ఆచార్యదేవోభవ-18

0
9

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సాహిత్య చరిత్ర పితామహుడు:

[dropcap]ఆం[/dropcap]ధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యయన అధ్యాపనాలకు పరమ గురువు పింగళి లక్ష్మీకాంతం. మదరాసు, ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు మూడింటిలో పని చేసిన విశిష్ట వ్యక్తి. ఆయన పాఠం చెప్పిన ఆంధ్ర సాహిత్య చరిత్ర నోట్స్ ఎందరో తరువాయి కాలంలో చరిత్ర గ్రంథాలుగా ప్రచురించారు.

పింగళి లక్ష్మీకాంతం (1894 జనవరి – 1972 జనవరి) పింగళి, కాటూరి జంటకవులలో ఒకరు. జనవరి 10, 1894 న కృష్ణాజిల్లా ఆర్తమూరులో జన్మించారు. ఆయన అధ్యాపకుడు, నటుడు, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. బందరు హిందూ ఉన్నత పాఠశాల, నోబుల్ కళాశాలలో చదివారు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రికి ప్రియశిష్యులు.

ఉద్యోగ ప్రస్థానం:

విజయవాడ సబ్ కోర్టులో రెండున్నర సంవత్సరాలు కాపీయిస్టుగా పనిచేశారు. నోబుల్ కళాశాల వారి పాఠశాలలో ఆంధ్ర పండితుడిగా అధ్యాపక జీవితం ఆరంభించిన వీరు ఎందరో విశ్వవిద్యాలయ ఆచార్యులను తీర్చిదిద్దిన దేశికోత్తములు. మదరాసు విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనా విభాగంలో అధ్యాపకులుగా 1927 – 30 మధ్య పని చేశారు. 1931లో సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా తెలుగులో బి.ఎ. ఆనర్స్ కోర్సు ప్రారంభించినప్పుడు లెక్చరర్‍గా ఎంపిక చేశారు. కొత్త కోర్సులకు రూపకల్పన చేసిన ఘనత వారిదే. కేవలం పాండిత్యము, అధ్యాపకత్వమే కాకుండా పరిపాలనాదక్షతలోనూ ఆయన మేటి. 18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని 1949లో పదవీ విరమణ చేశారు.

మహర్షీ మార్గదర్శీ:

రెండు దశాబ్దుల ప్రారంభకాంలో ఎం.ఏ. పాఠ్యప్రణాళికను పకడ్బందీగా రూపకల్పన చేశారు పింగళి. ఎందరో ఛాత్రలు యావద్భారతదేశంలో వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులుగాను, వివిధ కళాశాలల తెలుగు శాఖాధిపతులుగాను రిటైరయ్యారు. పింగళి రూపొందించిన తెలుగు పాఠ్య ప్రణాళికలే ఇతర సంస్థలకు మార్గదర్శనాలైనాయి. వీరు చెప్పిన సాహిత్య చరిత్ర, సాహిత్య విమర్శ నోట్సులే చెలామణీ అయి ఎందరికో దారి చూపాయి. తరువాతి కాలంలో ఆ రెండు గ్రంథాలను వీరు ప్రచురించారు.

పింగళి, కాటూరి జంటకవులు ముదునూరు, తోట్లవల్లూరు, నెల్లూరులలో శతావధానాలు చేశారు. పింగళి పాండవోద్యోగ విజయాలు, ముద్రారాక్షస నాటకాలలో అర్జునుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రపోషణ చేశారు. పింగళి, కాటూరి వ్రాసిన సౌందరనందం ప్రసిద్ధం. ‘సాహిత్య తిమ్మరుసు’గా పింగళికి ఖ్యాతి.

ఆకాశవాణి ప్రయోక్తగా:

ఆకాశవాణి విజయవాడ కేంద్రం 1948 డిసెంబరు 1న ప్రారంభించారు. సుప్రసిద్ధులైన ఆయా రంగాల వ్యక్తుల్ని ప్రయోక్తలుగా నియమించే సంప్రదాయంలో భాగంగా పింగళి తెలుగు ప్రసంగ శాఖ ప్రయోక్తగా 1954లో నియమింపబడ్డారు. ఏడేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగి 1961లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులుగా ఆహ్వానించబడ్డారు. ఆకాశవాణిలో ప్రసంగాలు మాట్లాడే భాషలో వుండేలా చూశారు. 5 నిమిషాల సూక్తి ముక్తావళి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, ఉదయమే శ్రోతల మానసిక వికాసానికి దోహదం చేశారు. సంస్కృత నాటకాలు ప్రసారం చేశారు.

తిరుపతిలో స్వామి సన్నిధిలో:

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఐదేళ్ళ పాటు తెలుగు శాఖ ఆచార్యులుగా అధ్యయన, అధ్యాపనాలతో బాటు పరిశోధనలకు తోడ్పడ్డారు. 1965 జూన్ లో పదవీ విరమణ చేశారు. 1965 జూన్‌లో నేను ఎం. ఏ. తెలుగులో చేరే నాటికి వారు అప్పుడే పదవీ విరమణ చేశారు. వీరి గ్రంథాలలో ప్రధానమైనవి: ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్ష, మధుర పండిత రాజము, సంస్కృత కుమార వ్యాకరణము, గంగాలహరి, తేజోలహరి, ఆత్మాలహరి, ఆంధ్ర వాజ్మయ చరిత్ర, గౌతమ వ్యాసాలు, గౌతమ నిఘంటువు (ఇంగ్లీషు – తెలుగు), నా రేడియో ప్రసంగాలు, మానవులందరు సోదరులు (మహాత్మా గాంధీ ఆంగ్ల రచన All Men are Brothers అనువాదం), తొలకరి, సౌందరనందం (1932) – కాటూరి, పింగళి జంటకృతి – చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి కంకితం.

లక్ష్మీకాంతం పల్నాటి వీర చరిత్రను పరిష్కరించారు. పింగళి సూర్య సుందరం లక్ష్మీకాంతం కుమారులు. హైదరాబాదులోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ ఎ.జి.గా పదవీవిరమణ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారు. 2019లో మరణించారు. వీరి కుమార్తె శైలజ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్లశాఖ ఆచార్యులు.

గురువులకు గురువు:

విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో తెలుగు శాఖాధిపతులుగా ఆంధ్ర దేశం నలుమూలలా ఆయన శిష్యులు విస్తరించారు. శిష్యులలో ఒకరైన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ నెల్లూరు వి.ఆర్. కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా వున్న సమయంలో నేను 1962-65 మధ్య బి.ఎ. స్పెషల్ తెలుగు చదివాను. భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరకు వెంకయ్యనాయుడు వారి శిష్యుడనని సభాముఖంగా అనేక సభలలో ప్రశంసాపూర్వకంగా పలికారు. లక్ష్మీకాంతం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరిని విశిష్ట సభ్యత్వంతో సత్కరించింది. తాను జన్మించిన జనవరి 10 తేదీన 1972లో లక్ష్మీకాంతం కీర్తికాయులయ్యారు.

2000 సం.లో ఢిల్లీ స్టూడియోలో శ్రీమతి ఆశా భోస్లేతో రచయిత

సాహిత్య ‘జోగి’ :

ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులలో ప్రాతః స్మరణీయులైన వ్యక్తి గంటిజోగి సోమయాజి. సి.ఆర్. రెడ్డి హయంలో కొందరు మల్లంపల్లి వంటి వారు ఆచార్య వర్గంలో చేరగా రాధాకృష్ణ పండితుని కాలంలో మరెందరో తెలుగు శాఖను పరిపుష్టం చేశారు. అట్టివారిలో గంటిజోగి సోమయాజి ఒకరు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ప్రారంభదశలో భాషా శాస్త్ర పరిజ్ఞానానికి నాంది పలికినవారు సోమయాజి. సాహిత్య చరిత్ర, సాహిత్య విమర్శకు పెద్ద పీట వేసినవారు పింగళి. బి.ఎ. ఆనర్స్ కోర్సు తెలుగులో ప్రవేశపెట్టిన రోజులలో ద్రావిడ భాషలపై తులనాత్మక పరిశోధనకు ప్రాముఖ్యం కల్పించారు సోమయాజి. అదే సమయంలో బి.ఏ. డిగ్రీ తెలుగులో ప్రారంభించారు. ఎం.ఏ. తెలుగు తత్రాపి వచ్చింది. ఎం.ఏ. విద్యార్థులకు గంటి తెలుగు, భాషా సాహిత్యం, సంస్కృతం 30 ఏళ్ళు బోధించారు.

ఉద్యోగ ప్రస్థానం:

గంటిజోగి సోమయాజి (7 అక్టోబరు 1900 – జనవరి 1987) విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జన్మించారు. ప్రాథమిక విద్య విజయనగరంలో పూర్తి చేశారు. కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్ చేసి, విజయనగరం మహారాజా కళాశాలలో 1917 – 19 మధ్య బి.యస్.సి. (కెమిస్ట్రీ) చేశారు.

కర్నూలు జిల్లా ఆదోని ఉన్నత పాఠశాలలో ఏడేళ్ళకు పైగా రసాయన శాస్త్ర అధ్యాపకులుగా వ్యవహరించారు. పినతండ్రి సూర్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకొన్నారు. సంస్కృతం, కన్నడ భాషలలో విద్వాన్ డిగ్రీ పొందారు. ద్రావిడ భాషలతో బాటు ఆంగ్లంపై పట్టు సాధించారు. రాజమండ్రిలో యల్.టి. చదువుతుండగా ఏ.యల్. నారాయణ వీరికి గురువు. తరువాతి కాలంలో నారాయణ ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్‌లర్ అయ్యారు.

మదరాసు విశ్వవిద్యాలయం నుండి 1928లో సంస్కృతం ఎం.ఏ. చదివారు. వెంటనే మదరాసు పచ్చయప్ప కళాశాలలో సంస్కృతం లెక్చరర్‍గా చేరి మూడేళ్ళున్నారు. మదరాసులో వుండగా లక్ష్మణస్వామి మొదలియార్ సోదరులు, రాధాకృష్ణ పండితులు బాగా పరిచయమయ్యారు. తదుపరి రాధాకృష్ణన్ ఆంధ్రా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ కాగానే సోమయాజి పాండిత్యాన్ని గుర్తించి 1933లో తెలుగు శాఖ లెక్చరర్‍గా నియమించారు. క్రమంగా 1944లో రీడరు, 1950లో ప్రొఫెసరు అయ్యారు. మూడు దశాబ్దుల అధ్యాపక జీవితంలో ఎందరో ఉత్తమ భాషాశాస్త్రవేత్తలకు వ్యక్తిత్వశిల్పి అయ్యారు. 1963లో పదవీవిరమణ చేశారు.

కేంద్ర ప్రభుత్వ పదవి:

రిటైరయిన సోమయాజిని కేంద్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్‍గా నియమించింది. తర్వాత కేంద్ర విద్యాశాఖ వారి Commission for Scientific and Technical Terminology సంస్థ అధ్యక్షులుగా కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. 1972 వరకు ఏదో ఒక పదవిలో వున్న ఖ్యాతి ఆయనది.

కళాప్రపూర్ణ బిరుదం:

ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారు సోమయాజిని కళాప్రపూర్ణతో 1963లో సత్కరించారు. భాషాభిమానులు ఆయనకు ‘భాషాశాస్త్ర చతురానన’ బిరుదమిచ్చారు. అధ్యాపకుడిగానే గాక, గ్రంథ రచయితగా, సోమయాజి ప్రసిద్ధులు. నవలా రచయిత, కావ్య రచయితగా, అనువాదకుడిగా, నిఘంటుకారుడిగా మంచిపేరు గడించారు.

రచనాపర్వం:

  • అల్లాహో అక్బర్ – నవల
  • రామచంద్రుని హంపీ యాత్ర – ఖండకావ్యం
  • మేఘ సందేశం (ఆంగ్లానువాదం)
  • ద్రావిడ భాషలు – ఆంధ్ర భాషా వికాసము
  • ఆంధ్ర భాషా వికాసము
  • తెలుగు వ్యుత్పత్తి పదకోశము (ప్రారంభ దశలో కార్యకర్త).
2000 సం.లో ఢిల్లీలో డా. బాలమురళీకృష్ణ గారితో రచయిత

తెలుగు శాఖ ప్రారంభ సంరంభం – 1931:

ఆంధ్ర విశ్వవిద్యాలయం చేసుకున్న అదృష్టం – తొలి రోజుల్లో ఇద్దరు మహనీయులు ఆ సంస్థ నావికాధారులు కావడం. సి.ఆర్. రెడ్డి, రాధాకృష్ణన్‌ ముఖ్యులు. సి.ఆర్.రెడ్డి చొరవతో బొబ్బిలి సంస్థానాధిపతి రావు వేంకట శ్వేతాచలపతి రంగారావు సంస్కృతాంధ్ర భాషాధ్యాయనానికి లక్ష రూపాయల భూరి విరాళ మందించారు. అలా 1931 సంవత్సరం తెలుగు శాఖ ఆరంభమైంది.

తెలుగు శాఖ అదృష్టం 1931లో పింగళి లక్ష్మీకాంతం తెలుగు లెక్చరర్ గాను, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి భాషా పండితులుగా నియమింపబడ్డారు. బి.ఏ. ఆనర్సు కోర్సు ప్రారంభించారు. కొంతకాలానికి పింగళి శాఖాధ్యక్షులయ్యారు. 1933లో గంటిజోగి సోమయాజి లెక్చరర్‍గా, వజ్ఝల చిన సీతారామశాస్త్రి భాషా పండితులుగా చేరారు.

1978లో శ్రీ ఈమని శంకరశాస్త్రి, శ్రీ పుట్టపర్తి, శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గార్లతో రచయిత

స్వర్ణోత్సవ సంరంభం:

తెలుగు శాఖ స్వర్ణోత్సవం 1981లో ఘనంగా జరిపి ఒక సంచికను ప్రచురించారు. యూనివర్శిటీ పక్షాన చాలా గ్రంథాలు కూడా ప్రచురించారు. స్వర్ణోత్సవ సంచికలో గంటిజోగి సోమయాజి, రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, దివాకర్ల వెంకటావధాని, యస్.వి.జోగారావు, కొర్లపాటి శ్రీరామమూర్తి, చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, లకంసాని చక్రధరరావు, వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, జోస్యుల సూర్యప్రకాశరావు, కోలవెన్ను మలయవాసిని, అత్తలూరి నరసింహారావు, పి. ఆపదరావుల వ్యాసాలు ప్రచురించారు. వీరందరూ తెలుగుశాఖలో పని చేసిన పాత, కొత్త తరం ఆచార్యులు.

గత 90 సంవత్సరాలలో తెలుగు శాఖ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించాయి. ప్రస్తుతం శాఖాధ్యక్షులుగా ఆచార్య జె. అప్పారావు వ్యవహరిస్తున్నారు. కేవలం ఒకే ఒక్కరు శాశ్వత ప్రాతిపదిక అధ్యాపకులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here