ఆ స్పర్శ వేరే..

2
10

[లేఖిని సంస్థ, సరసిజ థియేటర్ ఫర్ విమెన్ సంయుక్తంగా నిర్వహించిన ‘2023 గోళ్ళమూడి సుందరమ్మ స్మారక కథల పోటీల’లో తృతీయ బహుమతి గెలుచుకున్న కథ ఇది. రచన శ్రీమతి కె.కె. భాగ్యశ్రీ.]

[dropcap]రే[/dropcap]షన్‌ షాపు నుంచి బియ్యం సంచిని మోసుకొచ్చిన రాజమ్మ గుమ్మంలో కూర్చున్న కూతురు శాంతిని చూసి విస్తుపోయింది.

“ఏటే శాంతీ పనికెల్లలేదా? ఈ పూట బడి బేగొదిలీసినారని మూడింటికే వొచ్చీసినావు గందా! నాను కోటా తెచ్చుకోవాలని నిన్ను మాట్టారింటికి పనికెల్లమన్నాను! మరి పోకుండా ఇట్టా కూర్సున్నావేం?” తలమీద బియ్యం మూటను కిందకు దింపుతూ అడిగింది రాజమ్మ.

సాయంత్రం ఐదు కావస్తున్నా ఎండ వేడిమి ఏమీ తగ్గలేదు. మండువేసవిలోలా పరిసరాలన్నీ వేడిసెగలు చిమ్ముతున్నాయి. రాజమ్మకి చెప్పలేనంత అలసటగా ఉంది.

ఆమె కష్టపడితే గాని, పొయ్యిలో పిల్లి లేవదు. మొగుడు అప్పన్నకి తాగుడు మహ చెడ్ద అలవాటు. మంచి వడ్రంగి పనివాడైనా తెచ్చుకునేది అతడి తాగుడికే సరిపోతుంది. ఆమధ్య ఇలాగే..పూటుగా తాగి, కాలువలో పడి మూతి పగలగొట్టుకున్నాడు. కొన్ని పళ్ళు కూడా రాలాయి. దానికి తోడు అతడి ఒంట్లో మధుమేహం కూడా ఉంది.

ఆ మూతి సరిగ్గా చేయించడానికి రాజమ్మ పడ్డపాట్లు అన్నీ ఇన్నీకాదు. తెల్లకార్డు ఉండబట్టి వైద్యసేవలు ఉచితంగా లభించాయి. లేకపోతే తానెన్ని ఇక్కట్లు పడుండేదో అని అనుకుంటుంది రాజమ్మ.

అలా మూతిపళ్ళు రాలగొట్టుకున్న మొగుడితో “నువ్వు పనిసేసి మమ్మల్ని ఉద్దరించనక్కరలేదు.. ఇలా యీదికెక్కి, దెబ్బలు తగల్సుకుని మమ్మల్ని మరింత బాదెట్టకు.. నువ్వు ఇంట్లోనే ఉండి కాలచ్చేపం సేయి. నానే ఎట్టాగోట్టా కట్టపడి నీకు నాలుగు మెతుకులు ఎడతా..” తేల్చి చెప్పేసింది రాజమ్మ.

అదుగో.. అక్కడినుంచీ మరింత కఠినమైంది ఆమె జీవితం. అదనంగా మరో రెండిళ్ళు ఒప్పుకోక తప్పలేదు ఆమెకు. గుడ్డిలో మెల్లలా.. ఈ అపార్ట్‌మెంట్లొచ్చి పనివాళ్ళకి మేలు చేశాయి. అపార్ట్‌మెంట్ ఇళ్ళలో ఉండే ఆధునికమైన ఫ్లోరింగ్‌ల వలన రోజూ తడి గుడ్డ పెట్టి ఒత్తుకోకపోతే బాగుండదు. దాని వలన పనివాళ్ళకి పని పెరిగింది. వాళ్ళు చేసే పనుల్లో కూడా రకరకాల ప్యాకేజీలు వచ్చిపడ్డాయి. రోజూ రెండుపూటలా పనిలోకొస్తే ఒక రకం జీతం, ఒక్కపూటే వస్తే ఇంకో రకం జీతం, రోజూ తడి గుడ్డతో ఫ్లోరింగ్ తుడిస్తే మరికాస్త ఎక్కువ జీతం, రోజు విడిచి రోజు తుడిస్తే ఇంకో రకం ప్యాకేజీ..ఇలా పనిమనుషులకి పనిని బట్టి జీతం కూడా బాగానే దొరుకుతోంది.

మగడు చేతకాని వాడైనందుకు రాజమ్మకి కష్టపడినా ఫలితం బాగానే దక్కుతోంది. పొదుపుగా ఇల్లు గడుపుకుంటూ, పిల్లల పేర పోస్టాఫీసులో ఆర్.డి. కడుతోంది.

శాంతి, సుధీర్‌లు ఆమె సంతానం. చదువుసంధ్యలో లేకపోబట్టే తానిలా నాలుగు ఇళ్ళలో అంట్లగిన్నెలు తోముకుంటోంది. తన బిడ్డల గతి అలా కాకూడదన్న ఇంగితంతో వాళ్ళని గవర్నమెంట్ బడిలో చేర్చి చదివిస్తోంది రాజమ్మ.

తాను ఏదన్నా పనిమీద ఎటైనా వెళ్ళవలసి వస్తే.. ఆ పూట శాంతి కాని అందుబాటులో ఉంటే తన ఇంటికి దగ్గరగా ఉండే ఇళ్లలో పనికి పంపడం రాజమ్మకి అలవాటు. అలాగే ఈ రోజు కూడా తాను రేషన్ షాపుకి వెళ్ళేముందు శాంతిని పనికి పొమ్మని పురమాయించింది.

కాని, శాంతి తాను చెప్పినపని చేయకుండా పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం చూసి రాజమ్మకి కోపం ముంచుకొచ్చింది.

“ఏదో.. సేతికందొచ్చావు.. పనీపాటలో కూసింత రెక్కసాయం సేత్తావకుంతే.. సెప్పినమాట యినకుండా మొండితనం సేత్తావేందే..నా పేనానికి గొప్పగా దొరికినారు. అందరూ అందరే..” చిరాకుపడింది రాజమ్మ.

శాంతి నెమ్మదిగా తలెత్తి తల్లి కళ్లలోకి చూస్తూ “నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఆ ఇంటికి పనికి మాత్రం వెళ్ళనమ్మా.. నాకిష్టంలేదు.” చెప్పింది నిక్కచ్చిగా.

“ఎందుకు యెల్లవూ.. ఏం మాయరోగం ముంసుకొచ్చింది. ఆలింట్లో పెద్దగా పనేముంటుంది! బార్యా-బర్తా ఇద్దరే గందా.. ఉంటోంది.. ఎల్లి ఆ గదులూడిసేసి, రెండు చిప్పలు పామేసి రాడానికి ఆ సలుపేంటి నీకు!?” కూతురు సమాధానానికి చిర్రెత్తిపోయిన రాజమ్మ భద్రకాళిలా విరుచుకుపడింది.

శాంతి సమాధానమివ్వలేదు. మౌనంగా ఉండిపోయింది. కూతురు తనతో వాదించకుండా ఉండిపోవడం చూసి రాజమ్మ కోపం దిగిపోయింది.

కూతురి పక్కనే కూర్చుని లాలనగా తల నిమురుతూ “ఏటైనాదే..?” అడిగింది.

శాంతి తల్లికేసి చూస్తూ “ఆ ఇంట్లో ఆ మాస్టారి సంగతి అంత బాగానేదమ్మా.. పని చేస్తూంటే.. ఎనకెనకే తిరుగుతూ.. నామీద సేతులేస్తున్నారు. ఎక్కడెక్కడో ..రాస్తున్నాడు.” చెప్పింది మెల్లగా.

నిర్ఘాంతపోయింది రాజమ్మ. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవైనాయి.

“ఏటే సాంతీ.. నువ్వు సెప్పేది నిజవేనా? సారుకి అరవయ్యేల్ల పైనుంతాయి. ఈ వొయసులో.. ఆయన ఇలా సేత్తాడంతావా!?” నమ్మబుధ్ధి కావడంలేదు ఆమెకి ఆ మాస్టారిలా చేశాడంటే.

తల్లి మాటలకు బదులు పలకలేదు శాంతి. మాట్లాడకుండా పుస్తకంకేసి దృష్టి సారించింది.

రాజమ్మ మాత్రం ఆలోచనలో పడింది. ఎన్నో ఏళ్లపాటు పిల్లల మధ్యన గడుపుతూ, వాళ్ళకి విద్యాబుధ్ధులు నేర్పిస్తున్న ఆ మాస్టారికి.. అలాంటి పాడుబుధ్దులు ఉన్నాయంటే ఆమెకు వింతగా ఉంది. తన మనవరాలి వయసున్నశాంతిని అలా వేధిస్తున్నాడంటే వినడానికే ఏదోగా ఉంది.

అలాగని కూతురి మాటలు కూడా కొట్టి పడేయలేదు. తెల్లారి లేస్తే టివిల్లో చూపించే ఈ లైంగిక వేధింపుల దృశ్యాలు అక్షరం ముక్క రాని రాజమ్మలాంటి వారిలో సైతం ఆలోచనలని రేకెత్తిస్తున్నాయి. ముక్కుపచ్చలారని ఆడపిల్లలపై సాగుతున్న అత్యాచారాలు ఆమెను భయభ్రాంతురాలిని చేస్తున్నాయి.

ఇప్పుడు కూతురు పేల్చిన మందుపాతరలాంటి ఈ వార్త ఆమెకు వెన్నులోనుంచి వణుకు తెప్పించింది.

“సరేలే.. ఇక మీన నువ్వా యింటికి పోమాక.. నా తంటాలేవో నేనే పడతా..” చెప్పేసి కిందనున్న బియ్యం మూట ఎత్తుకుని లోపలికి వెళ్ళింది రాజమ్మ.

***

“ఛిఛీ.. ఒంటిమీదకి ఏళ్ళొస్తే ఏంలాభం.. బుధ్ధీజ్ఞానం లేకపోయాక.. నలుగురు మగాళ్ళు పోగయ్యే చోటికి వెళ్ళాలంటేనే కంపరం ఎత్తిపోతోంది.” ఎవరినో తిట్టుకుంటూ ఇంటికొస్తూన్న అత్తగారిని విస్మయంగా చూసింది కావేరి.

“ఏమైందత్తయ్యా?” అడిగింది సౌమ్యంగా.

“ఏమని చెప్పుకుంటామమ్మా.. గంగాభాగీరదీ సమానురాలినైన నామీద కూడా లైంగిక వేధింపులు జరిగాయని చెప్పుకోమన్నావా? ప్రశాంతత కోసం గుడికెళ్తే.. క్యూ లైన్లో ఎవడో అప్రాచ్యుడు నా ఒళ్ళంతా తడిమి వికృతానందం పొందాడని చెప్పమన్నావా?” కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది జానకమ్మ.

నిర్ఘాంతపోయింది కావేరి. అత్తగారి ఆవేదన చూసి మనసు కకావికలం అయ్యింది. అరవయ్యేళ్ళ వయసులో కూడా ఆవిడకి ఈ రకమైన వేధింపులు ఎదురవ్వడంతో ఆమె గుండె చెరువైంది.

“వెధవని పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించవలసింది.” ఉద్రేకంతో ఊగిపోయింది కావేరి.

“అంత కోపమూ వచ్చింది తల్లీ.. కాని, అది పవిత్రమైన గుడి ప్రాంగణం. అలాంటప్పుడు నేనే అల్లరి చేసినా, ఆ ప్రభావం ఉన్న భక్తుల మీద పడుతుంది. పైగా వయసులో అంత పెద్దవాడైన వాడు అలా చేశాడంటే ఎవరూ నమ్మకపోయే ప్రమాదం కూడా ఉంది. అక్కడికీ అతడివైపు గుర్రుగా చూసి అసింటా పోయాను. కాసేపాగి మళ్ళీ మామూలే.. ఉండు.. వెళ్లి స్నానం చేస్తే గాని, ఆ చీదర పోదు.” ముఖం ముడుచుకుని బాత్ రూమ్ లోకి వెళిపోయింది జానకమ్మ.

కావేరి మనసంతా చేదుగా అయిపోయింది. వయసుతోనూ, రూపు రేఖలతోనూ సంబంధం లేకుండా, ఆడవాళ్ళపైన జరిగే ఈ అత్యాచారాలకి అంతులేదా!? ఆక్రోశించింది ఆమె హృదయం.

అప్రయత్నంగా ఆమెకు తన అనుభవాలు కూడా మదిలో మెదిలాయి. కావేరికి సంగీతమంటే ప్రాణం. ఎప్పుడొ చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతానికి మెరుగులు దిద్దుకుందామని నగరంలో ప్రముఖ సంగీత విద్వాంసుడైన దండాయుధపాణి దగ్గర చేరింది కావేరి.

దండాయుధపాణి శిష్యులనెంపిక చేసుకునీ విధానం ఆషామాషీగా ఉండదు. అపాయింట్‌మెంట్ ఇచ్చాక ముందు ఫోన్‌లో గొంతు వింటాడు. నచ్చితే.. ఇంటి దగ్గర తన దగ్గర విద్యనేర్చుకోబోయే విద్యార్ధికి ఆ సత్తా ఉందోలేదోనని శతవిధాల పరీక్షిస్తాడు. ఎన్నో వడపోతల అనంతరం, విద్యార్థుల అర్హతలని అంచనా కట్టి తన దగ్గర విద్య నేర్చుకునే అవకాశం కల్పిస్తాడు.

ఆ ప్రక్రియలన్నింటిలోనూ విజయం సాధించి, ఎన్నో ఆటంకాలను అధిగమించి, దండాయుధపాణి దగ్గర సంగీత విద్యనభ్యసించే సదవకాశాన్ని అంది పుచ్చుకుంది కావేరి.

వారానికి రెండు తరగతుల చొప్పున హాజరౌతూ తన అభీష్టాన్ని నెరవేర్చుకుని, కృషి సలపసాగిందామె.

శిష్యబృందంలోకంతటికీ ప్రత్యేకంగా కనబడే కావేరి అంటే దండాయుధపాణికి అభిమానం మొదలైంది. ఏం చెప్పినా ఇట్టే ఆకళింపు చేసుకుని అల్లుకుపోయే ఆమె తత్వం అతడికి బాగా నచ్చింది. శ్రుతి శుభగమైన ఆమె కంఠస్వరం, ఆమె గొంతులో వింతపోకడలు పోతూ వీనులవిందుగా ధ్వనించే సప్తస్వరాల సొగసూ గమనించి ఆమెను బాగా మెచ్చుకునేవాడు దండాయుధపాణి.

“చూడమ్మా కావేరీ.. నీ పట్టుదల అమోఘం. అతి తక్కువకాలంలో నువ్వు సంగీతంలో సాధించిన పట్టు చూస్తే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సాక్షాత్తూ సరస్వతీ పుత్రికవే నువ్వు. ఇన్నాళ్ళూ ఇంత ప్రతిభని ఎక్కడ దాచుంచావు. ఇలా ‘గుంపులో గోవిందా’ అన్నట్లు నలుగురితోపాటు నేర్చుకుంటే, అంత ప్రగతి సాధించలేవు. కాబట్టి, నువ్వు కొంచెం వీలు చేసుకుని సంగీతం కోసం అదనపు సమయం కేటాయించగలిగితే, నీకోసం వేరే పాఠాలు చెప్పి నిన్ను పెద్దపెద్ద విద్వాంసుల సరసన నిలబడేలా చేయగలను. వేదిక మీద నాతో స్వరం కలిపి కచ్చేరీలు చేసే స్థాయికి నిన్ను తీసుకెళ్తాను. ఏమంటావు?” అన్నాడు దండాయుధపాణి.

ఆనందంతో ఉబ్బిబ్బైంది కావేరి. దండాయుధపాణిగారి దగ్గర శిష్యరికం చేసే అవకాశం రావడమే పెద్ద అదృష్టం. అలాంటిది తనకి ప్రత్యేక శిక్షణనిచ్చి తనంతటిదానిగా తయారుచేస్తానని ఆయనే ముందుకు రావడం మహద్భాగ్యం అనే అనుకోవచ్చు.

ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి భర్త అనుమతితో ఆయన తనకోసం చెప్పే ప్రత్యేక తరగతులకి హాజరవడం మొదలెట్టింది కావేరి.

కావేరి పాఠానికి వెళ్ళే సమయానికి దండాయుధపాణి భార్య కాలేజ్‌కి వెళ్ళిపోయేది. ఆవిడ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్. ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు.

ఒక పది పదిహేను క్లాసులు జరిగాక దండాయుధపాణి చూపులోనూ, మాటతీరులోనూ మార్పు వచ్చింది. అవసరం లేకపోయినా కావేరిని పదేపదే తాకడం, వేయకూడని చోట చేతులు వేయడం, తాళం వేయడం నేర్పించే మిషతో ఆమె తొడమీద తడమడం ఇలాంటి చేష్టలు చేసేవాడు. ఏదో పొరబాటున తగిలినట్లుగా ‘సారీ’లు కూడా చెప్పేవాడు.

మొదట్లో అతడిది పొరబాటే అనుకున్న కావేరి, అతడు బుధ్ధిపూర్వకంగానే తనమీద చేతులు వేస్తున్నాడని గ్రహించింది. అతడి కళ్లలో తన పట్ల కనబడేది వాత్సల్యం కాదని, వాత్సాయన కామసూత్రాలు బట్టీపట్టి, ఆ వాంఛలు తన ద్వారా తీర్చుకోవాలని తపించిపోయే కామమని ఆమెకు అర్థం అయ్యింది.

ఓ రోజు తాళం వేస్తున్న తన చేతిని పట్టుకుని “తాళం వేయడం అలా కాదని నీకెన్నిసార్లు చెప్పాలి కావేరీ..” అంటూ ఆమె తొడమీద చేయి ఆన్చి వేళ్లు సరిచేసి చూపసాగాడు.

చురుగ్గా చూసింది కావేరి ఈసారి. అతడి స్పర్శలోని వికారం బోధపడిన తరువాత మరి ఉపేక్షించలేకపోయింది ఆమె.

“గురువుగారూ.. మీరు నన్ను ముట్టుకోకుండా చెప్పండి. నేనే సరి చేసుకుంటాను.” చెప్పింది పదునుగా.

దండాయుధపాణి వంకరగా నవ్వాడు.

“చూడు కావేరీ.. కేవలం నీ ఒక్కదాని కోసం నా విలువైన కాలాన్ని వెచ్చించడానికి నేనేమన్నా వెర్రివాడిననుకున్నావా! ఎలాగూ నా ఆంతర్యం కనుగొన్నావు కనుక, బయటపడుతున్నా. నా ముచ్చట తీర్చు. నిన్ను సంగీత ప్రపంచపు సామ్రాజ్ఞిని చేస్తా..” అంటూ ఆమెపట్ల తనకున్న కాంక్షను వెల్లడించాడు.

కంపరంగా చూసింది కావేరి. దిగ్గున లేచి నిలబడుతూ “అలా అడ్డదారిన సాధించే గెలుపు నాకు అవసరం లేదు. నీతినియమాలకు ప్రాధాన్యతనిచ్చే మనిషిని నేను. సంగీతం నా ప్రాణమే కావచ్చు. దానికోసం నా విలువలకి నీళ్ళొదులుకోవడానికి మాత్రం నేను సిధ్ధంగా లేను. మిమ్మల్ని నమ్మడం నేను చేసిన పెద్ద పొరబాటు.. దయచేసి మీ దగ్గర విద్యనభ్యసించడానికి వచ్చే అమ్మాయిల పట్ల ఇలా ప్రవర్తించకండి. మీరూ ఓ ఆడపిల్ల తండ్రని మరవకండి.” మెత్తగా చీవాట్లుపెట్టి ఆ ఇంట్లోనుంచి బయటపడింది కావేరి.

ఆ ఉదంతం మదిలో మెదలగనే కావేరి మనసు చేదుగా తయారైంది. ఎందుకు స్త్రీ అంటే ఈ మగవారికింత చులకన. వయసుతోటీ, రూపురేఖలతోటీ, స్థాయితోటీ సంబంధం లేకుండా ఆమెను ఓ భోగ వస్తువుగా చూస్తారెందుకు?

ఇది తన ఒక్కదాని అనుభవం మాత్రమే కాదు. వయసుతో సంబంధంలేకుండా చాలామంది స్త్రీలు ఎదుర్కునే సామాజిక సమస్య ఇది.

తన ప్రియనేస్తం ప్రమీలదీ ఇదే సమస్య. ప్రమీలకి కవిత్వమంటే పిచ్చి. నగరంలో జరిగే సాహిత్య సమావేశాలలో పాల్గొంటూ, తన భావాలను అక్షరీకరించి, కవితలను రాసి చదువుతూంటుంది.

అలాంటప్పుడు నలుగురూ ‘బాగా రాశావమ్మా.’ అని ప్రశంసిస్తే లాటరీలో కోటిరూపాయలొచ్చినంతగా సంబరపడిపోతుంది.

కవులందరికీ పెద్ద తలకాయగా భావించే ‘లంబోదరం’ మాత్రం ఆమె రాసిన కవితలని తూర్పార పట్టేశాడోసారి. ఆమె రాసే కవితల్లో సాహిత్య విలువలెంతమాత్రం లేవని, మనసులో భావాలున్నంత మాత్రాన సరిపోదని వాటిని కవితాత్మకంగా ఎలా చెప్పాలో తెలియాలనీ ఘాటుగా విమర్శించాడు.

పదిమందిలో అతడలా మాట్లాడేసరికి బిత్తరపోయింది ప్రమీల.

“మీలాంటి పెద్దల సలహాలు, సూచనలు నాకు అవసరమే మాస్టారూ.. నాకు మంచి కవయిత్రిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఇకముందు నేను రాసిన కవితలను మీకు చూపిస్తాను. కాస్త దిద్దిపెట్టండి.” అతడిని గురుతుల్యుడిగా భావించిన ప్రమీల వినయంగా అడిగింది.

“దానిదేం భాగ్యం.. నాకు వీలున్నప్పుడు నీకు ఫోన్ చేస్తా.. నువ్వు రాసినవి తీసుకొస్తే దిద్దుబాట్లు చేస్తా..” హామీ ఇచ్చాడు లంబోదరం.

అలా ఒకటి రెండు సార్లు పబ్లిక్ లైబ్రరీలో కలిశారిద్దరూ. ప్రమీల రాసిన కవిత్వంలో లోటుపాట్లు చెబుతూ దిద్దిపెట్టాడు లంబోదరం.

ఆ తరువాత మాత్రం అలా గ్రంథాలయంలో కలుస్తే మాట్లాడడానికి కుదరడంలేదు కాబట్టి బయటింకెక్కడైనా కలుద్దామని అన్నాడు.

అలాగేనంది ప్రమీల. ఇద్దరూ కలిసి గుడిలోనో, లేకపోతే ఏ పార్కులోనో కలుసుకోసాగారు. లంబోదరం ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రమీలవి రెండూ కవితలు పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ప్రమీల ఆనందానికి అంతులేదు.

అప్పుడు మొదలైనాయి లంబోదరం వెకిలిచేష్టలు. తన భార్య రోగాలతో బాధపడుతూ ఉండడం వలన తనకి సంసారసుఖం లేకుండా పోయిందని, ప్రమీలని చూడగానే జన్మజన్మల బంధమేదో జ్ఞప్తికి వచ్చిందని, ఆమెతో స్నేహం తనలో కొత్త ఆశలు రేకెత్తించిందని.. ఏవేవో చెప్పసాగాడు లంబోదరం.

నిర్ఘాంతపోయింది ప్రమీల. తాను గురువుగా తలపోసిన వ్యక్తిలో ఈ రకమైన బుధ్ధులుంటాయని ఆమె అస్సలూహించలేదు.

‘ఒకవేళ అతడి భార్యకూడా అతడిలాగానే అనుకుని, వేరేవారి స్నేహం కోసం తపిస్తే అతడు అంగీకరిస్తాడా!’ అనుకున్న ప్రమీల ఆ క్షణం నుంచి అతడికి దూరంగా మసలుకోసాగింది.

ఒక జానకమ్మ, ఒక కావేరి, ఒక ప్రమీల.. ఎవరైతేనేం.. ఇలాంటి వేధింపుల బారిన పడాల్సిందేనా!

ఏ రంగంలోనైనా ఆడవారికి ఈ తరహా యాతనలు తప్పవా! అందుకే కాబోలు ఈ మధ్యన ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకుంది. ఎందరో సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ నిరసనగళం వినిపిస్తున్నారు.

కావేరి అలా ఆలోచనలలో మునిగి తేలుతూండగానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే లోపలికొచ్చిన రాజమ్మను చూసి “ఏం రాజమ్మా.. ఈరోజింత ఆలస్యం అయింది” అంటూ అడిగింది కావేరి.

“ఏటి సేయనమ్మా.. ఒక్కదాన్నీ అన్నిల్లూ సేసుకుని వొచ్చీసరికి ఈ యేలైపోతోంది..” కొంగు బొడ్లో దోపి చీపురందుకుంది రాజమ్మ.

“శాంతికి సెలవులే కదా.. నీతో పాటు తీసుకురాలేకపోయావా? నువ్వో ఇల్లు అదో ఇల్లూ చేసుకుంటే పని వేగం తెమిలిపోతుంది కదా!” తమ అపార్ట్‌మెంట్ లోనే నివసిస్తున్న పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయుడిని దృష్టిలో పెట్టుకుని అడిగింది కావేరి.

“ఆ సంగతెందుకడుగుతారు నెండమ్మా..” ఉస్సురని నిట్టూర్చింది రాజమ్మ.

“ఏమైంది రాజమ్మా.. వాళ్ళు పనిలోనుంచి మానిపించేసారా?” అడిగింది ఆరాగా.

“అదేటీనేదమ్మా.. మా సాంతే పనిలోకెల్లనంటాంది.” చెప్పింది రాజమ్మ నిస్పృహని తన స్వరంలో ధ్వనింపజేస్తూ.

కావేరి భృకుటి ముడివడిందొక్కసారిగా.

మరోసారి అడిగిన మీదట రాజమ్మ పెదవివిప్పి శాంతి సమస్యను వెల్లడించింది.

‘అనుకుంది.. ఇలాంటిదేదో జరిగుంటుందని..’ మనసులోనే అనుకుంది కావేరి.

“కట్టపడితే గాని, నోట్నోకి నాలుగేల్లూ పోని పేద బతుకులమ్మా మాయి. ఎల్లకాలమూ కట్టపడాలంటే ఒంట్నో ఓపికుండాలి గందా! పిల్ల కూసింత సాయంగా ఉంటాదంటే..ఇదెమ్మా పరిత్తితి..” వాపోయింది రాజమ్మ.

“పోనీలే రాజమ్మా.. ఆఇల్లు మానేసి వేరే ఇల్లు వెదుక్కో..” సూచించింది కావేరి.

“అక్కడా ఇట్టాంటోడింకోడు తగనడని గేరంటీ ఏటమ్మా?’ రాజమ్మ సూటిప్రశ్న కావేరి మదిలో కలకలం రేపింది.

ఆ మధ్య తన స్నేహితురాలొకరు ఇలాగే వాపోయింది. దూరపుబంధువొకడు తన కూతురు పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తెలుసుకుని, అతడికి గడ్డి పెడదామని నిలదీస్తే –

“వయసులో పెద్దవాడినని కూడా చూడకుండా ఎంత నింద వేశావమ్మా.. నీ కూతురు నాకేమౌతుంది? వరసకి మనవరాలు కాదూ.. మనవరాలి పట్ల అలా ఎలా ప్రవర్తిస్తాననుకున్నావమ్మా.. ఏదో వాత్సల్యం కొద్దీ దగ్గరకు తీసుకుంటే ఇన్ని పెడర్థాలు తీస్తావా?” అంటూ నలుగురిలోనూ ఆమెదే తప్పన్నట్లుగా అంటూ తనని తాను సమర్థించుకున్నాడు.

‘మనవరాలైతే మాత్రం అలా దగ్గరకు తీసుకోవడం దేనిక’ని అడగలేదు ఆమె. అప్పటికే అతడు తనని దోషిని చేయండం మూలాన తనేం చెప్పినా ఎవరూ నమ్మరని గ్రహించి తల దించుకుని వెనుతిరిగింది.

బడిలో, ఇళ్లలో, బహిరంగ ప్రదేశాలలో.. ఆఖరుకి గుడిలో కూడా ఇలాంటి కీచకులు తగులుతూనే ఉంటారు అడుగడుగునా!

ఆధునిక మహిళ వస్త్రధారణే ఇలాంటి అత్యాచారాలకి కారణం అవుతోందని బల్లగుద్ది వాదిస్తున్నారు కొందరు. అది కొంతవరకూ నిజమే అయినా అన్ని సందర్భాలలో మాత్రంకాదు.

ముక్కుపచ్చలారని పసికందులపై అత్యాచారం చేసే కామాంధులు ఆ పసిదానిలో స్త్రీని ఎలా చూడగలుగుతున్నారు.

వయసుడిగిన ఆడవాళ్ళని సైతం విడిచిపెట్టకుండా తమ కామవాంఛని ఎలా తీర్చుకోగలుగుతున్నారు?

వారిలో వాళ్లకి పరిపూర్ణత నిండీన స్త్రీమూర్తి ఎలా కనిపిస్తోంది!

వేనవేల ప్రశ్నలు కావేరి అంతరంగాన్ని పట్టి అతలాకుతలం చేసి పారేస్తున్నాయి.

శాంతి అంటే వయసులోకి అడుగుపెడుతోంది. ఇలాంటి స్పర్శలలో తేడాలని సులువుగానే తెలుసుకోగలదు. కాని, అభం-శుభం తెలియని చిన్నపిల్లలు వీటినెలా పసిగడతారు.

జ్ఞానమున్న మహిళల్లా ‘మీ టూ’ అని చెప్పుకోలేరు కదా!

ఇప్పుడు మానసిక వైద్యులు, సామాజిక రంగాల్లో సేవ చేస్తున్నారు గొంతు పగిలేలా ఘోషిస్తున్నారు.

‘గుడ్ టచ్ కి- బాడ్ టచ్ కి’ మధ్యనుండే తేడా తమ పిల్లలకి తెలియజేయమని.

కేవలం తెలియజేస్తే సరిపోతుందా! ఆ స్పర్శ నుంచి తమని తాము కాపాడుకోగలిగే సామర్థ్యం వారికెలా వస్తుంది.

గృహిణులుగా ఉండే తల్లులైతే కాస్త సమయం వెచ్చించి తమ బిడ్దలకి మంచి – చెడ్డా చెప్పగలరు. కాని, ఉద్యోగస్థులైన అతివలు తమ చిన్నారి పాపలకు ఇవన్నీ ఎలా చెప్పగలరు? వారికంత సమయమేదీ!

ఆలోచిస్తున్న కొద్దీ కావేరిలో ఆలోచనలు పదును తేలుతున్నాయి. ఇలాంటి వేధింపులకి గురైన మహిళాలందరూ ‘మీ టూ’ అని ఉద్యమిస్తే సరిపోదు.

తన చుట్టూ సమాజాన్ని కూడా జాగృతం చేయగలగాలి. ఒక దీపం మరికొన్ని దీపాలను వెలిగించినట్లుగా, తమ అనుభవాలను పాఠాలుగా మలచి బాధితులని చైతన్య పరచాలి.

సంగీతం నేర్చుకుంటే తన చిరకాల వాంఛ నెరవేరుతుందని అనుకుని, తగిన గురువు లభించక భంగపడింది. కాని, తనలాంటి వారు అలాంటి గురువుల బారిన పడకుండా చూడగలిగిందా!

మొత్తం సమాజాన్ని మార్చడం తన ఒక్కదాని వలనా కాదు. కాని, తన చుట్టూ ఉన్న మహిళా ప్రపంచాన్ని చైతన్యపరచడం మాత్రం తనకు చేతనౌతుంది.

అవును.. ఈ అపార్ట్‌మెంట్ లోని చిన్నపిల్లలని, యుక్తవయసులోకి అడుగుపెడుతున్న ఆడపిల్లలందరినీ ఒకచోట చేర్చి, వాళ్ళకి మగవాడి స్పర్శల్లో గల తేడాలను విశదీకరించి చెప్పాలి. తమను తాము కాపాడుకునే విధానాలను వారికి తెలియజెప్పాలి. అన్ని స్పర్శలూ వాత్సల్యంతో నిండి ఉండవని, సమయాన్ని బట్టి కొన్ని మేకవన్నెపులులు కబళించడానికి తయారుగా ఉంటాయని వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి.

అదే తన తక్షణ కర్తవ్యం. తాను తనకున్న పరిధిలో తన పరిసరాలలోని స్త్రీల రక్షణ కోసం ‘మీ టూ’ అని ముందడుగు వేయాలి.

ఈ నిర్ణయానికొచ్చాక కావేరి మనసు స్థిమితపడింది.

సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here