[dropcap]సా[/dropcap]గిపోతున్న కాలప్రవాహాన్ని అక్షరబద్ధం చేసి ముందు తరాలకు అందించ వలసిన బాధ్యతతో చివుకుల శ్రీలక్ష్మి గారు 116 కవులతో 129 అంశాలపై కవితలు వ్రాయించి ‘వచనకావ్య రచనా వేదిక’ ద్వారా పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆ పుస్తకంలోని ఆరు అధ్యాయాలలోని కవితలపై కోరాడ నరసింహారావు గారు అందిస్తున్న విశ్లేషణలో ఇది రెండవ భాగం. మొదటి భాగం ఇక్కడ చదవవచ్చు.
***
మూడవ అధ్యాయ గుణ ప్రశంస
యుగ యుగాల నుండీ…
తర తరాల
పరంపరానుగతంగా వస్తున్న మన విశిష్ట
ఆచార, సాంప్రదాయాల
జీవన విధానంలో
నిగూఢంగా నిక్షిప్తమై వున్న అద్భుత విషయ విశేషాలతో పాటు…
మానవ ప్రపంచానికే మార్గదర్శకాలను అందించిన
మన భారతీయ జీవన విధాన విశ్లేషణలతో
గొప్పగా మూడవ అధ్యాయాన్ని ప్రారంభించారు …
భారతీయ జీవన సరళి అనే శీర్షికతో లలితగారు !
మానవజన్మకు అంతిమ లక్ష్యమైన ఆత్మ… పరమాత్మను చేరటమనే విషయాన్ని…
మార్గాలెన్నున్నా, అవి ఏవైనా నదులన్నీ చివరకు చేరేది సాగరానికే అన్నట్టు…
మతాలు వేరైనా విధానాలు ఏవైనా …
ఆ సర్వేశ్వరుని ప్రాప్తియే లక్ష్యంగా బ్రతికిన
భక్తులచరితలతో… భక్తిని ఒక ఉద్యమంగా
ప్రపంచపు నలు దిశలా వ్యాపింప జేసిన
యోగుల, సిద్ధుల జన్మభూమి మన భారతావని యని …
చక్కని వివరణలతో
పొందుపరచి అందించారు
భక్తి యుగాన్ని
వెంకటలక్ష్మి గారు
జీవుడు వేరు, దేవుడు వేరని ద్వైతమంటే
జీవుడు, దేవుడు వేరు
కాదని అద్వైతం వాదిస్తే… ఏకమానేకం …
అనేకమేకమే జీవ బ్రహ్మల సంబంధం
అంటూ వివరించిన
విశిష్టాద్వైత వైశిష్ట్యాన్నీ… రామానుజుల ఔన్నత్యాన్నీ
చక్కని చిక్కని గేయకవితతో
కీర్తించారు రామకృష్ణ గారు …!
ఈ నేలపై రాజ్యాలు పురుడు పోసుకున్నది
మొదలు…
అనేక రాజులు, చక్రవర్తులు
వారి వారి ప్రాభవాన్ని
చాటుకుంటూనే
వచ్చారు! వారిలో
ఉత్తరదేశ ఏలికలలో
రాజపుత్రుల కాలం చిరస్మరణీయమే…
వారి ఉత్తమపరిపాలన… సాహిత్యపోషణ కళల ప్రోత్సాహం
భాషోద్ధరణలతో విద్యా వికాసానికి వారికృషి …
మొదలైన విషయాలన్నీ
సవివరంగా వారి వీరోచిత చరిత్రను…
రాజపుత్రుల వైభవం… అనే శీర్షికతో మనకందించారు …
సంతోషి గారు !
కాకతీయుల వైభవాన్ని … వికసింప జేసిన
వారి శిల్పకళా సోయగాన్నీ… వారి శౌర్య ప్రతాపాలను…
సుపరిపాలనను… సంగీతసాహిత్యాలలో సామ్రాట్టులైన
వారి గొప్పతనాన్నీ… హరి హర భక్తిసఖ్యతను మొత్తం
ఆ విశేషాలనన్నింటినీ
కాకతీయ వైభవం పేరుతో …
సవివర పద చిత్రాలతో దర్శింప జేశారు చక్రవర్తి గారు!
ఇటు… దక్షిణాన విజయనగర సామ్రాజ్య వైభవము వర్ణనాతీతము…
విజయనగర సామ్రాజ్య నిర్మాణ విశేషాలతో మొదలై
సంగమ, సాళువ, తుళువ వంశముల పాలనలను…
ప్రత్యేకించి కలానికీ, కత్తికి సమానమైన విలువనిచ్చారనీ…
అంగడి రత్నాల రాసులు పోసి అమ్మిన ఎంతటి
వైభవమైనా… శాశ్వతము కాదన్న విషయాన్ని
ఎరుకపరచే విధంగా …వారి ఖ్యాతిని ఈ భూమిపై విడచి
మరలినారన్న విషయాన్ని… సవివరముగా
విజయనగర సా మ్రాజ్య వైభవమును పేరిట కవిత్వీకరించి అందించారు నాగ మల్లేశ్వరం గారు
ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ చక్రవర్తీ
అంటూ కీర్తింపబడిన కృష్ణరాయలనే
ప్రత్యేకించి… చిరయశస్వి అనే శీర్షికతో…
కొనియాడారు అనురాధ గారు … వీరు
ఓ తుళువ వంశ సంజాతా అంటూ మొదలుపెట్టి…
వారిపాలనా చాతుర్యాన్ని…
అష్టదిగ్గజ కవిపోషకత్వాన్నీ…
స్వయం కవియై కవనాన్ని నెరపిన విధానాన్ని
వారి దేవాలయాల పునరుద్ధరణ, పోషకత్వాలను…
మొదలైన విషయాలనన్నింటినీ సవివరంగా పొందుపరిచారు .
పద్య, గద్య, చంపూ ప్రక్రియల వివిధ కావ్యములతో… పదహారవ శతాబ్ది
విరాజ మానమైనది
అష్టాదశ వర్ణనలతో
శృంగార వీరరసాల ప్రాధాన్యతన నవరసాలతోచ్ఛందోలంకారాలసొగసులతో …
పాండితీప్రకర్షకు నిదర్శనంగా అలరారింది
ఈ నేల తెలుగు వెలుగులతో ప్రబంధయుగంగా …
స్వర్ణయుగమైభాసిల్లింది…
ఆ విశేషాల నన్నింటినీ సవివరంగా… తమకవితా
ప్రవాహంతో ముంచెత్తారు … విలక్షణయుగం ప్రబంధయుగమంటూ…
శిరీషారఘురామ్ గారు !
అష్టావధానం, శతావధానం,
సహస్రావధానం, అంటూ అనేక
అవధాన ప్రక్రియలతో నేడు అలరారుతున్న
ఈ అవధాన ప్రక్రియను
శబ్దబ్రహ్మవిద్య అంటూ కొనియాడి …
శ్రవణ, స్మరణ, మనన ధారణలతో…
ఈ అద్భుత ప్రక్రియ కేవలము మన తెలుగు భాషకే సొంతమని సగర్వంగా చాటుతూ…
ఆ విషయాలన్నీ… సవివరంగా తన గేయరూప విన్యాసంతో…
మనల్ని ఆస్వాదించమంటున్నారు
సత్యసందీప శర్మ గారు…!
నాల్గవ అధ్యాయ గుణ ప్రశంస
స్వతంత్రం…
పరతంత్రం…
కుతంత్రం…!
యివి రాజ్యనిర్మాణంలోన… పరిపాలనలోనూ
చవిచూసే అనుభవాలే…!
తమ ప్రాభవాన్ని
చాటుకోటానికి
కొందరు యుద్దాలు చేస్తే …. మరికొందరు
తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోటానికి తప్పనిసరియై
యుద్దాలు చెయ్యవలసివచ్చింది…!
తమవారితోను పరాయివారితోనూ
యుద్దాలు
పరిణామక్రమంలో
బలమైనవాళ్ళే
ఏలికలై పాలించారు !
వారిలో మొఘలాయీలది విశిష్ట స్థానంలో
ఈ నేలను పాలించిన రాజకుటుంబాలన్నీ
వారివారి ప్రత్యేకతలను చరిత్రలో నిలిపి తరలి పోయినట్లే…
మొఘలాయీలు
తమ ప్రాభవాన్ని చరిత్రలో ఘనంగానే చాటుకున్నారు!
సంగీత సాహిత్య, నాట్య, శిల్ప, చిత్ర కళలతో చరిత్రను
వారు పరిపుష్టం చేశారు
ఎర్రకోట, తాజ్ మహల్ వంటి కట్టడాలతో….
అక్బరు, బాబరు మొదలైనవారల సంస్కరణలతో
వీరి కీర్తి అజరామరం!
ఈ విషయ విశేషాల నన్నింటినీ సవివరంగా స్పష్టం చేస్తూ ….
విభజించి పాలించే ఆంగ్లేయుల రాజకీయాలు…
వారి అరాచకాలకు పెరిగిన అసంతృప్తుల తిరుగుబాటు …
క్రమేణా మొఘలాయీల పతనావస్థలను …
మొఘల్ సామ్రాజ్య వైభవం పేరిట సుగవాసిగారి రచనతో … ప్రారంభమైంది
నాల్గవ అధ్యాయం !
అంతటి శక్తివంతులైన
మొఘలాయీలను సైతం ఎదిరించి తన దేశభక్తిని …
హిందూధర్మస్థాపనకోసం
తాను చూపిన ధైర్య సాహసాలను…
ఛత్రపతి బిరుదాంకిత
శివాజీ విశేషాల నన్నింటినీ
తేటతెల్లం చేస్తూ…
ఆనాడు దేశం
నలుమూలలనుండి
హిందూ ధర్మంపై
జరుగుతున్న దాడిని
నిరంకుశ నియంతృత్వాలను ఎదిరించిన శివాజీ
వీరోచితగాధను ఉత్సాహభరితంగా కొనియాడారు
సత్యవాణిగారు…!
నేటి బాలురే రేపటి పౌరులుగా …
తల్లిదండ్రుల పెంపకం… పరిసరాలు
ఎదిగే పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని
కలిగిస్తాయి..! జీవితంలో బాల్యం
అధిక ప్రాధాన్యతని సంతరించుకున్నది
అందుకే…
సత్య, న్యాయ, ధర్మాలతో పిల్లలను తీర్చిదిద్దవలసి ఉందంటూ …
చక్కని మార్గాలను ప్రతిపాదించారు
భారతి గారు …!
“మధ్యతరగతి జీవనచిత్రం” అంటూ
కమలకుమారి గారు
ఆనాటి మధ్యయుగపు మొత్తం మనిషి జీవితాన్ని… జీవనవిదానాన్ని చక్కనిగేయ రూపంలో
కళ్ళకు కట్టటమే కాకుండా ఆనాటి జానపదాల రూపురేఖల నుండి …
సమాజంలోని హెచ్చుతగ్గులు స్త్రీల స్థితి గతులు
అంధ విశ్వాసాల నన్నిటినీ… ఎండగడుతూ …
యే ఆచార వ్యవహారాలైనా మానవ జాతి కళ్యాణం కోసమేనని వారి కోసం వెలసినవే ఈ మతాలూ….
సాంప్రదాయాలు ఆచారాలన్నీ …!
కొందరు స్వార్థపరుల కుతంత్రాలతో
భ్రష్టు పట్టి … జనజీవనానికి పీడలా
దాపురించినపుడు… ఆ అన్యాయపు అరాచకాలతో
జనం అల్లాడిపోతున్నప్పుడు… మనలోనే మహనీయులు
కొందరు పుట్టుకొస్తారు…! సంస్కర్తలై పేరు తెచ్చుకుంటారు!
సమాజాన్ని ఉద్ధరిస్తారు … అలాంటి ఎన్నెన్నో సంస్కరణలకు
ఎందరెందరో సంస్కర్తలు పాటుపడిన
విధానాలను వివరణ సహితంగా
మనముందుంచి… వారందరికీ వందనాలంటున్నారు మన విజయలలితగారు….!
అనేక చిక్కులతో సతమతమయ్యే
మనుషుల మనసులకు లలితకళలు
స్వాంతన చేకూర్చగలుగుతాయి …
అందులోనూ మరీ ముఖ్యంగా గీతము గానము
ప్రశాంతతతో పాటు మనసుకు
ఉల్లాసాన్ని ఉత్సాహాన్నీ
కలిగించగలవు …!
అంతేకాదు కధిస్తాయి…
నాదంతో జీవ బ్రహ్మైక్యము
గావించగలిగేది సంగీతమే అంటూ …
సాహిత్యఔన్నత్యాన్ని యినుమడింపజేసేదీ
సంగీతమేనంటూ భక్తి సంగీత, సాహిత్యాలతో
కృతార్థులైన ఎందరో మహానీయులను ప్రస్తావిస్తూ …
సంగీతంతో ప్రకృతినే శాసించిన సోదాహరణలతో
ఈ సంగీతసాహిత్యాలను
పెంచి పోషించిన
ఆయా ప్రాంతాల ప్రభువులు
సంగీత, సాహిత్య,నాట్యరీతులనన్నింటినీ యిమిడివున్న
తత్వ వేదాంతవిషయాలతో సహా…
తన సుదీర్ఘ వ్యాఖ్యాన కవితారూపంతో
మనలనలరించారు…. రమాసుందరిగారు..!
ఆ సర్వేశ్వరుని నమ్మిన
యే ప్రవక్తలైనా… వారి ప్రచారానికి…. సంగీత,సాహిత్యాలనే
సాధనలుగా చేసుకున్నారు !
ఏ దిక్కున నున్ననేమి … చూసేచూపు,
తలచేతలపు ఒక్కటికావాలి అంటూ…
హిందూదేశం సమతాసమ్మిళితమన్న విషయాన్ని
తేట తెల్లంచేస్తూ …
మతాలు వికటాట్టహాసాలతో వేరుపడటంకాదు
మందహాసాలతో అందరం సంస్కర్తలమవుదాం
అంటూ మానవతా సమతావాదాలను
సమర్థిస్తున్నారు మతాలూ మందహాసాలులో
నిహారిణి గారు …!
కులము లోన ఒకడు
గుణవంతుడుండేనా కులము వెలయువాని
గుణము చేత అన్నట్టు మన భారత జాతి
మొత్తానికి ఒకే ఒక్కడు మనఖ్యాతిని
ఖండఖండాంతరాలలో…
ప్రతిధ్వనింప జేసిన వారు స్వామీ వివేకానంద!
దయ, ప్రేమ, సేవ, త్యాగములే హిందూ ధర్మ మూలసూత్రములని…
మానవసేవయే మాధవసేవని చాటిచెప్పి…
నిర్వీర్యులైన యువతను ఉత్తేజితులను
గావించిన చైతన్యదీప్తి అంటూ ఆ విషయాలనన్నిటినీ
ఎరుక పరచుతూ ఠాగూర్, గాంధీ వంటి వారికిసైతం ….
వివేకానందుని బోధలే
ప్రేరణయని…
యెంతకాలం బ్రతికామని కాదు…
ఎలా బ్రతకాలో వివేకానందుని జీవితాన్ని
ఉదాహరణగా చూపుతున్నారు సూర్యకుమారిగారు!
ప్రజాసంక్షేమంలో సంస్కరణలతో కూడుకున్న
పాలనారీతులు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి …
అత్యుత్తమ మూడoచెల పాలనలో… స్థానికస్వపరిపాలన సర్వోన్నతము
గ్రామ స్వరాజ్యమే
సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారమంటూ
వివిధకాలాలలో
ఆయా ప్రాంతాలలో
పరిపాలనా పద్దతులను సవివరంగా విశదపరిచారు…. ధరణీశ్వరీగారు…!
పరాయిపాలనలో
పరమాన్నం కన్నా
స్వపరిపాలనలో
చద్దన్నమే మిన్న
అన్నసత్యాన ఆనాటి రాజ్యాలు కోల్పోయిన రాజులు
ప్రాణాలొడ్డయినా తమహక్కులను సాధించుకోవాలని చేసిన
గట్టి ప్రయత్నానికి సాక్ష్యమే సిపాయిల తిరుగుబాటు…. చిరు వ్యాపారిగా వచ్చి
బడాపారిశ్రామిక వేత్తగా…
ఎదిగి… కుయుక్తులతో రాజ్యాధికారాన్ని కించుకుని…
అన్యాయాలకు నెట్టుకుంటున్న ఆంగ్లేయులపై కలిగిన ఆగ్రహమే
సిపాయిల తిరుగుబాటై …..
తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా
నిలిచిపోయింది అనే విషయాన్ని…
సవివరంగా సోదాహరణలతో వివరించారు ఉమాదేవిగారు!
ఓర్పుకి సహనానికి
మారుపేరైన భారతీయులు…
అన్ని నదులనూ,
తనలో కలుపుకున్న గంభీరమైన సముద్రంలా
అన్ని సంస్కృతులనూ
తనలో విలీనం చేసుకుంది…
భారతదేశరక్ష ణకై ఐక్యతతో మానవ హారమై నిలిచిన
యోగ భూమి యిది
యిట్టి మహత్తర భారత దేశంలో
కొరవడిన ఐక్యత, సామరస్యాలను వేలెత్తిచూపుతూ
ఈ దేశానికి ఆ పునర్వైభవాన్ని తీసుకు రావలసి ఉందంటూ భారతదేశ
ఐక్యతను వివరిస్తున్నారు వినీల గారు …!
దేశంకోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయులెందరో …
ఈ నేలపై వారి చరిత్రలను చిరస్మరణీయం చేసుకున్నారు
తరగని సంపదల పెన్నిధి
మన భరత ధరిత్రి… అందుకే అనాదిగా
ఎందరెందరో
అదను చిక్కినప్పుడల్లా
దోచుకుంటూనే వచ్చారు!,
భరించి భరించి
సహనం చచ్చి ఆంగ్లేయుల కాలం నాటికి
ప్రజాపోరాటంగా
రూపు దిద్దుకుంది
ఒక్కో ప్రాంతం నుండీ
దేశ భక్తులు బెబ్బులులై విరుచుకు పడగా… వారందరూ ఉరికొయ్యలకూ…
తుపాకీ తూటాలకూ బలైపోయారు !వారoదరినీ..
పేరు. పేరునా ప్రస్తుతిస్తూ నీరాజనాలర్పించారు
అమరవీరులు శీర్షికన
నాగరాజు గారు …!
ధర్మాన్ని నిలబెట్టవలసిన న్యాయ వ్యవస్థ
కళ్ళకు గంతలతో…
గుడ్డిదై నిలుచుంది
ఆంగ్లేయుల కుటిలనీతిని దమన రీతిని
వారి ప్రవేశవిశేషాలతో
మొదలుపెట్టి…
క్రమక్రమంగా
ఏకులుమేకుల్లా
ఎలా మారారో
ఇష్టా రాజ్యంగా
చట్ట న్యాయాలను
వారి కనుకూలంగా ఎలా మార్చుకున్నారో …చెబుతూ
వారి చట్టాలు మన సాంఘికదురాచారాల నిరోధానికి ఎలా ఉపకరించాయో
వివరించి మెచ్చుకుంటూ …
బ్రిటిష్ న్యాయ వ్యవస్థ పేరిట వివరించారు
దాసరి పద్మ గారు !
పాడిపంటలతో …
రత్నరాసులతో…
విలసిల్లే దేశానికి
వ్యాపార విధానాలతో పారిశ్రామికీకరణ మచ్చుగా జల్లి మనల్ని సొంత ఇంటి బానిసలుగా మార్చి…
పాశ్చాత్య మోజును పెంచి
జాతీయోత్పత్తి
విధానాలను త్రుంచి
ఆధునీకరణ ప్రపంచీకరణలతో…
ఈదేశ సాంఘిక, ఆర్ధికవ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం
చేశారో… చక్కగా వివరించారు అన్నాప్రగడ నరసింహం గారు !
పరమాత్మ ప్రసాదితామన్నం పరబ్రహ్మస్వరూపం…
సాక్షాదమృతం ఆరోగ్య, ఐశ్వర్య, జ్ఞానప్రదాయకం…
నమామ్యహం !అంతటి విశిష్టమైన అన్నంకోసం
తన స్వేద జలాలను చిందించి శ్రమార్చనతో…
పంటలను పండించి… మన నోటికందిస్తున్న రైతు
దేశానికి వెన్నెముక…
జనానికి జీవనాడి అట్టి రైతు యొక్క ఉత్కృష్ట జీవితాన్ని
పంటపండేవిధానాన్ని అత్యద్భుతంగా అక్షరీకరించారు
రైతును సౌభాగ్యప్రదాత అంటూ
రఘురామయ్య గారు…!
అంతటి గొప్ప రైతును
శత్రుమూక చుట్టు ముట్టిన అభిమన్యునితో
పోల్చుతూ అవిద్యవలన అన్యాయాలకు గురి కావటమే కాకుండా
భూకామందులు, వడ్డీవ్యాపారులు,
అనేకరకాల పన్నులు, అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు
రైతుబ్రతుకును పట్టి పీడిస్తూనే వున్నాయంటూ…
రైతు బతుకు చిత్రాన్ని స్పష్టంగా చూపిస్తూ అలసిన
ఓ రైతన్నా…
నీకష్టం తీరేదెపుడన్నా
అంటూ వాపోతున్నారు
రవి కుమార్ గారు …!
సమాజ పురోభివృద్ధిలో …
ప్రారంభ దశలో బాగా సహకరించినవి
చేతి వృత్తులు!
యివి పని విభజనకు…
తద్వారా పురోగతి
వేగవంతం కావటానికి
బాగా ఉపకరించాయి…
ఆ రోజుల్లోఈ నవీనపరిశ్రమల చీడ పీడలు లేవని
ఎవరి సామర్ధ్యానికి తగినట్టువారు శ్రమించి…
కాలుష్యాలెరుగని సమిష్టి సుఖాలను పొందుతూ
ఆనందంగా జీవించే వారని
చక్కని కవిత్వీకరణతో
చేతి వృత్తులను చూపించారు అభిరాంగారు …!
మనిషి మొదటినుండీ
సుఖాన్వేషి…
తక్కువ శ్రమతో
ఎక్కువ సుఖాలను
పొందగలిగే అవకాశాలను శోధించి సాధించుకున్నవాడే
భాషా లిపులను పరిపుష్టం చేసుకున్న తరువాత
మనిషి జీవనగతి
మరింత వేగవంతమై
మనుషులను, ప్రాంతాలను,
దేశాలను సైతం కలపగలిగే శక్తి భాష కున్నది!
మన భాషను మనం పరిరక్షించు కోవలసిన ఆవశ్యకతను
సవివరంగా చక్కని పద చిత్రాలతో మనకందించారు
తెలుగక్షరం వెలుగక్షరం…
అంటూ మాల్యాద్రి గారు …!
శ్రమ చిందించిన స్వేదం
అత్తరై పరవశింప జేస్తాయి
కర్షకులు అన్నాన్ని
ప్రాణాలను నిలబెడుతుంటే
కార్మికులు అపర బ్రహ్మలై ఈ భువికి అద్భుతానిచ్చారు.
అలాంటి కర్షక కార్మికుల కేవురకూ బ్రతుకులు భారమై పోతున్నాయి !
పొట్ట చేత పట్టుకుని వలసబ్రతుకులు
బ్రతక వలసిన దుస్థితి దాపురించింది…
అయినా తానెక్కడవుంటే దాన్నే అన్నంపెట్టిన
అమ్మలా భావించి ప్రేమించి వాటిని సున్దరోధ్యాన
వనాలుగా మారుస్తున్నారు
శ్రామికులు!
ప్రగతికి రథచక్రాలు ,
సారథులై నడిపించిన కార్మికులకు గుర్తింపు గౌరవం
కొరవడినాయని వారినోటనే ఆవేదనగా చెప్పించారు
నిర్లక్ష్యపు నీడలో వలస బ్రతుకు అంటూ
తన ఆవేదనాపూరిత కవిత్వీకరణతో రవీంద్రగారు !
బ్రతుకు భారమై …
దినం తీరక వలసపోతున్న బిడ్డలను
ఆవేదనతో గుండె చేరువై విలపించే
పల్లె తల్లిని అత్యంత వాస్తవికతతో
రూపు గట్టించారు.
పల్లె సహజ సౌందర్య వాతావరణాన్ని
ఆ నైర్మల్యాన్ని, నిఖార్సైన ప్రేమను
తన సొంపైన వర్ణనలతో మళ్ళీపల్లెకు
పూర్వవైభవం తీసుకు రావలసి ఉందని
స్వయంపాలనతో
గ్రామ స్వరాజ్యం రావాలని
దూరమైన బిడ్డలు మళ్ళీ పల్లెముఖం పట్టాలనే
పల్లె ఆవేదనను
సుస్పష్టం చేశారు
పల్లె వలసలు శీర్షికన సోమన్నగారు!
బలహీనుల్ని బలవంతులు పీడించి
దోచుకోవటం అనాదిగా వస్తున్నదే
అయినప్పటికీ ఆ రోజుల్లో
అవసరాల మేరకే అలా జరిగేవి !
రాను రాను రాజ్యాలు మొదలై
స్వార్ధ భోగ లాలసలతో యిది మరీ ఎక్కువైంది …
ఆంగ్లేయుల కాలం నాటికి
దీనికి హద్దూ అదుపూ లేకుండా పోయింది!
వారు సాటి మనుషులను
పరిశ్రమలకు ముడిసరకులుగా
శ్రమించే కూలీలుగానే
గుర్తించారు వాళ్ళు
ఫిరంగిశక్తి ,కుయుక్తులతో…
భరతఖండాన్ని
దోచుకున్నారంటూ …
ఈ దేశానికి ఎన్నోదేశాలు వలసవ్యాపారానికి వచ్చినప్పటికీ
ఆంగ్లేయుల ధాటికి నిలువలేకపోయారని
సూదిలా ప్రవేశించి గునపంలా తయారై ఈ దేశ భాగ్యాన్ని, సౌభాగ్యాన్నీ
పెల్లలు పెళ్లలుగా పెకలించుకు పోయారని
ప్రాంతీయ అనైక్యతను ఆసరాచేసుకుని
ఏకచ్ఛత్రాధి పతులయ్యారని
ఎన్నో తిరుగుబాటు యుద్దాలు జరిగినా
ఫలితంలేకపోయిందని
చివరకు భారతదేశం విక్టోరియారాణి
మోచేతిక్రిందికి వచ్చేసిందని… సవివరంగా విశ్లేషించారు
ఖాదర్ వలీ బాబూజీ గారు..
(సశేషం)
***
(వచన కావ్యం)
నిర్వహణ: చివుకుల శ్రీలక్ష్మి
పుటలు: 546, వెల: ₹ 500
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి
20-24-18, వెంకటేశ్వర కాలనీ, వసంత్ విహార్ దగ్గర,
విజయనగరం ఆంధ్రప్రదేశ్ 535002, ఫోన్: 9441957325