ఆది నుంచి… అనంతం దాకా… – పుస్తక విశ్లేషణ-1

2
10

[dropcap]సా[/dropcap]గిపోతున్న కాలప్రవాహాన్ని అక్షరబద్ధం చేసి ముందు తరాలకు అందించ వలసిన బాధ్యతతో చివుకుల శ్రీలక్ష్మి గారు 116 కవులతో 129 అంశాలపై కవితలు వ్రాయించి ‘వచనకావ్య రచనా వేదిక’ ద్వారా పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆ పుస్తకంలోని ఆరు అధ్యాయాలలోని కవితలపై కోరాడ నరసింహారావు గారు అందిస్తున్న విశ్లేషణ ఇది.

***

1వ అధ్యాయ గుణ ప్రశంస

ప్రారంభం శ్రీ లక్ష్మిగారి
సృష్టిఆరంభంలో
శ్రీకారం చుట్టబడింది
శూన్యం నుండి విస్ఫోటనంతో నాదమూలంగా
సృష్టి మొదలైందని
ఆకాశం నుండి వాయువు , అగ్ని, జలము, పృధివి… మొదలైన పంచభూతముల ఆవిర్భావం జరిగిందని
పృధివి నుండి ఓషధులు
వాటి వలన జంతుజాలము… పరిణామక్రమంలో
విశిష్టులైన మానవులు
ఈ మానవుని జిజ్ఞాసతో
ఎన్నో శోధనలు, పరిశోధనలు జరిగి సృష్టి రహస్యాలను సైతం విపులీకరించగలిగే  మహత్తర శక్తిగా మానవులు  ఎదిగారని జీవ నాదాత్మకమైన  ప్రాణజ్యోతి  వెలుగులో పరంజ్యోతిని కలుసుకునే ప్రయత్నంలో
మానవుని ప్రయాణo
ఆ విశేషాలను తెలుసుకోవటమే
ఈ రచన పరమార్ధ మన్నారు శ్రీలక్ష్మి గారు….!

పై విషయాన్నే కొనసాగిస్తూ
ఈ సృష్టి సమస్తమూ
సుందర శబ్ద సంగీతమని సమస్త ప్రాణుల సర్వ శక్తుల సమన్వయ సమగ్ర స్వరూపమే మానవుడని
ఈ నాదమయ జగత్తులో యిదే సుందరమూ శివము
సత్యచేతనామృతమన్నారు
విజయాదిత్య గారు…!

నాదమయమైన
చతుర్వేదాలు
భగవంతునిచే ఋషులకూ… గురుశిష్య  పరంపరగా
ఈ లోకానికీ  చేరాయని
మట్టిముద్ద వంటి మనుజుని మలిన రహితునిగా సంస్కారవంతునిగా యివి తీర్చి దిద్దుతున్నాయని ఒక్కొక్క వేదమూ
ఈ జగతి ఒక్కొక్క అంగాన్నీ పరిపుష్టం చేసి సమగ్రతను శాశ్వతత్వాన్ని
చేకూరుస్తున్నాయని వేదములు వివక్షరహితములు
పరమపావనములని కొనియాడారు హనుమంతరావు గారు…..!

విభాగపరచబడిన వేదాల వివరణాత్మక విశ్లేషణే ఉపనిషత్తులని  …
అనుసంధాన, ఉపాసన మార్గదర్శన వేదాంతమే  ఉపనిషద్సారమని  లౌకికులకు  కామితఫలములను
అలౌకికులకు ముక్తిని
…చివరకు నాస్తికులకు సైతం ఈ ఉపనిషత్తులు
సన్మార్గ మార్గ దర్శనాలని… ప్రశంసించారు పద్మజ గారు….!

అన్నియుగాలలోకీ
ఆదియుగం కృతయుగం అది ఈ భూమిపై వెలసిన స్వర్గమే  అంటూ
కల్పావిర్భావము, విస్తృతి,
మత్స్య, కూర్మ  వరాహ, నారసింహావతారాల  వివరాలు …
యిక్ష్వాక వంశ సగరుని  ఆనందమయ పాలన పురువంశోద్దారకుడు
భూతల స్వర్గంగా ఏలిన  భారత భూమిని
చక్కగాకవిత్వీకరించారు ప్రవల్లిక  గారు!

భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల అభివృద్ధికి పెట్టనికోటలుగా  నిలిచాయి మన సరిహద్దులు అంటూ
సమృద్ధమైన వనరులు… చక్కనివాతావరణ పరిస్థితులతో …
పరిపుష్టమై… ఉత్తరానదేవతలు,ఋషులతో …జీవనదులతో దట్టమైనఅరణ్యాలతో … మహాపర్వతాలు పుణ్యక్షేత్రాలు…
మైదానాలు,ఎడారులతో … మన సంస్కృతీ సాంప్రదాయాలకు  నిలువెత్తు సాక్ష్యాలుగా  నిలిచాయని …
మూడువైపులా
ఉప్పు సముద్రమే
సాగర గర్భాన  బడ బానలమే  అంటూ ప్రారంభ కవితతో పాటు దీన్నీ అందించారు
శ్రీలక్ష్మి గారు…!

నాదం ఓం కారమైతే
జీవనాదం జలం…!
అంటూ
ఒక్క వంతు భూమికి మూడొంతుల నీటిదే కదా ఘనత …
నీరులేనిదే జీవికి తావెక్కడ !?గంగ, యమున, గోదారి, సింధు, కృష్ణ, కావేరితో సహా  నదీమతల్లుల…
తీరప్రాంతాలలో కొలువైన దేవాలయాల విశేషాల నన్నింటినీ
చక్కగా అక్షరీకరించి విపులముగా విశద పరిచారు సుమన గారు ….!

ఆయా పవిత్ర స్థలాలలో పుట్టిన నదులు ప్రవహిస్తూ …
తమ నాట్యఝరీ విన్యాసాల పరీవాహక తీర ప్రాంతాలలో వెలసిన పుణ్యక్షేత్రాలు..
ఆ పవిత్రప్రాభవాలను యిహము  మరచి
మనసు పులకించునటుల  అక్షరీకరించారు సుభద్రాదేవిగారు  !

నాగరికతకు నాందిగా వెలసిన జానపదాలు విస్తరించాయి రాజధానుల…షోడశ జనపదాలను సాక్షాత్కరింప జేశారు కిలపర్తి వారు !

ఆదిమ కళయైన వృత్తి నైపుణ్యత ఆధారంగా…
అరువది నాలుగుకళలను…
వేద వేదాంగాలు మొదలుకుని సంగీత సాహిత్య లలితకళల వికాస ప్రాశస్త్యాలతో  మరోప్రపంచంవైపు నడిపించారు
వీర రాఘవ మాస్టారు!

నాట్యశాస్త్ర వివరణ విశ్లేషణలతో  …
నాట్యకళ వైశిష్ట్యాన్ని  సవివరంగా వినమ్రతతో  సుమన గారు సమర్పిస్తే  …..

ప్రాంతాలవారీగా
విస్తృతి చెందిన
నవ విధ నృత్య రీతులను  భావరాగతాళములచే వెలుగొందిన నవ్య రీతిని మనోరంజకoగా అక్షరీకరించారు
రాధికా రాణిగారు!

సంగీత,సాహిత్య,నాట్య రీతులనన్ని ….
కఠినశిలలయందు పదిలపరచి…
తరతరాలకు
మన వారసత్వ సంపద లివియని అందివ్వబడినవీ శిల్ప,చిత్ర కళలు..!

అపురూప శిల్పాల నిలయమీ అవనియని…
ఎవరెన్ని రీతుల  ద్వoసమొనర్చినా
నిలచినదీ కళయని
నిక్కచ్చిగా జెప్పినారు
ఎల్లా రెడ్డి గారు …!

భావాల వినిమయపు తొలి భాషగా పుట్టి…
చరితనంతయు బొమ్మలలో నిక్షిప్తమొనరించి భావికందించిన మన ఘన చిత్రకళ ఇదని ఆనాడే రంగులతొ అలరారియుండెనని కాలానుగుణముగా
అభివృద్ధి చెందెనని గొప్ప చిత్రకారులెందరికో జన్మనిచ్చిందని
భారతమాతకు కళలకోటగా నిలిచెనని…
యినుపకుర్తివారు
యిమ్ముగా జెప్పారు !

అజరం,అమరం అంటూ… మనసాహిత్య సంపదను వేద నాదము మొదలు …
పతంజలి మహాభాష్యముతో..
వాల్మీకి వ్యాసులను స్తుతిస్తూ సాహిత్య ఆదిమూలాలను ఆలాపన రీతిలో
సత్యాన్ని దర్శింప జేసేది సమాజానికి దర్పణమైన సాహిత్యమే ..
సత్యము, ధర్మము, జ్ఞానమని
ఎలుగెత్తి చాటారు
భైరవభట్ల  గారు!

సంగీత, సాహిత్య, నాట్యాలను మేళవించి తమ ప్రదర్శనలతో కధలను వినిపించిన కధకులను గురించి
పగలంతా పనులతో అలసి,సొలసిన జానపదులకు ఊరట నిచ్చే కధలను చెప్పే కధకుల వైశిష్ట్యాన్ని వివరిస్తూ  …
జ్ఞానాన్ని కధలలో నుంచి జనాల కణాల్లోకి ప్రవహింప జేసిన మూర్తులంటూ
వారిని ప్రశంసించారు
చొక్కాపువారు

మనిషికి కూడు, గూడుల యాతనలు తీరాక
లలితకళలు వికాసమార్గం పట్టాయి అక్కడితో ఆగక …
ఈ అనంతమైన సృష్టియేమిటో…
ఈ సృష్టిలో తానేమిటో…తెలుసుకోవాలన్న కుతూహలం …ఇన్నిన్ని పరిశీలనలు …పరిశోధనల వైపు నడిపించింది
అప్పుడే మనిషి ప్రకృతిని ,ప్రకృతి మూలలను పరిశీలించటం మొదలుపెట్టాడు…!
ఆకాశ, నక్షత్ర గ్రహాల స్థితి,గతులను తెలుసుకో గలిగాడు !
సూర్య,చంద్ర,నక్షత్రాలే
కాల గణాలకు  మూలమని…
ఈ అనంతమైన
మహోన్నత ఖగోళాన్ని విపులంగా …సవివరంగా విశ్లేషించిన మన ఆర్యభట్టు, వరహామిహర  బ్రహ్మగుప్తాదుల గొప్పతనాన్ని …. మహోన్నతంగా వికసించిన మనభారతీయ విజ్ఞాన అవధిని సవివరంగా మన ముందుంచారు రామశర్మ  గారు!

గాయత్రాది మహా మంత్రములలో నిక్షిప్తమై…నిగూఢదార్శనిక జీవనసాధనమై …
జ్యోతిష్యాది సకల శాస్త్ర విజ్ఞానంగా  విరాజమానమైన
మన సంఖ్యా శాస్త్ర వైశిష్ట్యాన్ని సవివరంగా విశదపరచటమే గాక సున్న (0)  యొక్క ఔన్నత్యాన్ని కొనియాడి
ఆ జ్ఞానవృష్టిలో
తడిసి తరించి,తరింప జేశారు విజయభారతి గారు!

ఇప్పటి
ఈ గణిత శాఖలన్నింటికీ ఆధారభూతమైనది
వేద గణితమేనని సోదాహరణంగా వివరించి సాహిత్య, సంగీతాది  కళలన్నీ గణితంమీదే
ఆధారపడి ఉన్నవని
గణితంతో ముడిపడివున్న విశ్వరహస్యాల విచ్చేదనం గావించారు అనుసూరివారు….!

గ్రహాలూ నక్షత్రాలు, రాశులు వీటి గమనాలతోనే
మనిషి సంపూర్ణ జీవితం ముడిపడి వున్నదని
ఉబోధకం చేసేదే జ్యోతిష్యమని దీనికి ఆద్యుడు వరాహమిహిరుడని
ప్రపంచ కదలికలు, కదిలించే కాళికలు అంతా జ్యోతిష్యానుగ్రహమని
నొక్కి వక్కాణించారు గుదిమెళ్లవారు!

మానవజన్మకు అవసరమైన  యోగాన్ని,
వివిధ క్రియాపద్దతులను వివరించి…
ఆద్యుడైన పతంజలికి ప్రణమిల్లి…
పఠితులను యోగభోగులను గావించారు తులసీగారు  !

అణువు మొదలు బ్రహ్మాండంవరకూ ప్రతి విషయవిశ్లేషణను…
శాస్త్రబద్ధoచేసి సిద్ధాంతీకరించిన
ఘనత మన భారతీయులదేనని
సగర్వంగా చాటుకోవచ్చును!
ఆయుర్వేదానికి మూలకర్తయైన ధన్వంతరితో ప్రారంభించి…
ఆయువుకు సంబంధించిన సమగ్రచర్చతో… ఆయుర్వేద  ఔన్నత్యాన్ని
విశద పరిచారు శాస్త్రిగారు !

నాగరికత అంటేనే
సభ్యతను  నేర్పేది,
సుఖ,శాంతులతో జీవింపజేసేది!
దీనికి ఖచ్చితమై భారతీయ వేదకాలపు నాగరికత
కృతజ్ఞతకూ వినమ్రతకూ పుట్టినిల్లు…
యదార్ధశక్తులనారాధించ… వ్యధార్తులనుద్దరింపజేసే
మన వేదకాలపు నాగరికతా వైశిష్ట్యాన్ని జీవన వికాసాన్ని …
ఆ అత్యుత్తమ మానవ సంబంధాలనూ విపులంగా విశదపరిచారు త్రిపుర సుందర తేజ గారు !

పురాణాల పుట్టుపూర్వోత్తరాలతో…
పురాణాల విశిష్టతనూ పురాణపఠనము యొక్క ఆవశ్యకతను…
సంప్రదాయ సమాజమునకు పాఠములుగా బోధించాలని  వివరించి చెప్పారు దన్నానవారు..!

అష్టాదశపురాణాలలో…
యే విజ్ఞానం యేపురాణంలో నిక్షిప్తమై యున్నదో
మనిషిమనుగడలో
యే పురాణం యేకోణానికి ఆలంబనగా నిలిచి నడిపిస్తుందో…
సవివరంగా ప్రస్తావిస్తూ… పురాణాలు మానవజాతికి వరాలని తేల్చి చెప్పారు లక్ష్మీమైథిలిగారు!

యుగములలో
అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది
త్రేతా యుగమని
అద్భుతమైన యుగ ఆవిర్భావ  వర్ణనతో  అత్యుత్తమ మానవ సంబంధాల
మహోన్నత జీవన విధానం…
ఆశ్రమధర్మాల మహత్వమును చక్కగా వివరించారు
ప్రమోద్ కుమార్ గారు !

ఇక్ష్వాకు వంశ ఆవిర్భావం …. రఘువంశంగా  పరివర్తనం
ఆయా మహాపురుషుల పరిచయాలతో ఉత్కృష్టమైన
ఇక్ష్వాకుచరితను శ్రద్దగా చదివింప  జేశారు
శైలజ గారు !

అత్యంత పవిత్రమైన రామాయణ మహాకావ్య కధాసారాన్ని రమణీయంగా పునశ్చరణ గావించారు సాహితి గారు…!

రామో విగ్రహవాన్ ధర్మః
అనే విషయాన్ని …
ప్రకటితము గావిస్తూ
సూటిగా, స్పష్టంగా, సoక్షిప్తంగా…
రామునిలో చంద్రుని,
చంద్రునిలో శ్రీరాముని చూపించేసారు సన్నిధానంవారు……!

సత్య, ధర్మాలను కోల్పోయినాక  యింక
శాంతి, ప్రేమలకు తావెక్కడ!?
ద్వాపర యుగ ఆవిర్భావం…
జనపదాల వికాసం
రాజ్యాల నిర్మాణం
నాగరికతా వికాసంతో సహా …
అధర్మాన్ని అణచటానికి ధర్మాన్ని గెలిపించటానికి…
శ్రీకృష్ణుడు అవతరించిన  విధానం … స్త్రీలు, ధర్మ నిరతుల  దుస్థితి …రెండు యుగముల సంధి కాలము వరకూ …సవివరముగా కవిత్వీకరించి అందించారు జ్యోతిర్మయి గారు…!

సమగ్ర భారత ఉద్గ్రంథాన్నీ కేవలం రెండు పేజీలలో సూక్ష్మీకరించి యిది
సాటిలేని చరితం
అంటూ నొక్కి వక్కాణించారు లక్ష్మీ నాధాచార్యుల వారు !

మానవ జీవన యానంలో దిక్సూచిలా నిలిచి నడిపించే ముక్తి ప్రదాతయే భగవద్గీత
సాక్షాత్ భగవానుడైన శ్రీ కృష్ణుడే అర్జునుని  ఉపకరణంగా
ఈ జగత్తుకు బోధించిన నీతిచంద్రికయే భగవద్గీత
అంతటి మహత్తు కలిగిన గీతలోని
యోగ గుళికల వివరాలనన్నిటినీ సుబోధకంజేస్తూ
నిష్కామకర్మయోగమే గీతాసారమన్నారు
రత్నం గారు..!

విలువలకు తిలోదకాలతో ఆవిర్భవించిన
కలియుగ ధర్మ రీతి
దాని స్వరూప స్వభావాలు అడుగంటిన విలువలు
మితి మీరిన అరాచకాలు
మొత్తం కలియుగ
లక్షణాలనన్నింటినీ కళ్ళకు కట్టిచూపించేసారు నవోదయానికై
కవులు కలాలతో నాంది పలుకుతున్నారంటూ  జయలక్ష్మి గారు…!

మంచి కోసం ఆవిర్భవించిన అమృతతుల్యాలలో
స్వార్ధ పూరిత విషపుచుక్కలు చేరితే ఏమవుతుందో …
మనకు ఆదినుండీ అలాంటి అనుభవాలే…
ఒకమతం మహోన్నతంగా వెలుగొంది
కాలక్రమేణా పతనం చెంది మరో క్రొత్తమత ఆవిర్భావానికి
దోహదకారి అవుతుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం
అలా ఆవిర్భవించినవే మతాలన్నీ…
జైనమతం కూడా అలానే ఆవిర్భవించి చాటుకున్న వైశిష్ట్యాన్నీ
నడిపించిన మహనీయులనూ సవివరంగా సుబోధకం జేశారు
దినవహి సత్యవతి గారు ….!

భోగముకన్న జ్ఞానమే గొప్పదని నిరూపించి
అహింసయే పరమధర్మమని ప్రవచించిన బౌద్ధ మతమును గూర్చి  చక్కగా అక్షరీకరించి అందించారు
తిరుమలరావు గారు…!

రాజ్యాలు ఇష్టారాజ్యాలై నిరంతర కలహాలతో
అశాంతి అలజడులు చెలరేగినపుడు
సమగ్రతకు సమైక్యతకూ నడుం బిగించారక్కడక్కడా
వారిలో ఆద్యుడే మౌర్యవంశ చంద్రగుప్తుడు…
గురువు చాణుక్యునితో కలిసి నడిపిన సామ్రాజ్య పాలనా విశేషాలను
పతనావస్థ, దుర్దశలను సవివరంగా ప్రస్థావించారు రామచంద్ర  హరనాధ్ గారు !

ఎంద రెందరు ఎన్నెన్ని మార్లు కొల్లగొట్టినా
తరగనివీ, చెరగనివీ మన భారతీయ వారసత్వ సంపదలని
అజ్ఞానంతో వచ్చిన వారు జ్ఞానాన్ని పొందే వెళతారని
చరిత్రలో అలెగ్జాండర్  జీవితంతో సుబోధకం చేశారు
కోరాడవారు!

మౌర్య వంశంలో
మహోన్నత చక్రవర్తి యైన అశోకుని  జీవిత విశేషాలను …
రాజ్యవిస్తరణ…. చివరికి యుద్దవిరక్తుడై…సత్యము నెఱిగి సమతను కోరి ….
బౌద్ధమత ప్రచారంతో శాశ్వత ప్రజాప్రయోజన విధానాలతో పాలన గావించి ఖ్యాతినార్జించి…
చివరిగా వంశమూ, మతము రెండూ పతనమై పోయినా
చరిత్రలో చిరస్థాయిగా నిలిచారంటూ… ఎరుకపరిచారు కుసుమంచివారు

తమ శక్తియుక్తులతో అన్నిరంగములను ప్రగతిపధంలో
నడిపిన తొలి తెలుగుపాలకులు శాతవాహనుల ప్రాభవాన్ని
అత్యద్భుతంగా అక్షరీకరించారు
కృష్ణకుమారి  గారు

జ్ఞానానికి పుట్టినిల్లు
మన భారతావనియే
సకల శాస్త్రాలూ…
ప్రభవించి, వికసించి ,
వెలుగులు విరజిమ్మిన ఈ వేదభూమిలో
మూలకారకులైన మహనీయులెందరో…
అందరినీ పేరు పేరునా స్మరించి …
వందనముల నిడుతూ మన సనాతన వాజ్ఞ్మయ కోశములలో
ముంచి తేల్చారు
శ్రీవాణిశర్మ గారు.

మన అత్యున్నత జీవనవిధాన సంప్రదాయ విధివిధానాలను  విశద పరచుచు…
అతి పవిత్రములైన
ఆశ్రమ ధర్మాచరణములతో …  సనాతన సంస్కృతీ హర్మ్యాలు నిర్మించారని
కొనియాడుతూ  మన గొప్పతనాన్ని
ఎలుగెత్తి చాటారు
సత్యకమలాకర్ గారు.

ఇంతటితో మొదటి అధ్యాయాన్ని ముగించి రెండోఅధ్యాయంలోకి మనల్ని నడిపించారు శ్రీలక్ష్మి గారు
చరిత్ర కాలానుగుణ  క్రమ గమన విధానాన్ననుసరించి  సక్రమముగా సంకలనపరచి  గ్రంథానికి  చక్కని రూపసౌందర్యాన్ని ఆపాదింపజేయటంలో చివుకుల  వారి శ్రమ, ఓపిక, కార్యదీక్ష, పట్టుదలలకు ప్రణమిల్లవలసిందే. బిందువులను చేర్చి మహాసింధువును ఆవిర్భవింప జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here