ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-19

0
10

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

160. శ్లో.

శరేణ ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితమ్।

ఇహ ప్రవ్రాజితో యుక్తః తాపసోహం సమాహితః॥

వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరమ్।

గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకమ్॥

అపి రామసహస్రాణి భీతః పశ్యామి రావణ!।

రామభూతమిదం సర్వమ్ అరణ్యం ప్రతిభాతి మే॥

రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప!।

దృష్ట్వా స్వప్నగతం రామమ్ ఉద్భ్రమామి విచేతనః॥

రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ!।

రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే॥

అహం తస్య ప్రభావజ్ఞో న యుద్ధం తేన తే క్షమమ్।

బలిం వా నముచిం వాపి హన్యాద్ధి రఘునందనః॥

రణే రామేణ యుద్ధ్యస్వ క్షమాం వా కురు రాక్షస।

న తే రామకథా కార్యా యది మాం ద్రష్టుమిచ్ఛసి॥

(అరణ్యకాండ, 39. 13-19)

మారీచుడు గతంలో దండకారణ్యంలోను, ఇతరత్ర శ్రీరామునితో గల పూర్వానుభవమును రావణునితో తెలుపుతూ ఇలా అన్నాడు:

శ్రీరాముని శరముల తీవ్రతను రుచి చూసి యున్నాను. ప్రాణాలతో బయటపడి తిన్నగా ఈ ఆశ్రమాన్ని చేరుకున్నాను. పశ్చాత్తాపంతో మునుపటి దుష్కార్యములను వదిలి పెట్టాను. సదాచారంతో ఉన్నాను. తపస్సు ఆచరిస్తున్నాను. జటావల్కలములతోనున్న శ్రీరాముడు అప్పటి నుండి చెట్టు నందు, పుట్టలందు కనిపిస్తున్నాడు. ఓ రావణా! రాముడు ఒక్కడే ఐనా వేలకొలది రాములున్నట్లు కనిపిస్తున్నాడు. ఆశ్రమమంతా ఆయనే ఉన్నాడు. నిద్రలో కలలో కూడా ఆయనే ఉన్నాడు. రామభయము పట్టుకున్న నాకు రత్నములు, రథముల రకారాది పదములు వినబడ్డా భయం వేస్తున్నది.

ఆ శ్రీరాముడు బలి చక్రవర్తిని గానీ, నముచిని గానీ వధింప సమర్థుడు. అందుచేత ఆయనతో యుద్ధం వద్దు. చేతనైతే శ్రీరామునకు ఎదురుగా నిలచి యుద్ధం చేయి. సీతను దొంగతనంగా అపహరించు ప్రయత్నం వద్దు. నన్ను మరల జీవితునిగా చూడదలచినచో రాముని గురించి ప్రస్తావనయే వద్దు!

ఇది ఎంతో ఆలోచించవలసిన అంశం. మాయావి, రాక్షసుడు ఐన మారీచునిలో ‘రామభయం’ ఆవహించి ‘రకారం’ కూడా రామతత్వాన్ని అతనిలో నింపేసి సాత్వికత, తపస్సు వైపు దారి మళ్లించింది. రామనామం యొక్క మహిమ అరణ్యమంతా అప్పటికే వ్యాపించి భయం ద్వారా మారీచుని రామతత్వంలోకి తీసుకుని వెళ్ళి మోక్షద్వారం దగ్గర నిలబెట్టడం అద్భుతమైన విషయం!

రామనామ స్మరణ లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి అలా జరగటానికి కారణం ఏదైనా కావచ్చును, కానీ ఫలితం అంతఃకరణ శుద్ధి, ఆత్మోద్ధరణ వైపుకు తీసుకుని వెళ్ళే తపస్సు లభిస్తుందన్నది అక్షర సత్యం!

161. శ్లో.

తం పథ్యహితవక్తారం మారీచం రాక్షసాధిపః।

అబ్రవీత్ పరుషం వాక్యమ్ అయుక్తం కాలచోదితః॥

దోషం గుణం వా సంపృష్టః త్వమేవం వక్తుమర్హసి।

అపాయం వా ప్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే॥

సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చితా।

ఉద్యతాంజలినా రాజ్ఞే య ఇచ్ఛేద్భూతిమాత్మనః॥

(అరణ్యకాండ, 40. 2, 8, 9)

మారీచుడు పలికిన హితవచనములను ప్రక్కన పెట్టి రావణుడు విధిప్రేరితుడై (కాలచోదితః) ప్రతికూల వచనములను పలికెను:

సీతాపరణ కార్యనిశ్చయములోని గుణదోషములను గూర్చియు, మంచి చెడుల గురించియు అడిగినప్పుడు తెలుపుట యుక్తము. తన క్షేమ లాభములను కోరుకునే ఏ మంత్రియైనా రాజు అడిగినప్పుడే నమ్రతతో నమస్కరించి చెప్పాలి!

162. శ్లో.

గుణదోషౌ న పృచ్ఛామి క్షమం చాత్మని రాక్షస!।

మయోక్తం తవ చైతావత్ సంప్రత్యమితవిక్రమః!॥

(అరణ్యకాండ, 40. 15)

రావణుడు: నేను తలపెట్టిన ‘సీతాపహరణ కార్యము’ మంచిదా? చెడ్డదా? అది నాకు క్షేమకరమా? కాదా? అని నేను నిన్ను అడగటం లేదు. ఓ వీరా! నేను సహాయం అడుగుతున్నాను. అంతే!

163. శ్లో.

కేనాయముపదిష్టస్తే వినాశః పాపకర్మణా।

సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర!॥

బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః।

పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః॥

తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా।

అత్రైవ శోచనీయస్త్వం ససైన్యో వినశిష్యసి॥

మాం నిహత్య తు రామశ్చ న చిరాత్ త్వాం వధిష్యతి।

అనేన కృతకృత్యోస్మి మ్రియే యదరిణా హతః॥

దర్శనాదేవ రామస్య హతం మామ్ అవధారయ।

ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవమ్॥

ఆనయిష్యసి చేత్ సీతామ్ ఆశ్రమాత్ సహితో మయా।

నైవత్వమసి నాహం చ నైవ లంకా న రాక్షసాః॥

(అరణ్యకాండ, 41. 2, 13, 16, 17, 18, 19)

మారీచుడు: నీవు సీతను అపహరిస్తే భార్యాపుత్రుల తోడను, అమాత్యుల తోడను నీవు నశించుటయే గాక నీ రాజ్యమునందలి ప్రజలెల్లరూ మృత్యువు పాలగుదురు. నీకు సర్వనాశనము తెచ్చి పెట్టు ఈ ఉపదేశము చేసిన దుర్మార్గుడెవరు?

ధర్మమార్గమున సాగిపోయే సాధువులతో చాలామంది ఇతరుల అపరాధముల కారణముగనే సపరివారంగా నశిస్తారు.

శ్రీరాముని చేతిలో నేను మరణించుట యన్నది యాదృచ్ఛికము. కానీ నీవు బుద్ధిపూర్వకముగా చేయనున్న అకృత్యము వలన నీవు, నీ సైన్యము మరణించుట యనునది మాత్రము శోచనీయము.

శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్నును చంపును. నీ చేతిలో మరణించుట కంటే నీ శత్రువు చేతిలో అనగా శ్రీరాముని చేతిలో మృతి చెందుట వలన నా జన్మ తరించును.

నేను శ్రీరాముని సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపై పడగానే నేను మరణించినట్లు భావింపుము. కానీ సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారంగా హతమగుట మాత్రము తథ్యమని తెలుసుకో.

నన్ను వెంట తీసుకెళ్ళి నీవు శ్రీరాముని ఆశ్రమము నుండి సీతను అపహరిస్తే నేను, నీవు, నీ బంగారు లంక, ఈ రాక్షసులందరును నశించుట ముమ్మాటికీ నిజము.

164. శ్లో.

తత్సారమఖిలం నౄణాం ధనం నిచయవర్ధనమ్।

మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ॥

అర్థీ యేనార్థకృత్యేన సంవ్రజత్యవిచారయన్।

తమర్థమర్థశాస్త్రజ్ఞాః ప్రాహురర్థ్యాశ్చ లక్ష్మణ॥

తదేవన్న భవేద్రక్షో వాతాపిరివ లక్ష్మణ।

మద్విధం యోతిమన్యేత ధర్మనిత్యం జితేంద్రియమ్॥

భవేద్ధతోయం వాతాపిః అగస్త్యేనేవ మాం గతః॥

(అరణ్యకాండ, 43. 32, 33, 44)

లక్ష్మణుడు మారీచుని మాయ గురించి శ్రీరామునితో చర్చించాడు. శ్రీరాముడు ఒప్పుకున్నాడు. సీత కోరిన దానిని స్వీకరిస్తూ శ్రీరాముడు నుడివిన మాట –

ఓ లక్ష్మణా! బ్రహ్మభావమును పొందిన తపస్వి సంకల్ప మాత్రము చేత పొందిన సంపద యంతయును ఉత్తమమైనదిగా భావింపబడును. ఏలనన అది లోకహితకారి యగును. రాజులకు వనములలో లభించిన ఇట్టి అమూల్యమైన ధనము ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడును. లోక కళ్యాణార్థమై ముందు వెనుకలాలోచించపక అర్థ సంపాదనకు పూనుకొనువాడే ‘అర్థి’ అని అర్థశాస్త్ర ప్రవీణులు పేర్కొందురు.

ఓ లక్ష్మణా! ధర్మనిరతుడనూ, జితేంద్రియుడునూ ఐన నా వంటి వానిని మోసగించినచో ఈ మారీచ రాక్షసుడు కూడా ఆ వాతాపి వలెనే నశించును. అగస్త్యుని చేత వాతాపి వలె నన్ను జేరిన ఇతడును యరియక తప్పదు!

శ్లో.

స ప్రాప్తకాలమ్ ఆజ్ఞాయ చకార చ తతః స్వరమ్।

సదృశం రాఘవస్యేవ హా సీతే! లక్ష్మణేతి చ॥

(అరణ్యకాండ, 44. 18)

మారీచుడు ఆ సమయమున తాను చేయవలసిన పనిని రావణుని ఆదేశానుసారం నిశ్చయించుకుని శ్రీరాముని కంఠస్వరమును అనుకరిస్తూ ‘హా సీతా! హా లక్ష్మణా!’ అని ఆర్తనాదాన్ని చేసాడు.

ఒక ప్రశ్న తలెత్తుతుది – శ్రీరాముని చేతిలో మరణించి తరిస్తానన్న మారీచుడు ఆ బాణానికి ఇక ప్రాణాలు వదిలే పరిస్థితికి తానే వచ్చాడు! ఇక మాట్లాడకుండా రామనామాన్ని జపిస్తూ ప్రాణత్యాగం చేయవచ్చును గదా? లక్ష్మణుడు పంచవటి వదిలే అవకాశమే ఉండేది కాదు కదా? రావణుని బెడద అటు మారీచునికీ లేదు, ఇటు సీతకూ లేదు..

ఇక్కడే ధర్మమన్నది కీలకం. రావణుని వ్యూహానుసారం నడుచుకోవాలన్నది ధర్మాచరణ మారీచునికి. అరణ్యంలో ప్రతి చెట్టున, పుట్టన, ఆకులో, పువ్వులో.. ప్రతి చోటా శ్రీరామనామాన్ని వింటున్నాడు మారీచుడు. ‘ర’కారంతో ఉన్న ప్రతి శబ్దమూ రామనామాన్నే అతనికి గుర్తు చేస్తోంది! ఆ స్థితిలో రామనామాన్నీ, రామతత్త్వాన్నీ ఉపాసించేవారు ఎట్టి పరిస్థితిలో ధర్మాన్ని తప్పే అవకాశం ఉండదు. అవసరం అంత కంతే ఉండదు. ధర్మాన్ని అనుసరిస్తూ శ్రీరాముని కంఠాన్ని అనుకరిస్తూ రావణవధ అనే ధర్మకార్యానికి  మార్గాన్ని ఏర్పాటు చేస్తూ తరించాడు మారీచుడు. శ్రీరామభక్తి సామ్రాజ్యమైన ఈ భరతభూమి మీద ఆ అయ్య కంఠాన్ని అనుకరిస్తూ తాదాత్మ్యం చెందిన ఏకైక భక్తుడు మారీచుడు. రాక్షసుడు ఐతే నేమి, రామ నామ మహిమ, శ్రీరామతత్త్వం ఏ సందర్భమైనా సరే, ‘ధైర్యానందసౌభ్యానికేతనమే!’

ఈ సంవాదంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి:

  1. ‘హిరణ్యవర్ణాం హరిణీం..’ అనబడే లక్ష్మీదేవి స్వరూపమైన సీత హరిణి మాయలో పడడం చిత్రంగా కనిపించినప్పటికీ శ్రీరాముడు చెప్పినట్లు ‘బ్రహ్మభావం’ గలవారు ఏది సంకల్పించినా అది ‘లోకకళ్యాణం’ కోసమే!
  2. అమ్మవారు ‘క్షుత్పిపాసా మలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహమ్’ – శ్రీసూక్తం లోని మాటను తీసుకుంటే సాక్షాత్ అమ్మవారే ఈ ప్రక్రియ ద్వారా రాక్షస మాయను, చివరకు రావణుని కూడా హతమార్చి (శ్రీరాముని ద్వారా) అలక్ష్మిని దూరం చేయబోవుచున్నదని విదితమవుతున్నది!
  3. వాతాపి అను రాక్షసుడు అగస్త్యుని తపశ్శక్తికి అసువులు బాసాడు! ఆయన అతన్ని జీర్ణింపజేసుకున్నాడు. ధర్మనిరతుడు ఐన శ్రీరాముడు ఈ కథను ఈ సందర్భంలో ఉటంకించటం అద్భుతంగా ఉంది. ఈ రాక్షసులను, వారి మాయ యావత్తును ఆయన ఈ ‘హరిణ మాయ’కు లొంగినట్లు కనిపించి ఇక హరించబోతున్నాడు అన్న అర్థం కూడా స్ఫురణలోకి వస్తున్నది!

ఉత్తరోత్తర ఆలోచిస్తే రావణుడు ‘అపహరించాడు’! శ్రీహరి పూర్తిగా ‘హరించాడు’!

165. శ్లో.

అనివార్యం బలం తస్య బలైర్బలవతామపి।

త్రిభిర్లోకైః సముద్యుక్తైః సేశ్వరైరపి సామరైః॥

హృదయం నిర్వృతం తేస్తు సంతాపస్త్యజ్యతామయమ్।

ఆగమిష్యతి తే భర్తా శ్రీఘ్రం హత్వా మృగోత్తమమ్॥

న చ తస్య స్వరో వ్యక్తం మాయయా కేన చిత్ కృతః।

గంధర్వనగరప్రఖ్యా మాయా సా తస్య రక్షసః॥

(అరణ్యకాండ, 45. 14, 15, 16)

లక్ష్మణుడు సీతతో: ముల్లోకముల వారును తిరుగులేని బలములతో కూడి వచ్చినను శ్రీరాముని బలమును నిలువరింపజాలరు. అమ్మా! నీ మనస్సును ఆధీనములో ఉంచుకొనుము. ఈ శోకమును వీడుము. నీ భర్త ఆ మృగమును వధించి శీఘ్రముగా రాగలడు.

మనకు వినబడినది శ్రీరాముని కంఠస్వరము కాదు! ఎవరో మాయా ప్రభావమున అలా పలికారు. అది ఆ మారీచ రాక్షసుడు చేసిన ఇంద్రజాలమై యుండవచ్చును!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here