ఆచార్యదేవోభవ-29

0
7

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అనంతపురానికి ‘రాయలు’:

సీడెడ్ జిల్లాల్లో ఒకటైన అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతి ప్రాచీనం. ఆ కళాశాలలో చదివిన నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతి అయ్యారు. ఆ ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యావకాశాల దృష్ట్యా 1967-68 విద్యా సంవత్సరంలో అనంతపురం పి.జి. సెంటరును తిరుపతిలోనే ప్రారంభించారు. రెండో సంవత్సరం అనంతపురం ప్రభుత్వ కళాశాలలో క్లాసులు నడిపారు. స్పెషల్ ఆఫీసరుగా తెలుగు శాఖ ఆచార్యులు కోరాడ మహాదేవశాస్త్రిని నియమించారు. వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి పర్యవేక్షణలో (తిరుపతి) పి.జి.సెంటరు నడిచింది.

శ్రీదేవి అడుగుజాడలు:

హైదరాబాదులో విద్యారంగంలో ప్రసిద్ధికెక్కిన వ్యక్తి శ్రీమతి డా. యస్. శ్రీదేవి. ఆమె కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎస్. చంద్రశేఖర్ సోదరి. ఆమెను పి.జి.సెంటర్ డైరక్టరుగా నియమించారు. రాప్తాడు వెళ్ళే దారిలో భవనాలకు స్థలం కేటాయించారు. విద్యాలయం తొలి అడుగులు శ్రీదేవి ఆధ్వర్యంలో పడ్డాయి. ప్రారంభదశలో ఆమె తీసుకున్న నిర్ణయాలు సంస్థ పురోగతికి తోడ్పడ్డాయి. 1978లో కడప ఆకాశవాణికి ఒక రికార్డింగుకు శ్రీదేవి వచ్చారు. మా యింట్లో భోంచేస్తూ ఒక మాట అన్నారు: “అనంతపురంలో తెలుగు శాఖలో లెక్చరర్ పోస్టు ప్రకటన వచ్చింది. మీరు రాకూడదా?” అని.

‘అమ్మా! యూనివర్శిటీలో అందరూ పి.హెచ్.డిలు, ఆకాశవాణిలో నేను ఒక్కడినే డాక్టర్ని. ఇలా వుండిపోతా’న్నాను వినయంగా.

డా. శ్రీదేవి, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులతో రచయిత 1978

విశ్వవిద్యాలయ ప్రారంభ సంరంభం:

1981 నవంబరు 23న ఒకే రోజు అనంతపురం జిల్లాలో రెండు విశ్వవిద్యాలయాలు పురుడు పోసుకున్నాయి. పుట్టపర్తిలో సత్యసాయి విశ్వవిద్యాలయం (అటానమస్) ఉదయం ప్రారంభమైంది. ఆ సాయంకాలం అనంతపురం పి.జి. సెంటర్‍ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంగా అప్పటి యు.జి.సి. ఛైర్మన్ డా. మాధురీ షా ప్రారంభించారు. ముఖ్యమంత్రి టి. అంజయ్య ఆధ్వర్యంలో సభ జరిగింది. ఆకాశవాణి పక్షాన రెండు విశ్వవిద్యాలయల ప్రారంభ సభలకు నేను ప్రొడ్యూసర్‍గా రికార్డు చేసి మర్నాడు రేడియో నివేదిక ప్రసారం చేశాను. తొలి వైస్ ఛాన్స్‌లర్ డా. యం. ఏబెల్. ఆయన మదరాసు క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్. ఆయన రెండు టరమ్‍లు కొనసాగారు.

1981లో సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో భగవాన్ సత్యసాయిబాబాతో రచయిత

ఉపకులపతుల అనుక్రమణిక:

  1. ఆచార్య యం. ఏబెల్ – ఆగస్టు 1981 – డిసెంబరు 1987
  2. ఆచార్య కె. వెంకటరెడ్డి – మే 1988 – మే 1991
  3. ఆచార్య యం.జె. కేశవమూర్తి – డిసెంబరు 1991 – డిసెంబరు 1994
  4. ఆచార్య పి.ఆర్. నాయుడు – నవంబరు 1995- నవంబరు 1998
  5. ఆచార్య శ్రీమతి వై. సరస్వతీరావు – ఏప్రిల్ 1999 – ఏప్రిల్ 2002
  6. ఆచార్య యం.డి. ఇక్బాల్ అహమ్మద్ – జూలై 2002 – జూన్ 2005
  7. ఆచార్య ఏ. రామారావు – ఆగస్టు 2005 – ఆగస్టు 2008
  8. ఆచార్య పి. కుసుమకుమారి – ఆగస్టు 2008 – అక్టోబరు 2010
  9. ఆచార్య కె. రామకృష్ణారెడ్డి (అదే విశ్వవిద్యాలయం) – నవంబరు 2011 – నవంబరు 2014
  10. ఆచార్య కె. రాజగోపాల్ – జూలై 2015 – ఏప్రిల్ 2020
  11. ఆచార్య రామకృష్ణారెడ్డి – నవంబరు 2020 –

ప్రస్తుత ఉపకులపతి:

ఆచార్య రామకృష్ణారెడ్డి (1958 మే) కడప జిల్లాకు చెందినవారు. ఆయన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి జియాలజీలో యం.యస్.సి, పి.హెచ్.డి. చేశారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రారు, తాత్కాలిక వైస్ ఛాన్స్‌లర్ పదవుల నలంకరించారు. ఉత్తమ విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా 2011లో పురస్కారం పొందారు.

వివిధ విభాగాలు:

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం నడుస్తున్న కోర్సుల వివరాలు

  1. భాషా సాహిత్య విభాగాలు – ఇంగ్లీషు, తెలుగు, హిందీ
  2. సామాజిక శాస్త్రాలు – వయోజన విద్య, ఎనకామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, గ్రామీణాభివృద్ధి, సోషియాలజీ, ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్సు.
  3. ఫిజికల్ సైన్సులు
  4. లా విభాగం
  5. కామర్సు, మేనేజ్‍మెంటు
  6. ఇంజనీరింగ్ విభాగాలు

వీటిలో పోస్టు గ్రాడ్యుయేట్, యం.ఫిల్, పి.హెచ్.డి కోర్సులు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ తరగతులు అనుబంధ కళాశాలల్లో నడుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కళాశాలలు (దాదాపు వంద) అనుబంధాలు.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్ళిన ఉపకులపతులు:

  1. ఆచార్య యల్. వేణుగోపాల రెడ్డి – నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు మరియు ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి
  2. ఆచార్య సి. సుబ్బారావు – ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి
  3. ఆచార్య కొలకలూరి ఇనాక్ – శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
  4. ఆచార్య సి.ఆర్. విశ్వేశ్వరరావు – విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు
  5. ఆచార్య కె. కృష్ణనాయక్ – రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు
  6. ఆచార్య హనుమంతు లజపతిరాయ్ – అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
  7. ఆచార్య ఆర్.జి. భగవత్ కుమార్ – దామోదరం సంజీవయ్య ‘లా’ విశ్వవిద్యాలయం, విశాఖ
  8. ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు – ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమండ్రి
  9. ఆచార్య వి.వి.యన్. రాజేంద్ర ప్రసాద్ – శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
  10. ఆచార్య యం.డి. భాషా మొహిద్దీన్ – కర్నాటకలో ప్రైవేటు విశ్వవిద్యాలయం
  11. ఆచార్య పి. సుబ్బారావు – విదేశాలలో. పాపా న్యూ గుయినియా

1988 తర్వాత:

1968లో పి.జి. సెంటరుగా ప్రారంభమైన అనంపురం కేంద్రం 25 జూలై 1981న శ్రీ కృష్ణదేవరాయల పేర (విజయనగర సామ్రాజ్యాధిపతి) నామకరణ చేయబడింది. 1988లో అనుబంధ కళాశాలలు చేరాయి. 1993లో కర్నూలు లోని పి.జి.సెంటరు ఇందులో భాగమైంది. 2008లో అది రాయలసీమ విశ్వవిద్యాలయమైంది.

482 ఎకరాల విశాల ప్రాంగణంలో బోధనా వసతులు, లైబ్రరీ, ఆడిటోరియం, వివిధ విభాగాలు, లేబొరేటరీ వస్తులు, హాస్టళ్ళు, క్వార్టర్లు ఏర్పడ్డాయి. దాదాపు 14 వేల గ్రంథాలు లైబ్రరీలో వున్నాయి.

ఆర్ట్స్ విభాగంలో 13 శాఖలు 18 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు; సైన్సు విభాగంలో 16 శాఖలు 19 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నడుస్తున్నాయి. నాలుగు దశాబ్దులుగా (1981) ఈ విశ్వవిద్యాలయం ఎందరో ప్రతిభావంతులైన అధ్యాపక వర్గ కృషితో ఉత్తమ బోధనా ప్రమాణాలు నెలకొల్పింది. ఈ విశ్వవిద్యాలయం గణిత శాస్త్ర ఆచార్యులు సీతారామస్వామి కుమార్తె ఆర్. శోభ – ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకు సెలక్టయి ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా వ్యవహరిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఆ ఉన్నత పదవి నలంకరించిన తొలి మహిళ శోభ.

1996లో గవర్నర్ వి.ఎస్. రమాదేవితో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రచయిత

తెలుగు శాఖ:

1967లో అనంతపురం పి.జి.సెంటర్లో తెలుగు విభాగం ఆరంభించారు. తొలుత ఒక రీడరు, 3 అధ్యాపకులతో ప్రారంభమై ఈనాడు 4 ప్రొఫెసర్లు, 3 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయికి ఎదిగింది. ఎం.ఏ. రెండు సంవత్సరాలలో 8 పేపర్లు తొలి రోజుల్లో వుండగా, ప్రస్తుతం 14 పేపర్లు వ్రాయాలి. ప్రస్తుత శాఖాధిపతి ఆచార్య జి. నరసింహన్. బోర్డ్ ఆఫ్ స్టడీస్ అధిపతి ఆచార్య జి. బాలసుబ్రహ్మణ్యం. అసిస్టెంట్ ప్రొఫెసర్‍గా యన్. ఆర్. సదాశివరెడ్డి ఉన్నారు.

ప్రగతి పథంలో:

గత 53 సంవత్సరాలలో (1968-2021) తెలుగు శాఖ నుండి 150 పిహెచ్.డిలు, 200 దాకా యం.ఫిల్ డిగ్రీలు – తెలుగు, తమిళ, కన్నడ భాషలలో వచ్చాయి. అందులో 20 శాతం ముద్రితమయ్యాయి. ఈ విభాగానికి రెండేళ్ళ కొకసారి అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసరు పీటర్ జె. క్లాసు అనంతపురం వచ్చి తాను జానపద సంగీతంపై చేస్తున్న పరిశోధనకు సహకారం పొందుతున్నారు. అదే విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి శ్రీమతి మార్టీనా – అనంతరపురం జానపద కళలపై ఇక్కడి అధ్యాపకుల సహకారంతో కృషి చేస్తోంది.

ఆచార్య గురుపరంపర:

అనంతపురం తెలుగు శాఖలో పని చేసిన పలువురు –

  1. ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి – స్పెషల్ ఆఫీసరు, శాఖాధిపతి
  2. డా. కె. నాగభూషణరావు (అకాల మరణం)
  3. డా. వి. రామచంద్ర చౌదరి (మదరాసు కెళ్ళారు)
  4. డా. శలాక రఘునాధ శర్మ
  5. డా. తుమ్మపూడి కోటీశ్వరరావు
  6. డా. మద్దూరి సుబ్బారెడ్డి
  7. డా. కొలకలూరి ఇనాక్ (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వి.సి.)
  8. డా. హెచ్.ఎస్. బ్రహ్మానంద
  9. డా. ఆర్. చంద్రశేఖరరెడ్డి (సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత)
  10. డా. పి.యల్. శ్రీనివాసరెడ్డి
  11. డా. యం.కె. దేవకి
  12. డా. శేషశాస్త్రి
  13. డా. బుడ్డన్న
  14. డా. జి. బాలసుబ్రమణ్యం
  15. డా. జి. నరసింహన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here