ఆచార్యదేవోభవ-43

0
6

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

‘జగన్నాథ’ సాహితీ రథ చక్రాలు:

[dropcap]చే[/dropcap]తనావర్త కవులలో పేర్వారం జగన్నాథం ప్రముఖులు. 1964లో వరంగల్ కళాశాలలో కోవెల సుప్రసన్నాచార్య, మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, వే. నరసింహా రెడ్డి అధ్యాపకులు. నిర్జీవంగా ఉన్న సాహితీ బంధు బృందాన్ని జగన్నాథం సజీవం చేసి కవితా గోష్ఠులు, పుస్తక ప్రచురణలు మొదలుపెట్టారు. 1967లో సుప్రసన్న, జగన్నాథంలు చేతనావర్తం ప్రచురించాలని నిర్ణయించారు. వీరితో సంపత్కుమార, నరసింహారెడ్డి జత కలిసారు. అందులో జగన్నాథం వ్యంగ్య కవితలు పలువురిని ఆకర్షించాయి. వ్యక్తి స్వేచ్ఛకు, జాతీయతకు, సర్వతోముఖ వికాసానికి చేతనావర్త కవులు తపించారు. 1971లో రెండో సంకలనం వచ్చింది. 1973 జనవరిలో నరసింహారెడ్డి మరణంతో ప్రచురణలు ఆగిపోయాయి.

జగన్నాథం విశిష్ట వ్యక్తిత్వం:

పేర్వారం వరంగల్లు జిల్లా ఖిలాషాపూరంలో 1934 ఆగస్టు 23న శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. తెలంగాణ రైతు పోరాట సమయంలో ధీరప్రవృత్తి అలవడింది. తన తమ్ముడు పేర్వారం రాములు (పోలీసు డి.జి.పి.) వివాహాన్ని తండ్రి చిన్నతనంలో నిర్ణయించారు. రాములు తండ్రి నెదిరించి జనగామ కోర్టులో కేసు వేసి బాల్య వివాహం ఆపగలిగారు. 1955లో వరంగల్‌లో సాహితీ బంధు బృందాన్ని ప్రారంభించి పి.వి., కాళోజీలను ఆహ్వానించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశారు. ;ఆరె జానపద సాహిత్యం – తెలుగు ప్రభావం’పై పరిశోధన చేశారు.

తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి:

1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఎన్నో పురోగభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ సంవత్సరం ఉత్తమ అనువాద పురస్కారం వారి చేతుల  మీదుగా నేను స్వీకరించాను. ఆయన కవి, విమర్శకుడు, సంపాదకుడు.

ఆచార్య పేర్వారం జగన్నాథం

వారి రచనలు:

  • కవితా సంపుటులు: సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడపురాణం, చేతనావర్తనం (నలుగురు)
  • సాహిత్య విమర్శ: సాహిత్యావలోకనం (1982), సాహితీ వసంతం, పేర్వారం పీఠికలు, యయాతి చరిత్ర
  • వీరి సిద్ధాంత గ్రంథం: ఆరె జానపద సాహిత్యం – తెలుగు ప్రభావం
  • సంపాదకత్వం: అభ్యుదయకవిత్వానంతర ధోరణులు, సాహిత్యం-సమాజం-రాజకీయాలు, విద్యారణ్య భారతి, అమృత స్మృతి, తెలుగులో దేశీయ కవితా ప్రస్థానం
  • జానపద సాహిత్య సేకరణ: ఆరె జానపద గేయాలు, ఆరె జానపద గాథలు, ఆరె భాషానిఘంటువు

పేర్వారం గూర్చి రవ్వా శ్రీహరి సంపాదకత్వంలో గ్రంథం వెలువడింది.

జగన్నాథం సోదరులు రాములు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. తెలంగాణా టూరిజం డెవలప్‍మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‍గా వ్యవహరించారు. మంచి కథా రచయిత. జగన్నాథం 2008 సెప్టెంబర్ 29న కాలధర్మం చెందారు.

సాహితీ రాజేశ్వరుడు:

అమరేశం రాజేశ్వర శర్మ కామరెడ్డి ఉన్నత పాఠశాలలో చాలాకాలం పని చేశారు. సంస్కృతాంధ్ర భాషలలో సమ ప్రతిభ గలవారు. వారికి వ్యాకరణం అభిమాన విషయం. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలలో అధ్యయన, అధ్యాపనాలు మూడు దశాబ్దులు కొనసాగించారు. రాజమండ్రికి వెళ్ళి ప్రాచ్య కళాశాలలో స్వచ్ఛందంగా పాఠాలు చెబుతున్నారు. 1929 సెప్టెంబరు 17న జన్మించిన శర్మ 1960 అక్టోబరులో ఉస్మానియాలో చేరారు. 1983లో ప్రొఫెసర్. 1988-89 మధ్య శాఖాధిపతి. 1989లో పదవీ విరమణ. ఆదిలో వరంగల్ పి.జి. సెంటర్‍లో పని చేశారు.

పరిశోధన:

రాజేశ్వర శర్మ ఆంధ్ర వ్యాకరణ పరిణామంపై 1971లో సిద్ధాంత వ్యాసం సమర్పించి డాక్టరేట్ పొందారు. ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షకులు. దివాకర్ల వారు ఈ సిద్ధాంత గ్రంథము గూర్చి మహతిలో వ్రాస్తూ “వీరి విమర్శ నిష్పాక్షికము, సప్రమాణము, పాండితీ స్ఫోరకమునై యున్నది” అన్నారు. “తెలుగులో ఇంత వరకు వచ్చిన వ్యాకరణాల చరిత్ర” అని దేవులపల్లి రామానుజరావు ప్రశంసించారు (1975). స్వంత ఖర్చులతో కామరెడ్డిలో ఓరియంటల్ కళాశాలను నడుపుతున్నారు. అరవయ్యవ పడిలో ‘లా’ కోర్సు చదివిన విజ్ఞానఖని శర్మ. వీరి అల్లుడు చంద్రశేఖర్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ డైరక్టరు.

సాహితీ గిరి శిఖరం:

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చిరకాలం ఆచార్యులుగా పని చేసిన కె. యాదగిరి పరిశోధనా రంగంలో పాలనా రంగంలో విశిష్ఠులు. తెలుగు అకాడమీ డైరక్టరుగా 2010 దశకంలో ఎన్నో అద్భుతాలు సాధించారు. ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు వంద మోనోగ్రాఫులు రికార్డు సమయంలో వ్రాయించి ప్రచురించారు. కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో వివిధ హోదాలలో పని చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వి.సి.గా వ్యవహరించారు. కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ఆచార్యులుగా మూడేళ్ళు పని చేశారు. 1986లో కోవెల సంపత్కుమార పర్యవేక్షణలో యాదగిరి పి.హెచ్.డి. చేశారు. యాదగిరి సిద్ధాంత వ్యాసం – రాయప్రోలు సౌందర్య దర్శనం. యాదగిరి పర్యవేక్షణలో ఎనిమిగి పి.హెచ్.డిలు వెలువడ్దాయి.

భక్తవత్సలుడు:

తెలుగు విశ్వవిద్యాలయం వారి వరంగల్ కేంద్రంలో జానపద విభాగం అధిపతిగా పని చేసిన డా. యన్. భక్తవత్సల రెడ్డి 1968లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. చేశారు. మదురై విశ్వవిద్యాలయంలో ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్య పర్యవేక్షణలో స్వాతంత్రోత్తర కాలన తెలుగు కవిత్వంపై 1979లో పి.హెచ్.డి. పొందారు. త్రివేండ్రంలో ద్రావిడ భాషా నిఘంటువు విభాగంలో ఆచార్యులుగా పని చేశారు. పదవీ విరమణానంతరం చిత్తూరు జిల్లా స్వగ్రామంలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ‘జానపద విజ్ఞానంలో పరిశోధనలు’ గ్రంథ ప్రధాన సంపాదకులు. ద్రవిడయన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి.

అతిరథ మహారథ కాకతీయులు:

కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులలో గణనీయులు మాదిరాజు రంగారావు. విశ్వనాథకు వీరాభిమాని. అదే రీతిలో గళం విప్పి విశ్వనాథ కవితలు చాలా రికార్డు చేశారు. ఆయన జన్మించింది ఖమ్మం జిల్లా పండితాపురం. కవిగా, విమర్శకులుగా ప్రసిద్ధికెక్కిన రంగారావు 1936 జనవరి 7న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1962లో ఎం.ఏ., 1966లో పిహెచ్‍డి, 1969లో సంస్కృత ఎం.ఏ. పూర్తి చేశారు. ‘కవిత్రయము మరియు నాచన సోమన కవితాశయాభాస్యాసములు’ సిద్ధాంత వ్యాసం. ఆచార్య బి. రామరాజు పర్యవేక్షకులు. దివాకర్ల వారు ఆ గ్రంథాన్ని గూర్చి మహతిలో ఇలా వ్యాఖ్యానించారు – “ఆంధ్ర వాఙ్మయ సౌధమునకు మూల స్తంభమని చెప్పదగిన యీ నలుగురు కవులను గూర్చియు, వారి కవితాకళాభిరుచులను గూర్చియు వారి కావించిన పరిశోధన ఆదర్శప్రాయమై అలరారుచున్నది.”

ఉస్మానియా తెలుగు శాఖలో 1964-68 వరకు బోధించి, 1968 నుండి కాకతీయలో 1995 వరకు ఆధ్యాపనలు కొనసాగించారు. వీరి పర్యవేక్షణలో 12 మంది ఎం.ఫిల్, 10 మంది పిహెచ్‌డిలు పొందారు. ఆచార్య రాయప్రోలు సుబ్బారావు ప్రధాన సంపాదకులుగా వున్న ఆంధ్ర భాగవత సవిమర్శ ప్రచురణల సంపాదక మండలిలో వీరు ప్రధానులు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పరిష్కరించిన ఆంధ్ర మహాభారత సంశోధిత ప్రతి సంపాదక సభ్యులు.

రచనా వ్యాసంగం:

1952 నుండి ఆధునిక కవిత్వము, నవలలు, విమర్శ, సంస్కృత వాఙ్మయం గూర్చి వ్యాసాలు ప్రచురించారు. ‘స్వేచ్ఛా కవిత్వం’ అనే ప్రత్యేక కవితా శాఖకు ఆద్యులు. 1992లొ ఉత్తమ అధ్యాపక అవార్డు, 1993లో తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ కవితా పురస్కారం లభించాయి. రచనలలో ప్రధానం (మొత్తం 15 గ్రంథాలు) – (1) కవిత్రయం-సృజన కళాశిల్పం (2) స్వేచ్ఛా కవిత్వం (3) నవలా స్వరూపం (4) పరిశోధనా స్వరూపం (5) అధికార భాష (6) అనువాద కళ (7) శ్రీశ్రీ మహాప్రస్థానం (8) దాశరథి పునర్నవం (9) సమదర్శిని (10) ఆలోకనం (11) సాహిత్య వ్యాసాలు.

కవితా సంపుటులు:

మాధవీయం, పడగెత్తిన ఉదయం, ముక్తధాత్రి, ఇదీ వియత్నాం, మనోభూమికలో, ఈ తరం స్వరచిత్రణ, వర్తమానం స్క్రీన్‍పై, శాంతిస్వప్నం, అపూర్వ అజ్ఞాతం నుండి, రోజు వస్తుంది స్వచ్ఛంగా, గిఫ్ట్ ప్యాకెట్, నవారంభం తదితరాలు.

కవితా మాదిరాజు కవిరాజు.

సాహిత్య ‘కేతనం’:

కాకతీయ తెలుగు శాఖలో సాహిత్య కేతనం హరి శివకుమార్. సాహిత్యకారుడిగా, చరిత్రకారుడిగా ప్రసిద్ధి. 1942 ఏప్రిల్ 19న వరంగల్ పట్టణంలో పండిత కుటుంబంలో జన్మించారు. డిగ్రీ చదువు వరంగల్ లోనూ, ఎం.ఏ., పి.హెచ్.డి.లు ఉస్మానియా నుండి చేశారు. వీరి తండ్రి రాధాకృష్ణమూర్తి భద్రకాళి దేవాలయ పునరుద్ధరణలో కీలక భూమిక పోషించారు. చిన్ననాటి నుండి శివకుమార్ భద్రకాళి అమ్మవారిపై భక్తి పెంచుకుని కాకతీయులకు సంబంధించి మరుగున పడిన చరిత్రను వెలికితీశారు. రామప్ప గుడి ఆలయాల శతాబ్ది ఉత్సవాల ప్రాధాన్యాన్ని, వేయి స్తంభాల దేవాలయ చరిత్రను లోకానికి తెలియజేశారు.

పరిశోధనా శివకుమారుడు (1942) :

డా. కేతవరపు రామకోటి శాస్త్రి పర్యవేక్షణలో 1968లో ‘కేతన-అతని కృతులు’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించారు. దివాకర్ల మాటలలో (మహతిలో) – “కేతన కృతుల గూర్చియు, జీవిత ప్రతిభా విశేషములను గూర్చియు చక్కగా వివరించు శివకుమార్ సిద్ధాంత వ్యాసము ఆ విషయమున అద్వితీయము.”

శివకుమార్ 1965-73 మధ్య వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేశారు. 1973లో కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరి 2002లో పదవీ విరమణ చేశారు. తెలుగు శాఖాధ్యక్షులయ్యారు. వీరి పర్యవేక్షణలో 13 మంది ఎంఫిల్, ఏడుగురు పి.హెచ్.డిలు పొందారు.

ఆయన సౌజన్యమూర్తి, స్నేహపాత్రులు. అనారోగ్యంతో 2017 ఆగస్టు 5న వరంగల్‌లో కన్నుమూశారు. 2013లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం లభించింది.

చారిత్రక పరిశోధనలు:

గద్వాల సంస్థానము- సాహిత్యసేవ, కాకతీయ వైభవం, వేయిస్తంభాల దేవాలయం చరిత్ర, శ్రీ భద్రకాళి దేవాలయం చరిత్ర, శ్రీ కాశీవిశ్వేశ్వర రంగనాథుల ఆలయాలు, ఓరుగల్లు అసలు చరిత్ర, త్రైలింగస్వామి జీవితం (అనువాదం).

మంత్రశాస్త్ర గ్రంథాలు:

సద్గురు కందుకూరి శివానందమూర్తికి శిష్యునిగా శివకుమార్ ప్రముఖులు.

రచనలు:

మహామృత్యుంజయ పాశుపత తంత్రం, శ్రీ దుర్గా తంత్రం, శ్రీ సర్పతంత్రం.

అధ్యాపకుడిగా, చారిత్రక పరిశోధకుడిగా సాహిత్య కేతనం హరి శివకుమార్.

ప్రొ. పి. ఎల్. శ్రీనివాసరెడ్డి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

ఆచార్య బిరుదురాజు రుక్మిణి:

శ్రీ బిరుదురాజు రామరాజు గారి కుమార్తె అయిన రుక్మిణి వరంగల్‍లో 1952లో జనవరి 16న జన్మించారు. ఆచార్య సి. నారాయణ రెడ్డి పర్యవేక్షణలో 1975-78 మధ్య కాలంలో ‘నన్నయ భారతంలో ఉపమ’ అనే అంశంపై పరిశోధన చేసి 1978లో పి.హెచ్.డి పొందారు. నన్నయ భారతంలో ఉపమించిన 785 ఉపమాలంకారాలను సిద్ధాంత గ్రంథం అనుబంధంలో ఇచ్చారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా వ్యవహరించి పదవీ విరమణానంతరం గతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here