ఆధ్యాత్మిక సాధనలు – సత్ఫలితములు

0
14

భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకం

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే

[dropcap]ఓ[/dropcap] అర్జునా, యోగభ్రష్టుడైనవాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములయందు అనేకానేక సంవత్సరములు సుఖములు అనుభవించిన పిమ్మట పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున కానీ జన్మించును.

గీతాచార్యుడు యోగ సాధన యొక్క ప్రాశస్త్యాన్ని బోధించే సమయంలో అర్జునుడికి ఒక సంశయం కలిగింది. కొన్ని అనివార్య కారణాల వలన ఒక సాధకుడు ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలగి నట్లయితే అతడు ఆధ్యాత్మిక జయము మరియు లౌకిక జయము రెండింటినీ పొందినవాడై, రెండిటికి చెడ్డ రేవడిలా అయితే ఇక అతని పరిస్థితి ఏమిటి?

ఈ ఉభయ భ్రష్టత్వం నుంచి తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి అన్న సంశయాన్ని శ్రీకృష్ణుడు ముందు వుంచగా దానికి శ్రీకృష్ణుడు పై శ్లోకం ద్వారా చక్కని వివరణ ఇస్తూ ఆధ్యాత్మికతను నమ్ముకున్న వారెవరు ఎన్నటికీ చెడిపోరని ఒక అద్భుతమైన అభయం కూడా ఇచ్చారు.

ఆధ్యాత్మిక జీవితంలో కృతకృత్యులు కాని వారిని శాస్త్రం రెండు విధాలుగా విభజించింది. కొద్దిపాటి పురోగతి తర్వాత పతనం పొందేవారు, అంటే సాధన ఆపివేసిన వారు. రెండవ తరగతి ఆధ్యాత్మిక సాధన తీవ్రంగా చేసిన పిమ్మట మార్గం నుండి మరలినవారు.

మొదటి వర్గం వారు మరణానంతరం కొంతకాలం పాటు పుణ్య లోకాలలో ప్రవేశించుటకు, అక్కడ కొంత కాలం నివసించేందుకు అర్హత సాధిస్తారు. వారి భౌతిక కోరికలన్నీ తీరిన తర్వాత తిరిగి మరు జన్మలో తమ ఆధ్యాత్మిక సాధన పునఃప్రారంభిస్తారు. రెండవ వర్గం వారు తమ ఆధ్యాత్మిక సాధన మధ్యలోనే ఆపేసి యోగ భ్రష్టులైనందున వారు పుణ్యలోకాలలో తమ పుణ్యం వున్నంతవరకు నివసించి, అక్కడ తమ పుణ్యం అంతా వ్యయమైపోయిన తర్వాత తిరిగి భూలోకమునకు పంపబడి అక్కడ ఒక పవిత్రమైన కుటుంబంలో జన్మిస్తారు. వారి పూర్వజన్మ సంస్కారం వలన ఆ కుటుంబంలో చక్కని ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి వారు తిరిగి తమ సాధనను కొనసాగించ గలుగుతారు.

ఈ విధంగా యోగ భ్రష్టులైన వారికి కూడా తిరిగి తమ సాధన కొనసాగించగలిగే అవకాశం తిరిగి భగవంతుడు మానవాళికి ప్రసాదిస్తున్నాడు. ఈ అవకాశం ఇంక ఏ ప్రాణికీ కల్పింపబడలేదు. అయితే ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశించిన వారు తాము ఎటువంటి భౌతిక ఆకర్షణలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని శాస్త్రం హెచ్చరిస్తోంది. రెండవ వర్గం వారికి తమ నూతన జీవితారంభం నుండే అంతే శిశువు దశలోనే ఆధ్యాత్మిక ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద ఆధ్యాత్మిక ప్రయత్నములు ఎన్నడూ వ్యర్థం కావని. ఎన్ని జన్మలకైనా అవి సత్ఫలితాల్నిస్తాయని భగవానుడు ఈ శ్లోకం ద్వారా మరోసారి అభయం ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here