2వ అధ్యాయ గుణ ప్రశంస
సొంతింటి పరమాన్నం మీద వెగటుపుట్టి…
పొరుగింటి పుల్లకూర మీద పెంచుకున్న మక్కువ…
రాజు ముఖం చూసిన కళ్ళతో
మగని ముఖం చూస్తే మొత్తబుద్దయినట్టు తయారైంది పరిస్థితి !
ఫలితం
సంసారం కూలిపోవటమే కదా!
సరిగ్గా అలాగే విచ్ఛిన్నమైన మన సంస్కృతిని..
షరాబుల అద్దాల్లోంచి
విస్పష్టం గావించారు …
శ్రీధర్ బాబుగారు
వారు ఎవరైనా గానీ
ఈ పవిత్రనేలలో
గాలి పీల్చి, నీరు ద్రావి,
ఈనేల తమదిగా భావించి…తరించటo
ఈ పవిత్ర నేల యొక్క గొప్పతనం
అట్టి కుషాణ సామ్రాజ్యాధినేత
కనిష్కుని పరాక్రమము..
పరిపాలనాదక్షత…గావించిన అన్నిరంగాల అభివృద్ధి .,
అత్యద్భుత పద చిత్రాలతో అందించారు కొల్లూరు వారు…!
ధర్మభూమియైన ఈ భరతభూమిలో …
ఏలికలై పాలించిన వారందరిలో…ఎవరివలనా రాని పేరు,ప్రతిష్టలు తెచ్చుకున్నవారు గుప్తులు!
వీరి పరిపాలనాకాలమును
చరిత్ర స్వర్ణయుగమని కొనియాడింది.
ఆ విషయాల నన్నీ తమ అమూల్య అక్షరీకరణతో అద్దంపట్టి చూపారు
కృష్ణ కుమారి గారు …!
ఈ అద్భుత భారతాన్నేలిన ఎందరో…రాజులు,చక్రవర్తులు..
అందరూ ఘన చరితులే !
ఒకరిని మించిన వారొకరు…!
హర్షుని పాలనావైశిష్ట్యం ఏఒక్కరికీ తీసిపోదు!
తన కంటూ చరిత్రలో
ఓ ప్రత్యేకతను సంతరింప జేసుకున్న తనదైన శైలిలో చక్కని పదబంధాలతో అందించారు శ్రీమణి గారు …!
ఉత్తమ సంస్కృతికి ఆలంబనయైన
సంస్కృత భాషాప్రాశస్త్యాన్ని చెప్ప సామాన్యులకు సాధ్యమా … !
అట్టి మహోన్నతమైన అమరభాషను గూర్చి అంతే గొప్పగా అభివర్ణించి .. మనముందుంచారు
స్వప్న హైందవి గారు !
భ్రష్టు పట్టిన హిందూ మత పునర్వైభవానికై…
కారణ జన్ములుగా వచ్చి …
ద్వైదీ వికారములతో
దృశ్యమానమవుతున్న
ఈసృష్టి సమస్తమూ… ఏకత్వముననే విలసితమైనదని
నిరూపణ గావిస్తూ…
అద్వైత శంకరులుగా ఖ్యాతినార్జించిన
ఆదిశంకరాచార్య
గీతాసారాన్ని కాచి వడబోసి
ఔషధంగా మనకందించిన విశేషాలనన్నింటినీ..
కడు రమ్యముగా పొందుపరిచారు
వారణాసి శ్రీదేవి గారు
అదే అద్వైత తత్వాన్ని మరింత సవివరంగా సుబోధకం గావిస్తూ
ఆత్మ తత్వాన్ని విడమరిచిన శంకరుల వారిని
నమామి శంకరం లోక శంకరం అంటూ ఆమహనీయుని స్తుతించారు ఉష గారు !
భౌగోళిక సరిహద్దుల్ని చెరిపి రాజ్యాలను కలిపి సామ్రాజ్యాలను చేసినవారు కొందరైతే
మనసంస్కృతిని ఏకీకృతమొనర్చ తపనతో పాటుపడినవారు
పల్లవ,చాళుక్య,రాష్ట్రకూటులు
దక్షిణభారతానికే
వన్నె తెచ్చినవారు …
చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణాలతో వాసిగాంచిన విషయము నంతయూ సవివరముగా పొందుపరిచారు…
బండి ఉషగారు …!
గెలిచి ఓడినా…ఓడి గెలిచినా
పల్లవుల పరిపాలన హర్షణీయమే !,
వైభవోపేతులై
చివరికి పతనం చెందినా …
వీరిపాలన అమోఘం…
శిలలలో
వీరి ఖ్యాతి చిరస్థాయి… ఈవాస్తవాలనన్నిటినీ సాక్షాత్కరింపజేశారు
తమకవితలో
రమణీ వరప్రసాద్ గారు….!
విష్ణుకుండినుల
విజయ గాధలను
వారి శైవ, వైష్ణవ, శాక్తేయ మతోద్ధరణను ధర్మనిరతిని చరిత్రలో వారియొక్క సత్కీర్తిని చక్కగా గేయరూపంలో మనకందించారు
రామకృష్ణ గారు …!
పూర్వరాజులలో కొందరు పరిపాలనా స్వర్ణ యుగాన్ని సృష్టిస్తే …,
చేర,చోళ,పాండ్య రాజులు సాహిత్యము,శిల్పం మొదలైన
లలితకళల స్వర్ణయుగాన్ని దక్షిణాపథంలో
విరాజమానము గావించిన ఘనతను…
చక్కని కవిత్వరీతిలోపొందుపరిచారు గొర్తి వాణి గారు!
భావ వ్యక్తీకరణలో
భాషది ముఖ్యభూమిక … భాష, లిపులలోనే
సమస్థజ్ఞానమూ నిక్షిప్తమైయున్నది మానవవికాసంలో
భాషాపరిణామం అతిముఖ్యమైనది …
వివరణాత్మక విశ్లేషణలతో భాష యొక్క సమగ్ర విశేషాలను పొందుపరచి మనకందించారు
విజయలక్ష్మి గారు…!
భాషకు లిపి శాశ్వతత్వాన్ని చేకూరుస్తుంది
మూక భావాలకు చిత్ర లిపి పుడితే …
ధ్వనిసంకేతంగా పుట్టింది అక్షర లిపి …
లిపి ఆవిర్భావం…పరిణామ, వికాస దశలు
విభిన్న స్వరూపాలు సమగ్రసమాచారాన్ని
చక్కగా విపులీకరించి విశదపపరిచారు
అరుణ గారు …!
పద్యాన్ని గురించి హృద్యంగా అద్భుత పద బంధాలతో
మన తెలుగుపద్యవైశిష్ట్యాన్ని విశ్లేషిస్తూ
విజయబావుటాఎగురవేస్తూ
తమ అక్షరరమ్య అనన్య ఝరిలో
ఓలలాడించారు రాధశ్రీగారు
ఆంద్ర సాహిత్య చరిత్రకే అగ్రతాంబూలాన్నందుకున్న
ప్రథమ తెలుగు కవిచంద్రుడు…
నన్నయను … పోషించిన
రాజ రాజ నరేంద్రుని రెండున్నర పర్వాల తెలుగు మహా భారతావిర్భావాన్నీ
అతి సుందరంగా
అక్షరీకరించారు మహేంద్రాడవారు…!
***
ఆది నుంచి… అనంతం దాకా…
(వచన కావ్యం)
నిర్వహణ: చివుకుల శ్రీలక్ష్మి
పుటలు: 546, వెల: ₹ 500
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి
20-24-18, వెంకటేశ్వర కాలనీ,
వసంత్ విహార్ దగ్గర,
విజయనగరం, ఆంధ్రప్రదేశ్ 535002,
ఫోన్: 9441957325
(సశేషం)