ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-28

0
13

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

దదర్శ చ నగాత్ తస్మాత్ నదీం నిపతితాం కపిః।

అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియామ్॥

జలే నిపతితా గ్రైశ్చ పాదపైరుపశోభితామ్।

వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః॥

పునరావృత్తతోయాం చ దదర్శ స మహాకపిః।

ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితామ్॥

(సుందరకాండ, 14. 29, 30, 31)

..ఆ కొండ నుండి క్రిందకి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను. ఆ నది ప్రణయకుపితయైన ప్రియురాలు ప్రియుని యొడి నుండి తటాలున దిగిపోవుచున్నట్లుగా ఒప్పుచుండెను. కుపితయైన ఆ ప్రమదను తమ చేతులతో అడ్డగించి వారించుచున్న ప్రియ బంధువుల వలె, నదీ తీరమున గల చెట్ల కొమ్మలు జలములను తాకునంతగా వంగి, ప్రవాహమును అడ్డగించుచున్నవా యనునట్లు శోభిల్లుచుండెను. ప్రియసఖులు వారించి నచ్చజెప్పగా ప్రసన్నురాలై తన ప్రియుని చేరుటకు వెనుదిరిగిన కాంత వలె దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృతమైన నదిని ఆ కపివరుడు మరల గాంచెను.

శ్లో.

తాం స్మృతిమీవ సందిగ్ధామ్ బుద్ధిం నిపతితామివ।

విహతామివ చ శ్రద్ధామ్ ఆశాం ప్రతిహతామివ॥

సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ।

అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ॥

రామోపరోధవ్యథితాం రక్షోహరణకర్శితామ్।

అబలాం మృగశాబాక్షీం వీక్షమాణాం తతస్తతః॥

(సుందరకాండ, 15. 33, 34, 35)

సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రము వలెను, క్షీణించిన సంపద వలెను, సన్నగిల్లిన శ్రద్ధ వలెను, నెరవేరని ఆశ వలెను, విఘ్నములు ఎదురగుటచే నిష్ఫలమైన కార్యసిద్ధి వలెను, కలుషితమైన బుద్ధి వలెను, నిరాధారమైన అపవాదముచే దెబ్బ తినిన కీర్తి వలెను ఒప్పుచు, రావణునిచే అపహరింపబడుట వలన కృశించినదై, శ్రీరాముని ఎడబాటుకు వ్యథ చెందినదై, అబలయైన జింకపిల్ల వలె అటునిటు బిత్తరచూపులతో చూచుచున్న సీతాదేవిని మారుతి గాంచెను.

శ్లో.

అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్।

తేనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి॥

దుష్కరం కృతవావ్ రామో హీనో యదనయా ప్రభుః।

ధారయత్యాత్మనో దేహం న శోకేనావసీదతి॥

దుష్కరం కురుతే రామో య ఇమాం మత్తకాశినీమ్।

సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి॥

ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టః పవనసంభవః।

జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్॥

(సుందరకాండ, 15. 52, 53, 54, 55)

శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతియే నిండి యున్నది. సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమై యున్నది. కావున ధర్మాత్ములైన వారిరువురును జీవించియుండగలుగుతున్నారు. లేనిచో ఇద్దరూ క్షణం ఉండగలిగేవారు కారు.

మహాసాధ్వియైన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని, దుష్కర కార్యమును చేయుచున్నాడు. ఇట్టి దుఃఖస్థితిలో ఆయన ధైర్యములను కల్గియుండుట ప్రశంసావహము.

ఈమెను విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంత వరకు జీవించి యుండుట నిజముగా అశక్యమైన కార్యమే.

మారుతి సంతోషించి శ్రీరామచంద్రుని స్మరించి, ఆ ప్రభువును మిక్కిలి కొనియాడెను.

శ్లో.

హర్షజాని చ సోశ్రూణి తాం దృష్ట్వా మదిరేక్షణామ్।

ముముచే హనుమాంస్తత్ర నమశ్చక్రే చ రాఘవమ్॥

నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్।

సీతాదర్శనసంహృష్టో హనుమాన్ సంవృతోభవత్॥

(సుందరకాండ, 17. 31, 32)

అందమైన కన్నులు గల ఆ సీతాదేవిని జూచుట తోడనే ఆ హనుమంతుని నేత్రముల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. పిమ్మట ఆంజనేయుడు రాముని స్మరించి, ఆయనకు అంజలి ఘటించెను. సీతాదర్శనముతో ఆనందభరితుడై రామలక్ష్మణులకు నమస్కరించి, ఆ మహా వీరుడు ఆకుల చాటున దాగుకొని యుండెను.

శ్లో.

షడంగవేదవిదుషాం క్రతుప్రవరయాజినామ్।

శుశ్రావ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరక్షసామ్॥

(సుందరకాండ, 18. 2)

వేదవేదాంగముల యందు నిష్ణాతులును, ప్రముఖ యజ్ఞములను జేసినవారును యైన బ్రహ్మరాక్షదులు ఆ వేకువ జామున కావించుచున్న వేద ఘోషలను హనుమంతుడు వినెను.

..ఆలోచించవలసిన అంశం ఇది. రాక్షసులలో కూడా బ్రహ్మరాక్షసులు (బ్రాహ్మణుల వంటి వారు) వేద పారాయణ చేస్తారు. అదే క్రమంలో రావణుడు గూడా పౌలస్త్యుడు కావటం వలన రావణబ్రహ్మగా కీర్తింపబడ్డాడు. అంత మాత్రం చేత అతడు బ్రాహ్మణుడని, శ్రీరామునికి బ్రహ్మహత్యాదోషం వచ్చెనని నిర్ధారించుట ఎంత అసమంజసమో ఇక్కడ స్పష్టమవుతున్నది. అన్ని విధాలా రావణుడు రాక్షసుడు మాత్రమే.

శ్లో.

ఏవం చైతదకామాం తు న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి।

కామం కామశ్శరీరే మే యథాకామం ప్రవర్తతామ్॥

(సుందరకాండ, 20. 6)

రావణుడు: ఓ మైథిలీ! సహజముగా నేను కామాతురుడను. మన్మథుడు నాలో కామ వికారములను ఎంతగా రెచ్చగొట్టినను కొట్టనిమ్ము. కానీ నాపై ప్రేమ లేని నిన్ను తాకనే తాకను.

శ్లో.

శక్యా లోభయితుం నాహమైశ్వర్యేణ ధనేన వా।

అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా॥

అహమౌపయికీ భార్యా తస్యైవ వసుధాపతేః।

వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః॥

(సుందరకాండ, 21. 15, 17)

సీతాదేవి: ఎట్టి ధనాశలకు గాని, ఐశ్వర్యాది ప్రలోభములకు గాని, నేను లొంగెడిదానను గాను. సూర్యుని నుండి కాంతి వేరుగానట్లు శ్రీరాముని నుండి నేను వేరు గాను.

వేద వ్రత స్నాతకోత్సవమును ముగించుకొనిన వాడై ఆత్మజ్ఞానియైన బ్రాహ్మణునకు వేద విద్యాసంపద వలె నేను అయోధ్యాపతి శ్రీరామునకు మాత్రమే భార్యగా తగినదానను.

శ్లో.

నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః।

విధిస్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః॥

(సుందరకాండ, 22. 21)

సీతాదేవి రావణునితో: నేను ప్రజ్ఞాశాలియైన శ్రీరాముని పత్నిని, వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు. కానీ నీకు చావు దగ్గర పడినందుననే విధి ఈ విధముగా సంకల్పించెను. ఇందుకు సందేహము లేదు.

శ్లో.

ప్రియాన్న సంభవేద్దుఃఖమ్ అప్రియాదధికం భయమ్।

తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్॥

(సుందరకాండ, 26. 50)

సీతాదేవి (స్వగతం): ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు. అనగా సుఖమే కలుగును. అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును. ఇది సామాన్యుల లక్షణము. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టివారికి నా నమస్కారము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here