ఆచార్యదేవోభవ-12

0
4

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అన్వేషణ జ్యోతి:

[dropcap]మ[/dropcap]దరాసు విశ్వవిద్యాలయంలో 1944-1960 మధ్య తెలుగు శాఖకు మార్గదర్శనం చేసినవారు నిడదవోలు వెంకటరావు. ఆయన తొలిరోజుల్లో కాకినాడ ఇంపీరియల్ బ్యాంకు గుమాస్తాగా పని చేస్తున్న రోజుల్లో పిఠాపురం రాజావారిని ఒక సందర్భంలో కలిశారు. సాహిత్య చర్చలో రాజావారిని మెప్పించారు. 1903 జనవరి 7న విజయనగరంలో వెంకటరావు జన్మించారు. వారిది పండిత కుటుంబం. తండ్రి సుందరం పండితులు, కవి పండితులు. వీర శైవానుయాయి. వారి ఇంట్లో ఆరువేలకు పైగా గ్రంథ భాండాగారం వుండేది. సాహిత్య వాతావరణం ఆ యింట తాండవించేది. ఆ ప్రభావం బాలుడైన వెంకటరావుపై వుంది.

సుందరం పంతులను చూచి, చర్చించడానికి ఆంధ్రదేశం నుండి కవి పండితులు వచ్చేవారు. వారి జీవన విధానాన్ని చూసి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం) ఒక వ్యాసంలో బహుధా ప్రశంసించారు. అప్పటికి వెంకటరావుకి 14 ఏళ్ళ వయసు. ఒక రోజు సుప్రసిద్ధ పరిశోధకులు మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి – సుందరం పంతులు ఇంటికి తాళపత్ర పరిశోధనకై వచ్చారు, ప్రభాకర శాస్త్రి ఒక నెల రోజులు బస చేశారు.

పిన్న వయసులోనే ప్రభాకర శాస్త్రి లోని పరిశోధనా దృక్పథం వెంకటరావు మనసు నాకర్షించింది. విజయనగరం, విశాఖపట్టణాలలో హైస్కూలు విద్య పూర్తి చేశారు. విజయనగరంలో ఆయనకు గురువు సెట్టి లక్ష్మీ నరసింహం. ఆయన వ్రాసిన చిత్రహరిశ్చంద్రీయంలో ఆపద్ధర్మంగా వెంకటరావు లోహితాస్యుని పాత్ర వేయవలసి వచ్చింది. నాటకం రక్తి గట్టింది.

సుందరం పంతులు విశాఖపట్టణం జిల్లా బోర్డు ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్‍గా పని చేసే రోజుల్లో వెంకటరావు ఏ.వి.యన్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. విజయనగరం కళాశాలలో బి.ఏ. చదువుతున్న సమయంలో గురువుగారైన ఇచ్ఛాపురం యజ్ఞనారాయణ రచించిన ‘రసపుత్ర విజయ’ నాటకంలో పద్యాలను వెంకటరావు వ్రాశారు. అప్పటికి సుందరం పంతులు విజయనగరం సంస్థానోద్యోగి. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. వెంకటరావు బి.ఏ. పరీక్షలకు ఫీజు కట్టే స్థితిలో లేడు. మదరాసు వావిళ్ళ రామస్వామి శాస్త్రుల కంపెనీ వారికి ధన సహాయం చేయమని సుదీర్ఘమైన ఉత్తరం పద్యాలతో వ్రాసి పంపాడు. అప్పటికే ఆయన వివిధ సభలలో పద్యాలు వ్రాసి చదివి ప్రశంసలందుకొని వున్నాడు. 1925లో డిగ్రీ పూర్తి చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా చేరారు. 1924లో మదరాసులో జరిగిన ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్సులో నన్నెచోడుని కాలంపై పరిశోధనా పత్రం సమర్పించారు.

జీవితంలో మలుపు – రాజ సందర్శనం:

పిఠాపురం రాజావారిని సందర్శించిన సందర్భంలో వెంకటరావు చూపిన పాండిత్య ప్రకర్ష రాజావారిని ఆకర్షించింది.1929లో బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి పలకగా, పిఠాపురం రాజా కళాశాలలో అధ్యాపకత్వం లభించింది. ఒక సంవత్సర కాలంలోనే పండితుల దృష్టిని ఆకర్షించి రాజావారు నడుపుతున్న సూర్యరాయాంధ్ర నిఘంటువులో వెంకటరావు పద సంగ్రాహకులుగా చేరారు. అప్పుడు నిఘంటు ప్రధాన సంపాదకులు జయంతి రామయ్య పంతులు. మరో పండితులు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి.

అద్భుత ధారణాశక్తి:

నిఘంటు నిర్మాణంలో పదాలకు ఆకరాలు కనిపెట్టడం బహు కష్టం. వెంకటరావు తన అసాధారణ ధారణాపటిమతో నన్నయ మొదలు చిన్నయ వరకు గల కావ్యాలలో ఆకరాలను ఎత్తి చూపగలిగేవారు. అందుకని ఆయనను ‘ప్రయోగ మూషిక మార్జాల’మని ముద్దుగా పిలిచేవారు. సూర్యరాయాంధ్ర నిఘంటువు మూడో సంపుటం అసమగ్రంగా వుంటే దానిని వేగవంతం చేసి పూర్తి చేయించారు. మధ్యలో మదరాసు విశ్వవిద్యాలయం ఎం.ఏ. తెలుగు పరీక్షకు కూర్చున్నారు. 1941లో సర్వప్రథములుగా ఉత్తీర్ణులై స్వర్ణపతకం సాధించారు. దాంతో పిఠాపురం రాజా కాలేజీ, కాకినాడలో తెలుగు శాఖలో ఉద్యోగం లభించింది.

డా. పొత్తూరి వెంకటేశ్వరరావు గారితో రచయిత

విశ్వవిద్యాలయ ఉద్యోగం:

మదరాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఖాళీ ఏర్పడింది. ప్రతిభావంతుడైన వెంకటరావు 1944లో సహాయోపన్యాసకులుగా చేరారు. కోరాడ రామకృష్ణయ్య గారి సాహచర్యంలో ఐదేళ్ళు పని చేశారు. కోరాడ వారు 1949లో రిటైరయ్యారు. వెంకటరావు శాఖాధ్యక్షులయ్యారు. 16 ఏళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా పని చేసి 1960లో రీడర్‍గా పదవీ విరమణ చేశారు. తెలుగు శాఖ ద్వారా ఎన్నో పరిశోధనలు చేపట్టారు. స్వయంగా ఎన్నో గ్రంథాలు వ్రాశారు. రిటైరయిన తర్వాత హైదరాబాదుకు వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ళు యు.జి.సి. ప్రొఫెసర్‍గా వ్యవహరించారు. ఎక్కడ వున్నా పరిశోధనకే పెద్ద పీట వేశారు. 1940 నుండి 1982 అక్టోబరు 15 (కాలధర్మం) వరకు ఆయన కలం ఆగలేదు. ఆయన ఎన్నో గ్రంథాలు పరిష్కరణలు చేశారు. 1959లో వ్రాసిన ‘తెలుగుపొలుపు’ – ఖండకావ్యం ఓరియంటల్ విద్యార్థులకు పాఠ్యగ్రంథం. వీరి మౌలిక రచనలను గూర్చి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు వివరణాత్మక పట్టిక ఇచ్చారు.

పరిశోధనా గ్రంథాలు:

  1. తెనుగు కవుల చరిత్ర (1956): ఎంతో పరిశోధన చేసి ప్రాఙ్నన్నయ యుగం నుంచి 13వ శతాబ్ది వరకు వున్న కవుల చరిత్రను, సాహిత్య చరిత్రను పొందుపరిచారు. శాసన పద్య రచయితల ప్రస్తావన ప్రధానం.
  2. ఆంధ్రవచన వాఙ్మయం (1977): తెలుగు భాషా సమితి వారు నిర్వహించిన పోటీలో బహుమతి నందుకొన్న గ్రంథమిది. శాసనాల మొదలు 1900 సంవత్సరం వరకు తెలుగు వచన పరిణామాన్ని కూలంకుషంగా చర్చించి బహుమతి నందుకొన్నారు.
  3. దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం (1954): ఈ గ్రంథం తంజావూరు ఆంధ్ర నాయక రాజుల సాహిత్య పోషణను వివరిస్తుంది. యక్షగాన పుట్టుపూర్వోత్తరాల ప్రస్తావనతో కూడిన బృహద్గ్రంథమిది (800 పుటలు).
  4. విజయ నగర సంస్థానము – సాహిత్య పోషణ (1965)
  5. భాషా పరిశోధన – ప్రయోగ విశేషాలు
  6. చిన్నయ సూరి జీవితము
  7. ఉదాహరణ వాఙ్మయ చరిత్ర (1968): ఇది అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. రావిపాటి త్రిపురాంతకుని ‘త్రిపురాంతకోదాహరణం’ మొదలు అనేక ఉదాహరణలను సేకరించి ప్రచురించారు. ఈ గ్రంథం ఆధారంగా నేను 1979లో కలకత్తాలో జరిగిన ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్‍లో ‘Udaharana Literature’ అనే పత్రాన్ని ఆంగ్లంలో సమర్పించాను. ఆ సమావేశానికి ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి (శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం) అధ్యక్షత వహించి నన్ను ప్రశంసించారు. ఎం.ఏ.లో వారు నాకు గురువులు.

అనేకానేక వ్యాసాలను వెంకటరావు ప్రకటించారు. వారు పరిష్కరించిన గ్రంథాలను మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీ, ఆంధ్రగ్రంథమాల, వావిళ్ళ వారు ప్రచురించారు.

డా. ఎన్. గోపి గారితో రచయిత

ప్రముఖ పరిష్కరణలు:

  1. కట్టా వరదరాజ రామాయణం
  2. శివతత్వసారం – మల్లికారుజున పండితారాధ్యుడు
  3. నన్నెచోడుని కుమారసంభవం
  4. పాల్కురికి సోమన బసవపురాణం
  5. భాస్కర రామాయణం
  6. ఆంధ్ర మహాభాగవతం
  7. విప్రనారాయణ చరిత్ర
  8. వసు చరిత్ర
  9. వాల్మీకి చరిత్ర
  10. శుకసప్తతి
  11. ప్రబంధ మణిభూషణం
  12. శతక సంపుటం
  13. కవిజనాశ్రయం
  14. ఛందోదర్పణం
  15. అప్పకవీయం
  16. ఉద్భటారాధ్య చరిత్ర
  17. కొప్పరపు సోదర కవుల చరిత్ర

ఈ పరిష్కరణలే గాక మెకంజీ కైఫీయతులను వెంకటరావు తొలి రోజులలో మదరాసు విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నప్పుడు సంక్షేపించి ఆంగ్లంలోకి అనువదించారు. 30 కి పైగా గ్రంథాలకు సులక్షణ పీఠికలు వ్రాశారు.

తెలుగులోను, ఆంగ్లంలోను దిట్ట కావడం వల్ల ఎన్నో వ్యాసాలను ఆంగ్లంలో వ్రాసి పత్రికలలో ప్రచురించారు. మదరాసు ఆకాశవాణిలో ఎన్నో ప్రసంగాలు చేశారు. వెంకటరావు అముద్రిత రచనలు వెలుగులోకి రావలసిన అవసరం ఎంతైనా వుంది.

సత్కారాలు:

  1. ఆంధ్ర సారస్వత పరిషత్, నరసరావుపేట – ‘విద్యారత్న’ 1942
  2. విశ్వనాథ సత్యనారాయణ అద్యక్షత-1951 – ‘పరిశోధన పరమేశ్వర’
  3. ఆంధ్ర విశ్వకళాపరిషత్ – 1973 – ‘కళాప్రపూర్ణ’

పరిశోధనాత్రయంగా మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వెంకటరావు పేర్కొనదగినవారు. శైవ సాహిత్యానికి సంబంధించి ఆయన ప్రామాణిక పరిశోధనలు చేశారు. ‘త్రిపురాంతకోదాహరణా’న్ని లోకానికి తెలియజేసిన ఘనత వెంకటరావుదే. ఆయన జంగమ విజ్ఞాన సర్వస్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here