ఆది నుంచి… అనంతం దాకా… – పుస్తక విశ్లేషణ-2

1
9

[dropcap]సా[/dropcap]గిపోతున్న కాలప్రవాహాన్ని అక్షరబద్ధం చేసి ముందు తరాలకు అందించ వలసిన బాధ్యతతో చివుకుల శ్రీలక్ష్మి గారు 116 కవులతో 129 అంశాలపై కవితలు వ్రాయించి ‘వచనకావ్య రచనా వేదిక’ ద్వారా పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆ పుస్తకంలోని ఆరు అధ్యాయాలలోని కవితలపై కోరాడ నరసింహారావు గారు అందిస్తున్న విశ్లేషణలో ఇది రెండవ భాగం. మొదటి భాగం ఇక్కడ చదవవచ్చు.

***

మూడవ అధ్యాయ గుణ ప్రశంస

యుగ యుగాల నుండీ…
తర తరాల
పరంపరానుగతంగా వస్తున్న మన విశిష్ట
ఆచార, సాంప్రదాయాల
జీవన విధానంలో
నిగూఢంగా నిక్షిప్తమై వున్న అద్భుత విషయ విశేషాలతో పాటు…
మానవ ప్రపంచానికే మార్గదర్శకాలను అందించిన
మన భారతీయ జీవన విధాన విశ్లేషణలతో
గొప్పగా మూడవ అధ్యాయాన్ని ప్రారంభించారు …
భారతీయ జీవన సరళి అనే శీర్షికతో లలితగారు !

మానవజన్మకు అంతిమ లక్ష్యమైన ఆత్మ… పరమాత్మను చేరటమనే విషయాన్ని…
మార్గాలెన్నున్నా, అవి ఏవైనా నదులన్నీ చివరకు చేరేది సాగరానికే అన్నట్టు…
మతాలు వేరైనా విధానాలు ఏవైనా …
ఆ సర్వేశ్వరుని ప్రాప్తియే లక్ష్యంగా బ్రతికిన
భక్తులచరితలతో… భక్తిని ఒక ఉద్యమంగా
ప్రపంచపు నలు దిశలా వ్యాపింప జేసిన
యోగుల, సిద్ధుల జన్మభూమి మన భారతావని యని …
చక్కని వివరణలతో
పొందుపరచి అందించారు
భక్తి యుగాన్ని
వెంకటలక్ష్మి గారు

జీవుడు వేరు, దేవుడు వేరని ద్వైతమంటే
జీవుడు, దేవుడు వేరు
కాదని అద్వైతం వాదిస్తే… ఏకమానేకం …
అనేకమేకమే జీవ బ్రహ్మల సంబంధం
అంటూ వివరించిన
విశిష్టాద్వైత వైశిష్ట్యాన్నీ… రామానుజుల ఔన్నత్యాన్నీ
చక్కని చిక్కని గేయకవితతో
కీర్తించారు రామకృష్ణ గారు …!

ఈ నేలపై రాజ్యాలు పురుడు పోసుకున్నది
మొదలు…
అనేక రాజులు, చక్రవర్తులు
వారి వారి ప్రాభవాన్ని
చాటుకుంటూనే
వచ్చారు! వారిలో
ఉత్తరదేశ ఏలికలలో
రాజపుత్రుల కాలం చిరస్మరణీయమే…
వారి ఉత్తమపరిపాలన… సాహిత్యపోషణ కళల ప్రోత్సాహం
భాషోద్ధరణలతో విద్యా వికాసానికి వారికృషి …
మొదలైన విషయాలన్నీ
సవివరంగా వారి వీరోచిత చరిత్రను…
రాజపుత్రుల వైభవం… అనే శీర్షికతో మనకందించారు …
సంతోషి గారు !

కాకతీయుల వైభవాన్ని … వికసింప జేసిన
వారి శిల్పకళా సోయగాన్నీ… వారి శౌర్య ప్రతాపాలను…
సుపరిపాలనను… సంగీతసాహిత్యాలలో సామ్రాట్టులైన
వారి గొప్పతనాన్నీ… హరి హర భక్తిసఖ్యతను మొత్తం
ఆ విశేషాలనన్నింటినీ
కాకతీయ వైభవం పేరుతో …
సవివర పద చిత్రాలతో దర్శింప జేశారు చక్రవర్తి గారు!

ఇటు… దక్షిణాన విజయనగర సామ్రాజ్య వైభవము వర్ణనాతీతము…
విజయనగర సామ్రాజ్య నిర్మాణ విశేషాలతో మొదలై
సంగమ, సాళువ, తుళువ వంశముల పాలనలను…
ప్రత్యేకించి కలానికీ, కత్తికి సమానమైన విలువనిచ్చారనీ…
అంగడి రత్నాల రాసులు పోసి అమ్మిన ఎంతటి
వైభవమైనా… శాశ్వతము కాదన్న విషయాన్ని
ఎరుకపరచే విధంగా …వారి ఖ్యాతిని ఈ భూమిపై విడచి
మరలినారన్న విషయాన్ని… సవివరముగా
విజయనగర సా మ్రాజ్య వైభవమును పేరిట కవిత్వీకరించి అందించారు నాగ మల్లేశ్వరం గారు

ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ చక్రవర్తీ
అంటూ కీర్తింపబడిన కృష్ణరాయలనే
ప్రత్యేకించి… చిరయశస్వి అనే శీర్షికతో…
కొనియాడారు అనురాధ గారు … వీరు
ఓ తుళువ వంశ సంజాతా అంటూ మొదలుపెట్టి…
వారిపాలనా చాతుర్యాన్ని…
అష్టదిగ్గజ కవిపోషకత్వాన్నీ…
స్వయం కవియై కవనాన్ని నెరపిన విధానాన్ని
వారి దేవాలయాల పునరుద్ధరణ, పోషకత్వాలను…
మొదలైన విషయాలనన్నింటినీ సవివరంగా పొందుపరిచారు .

పద్య, గద్య, చంపూ ప్రక్రియల వివిధ కావ్యములతో… పదహారవ శతాబ్ది
విరాజ మానమైనది
అష్టాదశ వర్ణనలతో
శృంగార వీరరసాల ప్రాధాన్యతన నవరసాలతోచ్ఛందోలంకారాలసొగసులతో …
పాండితీప్రకర్షకు నిదర్శనంగా అలరారింది
ఈ నేల తెలుగు వెలుగులతో ప్రబంధయుగంగా …
స్వర్ణయుగమైభాసిల్లింది…
ఆ విశేషాల నన్నింటినీ సవివరంగా… తమకవితా
ప్రవాహంతో ముంచెత్తారు … విలక్షణయుగం ప్రబంధయుగమంటూ…
శిరీషారఘురామ్ గారు !

అష్టావధానం, శతావధానం,
సహస్రావధానం, అంటూ అనేక
అవధాన ప్రక్రియలతో నేడు అలరారుతున్న
ఈ అవధాన ప్రక్రియను
శబ్దబ్రహ్మవిద్య అంటూ కొనియాడి …
శ్రవణ, స్మరణ, మనన ధారణలతో…
ఈ అద్భుత ప్రక్రియ కేవలము మన తెలుగు భాషకే సొంతమని సగర్వంగా చాటుతూ…
ఆ విషయాలన్నీ… సవివరంగా తన గేయరూప విన్యాసంతో…
మనల్ని ఆస్వాదించమంటున్నారు
సత్యసందీప శర్మ గారు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here