ఆచార్యదేవోభవ-22

0
11

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సాహిత్య ద్రోణాచార్యుడు:

[dropcap]ఒ[/dropcap]క సాధారణ కుటుంబంలో రాయలసీమలోని మారుమూల పల్లెలో జన్మించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకొన్న వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయ తొలి ఉపాధ్యక్షుని స్థాయి కెదిగారు. స్వయంకృషి, పాండితీప్రకర్ష అందుకు దోహదం చేశాయి. కళాసాహిత్యవిద్యా రంగాలలో విశేష కృషీవలుడైన తూమాటి దోణప్ప తిమ్మారాయ చౌదరి (దోణప్ప) అనంతపురం జిల్లా రాకెట్ల గ్రామంలో 1926 జూలై 1న ఎనిమిదో సంతానంగా జన్మించారు. తాతగారు భీమప్ప వద్ద సంస్కృత కావ్యాలు, పంచకావ్యాలు నేర్చుకొన్నారు. చిన్నతనంలో భాగవత ప్రవచనం చేశారు.

వజ్రకరూరు (1939-42), ఉరవకొండ (1942-46) పాఠశాలల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ రోజుల్లో నాటకాలలో వేషాలు వేశారు. రత్నాకరం సత్యనారాయణరాజు (తర్వాతి కాలంలో శ్రీశ్రీ పుట్టపర్తి సాయిబాబా) సహధ్యాయి స్త్రీ పాత్రలు ధరించగా దోణప్ప కూడా చింతామణి నాటకంలో ‘చిత్ర’; ‘సుభద్రా పరిణయం’లో సుభద్ర; ‘మోహినీరుక్మాంగద’లో రుక్మాంగద పాత్రలు ధరించి ప్రేక్షకులను అలరించారు. సాయిలీల నాటకంలో సాయిబాబాగా, మరోసారి మహావిష్ణువుగా నటించారు. నూతలపాటి పేరరాజు అనే గురువు దోణప్పకు ఆశుకవితాభ్యాసం నేర్పించారు.

1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివారు. అక్కడ చిలుకూరి నారాయణరావు, కారెంపూడి రాజమన్నారు గురువులు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తొలి అడుగు విద్యార్థిగా 1949లో వేసి 1952లో బి.ఎ. ఆనర్స్ పూర్తి చేశారు. దిగ్దంతులైన పండితులు – గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, కె.వి.ఆర్. నరసింహం, భద్రిరాజు కృష్ణమూర్తి, వజ్ఝల చినసీతారామస్వామి ప్రభృతులు గురువులు. 1953లో ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై స్వర్ణపతకం సాధించారు. వెంటనే గంటి జోగి సోమయాజివద్ద పరిశోధకుడిగా చేరి ‘తెలుగులో వైకృతపదాలు’ అనే అంశంపై పి.హెచ్.డి 1966లో సంపాదించారు. ఆ తర్వాత వివిధ ఉద్యోగాలు ఆయనను వరించాయి.

ఉద్యోగ ప్రస్థానం:

  • 1957: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖ్యసహాయకుడు (తెలుగు వ్యుత్పత్తి పదకోశ నిర్మాణంలో)
  • 1958-70: ఆంధ్రవిశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఉపన్యాసకుడు
  • 1970-75: ఆంధ్రవిశ్వవిద్యాలయ తెలుగు శాఖ ప్రధానాచార్యుడు
  • 1976-80: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖ హెడ్
  • 1980-81: నాగార్జున విశ్వవిద్యాలయ రిజిష్ట్రారు
  • 1983-85: నాగార్జున యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్
  • 1985-86: తెలుగు విజ్ఞానపీఠం, హైదరాబాదు ప్రత్యేకాధికారి
  • 1986: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు తొలి వైస్ ఛాన్స్‌లర్

ఆ విధంగా ఉపన్యాసకుడి స్థాయి నుండి ఉప కులపతి హోదా వరకు ఎదిగారు. పరిశోధకుడిగా ప్రామాణిక గ్రంథాలు ప్రచురించారు.

పారిజాతాపహరణం కావ్యంపై దోణప్ప చెప్పిన పద్యం

తే:
పలుకు పలుకున తేనియ లొలుకు నట్లు
అరణపుంగవి ముక్కు తిమ్మన్నగారు
పారిజాతాపహరణ కావ్యంబు చెంత
కూరుచున్నారు ముత్యాల గొడుగు పట్టి

ప్రకటిత గ్రంథాలు:

  1. ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణము
  2. తెలుగు హరికథాసర్వస్వము
  3. జానపద కళాసంపద
  4. తెలుగు మాండలిక శబ్దకోశం
  5. మన కళాప్రపూర్ణుల కవితారేఖలు
  6. భాషాచారిత్రక వ్యాసావళి
  7. తెలుగులో కొత్తవెలుగులు
  8. తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు
  9. దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట
  10. ఆకాశవాణి భాషితాలు
  11. తెలుగు వ్యాకరణ వ్యాసాలు
  12. ఆంధ్రుల అసలు కథ
  13. బాలల శబ్ద రత్నాకరం

దోణప్ప షష్టిపూర్తి అభినందన సంచికను ప్రచురించారు.

దోణప్పగారితో అనుబంధం:

1976లో నేను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నా సిద్ధాంత గ్రంథం ‘కందుకూరి రుద్రకవి రచనలు – పరిశీలన’ సమర్పించాను. ఆచార్య జాస్తి సూర్యనారాయణ నాకు పర్యవేక్షకులు. పరీక్షాధికారులుగా ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆచార్య తూమాటి దోణప్ప, ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్య నియమింపబడ్డారు. 1976 డిసెంబరు 30న మౌఖిక పరీక్ష తిరుపతిలో నిర్వహించారు. శాఖాధ్యక్షులుగా ఆచార్య జి.యన్.రెడ్డితో బాటు రామరాజు, దోణప్పలు వైవా-వోస్‌లో నన్ను ఒక పట్టు పట్టారు. సిద్ధాంత గ్రంథం వెంటనే ప్రచురించండని దోణప్ప సలహానిచ్చారు. నెలలోపు ప్రచురించాను.

ఆచార్య దోణప్పగారికి పూలమాల వేస్తున్న రచయిత

వంశీ సన్మానం:

1987 జనవరి 29న నా 40వ జన్మదిన సందర్భంగా హైదరాబాదులోని వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధిపతి వంశీరామరాజు, బి.వి.పట్టాభిరాంల ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో అద్భుత రీతిలో అభినందన సభ జరిగింది. ముగ్గురు వైస్ ఛాన్స్‌లర్లు – ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (సెంట్రల్ యూనివర్శిటీ), ఆచార్య సి. నారాయణ రెడ్డి (సార్వత్రిక విశ్వవిద్యాలయం), ఆచార్య తూమాటి దోణప్ప (తెలుగు విశ్వవిద్యాలయం) సభలో అతిథులు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీ విద్యానృసింహభారతీ స్వాముల వారు ఆశీస్సులందించారు. మహారాష్ట్ర గవర్నరు శ్రీ కోన ప్రభాకరరావు ముఖ్య అతిథి. ఆ సభలో దోణప్ప నా పరిశోధనా గ్రంథ ప్రాశస్త్యం వివరించారు.

రచయితని సత్కరిస్తున్న అప్పటి మహారాష్ట్ర గవర్నరు శ్రీ కోన ప్రభాకరరావు
రచయితకి పుష్పగిరి స్వాములవారి ఆశీస్సులు

వార్తలు చదివే వ్యక్తి సెలక్షను:

1980లో విజయవాడ ఆకాశవాణిలో నేను ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాను. వార్తా విభాగంలో వార్తలు చదివే వ్యక్తి ఎంపికకు ఇంటర్వ్యూ జరిపారు. అప్పటి స్టేషన్ డైరక్టరు యం. శివప్రకాశం ఆ ఇంటర్వ్యూలో పరీక్షాధికారిగా తూమాటి దోణప్పను ఎంపిక చేశారు. ఆయన అప్పుడు నాగార్జున విశ్వవిద్యాలయ రిజిష్ట్రారు. ఆయనను ఎస్కార్ట్ చేసి తీసుకురమ్మని మా డైరక్టరు కార్లో పంపారు. దారి పొడుగునా ఎన్నో సాహిత్య విషయాలు ముచ్చటించారు.

హైదరాబాదులో 1982-87 మధ్య ఆకాశవాణిలో పని చేసినప్పుడు వివిధ సందర్భాలలో ఆయన రికార్డింగులకు విచ్చేశారు. ఆదరంగా మాట్లాడేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎందరో ప్రతిభావంతులైన ఉపన్యాసకులకు మార్గదర్శనం చేశారు. వీరి గ్రంథం తెలుగు హరికథాసర్వస్వానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్. ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ నుండి మూడు మార్లు బహుమతులు అందుకొన్నారు.

1996 సెప్టెంబరు 6న కాలధర్మం చెందారు.

అభినందన సంచిక:

63 సంవత్సరాల సందర్భంగా అభినందన సమితి 444 పుటల అభినందన సంచికను ప్రచురించింది.  మాజీ గవర్నరులు మీర్ అక్బర్ అలీఖాన్, డా. బెజవాడ గోపాలరెడ్డి గౌరవాధ్యక్షులుగా, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి, యం.ఆర్. అప్పారావు, నవనీతరావు ప్రభృతులు ఉపదేశకులుగా అభినందన సంచిక వెలువడింది. అది ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ వారి ఆర్కైవ్స్‌లో లభ్యం.

తెనుగు లెంక తుమ్మల సీతారామమూర్తి ‘హితవాణి’ పేర అభినందన పంచరత్నాలు సంచికకు పంపారు.

“అరువది యేండ్లు నిండెను దోణప్ప కటం చనువారి మాట ద
బ్బర యనజాలగాని ఎల ప్రాయపు నిగ్గుల నీతడుంట క
చ్చెరువడెన్, సదాశయ విశిష్టుని డాయ జరాపిశాచికిన్
వెరపు జనించు నేమో నిజవిక్రమ మక్రమమై తొలంగగన్.”

1987లో ఈ అభినందన సంచిక వెలువడింది. కోటపాటి మురహరిరావు సమితి కార్యదర్శి. నాగళ్ళ గురుప్రసాదరావు దోణప్ప సాహిత్య పరిచయ వ్యాసం ప్రచురించారు. వారి మాటల్లో – “ఇంగ్లీషు చదువుకొంటే మిత్తి నెత్తికెక్కినట్టే అని వారి పెద్దల విశ్వాసం గదా. 200 ఎకరాల భూస్థితి వుంది. కౌమారం వచ్చిన తర్వాత దోణప్ప ఆలకాపరి అయ్యారు. గొడ్లు కాచే జీతగాడు నాగా పెడితే ఆ పని దోణప్ప పాలబడేది.

….ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరటానికి ముందే దోణప్ప విస్తృతంగా పర్యటించి దత్తమండల జానపద సాహిత్యాన్ని సేకరించారు. …ఆనర్స్ చదువుతున్నప్పుడు రెండో సంవత్సరం జబ్బు పడి ఇల్లు చేరారు. ‘చదువు అచ్చిరాదురా అంతే విన్నావు గాదు! ఇప్పుడైనా చదువుకు నీళ్ళొదలరా!’ అని తల్లి తిమ్మక్క (1950) హితబోధ చేసింది. అప్పటికే పితృవియోగమైంది. మరుసటి సంవత్సరం రెండో ఏడు ఆనర్సులో చేరారు. ఆ సంవత్సరమే మాతృవియోగం.”

ఈ విధంగా ‘కష్టేఫలి’ అనే సూత్రం దోణప్ప విషయంలో నిదర్శనం. తాను చదువుకోవడమే గాక ‘ద్వానా శాస్త్రి’ వంటి ఎందరినో తీర్చిదిద్దిన దేశికోత్తములు దోణప్ప. మాటల్లో సున్నితత్వము, పరిశోధనలో కఠినత్వము, జీవనంలో ధర్మబద్ధత ఆయన జీవలక్షణాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here