ఆచార్యదేవోభవ-5

1
10

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై 1978లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీరాములు కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. 1983లో అసెంబ్లీలో ఆ కమిటీ రిపోర్టు ప్రవేశపెట్టారు. 1979 నుండి హెడ్‌షిప్ రొటేషన్ (తల తిరుగుడు పద్ధతి) నిర్ణయం జరిగింది. మెరిట్ ప్రమోషన్ పథకం కూడా అమల్లోకి వచ్చింది. నిర్దిష్ట కాల పరిమితి ముగిసి డాక్టరేట్ వుంటే లెక్చరర్ రీడర్‍గా, రీడర్ ప్రొఫెసర్‍గా ప్రమోషన్ పొందే అవకాశం లభించింది. అలా 1982లో రామరాజు రిటైర్ కాగానే గోపాలకృష్ణారావు తెలుగు శాఖాధిపతి అయ్యారు. దరిమిలా నాయని కృష్ణకుమారి, యం. కులశేఖరరావు, అమరేశం రాజేశ్వర శర్మ, యశోదారెడ్డి 1983లో ప్రమోషన్ కింద ఆచార్యులయ్యారు. 1984లో వేటూరి ఆనందమూర్తి, సుమతీ నరేంద్ర, కుసుమాబాయి, 1985లో కసిరెడ్డి వెంకటరెడ్డి ఆచార్యులయ్యారు.

సౌభద్రుని కుమార్తె:

నాయని సుబ్బారావు ‘సౌభద్రుని ప్రణయయాత్ర’ ఖండకావ్యం ద్వారా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులు. వారి కుమార్తెలు నాయని కృష్ణకుమారి, కోటేశ్వరి. కృష్ణకుమారి 22 ఏళ్ళ వయసులో తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరారు. 1983లో ప్రొఫెసర్ అయి, 1990 మార్చిలో పదవీ విరమణ చేశారు. ఉస్మానియా తెలుగు శాఖలో ఇంత సుదీర్ఘ కాలం 38 సంవత్సరాలు మరెవ్వరూ సేవలందించలేదు. ఆమె తెలుగు శాఖాధ్యక్షులుగా 1984-86 మధ్య పని చేశారు. ఆమె చొరవతో జానపద శాస్త్రీయ విశ్లేషణకు శిష్యుల దృష్టి మరలింది. సున్నిత స్వభావురాలైన ఆమె అధ్యయన, అధ్యాపనాలలో ఆరితేరిన మనీషి. కృష్ణకుమారి 1930 మార్చిలో గుంటూరు జిల్లాలో జన్మించారు.

ఆకాశవాణిలో తండ్రి సుబ్బారావు పని చేస్తుండడం వల్ల ఎందరో సాహితీ ప్రముఖులతో పరిచయాలు కృష్ణకుమారికి చిన్నతనంలోనే లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1948లో బి.ఎ. ఆనర్స్ – తెలుగు పూర్తి చేశారు. పింగళి లక్ష్మీకాంతం, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వంటి పండితులు అక్కడ గురువులు. 1952లో కోఠీ మహిళా కళాశాలలో లెక్చరర్‍గా చేరారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి:

కృష్ణకుమారి అన్ని సాహిత్య ప్రక్రియలలో విస్తృత రచనలు చేశారు. కవిత్వం, కథ, నవల, యాత్రాచరిత్ర, స్మృతి కావ్యం, వ్యాసాలు, పరిశోధనలు తనదైన శైలిలో రచించారు. ‘గౌతమి’ నవలను 1950లో వ్రాశారు. ‘ఆయాధా’ అనే హిందీ కథా సంపుటి 1960లోనూ, యాత్రాదర్శిని అయిన ‘కాశ్మీర దీపకళిక’ 1967లోనూ ప్రచురించారు.

పరిశోధన, పరిశీలన అనే పేర 1977లో భాషా సాహితీ వ్యాస సంపుటులు వెలువరించారు. అగ్నిపుత్రిక కవితాసంపుటి 1978లో వచ్చింది. ఆత్మీయురాలైన నవలా రచయిత్రి డా. శ్రీదేవి మృతికి చలించి కాలాతీత వ్యక్తులు అనే స్మృతి కవిత వ్రాశారు. ఆంధ్రుల కథ, కథల కడలి – ఉత్తమ రచనలు. జానపద విజ్ఞానంపై క్షోదక్షమంగా వ్యాసాలు దినపత్రికలలో ప్రచురించారు. కవిత్వం ఆమె కభిరుచి. గృహలక్ష్మి స్వర్ణ కంకణం అందుకొన్నారు.

ఆకాశవాణిలో అనేక ప్రసంగాలు చేశారు. 1996లో నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరక్టరుగా ఒంగోలులో ఆహుతుల సమక్షంలో కథకసమ్మేళనం రచయిత్రులతో నిర్వహించాను. అందులో కృష్ణకుమారి అద్భుత ప్రసంగం చేశారు. తండ్రి ఆకాశవాణిలో పనిచేశారు కాబట్టి ఆకాశవాణి మిత్రులతో ఆత్మీయంగా ఉండేవారు. ఆమె రచనలు నాలుగు పాయలుగా ప్రవహించాయి. 1. కథ 2. నవల 3. జానపదం 4. పరిశోధన.

‘ఏం చెప్పను నేస్తం’ అనే ఆమె కవితా సంపుటి ఆమెను అగ్రశ్రేణి కవయిత్రిగా సాహిత్యంలో నిలిపింది. ‘తెలుగు జానపద గేయగాథలు’- వీరి పరిశోధనా గ్రంథం.

పోటీపడి వచ్చిన పదవులు:

ప్రతిభావ్యుత్పత్తులకు తోడు అదృష్టం కలిసి వస్తే జీవితం పూలపందిరే అవుతుంది. కృష్ణకుమారి చిన్నతనంలోనే ఉద్యోగంలో చేరగలిగారు. తెలుగు శాఖలో చిరకాలం పని చేశారు. శాఖాధ్యక్షులుగా, పాఠ్యప్రణాళికా సంఘాధ్యక్షులుగా, పద్మావతీ మహిళా యూనివర్సిటీ (తిరుపతి) తొలి ప్రధానాచార్యులుగా పదవులు వరించి వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా 1996-99ల మధ్య నియుక్తులై సమర్థవంతంగా దిశానిర్దేశం చేశారు. తండ్రి సుబ్బారావు కవితా వారసత్వం, పింగళి లక్ష్మీకాంతం వంటి గురువుల బోధన, అవార్డులు రివార్డుల పంట ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాయి. ప్రస్తుత తెలుగు శాఖాధ్యక్షులు సూర్య ధనంజయ్ ఆమె శిష్యురాలు. ఉస్మానియా తెలుగు ఎం.ఏ. విద్యార్థుల సంఖ్య పదివేలు దాటి ఉండవచ్చు. ఎందరో మహోన్నత పీఠా లధిష్ఠించడం విశిష్టం. కృష్ణకుమారి 2016 జనవరి 30న కాలధర్మం చేశారు.

శ్రీ యస్. జైపాల్‌రెడ్డిగారితో వ్యాస రచయిత

‘పాకాల’ రచనా పాకాలు:

పాకాల యశోదారెడ్డి మహబూబ్‍నగర్ జిల్లా బిజినేపల్లిలో 1929 ఆగస్టులో జన్మించారు. అప్పట్లో స్త్రీ విద్య అంతగా వ్యాప్తిలో లేదు. రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి అందించిన ప్రోత్సాహంతో హైదరాబాదులో కళాశాల విద్య కొనసాగించారు. నారాయణ గూడ బాలికల ఉన్నత పాఠశాలలో హైస్కూలు చదువులు పూర్తి అయ్యాయి. విద్యార్జనపై దృష్టి పెట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సంస్కృత భాషలలో ఎం.ఏ. చేశారు.

జర్మన్ భాషలోనూ, లింగ్విస్టిక్స్ లోనూ డిప్లొమా చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘తెలుగులో హరివంశాలు’ అనే అంశం మీద పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. తెలుగులోనే గాక, హిందీ, ఉర్దూ, కన్నడ భాషలతో బాటు జర్మన్ భాష పైనా పట్టు వుంది.

కోఠి మహిళాకళాశాలలో 1955లో అధ్యాపకురాలిగా చేరి తరువాత ఉస్మానియా తెలుగు శాఖలో రీడరు, ప్రొఫెసర్‍గా పని చేశారు. 60 ఏళ్ళు నిండి 1989లో రిటైరయ్యారు. కథా రచయిత్రిగా ప్రసిద్ధి. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి తెలంగాణ మాండలికంలో కథలు ప్రసారం చేసిన తొలి రచయిత్రి. మూడు కథా సంపుటులు ప్రచురించారు.

తెలంగాణా సంస్కృతికి నిలువెత్తు దర్పణం:

యశోదారెడ్డి మూడు కథా సంపుటులు ప్రచురించారు.

1. మా వూరి ముచ్చట్లు (1973). ఇందులో 1920 – 40 మధ్య తెలంగాణ గ్రామీణ విధానాన్ని కళ్ళకు కట్టేలా చిత్రీకరించారు.

2. ఎచ్చమ్మ కథలు (1999). ఈ కథలు 1950 – 70ల నాటి తెలంగాణా సంస్కృతిని విస్తృతంగా వివరించాయి.

3. ధర్మశాల (2000). ఇందులో 1980 – 90 లలో తెలంగాణా సమాజంలో చోటు చేసుకున్న మార్పులు చిత్రించారు. మొదటి రెండు పాలమూరు జిల్లా మాండలికంలోనూ, ‘ధర్మశాల’ వ్యావహారిక తెలుగు భాషలోనూ ఉన్నాయి.

కథా రచయిత్రిగానే కాదు, కవయిత్రిగా యశోదారెడ్డి ప్రసిద్ధురాలు. రెండు కవితా సంపుటులు (1) ఉగాదికి ఉయ్యాల (2) భావిక – వెలువరించారు. వేదిక మీద అనర్గళంగా ఒక పాఠశాలలో మాట్లాడుతున్న యశోద వక్తృత్వ పాటవం చూసి పాకాల తిరుమల్ రెడ్డి (పి.టి.రెడ్డి) వివాహమాడారు. ఆయన సుప్రసిద్ధ చిత్రకారుడు. కొంతకాలం లాహోర్‍లో పని చేసి వచ్చారు. ఆయన గీసిన అనేక చిత్రాలకు యశోద స్ఫూర్తి. 1947లో వారు ప్రేమ వివాహమాడారు. ద్విపద వాఙ్మయం, ప్రబంధ వాఙ్మయం, భారతీయ చిత్రకళ, భాగవత సుధ ఆమె ఇతర రచనలు. 2007 అక్టోబరులో ఆమె గతించారు.

శ్రీమతి కుముద్‍ బెన్ జోషీ గారితో రచయిత

యువభారతి జయకేతనం:

భాగ్యనగరంలో 70వ దశకంలో యువభారతి సాహితీసేవలు ఖ్యాతి గడించాయి. వాటికి వెన్నెముకగా నిలిచి జయకేతనం ఎగురవేసిన సాహితీమూర్తి ఇరివెంటి కృష్ణమూర్తి. ఆయన పాలమూరు జిల్లాలో 1930 జూలైలో జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ చదువుకుని ఉస్మానియాలో ఎం.ఏ. చేశారు. పాలమూరు జిల్లా, కరీంనగర్ జిల్లాల మాండలికాలలో కథలు రాశారు. తెలంగాణా సాహిత్య సాంస్కృతిక సంస్థల పురోగభివృద్ధికి తోడ్పడ్డారు. చిన్నతనంలోనే నిజాం నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడి కారాగార శిక్ష అనుభవించారు.

యువభారతిని స్థాపించి 20 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా వ్యవహరించి ‘మహతి’ వంటి పరిశోధనా గ్రంథాల సంపాదకత్వం వహించారు. కావ్యలహరి, వికాసలహరి పేర సాహిత్యోపన్యాసాలు ప్రచురిచారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి బెజవాడ గోపాలరెడ్డి తర్వాత కార్యదర్శిగా వున్న దేవులపల్లి రామానుజరావు అధ్యక్షులయ్యారు. అప్పుడు సమర్థుడైన ఇరివెంటి కృష్ణమూర్తిని కార్యదర్శిగా నియమించారు. అలానే ఆంధ్ర సాహిత్య పరిషత్ కార్యదర్శిగా మెలగారు.

ఉస్మానియాలో డా. సి. నారాయణరెడ్డి పర్యవేక్షణలో కృష్ణమూర్తి తెలుగులో కవి సమయాలపై పరిశోధన చేశారు.  తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి ప్రొఫెసర్ పదవి నలంకరించారు. 1989 ఏప్రిల్ 26 న 59వ ఏట హఠాత్తుగా మరణించారు. ఉర్దూ సాహిత్యంలో అధ్యయనం చేసి పట్టు సంపాదించారు. విశేషంగా బాల సాహిత్య గ్రంథాలు ప్రచురించారు – వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్నా, లక్ష్మణుడు – ఈ కోవలోనివే. ఆయన బోధనలో వ్యక్తిత్వ వికాశానికి ప్రాధాన్యముండేది.

ఇతర రచనలలో – దశరూపక సందర్శనం, భావన (సుభాషితాల సంకలనం), ఇరివెంటి వ్యాసాలు, ఇరివెంటి రచనలు, వాగ్భూషణం, వేగుచుక్కలు వెలుగుబాటలు ప్రధానం. ఒక వ్యక్తి ఒక శక్తిగా రూపొంది సాహిత్య సంస్థల పనితీరును వేగవంతం చేయవచ్చుననడానికి కృష్ణమూర్తి నిదర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి ‘లక్ష్మణుడు’ అనే చిరు గ్రంథం బాల సాహిత్య గ్రంథములలో వ్రాశారు. 1963 అక్టోబరు 27న విజయదశమి నాడు ఇరివెంటి చొరవతో ‘యువభారతి’ ప్రారంభమైంది. “చుట్టూరా ఆవరించుకొని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటె ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది” – అనే ధ్యేయంతో ఈ సంస్థ ఆరంభించారు. సమాజ హితం కోసం, సాహిత్యాభ్యుదయం కోసం ఈ సంస్థ ఎన్నో గ్రంథాలు ప్రచురించింది. సాహిత్య ప్రసంగాలను పుస్తక రూపంలో తెచ్చి గత 60 సంవత్సరాలుగా అసామాన్య సేవలు అందిస్తూ వుంది. ‘సమయ పాలన మా క్రమశిక్షణ’ అనే నినాదంతో సభలు నిర్వహించింది. పాత కొత్తల మేలు కలయికగా 180 గ్రంథాలు ప్రచురించింది. 2012లో ఈ సంస్థ స్వర్ణోత్సవాలు జరిగాయి.

శ్రీ అరుణ్ జైట్లీ గారితో రచయిత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here