ఆచార్యదేవోభవ-9

0
7

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

పాత్రికేయ గురుకులం:

[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయంలో తనదైన ప్రత్యేకత నిలుపుకొన్న విభాగం జర్నలిజం విభాగం. 1954లోనే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ శాఖ డి. ఫారెస్ట్ డెల్ అనే అధ్యాపకుని ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ప్రస్తుతం రెండేళ్ళ ఎం.ఏ. కోర్సు, ఎంఫిల్, పిహెచ్‌డి పరిశోధనలు నిర్వహిస్తోంది.

పత్రికా రంగంలోను, ప్రసార మాధ్యమాలలోనూ ఈ జర్నలిజం విభాగ విద్యార్థులు ప్రతిభావ్యుత్పత్తులు ప్రదర్శించి ఖ్యాతి గడించారు. జర్నలిజం శాఖలో ఆచార్యులుగా పనిచేసిన లబ్ధప్రతిష్ఠులలో యస్. బషీరుద్దీన్, ఉషావ్యాసులు రెడ్డి, రహీం, పద్మజా షా, పి. యల్. విశ్వేశ్వరరావు ప్రముఖులు. గత ఏడు దశాబ్దులుగా ఇది పాత్రికేయుల్ని తీర్చిదిద్దుతోంది. మూడు వేల గ్రంథాలతో సమగ్ర వసతులు గల సెమినార్ లైబ్రరీ వుంది. పారిశ్రామిక రంగానికి అవసరమైన విధంగా శిక్షణార్థులకు తర్ఫీదు నిస్తోంది.

ఆచార్యులుగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ప్రొ. కర్ణం నరేందర్, ప్రొ. కె. స్టీవెన్‍సన్, ప్రొ. బి. బాలస్వామి పేరు గడించారు. ఉత్తమ ప్రమాణాలతో జర్నలిజం శాఖ ప్రగతి పథంలో పయనిస్తోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక రంగాలలో ప్రసిద్ధి పొందారు. వారిలో సర్వశ్రీ యస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు, విజయ్ జోషి, మాడభూషి శ్రీధర్, సునీల్ జాన్, సునీల్ రాబర్ట్, జె. వి. లక్ష్మణరావు, హరూన్ సిద్ధిఖీ, చిట్టి పంతులు, శ్రీనివాస్ మేల్కొటే, కవితా కరణ్, రాధికా పరమేశ్వరన్, టి. రామమూర్తి, మోహన రాజ్, ప్రదీప్ కృష్ణత్రే, బి.యస్. ఠాకూర్, ములుగు సోమ శేఖర్, గోవిందరాజన్, యిషి కుమార్, అజయ్ కుమార్, వి. శ్యామ సుందర్, యం. శ్రీనాథ్ రెడ్డి తదితరులు ప్రముఖులు.

ఆధునిక సమాజంలో మీడియా రంగం విశిష్టతను సంతరించుకొంది. ఆయా రంగాలలో పని చేసేందుకు సుశిక్షితులను అందజేసే ఈ విభాగం సేవలు గణనీయం. నేనెరిగిన కొందరు ప్రముఖుల ప్రస్తావన చేస్తాను.

ప్రొ. యస్. బషీరుద్దీన్:

జర్నలిజం విభాగాధిపతి యస్. బషీరుద్దీన్ ఆకాశవాణి కార్యక్రమాలకు వచ్చినప్పుడు (1982-87) కలవడమే కాక ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ సమావేశాలకు హాజరైనప్పుడు సన్నిహితంగా మెలిగాను. చక్కని వక్త! ఆయన కుమారుడు సయ్యద్ అక్బరుద్దీన్ దౌత్యవ్యవహర్త. ఆయన యునైటెడ్ నేషన్స్ సంస్థలో రాయబారి.

బషీరుద్దీన్ 1970వ దశకంలో జర్నలిజం విభాగాధిపతి. 80వ దశకంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్. విదేశాలలో రాయబారిగా ఖతర్ దేశంలో వ్యవహరించారు. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పూనాలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యుట్‍కు సేవలందించారు.

ఉషావ్యాసులు రెడ్డి:

ఈ విభాగంలో పని చేసిన ఆచార్య రహీం అధ్యాపకుడిగా మంచి పేరు గడించారు. 1985లో జర్నలిజం (ఎం.ఏ) విద్యార్థులకు నా చేత పాఠాలు చెప్పించారు. ఆచార్య ఉషావ్యాసులు రెడ్డి అంతర్జాతీయ పరిశోధకురాలిగా పేరు తెచ్చుకొన్నారు. ఢిల్లీలోని కామన్‍వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఏషియా డైరక్టరుగా వ్యవహరించారు. ఉస్మానియాలో ఆడియో విజువల్ రిసెర్చ్ సెంటర్ డైరక్టరుగా, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ప్రొఫెసరుగా సేవలందించారు. 2003లో నేను, ఆమె యు.జి.సి. వారు నియమించిన ఒక కమిటీలో సభ్యులుగా EMRC ఉద్యోగుల జీతాల స్కేళ్ళ రివిజన్‍కు ప్రతిపాదనలు తయారుచేశాము.

1982లో ఈ విభాగం విద్యార్థులు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని కలిసినప్పుడు ఆమె తమ సందేశంలో ‘జాతి ప్రగతికి పత్రికలు దోహదం చేయాల’ని ఉద్బోధించారు.

జర్నలిజం కోర్సుల చరిత్ర:

19, 20 శతాబ్ద ప్రారంభంలో పాత్రికేయులకు శిక్షణా సంస్థలు లేవు. కోటంరాజు రామారావు, యం. చలపతిరావు, ఖాసా సుబ్బారావు, సి.వై. చింతామణి, కుందూరు ఈశ్వరదత్తు వంటి వారు ఏ జర్నలిజం పాఠశాలకు వెళ్ళలేదు. ఆ రోజుల్లో జర్నలిజం ఒక వృత్తి కాదు, ఒక మిషన్. స్వతంత్ర భారతదేశంలో జర్నలిజం శిక్షణావశ్యకతను గుర్తించారు. 1941లో పి. పి. సింగ్ జర్నలిజం స్కూలును లాహోర్‍లో స్థాపించి నడిపారు. స్వాతంత్రానంతరం అది ఛండీఘడ్‍కు మారింది. 1952లో నాగపూరులో ఒక ప్రైవేటు సంస్థ – హిస్టాప్ కాలేజ్ – జర్నలిజం కోర్సును ప్రారంభించింది. ఆ తర్వాత 1954లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలిసారిగా మనదేశంలో యువతకు జర్నలిజంలో శిక్షణ ఇవ్వడానికి స్థిరమైన పునాదులు ఏర్పడ్డాయి. అమెరికా తదితర దేశాలలోని అధ్యాపక వృత్తిలో ప్రసిద్ధుల సలహా సంప్రదింపులు జరిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ పాత్రికేయులు డా. డి. ఫారెస్ట్ – ఓ – డెల్‌కు ఆ బాధ్యత అప్పగించారు.

రచయిత పుస్తకాన్ని తిరుపతిలో ఆవిష్కరిస్తున్న శ్రీ గొల్లపూడి

జర్నలిజంలో పరమ గురువు:

ఓడెల్ 1898 జనవరిలో అమెరికాలోని అట్లాంటాలో జన్మించారు. 1921లో బట్లర్ యూనివర్శిటీలో డిగ్రీ చేసే సమయంలోనే ఆయన క్యాంపస్ వార్తా పత్రికను, ఇయర్ బుక్‍ను రూపొందించారు. ఆ విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖాధిపతి అయ్యారు. న్యూయార్క్ లోని అనేక వార్తా పత్రికలకు వ్రాశారు. న్యూయార్క్ నగరంలోని అసోసియేట్ ప్రెస్‍కు కాపీ ఎడిటర్‍గా పని చేశారు. 1954లో ఆయన ఉస్మానియా జర్నలిజం వ్యవస్థాపక అధిపతి అయ్యారు. తొలుత డిప్లొమా కోర్సు 1954-55 లో మొదలుపెట్టారు. ఆ కోర్సులో భాగంగా న్యూఢిల్లీ, బొంబాయి, మదరాసులోని ప్రముఖ దినపత్రికలలో విద్యార్థులు శిక్షణ పొందేవారు. ఇతర సంస్థలు అసూయపడేలా కార్యకలాపాలను సాగిస్తూ – 1956 వరకూ పని చేశారు. 1958 జూన్ 19న అమెరికాలోని ఇండియానా పోలీస్‍లో గతించారు. 1970-71లో తొలి బ్యాచిలర్ డిగ్రీ కోర్సు మొదలైంది. ఆ తర్వాత మాస్టర్స్ కోర్సు మొదలెట్టారు.

ప్రతిభావంతులైన విద్యార్థులు:

జర్నలిజం విభాగం సగర్వంగా చెప్పుకొనే పూర్వ విద్యార్థులలో కేంద్రంలో మంత్రిగా పని చేసిన యస్. జైపాల్ రెడ్డి ఒకరు. 1997లో నేను ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరక్టర్‍గా వున్నప్పుడు ఆయన కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి. 2001లో దూరదర్శన్‍లో అదనపు డైరక్టరు జనరల్‍గా ఉన్నప్పుడు మా శాఖ మంత్రిగా పార్లమెంటులో ప్రశ్నలకు సమాధానాలు తయారు చేసే అధికారులలో భాగస్వామిగా వారితో నేను పార్లమెంటు అధికారుల లాబీలో కూచొనే అవకాశం కలిగింది. ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకొన్న వక్త.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రీయ సమితి పక్షాన రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు పూర్వ విద్యార్థి. శాసనమండలి సభ్యులుగా పనిచేసిన డా. కె. నాగేశ్వర్ మీడియా చర్చలలో తరచూ కన్పిస్తారు. నేను హైదరాబాదు నారాయణ ఐఎఎస్ అకాడమీ ప్రిన్సిపాల్‍గా పని చేసిన రోజులలో (2011) నాగేశ్వర్ సివిల్స్ విద్యార్థులకు పాఠాలు అద్భుతంగా చెప్పారు.

ఆచార్య పి.యల్. విశ్వేశ్వరరావు సామాజిక కార్యకర్తగా ప్రసిద్ధులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వారు 2007లో ఒక కమిటీ వేసి జర్నలిజం పాఠ్యాంశాల నిర్ణయ బాధ్యత లప్పగించారు. ఆ కమిటీలో విశ్వేశ్వరరావు, సి.వి. నరసింహారెడ్డి, నేను సభ్యులం. జర్నలిజం ఎం.ఏ. కోర్సుల పాఠ్య ప్రణాళికలు రూపొందించాం. పద్మజా షా నేను – టివి ఛానళ్ళ యునిసెఫ్ బహుమతి నిర్ణాయక కమిటీ సభ్యులం.

వరంగల్ ఆకాశవాణి కార్యక్రమంలో కాళోజీ, పేర్వారం జగన్నథం గార్లతో రచయిత

ఉస్మానియా కీర్తి కిరీటం:

ఉస్మానియా విశ్వవిద్యాలయం సగర్వంగా చెప్పుకునే ప్రతిభావంతుడు ఆచార్య జి. రామిరెడ్డి. ఉన్నత విద్యలో అత్యున్నత శిఖరాల నధిరోహించిన ఘనుడు. 1929 డిసెంబరు 4న కరీంనగర్ జిల్లా మైలారంలో జన్మించారు. ఉస్మానియా పొలిటికల్ సైన్స్ విభాగాధిపతిగా, ఆచార్యుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు. ఆయన నిర్వహించిన పదవులు ఆశ్చర్యం కలిగిస్తాయి.

  • 1969 – 74 – సోషల్ సైన్సెస్ రిసెర్చ్ కౌన్సిల్ తొలి ఛైర్మను
  • 1977 – 82 – ఉస్మానియా విశ్వవిద్యాలయ 12వ వైస్-ఛాన్స్‌లర్
  • 1982 – 85 – ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ తొలి వైస్-ఛాన్స్‌లర్
  • 1985 – 90 – ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం తొలి వైస్-ఛాన్స్‌లర్
  • 1990 – 95 – యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ – అధ్యక్షులు
  • 1995 – కామన్‌వెల్త్ విద్యా సంస్థ అధికారి

దూరవిద్యకు సంబంధించిన రూపశిల్పి. ఆయన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధిపతిగా వుండగా నేను హైదరాబాద్ ఆకాశవాణిలో అసిస్టెంట్ డైరక్టరు. దూరవిద్య పాఠాలు రేడియోలో ప్రసారం చేసే విషయంలో ఉభయులం ఎంతో కృషి చేశాం. 65వ ఏట రామిరెడ్ది 1995 జులై 2న బ్రిటన్‍లోని లండన్‍లో కామన్‍వెల్త్ విద్యా సమావేశాలకు హాజరయి హఠాన్మరణం చెందారు. గొప్ప విద్యావేత్త.

ఉస్మానియా నుంచి దౌత్యవేత్తలు:

ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపక వర్గం నుండి ఇద్దరు దౌత్యవేత్తలు విదేశీ రాయబారులుగా నియమింపబడ్డారు. ఆచార్య యస్. బషీరుద్దీన్ ఖతర్ రాయబారిగా వెళ్ళారు. అదే రీతిలో సోషియాలజీ విభాగాధిపతి ఆచార్య సి. లక్ష్మన్న ట్రినిడాడ్ మరియు టొబాగో దేశ రాయబారిగా పని చేశారు.

ప్రొ. సి. లక్ష్మన్న:

సి. లక్ష్మన్న అనంతపురం జిల్లాలో 1935 ఫిబ్రవరి 18న జన్మించారు. ఉస్మానియా సోషియాలజీ విభాగాధిపతిగా పని చేశారు. ఎన్.టి.రామారావు తెలుగు దేశం స్థాపించినప్పుడు విద్యావంతులను రాజకీయాలలోకి ఆహ్వానించే విధానంలో భాగంగా తెలుగు దేశం పార్టీలోకి లక్ష్మన్నను పిలిచారు. 1984 ఏప్రిల్ నుంచి 1990 ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యులు. వీరి సతీమణి మమతా లక్ష్మన్న ఉస్మానియా ప్రొఫెసర్. లక్ష్మన్న 1975-77 మధ్య ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్. వీరిని భారత ప్రభుత్వం ట్రినిడాడ్ అండ్ టొబాగో రాయబారిగా 1990లో పంపింది. నేను ఢిల్లీ ఆకాశవాణిలో ఉండగా తరచూ కలిసేవారం. అనేక గ్రంథాలు ప్రచురించారు. Teaching and Research in Sociology in India అనే ప్రామాణిక గ్రంథాన్ని 1974లో వెలువరించారు. 2017 డిసెంబరు 19న గతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here