ఆ రోజు

1
10

[dropcap]జీ[/dropcap]వితం అనేక అనుభూతుల పుట్ట. అందులో కొన్ని అపురూపమైనవి. మన ప్రమేయం లేకుండానే మనస్సులో తిష్ట వేసుకుని కూర్చోవటడమేగాక బహుశా మరు జన్మలో కూడా సహాయ పడతాయేమో!! అలాంటి సంఘటనలు నా జీవితంలో కూడా కొన్ని వున్నాయి. వాటిలో అపురూపమైనది ఆ రోజు…..

 

ఆ రోజు జులై 16 2022. నాంది

చిత్తూరు జిల్లా లోని టి. పుత్తూరు గ్రామంలో కోదండ రామాలయం వున్నది. ఆ ఆలయానికి చరిత్ర చాలా వుంది. ఒక ముఖ్య విషయం మాత్రం ఇక్కడ చెబుతాను. ఆ పురాతన ఆలయం ముందు ఆంజనేయ స్వామిది. అక్కడివారు ఆయనని సంజీవరాయనిగా కొలిచేవారు. చాలాకాలం క్రితం ఒకసారి ఆ ఆలయ ధర్మకర్త కలలో ఆంజనేయస్వామి కనబడి నా స్వామి ఇక్కడికి సమీపంలో వున్న కోగిలేరు వాగులో వున్నాడు. ఆయనని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పారుట. ధర్మకర్త ఊరి పెద్దలు కలసి కొంత అన్వేషణ, కొంత శ్రమ, కొన్ని వాగ్వివాదాలు తర్వాత అందరి సహకారంతో కోగిలేరు వాగులో దొరికిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇక్కడికి తీసుకు వచ్చారు. అంతకు ముందు కొలువు తీరిన సంజీవ రాయని కొంచెం ముందుకు జరిపి అక్కడ కోదండ రామయ్యని ప్రతిష్ఠించి భక్తి శ్రధ్ధలతో పూజించ సాగారు. ఆ స్వామి అద్భుతాలు ఇంకా వున్నాయి. వాటి గురించి నా యాత్రా దీపిక 12 – చిత్తూరు జిల్లాలో చదవవచ్చు (సంచికలో ధారావాహికం).

అలా సంజీవరాయడు కోరి రప్పించుకున్న కోదండరామయ్యకి ఆ రోజు నా యాత్రా దీపిక సీరీస్ లోని 12వ దీపిక యాత్రా దీపిక-12 చిత్తూరు జిల్లా సమర్పించాను. అసలదెలా ప్రారంభం అయిందంటే.. అంతకు ముందు కొన్ని నెలల క్రితం ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ పురంధర రెడ్డి నా పుస్తకాల కోసం మా ఇంటికి వచ్చారు. అప్పటికి నా దృష్టిలో చిత్తూరు జిల్లాలో తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, అరగొండలాంటి ఐదారు ఆలయాలు తప్పితే పురాతన ఆలయాలు ఏమీ లేవు. సొంత విషయాలైతే ఆరాలు తియ్యనుగానీ, ఆలయాల విషయమైతే చెప్పేవారికి విసుగొచ్చి దణ్ణం పెట్టేదాకా ఆరాలు తీస్తూనే వుంటాను. అలా ఆరాలు తియ్యగా చిత్తూరు జిల్లాలో అవేకాక అనేక పురాతన ఆలయాలున్నాయని, తనకన్నా తన మిత్రుడు శ్రీ సాంబశివ రెడ్డికి చాలా తెలుసని అప్పుడే ఆయనతో మాట్లాడించారు. ఆయన చాలా ఉత్సాహంగా చాలా వున్నాయనీ, వాటన్నిటి గురించీ చెబుతాననీ, తెలియనివాటి గురించి ఇంకా తెలుసుకుంటాననీ, మమ్మల్ని 4, 5 రోజులుండేటట్లు రమ్మనీ చెప్పారు. అంతే కాదు ఆ జిల్లాలో ఆలయాల గురించి చాలామటుకు పరిశోధించి పుస్తకాలు రాసిన శ్రీ బత్తినపల్లి మునిరత్నం రెడ్డిగారి పుస్తకం కౌండిన్య క్షేత్రాలు పంపించారు. రెండుసార్లు సాగిన ఆ పర్యటనలో మార్గదర్శకులుగా నిలిచారు. అయితే ఒక షరతు పెట్టారు. చిత్తూరు జిల్లా యాత్రా దీపిక వారి టి.పుత్తూరు లోని కోదండరామయ్యకే అంకితమివ్వాలని. ఇది నాందీ ప్రస్తావన.

యాత్రాదీపికల కోసం నేను పడుతున్న శ్రమ గమనించిన రామయ్య నన్నిలా కరుణించాడని సంతోషించాను. రెండుసార్లు జరిగిన చిత్తూరు జిల్లా పర్యటనలో మొదటిసారి నా స్నేహితురాలు శ్రీమతి బొండాడ ఉమా మహేశ్వరి, రెండవసారి ఇంకో మిత్రురాలు శ్రీమతి కమల పరచ (మాలా కుమార్) తోడు వచ్చారు. రెండుసార్లూ సాంబశివ రెడ్డిగారు, పురంధర రెడ్డిగారు అన్ని సౌకర్యాలూ చెయ్యటమేగాక ఏ రోజు ఏ ఆలయాలు దర్శించాలో, ముందుగానే చిత్తూరు జిల్లాల ఆలయాల రచయిత శ్రీ బత్తినపల్లి మునిరత్నం రెడ్డిగారి సలహాతో ప్రణాళిక వేసి మాకు ఏ శ్రమా లేకుండా, తక్కువ సమయంలో ఎక్కువ ఆలయాలు చూపించారు. కొన్ని ఆలయాలకి మధ్యాహ్నం పూట వెళ్ళటంతో మూసి వుండేవి. అర్చక స్వాముల ఫోన్ నెంబర్లు, ఇళ్ళు కనుక్కుని వారిని సాదరంగా పిలుచుకువచ్చి తలుపులు తీయించేవారు. వారు కూడా విసుక్కోకుండా రావటమే కాదు వారి ఆలయాల గురించి వ్రాస్తున్నానని చాలా ఉత్సాహంగా ఆలయ చరిత్ర వివరించారు. దీనికి సహకరించినవారు టి.పుత్తూరు కోదండ రామాలయం ధర్మకర్త శ్రీ సిధ్ధేశ్వర రెడ్డిగారు. వారందరికీ కృతజ్ఞతలు.

ఇంక ఆ రోజు .. సమీకరణ

మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా చూశాం కదా అని 49 ఆలయాల చరిత్రతో సంచిక ఆన్‌లైన్ మేగజైన్‌లో చిత్తూరు జిల్లా యాత్రా దీపిక ప్రచురించబడింది. పుస్తకం పూర్తయిందంటే అప్పుడేనా, ఇంకా చూడాల్సినవి చాలా వున్నాయి. ఇంకొక్కసారి రండి అన్నారు సాంబశివరెడ్డిగారు. రెండవమారు మాలా కుమార్ నేను వెళ్ళి చూసి వచ్చిన ఆలయాలతో పుస్తకంలో ఆలయాల సంఖ్య 72 అయ్యాయి. ఇవికాక నేను చూడని 3 ఆలయాల గురించి కూడా మిత్రుల ఉత్సాహంతో వారిచ్చిన వివరాలు వ్రాశాను. సంచికవారికీ విషయాన్ని తెలిపి (అప్పటికి కృష్ణా జిల్లా యాత్ర వస్తోంది సంచికలో) మళ్ళీ చిత్తూరు మొదలు పెట్టాను.

జులై 8 నుంచీ 22 దాకా టి.పుత్తూరులో బ్రహ్మోత్సవాలు. సంచికలో యాత్ర ప్రచురణ ముగియ లేదు. బ్రహ్మోత్సవాలలో పుస్తకం సమర్పించాలని పుస్తక ప్రచురణకి సంకల్పించాను. ముందు అన్ని వ్యాసాలు వ్రాయటం ముగించి సంచికకి పంపాను. వారు పుస్తకావిష్కరణ లోపే సంచికలో వాటికి ముగింపు వుండాలని ఎక్కువ వ్యాసాలు ప్రచురించి ముగించారు.

ప్రచురణ.. ఇంక నా సంగతి చూడాలి. ఈ మధ్య ఆరోగ్యం సరిగా వుండటం లేదు. పుస్తకం కోసం మిగిలిన 10, 12 వ్యాసాలు వ్రాసి పంపటం, డి.టి.పి. చేయించటం, ప్రూఫ్ రీడింగ్, ప్రచురణ… చాలా శ్రమ పడ్డాను సమయం తక్కువ వుండటంవల్ల. 14వ తారీకు మా ప్రయాణం. 13న పుస్తకాలు చేతికి వచ్చాయి. దీనికోసం శ్రమపడ్డ శ్రీ మధుగారికి, శ్రీ కడియాల ప్రభాకర్ గారికి నా కృతజ్ఞతలు.

ఇంక ప్రయాణం ప్రహసనం.

ఇప్పటిదాకా 16 పుస్తకాలు వ్రాశాను, 13 ప్రచురించి ప్రతి పుస్తకం అంకితమిచ్చానుగానీ ఇలా స్వామికి స్వయంగా సమర్పించటం అనేది చిత్తూరు లోనే జరిగింది. మరి అంతటి అదృష్టకరమైన అవకాశం నా వాళ్ళు చూడాలనే ఆశ. చెల్లెళ్ళు వివిధ కారణాలవల్ల రాలేక పోయారు. మా ఉమ వాళ్ళ అక్కయ్యగారి అమ్మాయి శ్రీమతి శారద వస్తామన్నారు. మా అబ్బాయి వద్దామనుకున్నా సెలవు లేక పోవటం, దూరాభారం అవటం వల్ల రాలేక పోయాడు. ఇంక మా శ్రీవారు శ్రీ వెంకటేశ్వర్లుగారికి తప్పదని చెప్పేశాను. ఆయన ఆఫీసు పనివల్ల రాలేను అన్నా వూరుకోలేదు. మరి నా సంతోషాన్ని పంచుకోవాలి కదా. కరోనా తర్వాత బయటకి కదిలే అవకాశం వల్లనేమో 15 రోజులు ముందు రిజర్వు చేసుకున్నా వైటింగ్ లిస్టు తప్పలేదు. ఆ ఒడిదుడుకులను కూడా కోదండరామయ్యే సరిచేసి మా మార్గం సుగమం చేశాడు. 15వ తారీకు ఉదయం 9 గం. లకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చిత్తూరు చేరుకున్నాము. స్టేషన్‌కి శ్రీ సాంబశివ రెడ్డిగారు వచ్చారు. అప్పటికే చిత్తూరు చేరుకున్న శ్రీమతి శారదగారిని తీసుకుని రెడ్డిగారి అన్నగారింటికి తీసుకెళ్ళారు మమ్మల్ని. వారి వదిన శ్రీమతి రుక్మిణి మంచి ఆధ్యాత్మికవేత్త. పరిచయమైన ఎవరైనా ఆవిడతో ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండును అనుకుంటారు.

కొంచెం సేపు విశ్రాంతి, భోజనం తర్వాత సాయంత్రం 4 గం.లకు ప్రారంభం అయ్యే రథయాత్ర చూడటానికి టి.పుత్తూరు కోదండ రామాలయానికి బయల్దేరాము.

రథయాత్ర.. అబ్బో ఎంత జనం!! కరోనాలనూ, మాస్కులనూ లెక్కచెయ్యకుండా తమ రామయ్య మీద నమ్మకంతో ఆయన పుర వీధులలో రథయాత్ర చేస్తుంటే చూసి ధన్యులయే అభిలాషతో. కిక్కిరిసిన జనం. ఈ మధ్య అంత జనం ఒక చోట అలవాటు లేదు కదా. ఎలాగో రెడ్డి ద్వయం మమ్మల్ని ఆ జనంలోంచి దోవ చేసి ఆలయం పక్కనే వున్న ఒక షాపుకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కొంత గాలి పీల్చుకున్నాము. ఊరంతా అన్ని కార్యక్రమాలలోనూ ఉమ్మడిగా పాల్గొన్నారు.

వి.ఐ.పి. ట్రీట్మెంట్లు కొంచెం అలవాటున్నా, అక్కడ మమ్మల్ని ప్రత్యేకించి కూర్చోబెట్టి, ప్రముఖులనందరినీ పరిచయం చేస్తుంటే.. ఏంటో.. కొంచెం ప్రత్యేకతే అనిపించింది లెండి. అది కల్పించిన కోదండ రామయ్యకి మనసులోనే నమస్కరించుకుంటూ కూర్చున్నాము. ఆ రథం కొత్తగా ఈ ఏడాదే తయారు చేయించారు. చక్కని అలంకరణ. ముందు మంగళ వాయిద్యాలు, వివిధ వేషధారులు, మీరు చిన్నప్పుడు చూసే వుంటారు.. గుర్రాల మధ్య మనుషులుండి వాటిని ఆడించుకుంటూ రథయాత్ర ముందు సాగేవారు, వారూ, కోలాటాలాడే పిన్న, పెద్దలు ఇంతమంది ఉత్సాహంగా దారి తీయగా, పుర జనులకి కన్నుల విందొనరుస్తూ రధయాత్ర శోభాయమానంగా జరిగింది.

రాత్రి 8-30కి ఊంజల్ సేవ. గోపురం బయట వున్న మండపంలో ఉత్సవ విగ్రహాలకి. దేవతా మూర్తులకి, చక్కని అలంకరణ. ఆలయం, పరిసర ప్రాంతాలు అంతా విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శ్రీమతి రుక్మిణిగారు కొడుకు, కోడలు, మనవరాలు బెంగుళూరునుంచి బ్రహ్మోత్సవాల కోసం అప్పుడే వచ్చారు. ఈ ఉత్సవాల సమయంలో ఆ ఊరివారందరూ తమ తమ వృత్తి వ్యాపారరీత్యా ఏ ఊరులో వున్నా తప్పనిసరిగా ఉత్సవాలకు హాజరవుతారు. ప్రతి ఇల్లూ బంధు మిత్రులతో కళకళలాడుతూ వుంటుంది. అంత హడావిడిలోనూ శ్రీమతి రుక్మణిగారు మమ్మల్ని భోజనానికి పిలిచారు. ఈ హడావిడిలో ఎందుకమ్మా అంటే మా ఊరు, మా రామయ్య ఉత్సవాలు. ఈ పదిరోజులూ బంధు మిత్రులు మాకలవాటే. ఇందులో శ్రమేమీ లేదని ఆప్యాయంగా పిలిచి కడుపు నింపారు.

కర్పూర హారతి.. నేను ఈ ఉత్సవాలలో చూడాలనుకున్నది రథయాత్ర (చిన్నప్పుడెప్పుడో చూశాను), అక్కడ ప్రత్యేకమైన కర్పూర హారతి. ఊంజల్ సేవ తర్వాత కర్పూర హారతి. స్వామి అంటే సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా అని.. పల్లకీలో ఊరేగింపు. దోవ పొడుగునా కర్పూరం ముద్దలు వెలిగిస్తూ వెళ్తారు. దాని మీదనుంచీ పల్లకీని ఊపుతూ తీసుకు వెళ్తారు. చూడ ముచ్చటగా వుంది.

ఆ రోజు స్వామికి మేము నూతన వస్త్రాలు సమర్పించి మర్నాడు వాటిని ధరింపజేయమని కోరాము.

ఆ రోజు… ఉదయం 9-30కల్లా ఆలయం చేరాము. ఉత్సవాల సమయం కదా. అప్పటికే చాలామంది భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా రచయితల సంఘం అద్యక్షులు శ్రీ కట్టమంచి బాలకృష్ణా రెడ్డి, వారి శ్రీమతి మాలతిగారితో సహా నా పుస్తకం ఆవిష్కరించటానికి విచ్చేశారు. రచయిత శ్రీ బత్తినపల్లి మునిరత్నం రెడ్డిగారు, ఆలయ కమిటీ మెంబరూ, పుర ప్రముఖులూ, విశ్రాంత తెలుగు పండితులూ శ్రీ కె.యమ్. యాగమూర్తి పిళ్ళైగారు (సభాధ్యక్షులు) స్వామి సేవలో వున్నారు.

శ్రీ సాంబశివరెడ్డిగారు నా పుస్తకం ఒకటి అందంగా పేక్ చేయించారు. ఇంకా కొన్ని పుస్తకాలు ఆవిష్కరణ కోసం మరో అందమైన పేక్ తయారు చేశారు. ఒక పూల పళ్ళెంలో ఆ పేక్ చేసిన ఒక పుస్తకం పెట్టి నన్ను తలమీద పెట్టుకొమ్మన్నారు. మావారు, నా స్నేహితులూ, ఆలయ ధర్మకర్తా, హితులూ, పుర ప్రముఖులూ, గ్రామ పెద్దలూ వెంటరాగా, మంగళ వాయిద్యాలతో ఆలయానికి ప్రదక్షిణ చేశాము. నేనేదో అన్ని ఆలయాలు చూశాను, ఇన్ని వ్యాసాలు రాశాను, ఇన్ని పుస్తకాలు వేశాను అనుకుంటానుగానీ ఈ అనుభూతి నాకు సరి కొత్త!!! ఆనంద సముద్రం గుండె గోడలని పగులగొట్టి ఉప్పొంగింది. ఆ సమయంలో నా గురించి నేనేమి చెప్పను!?? ఎంత అదృష్టం!! కలలో కూడా ఊహించని వరం. ఉద్వేగానందాలతో మనసు పొర్లిపోయింది. ఇప్పటిదాకా 18 యాత్రాదీపికలు వెలుగు చూశాయి. 9 ప్రింట్ అయ్యాయి. పిల్లల కథల పుస్తకాలు 4 ప్రింట్ అయ్యాయి. అన్నిటినీ దేవుళ్ళకో, మనుష్యులకో అంకితమిచ్చాను. కానీ వాటిని పుస్తకంలో చూసుకోవటమే. స్వామి కల్పించిన ఈ అరుదైన అవకాశం నా జీవితంలో తొలిసారి. స్వామి సేవలో నేనూ నేరుగా పాలుపంచుకున్నాను అనిపించింది. సాంబశివరెడ్డిగారి ద్వారా స్వామే ఈ పుస్తకానికి ప్రేరేపించాడు అనుకున్నాను. ఇన్ని ఆలయాలను దర్శించి అందరికీ వాటి గురించి చెబుతున్నావు కదా.. ఆ పుణ్య ఫలితమే ఇదని శ్రేయోభిలాషుల హిత వచనాలు. నైన్త్ క్లౌడ్, టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటారు కదా. అవేమీ కాదు.. ఆ స్వామి పాదాలకు నేను పూయించిన పుష్పాన్నొకదాన్ని సమర్పించాను అనే అతులితమైన తృప్తి కలిగింది. మనసు నిండి పోయింది. సంతోషం ఉప్పొంగింది. ప్రదక్షిణ, అర్చన తర్వాత స్వామికి అర్చక స్వామి నా పుస్తక పుష్పాన్ని సమర్పించి మమ్మల్ని ఆశీర్వదించారు.

ఆవిష్కరణ.. తర్వాత ఆలయ గోపురం బయట మండపంలో పుస్తకావిష్కరణ సభ. ధర్మకర్త శ్రీ సిధ్ధేశ్వర రెడ్డిగారి ఆధ్వర్యంలో, శ్రీ బత్తినపల్లి మునిరత్నం రెడ్డి, రచయితగారు, శ్రీ వేణుగోపాల రెడ్డి, డా. మయూరనాధ రెడ్డి, ఇంకా ఇతర ఆలయ నిర్వాహకులు, పెద్దల సమక్షంలో, పుర ప్రముఖులు శ్రీ యాగమూర్తి పిళ్ళై గారి అధ్యక్షతలో, శ్రీ కట్టమంచి బాలకృష్ణా రెడ్డిగారు కోదండరామయ్య స్వీకరించిన యాత్రా దీపిక – 12 చిత్తూరు జిల్లాని అందరికోసం ఆవిష్కరించారు. ఆలయ అర్చక బ్రహ్మలతో నాకూ, మా శ్రీవారు వెంకటేశ్వర్లుగారికీ, నా మిత్రులు, ఉమ, శారదగార్లకు సన్మానం. మాలా కుమార్ ఈ ఉత్సవాలని మిస్ అయ్యారనుకున్నాను. రామయ్య ఆవిడని ఏమని ప్రోద్బల పరచారోగానీ, మొన్న రాత్రి (3-7-22) మెసేజ్ పెట్టి, ఈ ఆవిష్కరణ గురించి నిన్న రాత్రి (4-4-22) వారి ప్రభాత కమలంలో నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో కూడా ఆగస్టు 7వ తారీకున విడుదల అవుతుంది.

ఇంకో విశేషం. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత శ్రీ మునిరత్నంరెడ్డిగారు ఫోన్ చేసి నా పుస్తకం చదివాననీ, చాలా బాగా రాశాననీ మెచ్చుకోవటమే కాదు.. తను కూడా ఇంక ముందు నా పంథాలో రాస్తానన్నారు.. స్వామీ నా చేత దణ్ణం పెట్టించుకోవటానికి నీకు విసుగొచ్చిందేమోగానీ, నాకు మాత్రం తనివి తీరటంలేదయ్యా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here