాల పేటేరు జరీ చీరతో అచ్చంగా మధుర మీనాక్షమ్మలా ఉంటుంది. నుదుటమీద రూపాయి బిళ్ళంత కుంకుమబొట్టు, ముక్కుకి రెండువైపులా ఏడురాళ్ళ బేసరు. తెల్లగా వెండీ తీగల్లా మెరిసిపోతున్న తలవెంట్రుకలను శుభ్రంగా దువ్వివేసిన ముడి. కాళ్ళకు వెండికడియాలు, నడుస్తుంటే నేలకు తగిలి ‘ఠంగు’మంటు వచ్చే ధ్వని ఇంట్లో వాళ్ల మనసుల్లో ఆత్మ విశ్వాసం నింపుతుంది.

కుటుంబ నియంత్రణ అమలులో లేని ఆ రోజుల్లో ఆమె పిల్లలు, వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఓ పెండ్లి ఇల్లులా ఉండేది. ఆ ఇంటికి మహారాణి బామ్మ. ఇంట్లో నాలుగు గేదెల పాడి, చిక్కటి పాలు, వాటిమీద బెత్తెడు మందాన మీగడ, కుండ నిండా పెరుగు. పొడవాటి కవ్వంతో మజ్జిగ చిలుకుతూ ఉంటే, ఆనాడు వ్రేపల్లెలో యశోదమ్మ కృష్ణయ్య చేతిలో వెన్నపెట్టినట్లుగా పిల్లలకు చేతిలో వెన్న, మీగడ పెట్టడం బామ్మగా ఆమె ఆత్మీయత అద్భుతం. ఆ రోజుల్లో ఇన్ని రకాల టిఫిన్లు లేవుకదా! పెద్ద కంచంలో చింతకాయ పచ్చడో, గోంగూరపచ్చడో వేసి తలా ఓ అన్నం ముద్ద పెడితే ఎంత తింటున్నారో కూడా పిల్లలకు తెలియదు. ఆ రోజుల్లో పిల్లలకు స్నాక్స్ తెలియదు. ఉప్పు కలిపిన దబ్బకాయ ముక్క, రేగిపండ్లతో అడలు అపురూపంగా తినేవాళ్ళు. ఆడవాళ్ళు గడపదాటి బయటకు రావడమే తప్పుగా భావించే ఆ రోజుల్లో ఆడవాళ్ళంతా ఒకచోట చేరి పురాణ కాలక్షేపం చేసేవాళ్ళు. గ్యాస్ స్టౌ పరిచయం లేని ఆ రోజుల్లో కుంపటిమీద చేసే ఏ వంటకమైనా నలభీమపాకమే. సంక్రాంతికి బామ్మ చేసే నేతి అరిసెల వాసన వీధి వీధంతా నోరూపింపజేస్తుంది. బామ్మ, వదిన, అత్తయ్య అంటూ పిలిచే వరుస కలిపి పిలుచుకునేవాళ్ళు.

“అత్తయ్య అమ్మాయిని కాపురానికి పంపాలి. మంచిరోజు చూసి చెప్పు”; “బామ్మా మనవడు నాలుగురోజుల నుండి అన్నం తినటం లేదు. దిష్టిమంత్రం పెట్టు” అని అడిగేవాళ్ళు. చెల్ది మంత్రం, తేలు మంత్రం లాంటి వాటికి ఆ పల్లెటూల్లో బామ్మ ఓ చిన్న డాక్టరు. ఊళ్ళో ఏ ఉత్సవం జరిగినా బామ్మ పెద్ద ముత్తయిదువ. “కోడలా, దొడ్లో గోరింటాకు కోసి పెడితే పిల్లలంతా పెట్టుకుంటారు. పెద్దోడా ఇంటిముందు వేపచెట్టుకు ఉయ్యాల వేయించు. రేపు ఉండ్రాళ్ళతద్దె పిల్లలంతా ఊగుతారు” అంటూ సంప్రదాయాన్ని గుర్తుచేయడం ఆనాటి బామ్మకే చెల్లింది.

ఆ రోజుల్లో బామ్మ మడిబట్ట ఆరేసుకోవడానికి వంటింట్లో ఓ దండెం ఉండేది. ఆచారము, మడి ఇంటిల్లిపాది క్రమశిక్షణగా పాటించేవాళ్ళు. ఇంట్లో పడమటి గదిలో ఆవకాయ జాడీలు. బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళు వాటిని ముట్టుకోకూడదు. అందరికీ బామ్మ అంటే భయంతో కూడిన గౌరవం. ఆ తరం బామ్మ ఇప్పుడు లేదు. అందుకే వరసపాటల గురించి పిల్లలకు తెలియదు. పిల్లలకు, కాశీమజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పేవాళ్ళు లేరు.

బామ్మ తప్పకుండా స్వర్గంలోనే ఉంటుంది. పునర్జన్మతో తిరిగి వచ్చి పిల్లలందరినీ అక్కున చేర్చుకోవాలి. కంప్యూటర్‍తో, సెల్ ఫోన్‍తో అనుబంధం పెంచుకున్న ఈ తరం పిల్లలకు బామ్మ చెప్పే కథలు వినే తీరిక ఎక్కడిది? ఆమె మాటలు ఓ చాదస్తంలా, ఆమె ఆప్యాయత పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. అలాంటి ఆపేక్ష తెలియక అపురూపమైన బాల్యాన్ని కోల్పోతున్న అమాయకులీ తరపు పిల్లలు. వాళ్ళందరికీ బామ్మ ప్రేమ అందాలి. వాళ్ళంతా ఆస్వాదించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here