[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
ధర్మప్రధానస్య మహారథస్య
ఇక్ష్వాకువంశ ప్రభవస్య రాజ్ఞః।
ప్రహస్త దేవాశ్చ తథావిధస్య
కృత్యేషు శక్తస్య భవంతి మూఢా॥
(యుద్ధ కాండ, 14. 12)
విభీషణుడు ప్రహస్తునితో:
శ్రీరాముడు ఇక్ష్వాకు వంశమున అవతరించిన పురుషోత్తముడు, ధర్మనిరతుడు, మహారథుడు, రణకోవిదుడైన రాజకుమారుడు. విరాధుడు, కదంభుడు, వాలి, మొదలగు ప్రముఖులను రూపుమాపినవాడు. అట్టి మహావీరుని యెదుట దేవతలను శక్తిహీనులగుదురు.
శ్లో:
మహాపార్శ్వ నిబోధ త్వం రహస్యం కించిదాత్మనః।
చిరవృత్తం తదాఖ్యాస్యే యదవాప్తం మయా పురా॥
పితామహస్య భవనం గచ్ఛంతీం పుంజికస్థలామ్।
చంచూర్యమాణామ్ అద్రాక్షమ్ ఆకాశేగ్నిశిఖామివ॥
సా ప్రసహ్య మయా భుక్తా కృతా వివసనా తతః।
స్వయంభూ భవనం ప్రాప్తా లోలితా నళినీయథా॥
తస్య తచ్చ తదా మన్యే జ్ఞాత మాసీన్మహాత్మనః।
అథ సంకుపితో దేవో మామిదం వాక్యమబ్రవీత్॥
అద్య ప్రభృతి యామన్యాం బలాన్నారీం గమిష్యసి।
తదా తే శతధా మూర్ధా ఫలిష్యతి న సంశయః॥
(యుద్ధ కాండ, 13. 10, 11, 12, 13, 14)
రావణుడు మహాపార్శ్వునితో (మహాపార్శ్వుడు సీతాదేవితో బలవంతం చేయమని సలహా ఇచ్చాడు):
చాలా కాలం క్రితం చిన్న సంఘటన జరిగినది. ఆ రహస్యం చెబుతాను విను. బ్రహ్మదేవుని అనుగ్రహం పొందుటకై పుంజికస్థలయను అప్సరస ఆకాశంలో పోవుచుండగా ఆమెను వివస్త్రను చేసి అనుభవించాను.
ఆమె దుఃస్థితి చూసి బ్రహ్మదేవుడు ‘రావణా! ఈ క్షణం నుండి నీవు పరస్త్రీని బలవంతంగా అనుభవించినచో వెంటనే నీ శిరస్సు నూరు ముక్కలగుట తథ్యం’ అని శపించాడు.
శ్లో:
సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే।
నివేదయత మాం క్షిప్రం విభీషణ ముపస్థితమ్॥
(యుద్ధ కాండ, 17. 17)
విభీషణుడు (ఆకాశంలో నిలబడి) సుగ్రీవునితో:
సమస్త లోకములకు రక్షకుడు, పరమాత్ముడు ఐన శ్రీరామచంద్ర ప్రభువునకు ‘విభీషణుడు శరణుగోరి తమ సమీపమునకు వచ్చియున్నాడు’ అని వెంటనే విన్నవింపుము.
శ్లో:
మిత్రాటవీబలం చైవ మౌలం భృత్యబలం తథా।
సర్వమేతద్బలం గ్రాహ్యం వర్జయిత్వా ద్విషద్బలమ్॥
(యుద్ధ కాండ, 17. 24)
సుగ్రీవుడు: ప్రభూ! మిత్రులను, అడవి జాతి వారిని, పరంపరగా వస్తున్న సైనికులను, వేతనముపై వచ్చేవారిని సైనికులుగా చేర్చుకోవచ్చును. కానీ శత్రుపక్షము వారిని ఎట్టి పరిస్థితులలోనూ దరి చేరనీయకూడదు.
శ్లో:
అజ్ఞాతం నాస్తి తే కించిత్ త్రిషులోకేషు రాఘవః।
ఆత్మానం సూచయన్ జనన్ పృచ్ఛస్యస్మాన్ సుహృత్తయా॥
త్వం హి సత్యవ్రతః శూరో ధార్మికో దృఢవిక్రమః।
పరీక్ష్యకారీ స్మృతిమాన్ నిసృష్టాత్మా సుహృత్సుచ॥
తస్మాదేకైక శస్తావత్ బ్రవంతు సచివాస్తవ।
హేతుతో మతిసంపన్నాః సమర్థాశ్చ పునః పునః॥
(యుద్ధ కాండ, 17. 35, 36, 37)
శ్రీరాముడు విభీషణుని గురించి అందరినీ అభిప్రాయం అడిగాడు. అందరూ అభిప్రాయం తెలుపుతూ..
మా యెడల ఆత్మీయతతో మా గౌరవ ప్రతిష్ఠలను పెంచుతూ ఇలా మమ్మల్ని అడుగుతున్నావు. నీకు తెలియనిది ఏదీ లేదు. నీవు సత్యవ్రతుడవు. శూరుడవు. యుక్తాయుక్తములను బాగుగా ఆలోచించి నిర్ణయములను తీసుకొనువాడవు. ధర్మశాస్త్రములను చక్కగా ఎరిగినవాడవు. మిత్రులపై విశ్వాసము నుంచి వారి సూచనలను మన్నించువాడవు. స్వామీ! నీవు ఇట్టి ఉదాత్త గుణముల గలవాడవు గావున బుద్ధిమంతులు, సమర్థులు అయిన నీ సచివులందరును క్రమముగా ఒక్కొక్కరు యుక్తియుక్తములైన తమ అభిప్రాయములను తెలుపుదురు!
శ్లో:
ఋతే నియోగాత్ సామర్థ్యమ్ అవబోద్ధుం న శక్యతే।
సహసా వినియోగో హి దోషవాన్ ప్రతిభాతిమే॥
(యుద్ధ కాండ, 17. 54)
హనుమంతుడు: ఎవరినైననూ కార్యములందు నియోగింపనిదే వారి సామర్థ్యమును తెలిసికొనుట వీలు కాదు. కొత్తవారికి కార్యభారమును అప్పగించుటయు సరి కాదు.
శ్లో:
పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోషగుణావపి।
దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి।
యుక్తమ్ ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధితః॥
(యుద్ధ కాండ, 17. 57)
హనుమంతుడు: విభీషణుడు నీచుడైన రావణుని నుండి పురుషోత్తముడవైన నీ కడకు వచ్చాడు. అంతకు ముందు అతడు రావణుని లోని దోషమును, నీలోని సుగుణములను వివేచనతో గుర్తించినాడు. రావణుని యొక్క దుర్మార్గములను, నీ పరాక్రమ వైభవములను ఎరింగి యున్నాడు. కనుక అతడు ఇచటికి వచ్చుట అన్ని విధములుగా సమంజసమే!
..హనుమంతుడు లంకలో ఉండగా అతని శిరస్సును ఖండించమని రావణుడు ఆదేశించినప్పుడు విభీషణుడు దూతను వధించకూడదన్న మాట చెప్పగా, తగు రీతి శిక్షించాలని రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టించాడు. ఈ విషయం ఇక్కడ చెప్పి విభీషణుడు ధర్మాత్ముడు, మనకు మేలు చేశాడు కాబట్టి మన పక్షంలో చేర్చుకొమ్మని ఎందుకు అనలేదని అడుగుతారు.
వాస్తవానికి ఆ ఉదంతాన్ని అప్పటికే లంక నుండి తిరిగి వచ్చినప్పుడు అందరి సమక్షంలో మారుతి చెప్పి యున్నాడు. అది ఇప్పుడు మరల చెబితే తన ప్రాణాలను రక్షించాడు కాబట్టి చేర్చుకోండి అని చెప్పటం అవుతుంది.
అందరూ ఇది స్వార్థం అవుతుందని అనుకుంటారు. బదులుగా విభీషణుని విచక్షణను ఎక్కువగా ప్రతిబింబించాడు హనుమంతుడు!
శ్లో:
యస్తు దోషస్త్వయా ప్రోక్తో హ్యాదానేరి బలస్యచ।
తత్ర తే కీర్తయిష్యామి యథా శాస్త్రమిదం శృణు॥
న వయం తత్కులీనాశ్చ రాజ్యకాంక్షే చ రాక్షసః।
పండితా హి భవిష్యంతి తస్మాద్గ్రాహ్యో విభీషణః॥
(యుద్ధ కాండ, 18. 13, 14)
అన్నను వదిలి వచ్చినవాడు మనలను పరిత్యజించడన్న నమ్మకం ఏమిటి? అని సుగ్రీవుడు అడిగినప్పుడు శ్రీరాముడు చెప్పిన సమాధానం:
దుష్టుడైన రావణుడు ఇతనిని శంకించుట వలన ఇతడు తన రక్షణకై ఇచటికి వచ్చియుండవచ్చును. కనుక ఇతడు తన సోదరుని విడిచి వచ్చుట దోషము గాదు. మనము అతని వంశమున పుట్టినవారము గాము. జ్ఞాతి కాడు. శంకింపవలసిన పని లేదు. ఈ రాక్షసుడు రాజ్యమును కాంక్షించి మన వద్దకు రాలేదు. రాక్షసులలో కూడా జ్ఞానులుందురు. ఇతడు అట్టివాడే. అందువలన ఇతనిని మన పక్షములో చేర్చుకొనుట సమంజసమే.
శ్లో:
న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః।
మద్విధా వా పితుః పుత్రా: సుహృదో వా భవద్విధాః॥
(యుద్ధ కాండ, 18. 15)
శ్రీరాముడు: నాయనా! సుగ్రీవా! ప్రపంచములో భరతుని వంటి సోదరులుండరు. తండ్రికి నా వంటి పుత్రులుండరు. నీవంటి మిత్రులును ఉండరు.
..కొందరు లక్ష్మణుని వంటి సోదరులుండరు అని ఎందుకు చెప్పలేదంటారు. ఇక్కడ సందర్భం విభీషణుడు. అన్నింటినీ వదిలి శ్రీరాముడు, అయన పాదాలు శరణు అన్న భరతుని కీర్తి, దుష్టుడైన రావణుని వదిలి ‘సర్వలోక శరణ్యాయ’ అని పలికి వచ్చిన విభీషణుని కీర్తి సామాన్యమైనవి కావు.
‘లక్ష్మణుడు నా బహిర్ప్రాణం’ అని శ్రీరాముడు అదివరకే చెప్పియున్నాడు.
శ్లో:
ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయం మయా।
విభీషణో వా సుగ్రీవః యది వా రావణః స్వయమ్॥
(యుద్ధ కాండ, 18. 36)
వానరోత్తమా! సుగ్రీవా! విభీషణునకు నేను అభయమిచ్చుచున్నాను. వెంటనే అతనిని తోడ్కొని రమ్ము. అతనికే గాదు, స్వయముగా రావణుడే వచ్చి శరణు గోరినను వానికిని నేను అభయమిచ్చెదను.
శ్లో:
అవలేపః సముద్రస్య న దర్శయతి యత్ స్వయమ్।
ప్రశమశ్చ క్షమాచైవ ఆర్జవం ప్రియవాదితా।
అసామర్థ్యం ఫలంత్యేతే నిర్గుణేషు సతాంగుణాః॥
ఆత్మప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకమ్।
సర్వత్రోత్సృష్టదండం చలోకః సత్కురుతే నరమ్॥
న సామ్నా శక్యతే కీర్తిః న సామ్నా శక్యతే యశః।
ప్రాప్తుం లక్ష్మణ లోకేస్మిన్ జయో వా రణమూర్ధని॥
చాపమానయ సౌమిత్రే శరాంశ్చాశీ విషోపమాన్।
సాగరం శోషయిష్యామి పద్భ్యాం యాంతుప్లవంగమాః॥
(యుద్ధ కాండ, 21. 14, 15, 16, 17, 23)
శ్రీరాముడు సముద్రునిపై ఆగ్రహించినప్పుడు పలికినవి:
సముద్రుడు గర్వోన్మత్తుడై తన దివ్య రూపముతో ఇంతవరకును నా ఎదుటకు రాలేదు. శాంతి, క్షమ, ఋజువర్తనము, మృదుమధుర భాషణములు అనునవి సత్పురుష లక్షణములు. ఈ లక్షణములు గల వానిని గుణహీనులు, అసమర్థులు అనుకొంటారు. తనను తాను పొగుడుకొను వాడిని, దుష్టుని, నిర్దయుని, కర్తవ్యముల విషయమున వెనుకాడువాడిని, న్యాయ-అన్యాయములను విచారింపక కఠోరముగా శిక్షించువానిని ఈ మూఢ లోకము మన్నన చేయును. లక్ష్మణా! శాంత స్వభావము కలవానికి ఈ లోకమున కీర్తిప్రతిష్ఠలు ప్రాప్తింపవు. అంతే గాదు, యుద్ధరంగమున విజయము గూడ లభింపదు.
క్షణములో ఈ సముద్రాన్ని శుష్కింపజేస్తాను. అప్పుడు ఈ వానరులు అందరును నడిచియే వెళ్ళగలరు!
..శ్రీరాముడు సార్వజనికమైన జీవితసత్యాన్ని చెప్పాడు. శ్రీరాముని సరిగ్గా అర్థం చేసుకున్న వారు పైన ఉదహరించిన వ్యక్తుల పట్ల దీటుగా వ్యవహరిస్తారు. ఎందుకులేనని అనవసరమైన నమ్రత చూపించరు!
శ్లో:
మమ చాపమయీం వీణాం శరకోణైః ప్రవాదితామ్।
జ్యాశబ్దతుములాం ఘోరామ్ ఆర్తభీతమహాస్వనామ్॥
నారాచతలసన్నాదాం తాం మమాహితవాహినీమ్।
అవగాహ్య మహారంగం వాదయిష్యామ్యహం రణే॥
(యుద్ధ కాండ, 24. 45, 46)
శ్రీరాముడు: నేను శత్రు సేన యనెడి రంగస్థలమున ప్రవేశించి, నా ధనస్సు అనెడి వీణను వాయించెదను. నా బాణములే దానిని మ్రోగించు దండములు. ధనుష్టంకారములే వీణాస్వరలహరులు, రణరంగము నందలి సైనికుల ఆర్తనాదములే వీణాస్వరములకు అనుగుణముగా సాగెడి గీతాలాపములు, బాణములను విడుచునప్పుడు కలిగెడు శబ్దములే తాళములు, వీణానాదములు శ్రోతల హృదయములను అలరింపజేయును, కానీ నా ధనుష్టంకారములు, బాణ ప్రయోగ శబ్దములు శత్రువుల గుండెలను అవియజేయును.
శ్లో:
యశ్చైషోనంతరః శూరః శ్యామః పద్మనిభేక్షణః।
ఇక్ష్వాకూణామతిరథో లోకే విఖ్యాత పౌరుష॥
యస్మిన్ న చలతే ధర్మో యో ధర్మం నాతివర్తతే।
యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేదవిదాం వరః॥
యో భింద్యాద్గగనం బాణైః పర్వతా న పి దారయేత్।
యస్య మృత్యోరివ క్రోధః శక్రస్యేవ పరాక్రమః॥
యస్య భార్యా జనస్థానాత్ సీతా చాపహృతా త్వయా।
స ఏష రామస్త్వాం యోద్ధుం రాజన్ సమభివర్తతే॥
(యుద్ధ కాండ, 28. 18, 19, 20, 21)
శకుడు (రావణుని గూఢచారి, మంత్రి) శ్రీరామదండును వర్ణిస్తూ రావణునికి చెప్పిన వివరం:
రాజా! ఆ సమీపముననే శ్యామవర్ణ శోభితుడైయున్నవాడూ, శూరుడు శ్రీరాముడు వికసించిన పద్మముల వంటి కన్నులు గలవాడు, ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు. ఈయన పరాక్రమము అన్ని లోకములలోనూ ప్రసిద్ధి కెక్కినది. ఈయన ధర్మమునకు కాణాచి (అధర్మము ఈయనను దరి చేరదు).
ధర్మమును ఎన్నడూ అతిక్రమింపడు. బ్రహ్మాస్త్రమును ప్రయోగించుట యందును, ఉపసంహరించుటలోనూ సమర్థుడు, వేదవేత్తలలో శ్రేష్ఠుడు, వేద స్వరూపుడు. ఇతడు తన బాణ ప్రయోగములతో ఊర్థ్వలోకములను, అధోలోకములను చిన్నాభిన్న మొనర్పగలడు. పర్వతములను ముక్కలు ముక్కలు గావించగలడు. ఇతని కోపమునకు గురియైన వాడు మృత్యుముఖమున చేరినట్లే. ఇతడు దేవేంద్రుని వలె మిగుల పరాక్రమశాలి. నీవు దండకారణ్యము నుండి అపహరించుకుని వచ్చిన సీతాదేవి ఈ మహావీరుని భార్యయే! అట్టి శ్రీరామచంద్ర ప్రభువు యుద్ధమున నీ గర్వమణుచుటకు సిద్ధముగా ఉన్నాడు.
శ్లో:
కించిదావిగ్నహృదయో జాతక్రోధశ్చ రావణః।
భర్త్సయామాస తౌ వీరౌ కథాంతే శుకసారణౌ॥
(యుద్ధ కాండ, 29. 5)
ఈ సైన్యాన్ని జాగ్రత్తగా పరిశీలించిన రావణునికి హృదయం కొద్దిగా భీతిల్లినది! శుకసారణులు శత్రు పక్షాన్ని ప్రశంసించినందులకు కుపితుడై రాక్షసరాజు వారిని మందలించాడు.
(ఇంకా ఉంది)