ఆచార్యదేవోభవ-4

1
8

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

ఛందఃశిల్పి పాటిబండ:

[dropcap]”పా[/dropcap]ఠమ్ము చెప్పెనా బండరాతికినైన
చైతన్య చిహ్నముల్ సంఘటించు”

అని దివాకర్ల వెంకటావధానిచే ప్రశంసలందుకొన్నారు పాటిబండ మాధవశర్మ. ఉస్మానియా తెలుగు శాఖలో ఆయన సాహితీ కృషి అద్భుతం. ఆయన ఛందః పరిశోధనా పరమేశ్వరులు. అధ్యాపకులుగా ఆరితేరిన మనిషి. ఉభయ భాషా ప్రవీణులు. శేముషీ రోచిష్ణువు అని వెల్దండ నిత్యానందరావు ఒక వ్యాసంలో ప్రస్తుతించారు. చారిత్రక నవలలే గాదు, పద్య రచనలను సమకాలీన సమాజిక రచనా ధోరణిలో రచించిన యశస్వి. ‘వీణ’ అనే సాహిత్య పత్రికా సంపాదకులుగా వ్యవహరించారు.

మాధవశర్మ (ఏప్రిల్ 1910 – 1978) కృష్ణా జిల్లా తేలప్రోలులో జన్మించారు. పద్యరచనను చిన్ననాటనే ప్రారంభించి 1929లోనే బందరు నుండి వెలువడే ఆంధ్రభారతిలో ‘కుంతి తో కర్ణుడు’ అనే పద్యాలు ప్రచురించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్స్‌లో చేరారు. దివాకర్ల వెంకటావధాని సహాధ్యాయి. విశ్వనాథ రచించిన ‘నర్తనశాల’ నాటకంలో దివాకర్ల భీముడు, పాటిబండ ద్రౌపది పాత్రలు పోషించారు. విద్యార్థి దశలోనే ‘ఉషస్సు’ అనే పత్రిక నడిపారు. అందులో శ్రీశ్రీ గీతాలు ప్రచురించారు. విశ్వవిద్యాలయంలో వారికి పింగళి లక్ష్మీకాంతం, గంటి జోగి సోమయాజి ప్రభృతులు అధ్యాపకులు. శ్రీశ్రీ బి.ఎ. ఆనర్స్ రెండో సంవత్సరం చదువుతున్నారప్పుడు.

పరిశోధనకు ‘ఆధునికాంధ్ర భావ కవిత్వం’ ఎంచుకొని 1936లో ఎం.ఏ. ఆనర్స్ పొందారు. సొంతంగా ప్రెస్సు పెట్టి వీణ మాసపత్రికా నిర్వహణ చేపట్టారు. దాదాపు మూడేళ్ళ లోపు పత్రిక మూత పడింది. విశ్వనాథ, శ్రీశ్రీ, రాయప్రోలు, మల్లంపల్లి వంటి ప్రముఖుల రచనలు ప్రచురించారు. రెండేళ్ళు 1935 – 38 మధ్య గుంటూరు శారదానికేతన్ ఓరియంటల్ కళాశాల అధ్యక్ష స్థానంలో వున్నారు.

1939లో తేలప్రోలులో ‘ఉదయభారతి’ గురుకులాన్ని గాంధేయ సిద్ధాంతాలతో స్థాపించి కొంతకాలానికి నష్టాలతో మూసివేశారు. 1945లో బెజవాడ యస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కళాశాల అధ్యాపకత్వం లభించింది. విశ్వనాథ కూడా అప్పుడక్కడ అధ్యాపకులు. బాలప్రభ మాసపత్రికను కొంతకాలం నడిపారు.

1957లో హైదరాబాద్ న్యూ సైన్స్ కళాశాల అధ్యాపకత్వంతో రాజధానీ నగరప్రవేశం జరిగింది. క్రమంగా 1959 సెప్టెంబరులో ఉస్మానియా తెలుగు శాఖ అధ్యాపకులుగా చేరి 1970లో పదవీ విరమణ చేశారు. 1965లో డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. వెంటనే రీడర్‍గా పదోన్నతి పొందారు.

నిత్య పరిశోధకులు:

మాధవశర్మ నిత్య సాహిత్య కృషీవలులు. ఆంధ్ర మహా భారతం – ఛందశ్శిల్పం అనే అంశంపై పరిశోధనకుగా డాక్టరేట్ లభించింది. ఛందస్సు అనేది ఒక శిల్పంగా, కావ్య సౌందర్య పోషకంగా వుండటాన్ని కవిత్రయ భారతంతో సమన్వయం చేశారు. ప్రాచ్య పాశ్చాత్య ఛందోతీరులను ప్రస్తావించి విశ్లేషించారు. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా 1975లో తెలుగులో సాహిత్య విమర్శ గ్రంథాన్ని ప్రచురించారు. బ్రౌన్, కందుకూరి వీరేశలింగంల సాహిత్య సేవను విశ్లేషించారు. అద్దంకి గంగాధర కవి తపతీ సరోవరోపఖ్యానికి సుదీర్ఘ పీఠిక వ్రాసి పరిష్కరించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి కోసం అరణ్యపర్వము, తిక్కన నిర్వచనోత్తర రామాయణ సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. వివిధ సంస్కృత గ్రంథాలకు సరళానువాదాలు ప్రకటించారు.

నవలా రచయితగా:

ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి చారిత్రక నవలల పోటీలలో మాధవశర్మ రచించిన ‘రాజశిల్పి’ బహుమతి నందుకొంది. 1958లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆ నవలను ప్రచురించింది. కుమారగిరి రెడ్డి నాయకుడిగా ఆ నవల రసవత్తరంగా సాగింది. అతడు వసంత రాజీయ వ్యాఖ్యాత. ఇందులో లకుమను ప్రేయసిగా గాక, సోదరిగా చిత్రించారు.

విష్ణుకుండినుల గాధ ఆధారంగా 1957లో ‘ఇంద్రాణి’ అనే మరో నవల కళాశాల విద్యార్థులకు ఉపవాచకంగా చాలాకాలం ప్రచారంలో వున్నది. రాజస్థానీ కథావళి ఆధారంగా ‘చారుణి’ కావ్యం 1933లోనే వ్రాశారు. పింగళి లక్ష్మీకాంతం మార్గదర్శకత్వంలో చేసిన భావకవిత్వంపై పరిశోధన అగ్రగణ్యం. మాధవశర్మ కృతులపై పరిశోధన చేసి కలువకుంట రామకృష్ణ పి.హెచ్.డి. పొందారు.

వైయక్తిక విశేషాలు:

మాధవశర్మ, మంగతాయారు దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. పెద్దమ్మాయి ఝాన్సీ ఉస్మానియ విశ్వవిద్యాలయ చరిత్ర శాఖ ఆచార్యులుగా పని చేసి పదవీ విరమణానంతరం గతించారు. అరుంధతి ఢిల్లీలోని ఆర్కియాలజీ విభాగంలో డిప్యూటీ డైరక్టర్‍గా పదవీ విరమణ చేశారు. వారి భర్త సుబ్బారావు సుప్రీం కోర్టు న్యాయవాది. ఆ దంపతులు, మేము 1999-2005 మధ్య ఢిల్లీ లోని పండారా రోడ్డు క్వార్టర్లలో సన్నిహితంగా వుండేవారం. అరుంధతి తమ తండ్రి గూర్చి సగర్వంగా చెప్పేవారు. ఆమె నాలుగు గ్రంథాలు ప్రచురించారు. వెంకటావధాని, మాధవశర్మ సహాధ్యాయులే అయినా ఇరువురి జీవనరేఖలలో అదృష్టలక్ష్మి భిన్నంగా ప్రవర్తించింది. ఎవరిదారి వారిది అన్న సూక్తికి ఇదొక ఉదాహరణ.

ఆర్ట్స్ కళాశాల భవనం:

చూడచక్కనైన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణం 1934లో మొదలై 1939లో పూర్తి అయింది. దాదాపు 38 లక్షల ద్రవ్యం ఖర్చయ్యింది. అందులో 1949లో తెలుగు శాఖ ఏర్పాటై, ఎం.ఏ. తరగతులు మొదలయ్యాయి. హిందూ, మహమ్మదీయ శిల్పకళా సంప్రదాయాల సమ్మేళనంగా ఆ భవనం తీర్చిదిద్దారు. ఈ భవనంలో 10 లక్షల గ్రంథాలు వివిధ భాషలకు చెందిన పరిశోధకులకు అందుబాటులో ఉన్నాయి. అన్ని భాషలకు చెందిన ఏడు వేల తాళపత్ర గ్రంథాలు ప్రత్యేకంగా సంస్కృత అకాడమీలో భద్రపరిచారు. 2000 ఎకరాల విస్తీర్ణంలో కొండను తొలిచి ఎత్తుకొచ్చి పెట్టినట్లుగా ఈ ఆర్ట్స్ కళాశాల భవనం కన్పిస్తుందని జియో ఫిజిక్స్ శాఖ విశ్రాంతాచార్యులు డా. యస్.వి. శేషగిరిరావు వర్ణించారు. బెల్జియంకు చెందిన ఆర్కిటెక్ట్ యం.ఇ. జాస్పర్ రూపకల్పన చేసిన మహాద్భుత కట్టడమది. అది ఒక పెద్ద గాలిగోపురమని డా. మాడభూషి శ్రీధర్ ప్రశంసించారు.

శ్రీకృష్ణదేవరాయలుగా వ్యాస రచయిత

నిజాం కళాశాల:

1883లో స్థాపించబడిన నిజాం కళాశాలలో తెలుగు శాఖ 1910లో ప్రారంభించారు. తొలి ప్రొఫెసరు రాయప్రోలు వెంకటరామ సోమయాజులు. ఆయన 1910-30 మధ్య పని చెశారు. 1942లో కురుగంటి సీతారామయ్య ఆ బాధ్యతలు స్వీకరించారు. వారి కాలంలో విద్యార్థులతో తెలుగు సారస్వత సమితి స్థాపించారు. ఆంధ్రదేశం నుండి ఎందరో కవి పండితుల నాహ్వానించి ఉపన్యాసాలిప్పించారు. సీతారామయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ఎం.ఏ. విద్యార్థులకు కూడా పాఠాలు చెప్పారు. 1950లో నిజాం కళాశాలలో గరికపాటి లక్ష్మీకాంతయ్య ఉపన్యాసకులుగా ప్రవేశించారు. సీతారామయ్య ‘తంజాపురాంధ్రనాయకరాజ చరిత్రం’ రచించారు.

నిజాం కళాశాలలో ఎందరో ప్రముఖులు అధ్యాపక వర్గంలో వున్నారు. వారిలో ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజు రామరాజు, సి. నారాయణ రెడ్డి, కోవూరు గోపాలకృష్ణారావు ప్రముఖులు. 1982లో పోస్టు గ్రాడ్యుయేట్ తరగతులు ప్రారంభించారు. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయింది.

కురుగంటి సీతారామయ్య విద్యార్థి అనే పత్రికను నడిపారు. నవ్య సాహితీ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. 1932లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును తాను కార్యదర్శిగా, రాయప్రోలు అధ్యక్షులుగా స్థాపించారు. వీరికి పేరు తెచ్చిన రచనలలో ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’, ‘అలంకార తత్త్వ విచారము’ ప్రధానం. షడ్దర్శనములు, శాతకర్ణి (నవల), లవంగి (నవల), ఆదర్శప్రభువు, కథాత్రయి, కురుగంటి వ్యాసలహరి, కురుగంటి కథావళి ఇతర రచనలు. 1991 ఫిభ్రవరి 24న యాభయ్యవ ఏట మరణించారు.

అధ్యక్ష పదవి వద్దన్న సి.నా.రె.:

బిరుదురాజు రామరాజు పదవీ విరమణానంతరం సీనియారిటీ ప్రకారం డా. సి. నారాయణ రెడ్ది ఆ పదవి నధిష్టించాలి. కాని ఆయన ఐచ్ఛికంగా వదులుకున్నారు. అప్పుడు కె. గోపాలకృష్ణారావు ఆ బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. అప్పటివరకు తెలుగు శాఖాధ్యక్షుల వివరాలివి:

1. రాయప్రోలు సుబ్బారావు 1919 – 1946

2. ఖండవల్లి లక్ష్మీ రంజనం 1946 – 1964

3. దివాకర్ల వెంకటావధాని 1965 – 1973

4. బిరుదురాజు రామరాజు 1973 – 1982

ఆ తర్వాత కోవూరు గోపాలకృష్ణారావు ప్రభృతులు ఆ బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1949 నవంబరు 22న అధ్యాపకులయ్యారు. గోపాలకృష్ణారావు రామరాజు గారి బ్యాచ్‌కి కొంత కాలం పాఠాలు చెప్పారు. సి. నారాయణ రెడ్డి, జి. రామిరెడ్డి లాంటి వారు ఈయన శిష్యులు. 1982 మార్చి నుండి 1986 మార్చి వరకు ఆయన శాఖాధ్యక్షులు. తెలుగుపై ఉర్దూ పారశీకములు – అనే గ్రంథం వ్రాశారు. ఉర్దూలో మంచి పండితులు.

“గోపాలకృష్ణారావు మౌని. ఇరివెంటి కృష్ణమూర్తి మౌని” అని ముదిగొండ శివప్రసాద్ ప్రస్తావించారు. శతక సాహిత్యంపై గోపాలకృష్ణారావు పరిశోధన చేశారు.

తిరుపతిలో త్రిగళావధానం సందర్భంగా సన్మానం

కులశేఖరుడు:

1963 ప్రాంతాలలో భూపతి లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖలో సీనియర్ పదవిలో వున్నారు. నిజాం కళాశాలలో తెలుగు శాఖలో 1955లో యం. కులశేఖరరావు అధ్యాపకులుగా చేరారు. ఆయన ఉస్మానియాలో 1953-55 మధ్య తెలుగు యం.ఎ. చేశారు. అప్పుడు ఆ విధాగంలో నలుగురే విద్యార్థులు. మొదటి సంవత్సరం పరీక్షలకు నాలుగు పేపర్లుండేవి. 1. భాషాశాస్త్రం 2. వ్యాకరణం (ఆంధ్ర శబ్ద చింతామణి) 3. పద్య భాగం 4. గద్య భాగం. రెండో సంవత్సరం నాలుగు పేపర్లు. 1.చరిత్ర, సంస్కృతి 2. సాహిత్య చరిత్ర 3. సంస్కృతం 4. అలంకార శాస్త్రం.

కులశేఖరరావు 1956లో ఆంధ్ర వచన వాఙ్మయంపైన పరిశోధన ప్రారంభించారు. 1965లో ఉస్మానియాలో చేరి అతి చిన్న వయసులో 33 ఏళ్ళకే రీడర్ అయ్యారు. “He is the youngest Reader” అని అప్పటి ఉపాధ్యక్షులు డి.యస్.రెడ్డి ఒక సభలో ప్రస్తుతించారు. 1982-92 మధ్య ఆచార్యులుగాను, మధ్యలో రెండేళ్ళు శాఖాధిపతి గాను వ్యవహరించారు. రిటైరయిన తర్వాత యు.జి.సి. ప్రొఫెసర్‍గా 1992-95 మధ్య పని చేశారు. వీరు 1988లో ఆంగ్లంలో ప్రచురించిన ‘A History of Telugu Literature’ విశేష ప్రచారం విదేశాలలో సంపాదించింది. 1976లో ఆంధ్ర రచయితల సంఘం వారు కులశేఖరరావు రచించిన ‘రుచిరాలోకనము’ ప్రచురించారు. మడుపు కులశేఖరరావు జైమిని భారత గ్రంథ పరిష్కరణ చేశారు. కులశేఖరరావు 1932 జూన్ 25న జన్మించారు. జన్మభూమి వైదేశికము, కులశేఖరరావు కావ్యాలు, సాహితీ మంజూష, తెలుగు సాహిత్యము – పరిశోధన, శ్రీకృష్ణ విలాసము చారిత్రాత్మక గాథ – వారి ఇతర రచనలు. 1986-88 మధ్య తెలుగు శాఖాధ్యక్షులు. సి.నా.రె. ను ఆంగ్ల పాఠకులకు పరిచయం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here