ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-36

0
10

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

గిరివర మభితోను వర్తమానో హయ ఇవ మండల మాశు యః కరోతి।

తమిహ శరణమభ్యుపైహి దేవం దివసకరం ప్రభవో హ్యయం ప్రజానామ్॥

(యుద్ధ కాండ, 33. 38)

రావణుడు శ్రీరాముని మాయా శిరస్సును సీతాదేవికి చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేసాడు.

సీతాదేవి బాధపడుతున్నప్పుడు సరమ చెప్పిన మాట:

మండలాకారమున వేగముగా తిరుగు అశ్వము వలె సూర్యభగవానుడు మేరు పర్వతమునకు ప్రదక్షిణ పూర్వకముగా సంచరించును. దినకరుడైన ఆ కర్మసాక్షి సమస్త ప్రాణుల పుట్టుకకు కారణభూతుడు. ఆ స్వామి మీ వంశమునకు మూల పురుషుడు. ఆ సూర్యనారాయణ స్వామిని నీవు శరణు వేడుము.

..కోట్ల సంఖ్యలోనున్న శ్రీరామదండును, శ్రీరామ లక్ష్మణులను చూసి రావణుడు కొద్దిగా బెదిరినట్లు అర్థమవుతున్నది. మహావీరుడు అనబడే ఈయన సీతాదేవి వద్దకు వెళ్ళి మాయ చేసి ఆవిడను లొంగదీసుకునే ప్రయత్నం చేయటంలో అర్థం ఆ విధంగా శ్రీరాముడు వెనక్కి వెళ్ళిపోగలడనే కదా? యుద్ధం ఆసన్నమైనప్పుడు ఇది నిజమైన శూరుల లక్షణమేనా?

శ్లో:

తన్మహ్యం రోచతే సంధిః సహరామేణ రావణ।

యదర్థమ్ అభియుక్తాః స్మ సీతా తస్మై ప్రదీయతామ్॥

(యుద్ధ కాండ, 35. 10)

రావణుని మాతామహుడైన మాల్యవంతుడు (మంత్రి కూడా) రావణునితో చెప్పిన మాటలు:

..ఇప్పుడు ఆ ప్రభువు (శ్రీరాముడు) నీపై దండెత్తి వచ్చుట సీతాదేవి కొరకే కదా! కనుక ఆ సాధ్విని ఆయనకు అప్పగించుటయే మనకు శ్రేయస్కరము.

శ్లో:

అసృజద్భగవాన్ పక్షౌ ద్వావేవ హి పితామహః।

సురాణామ్ అసురాణాం చ ధర్మాధర్మౌ తదాశ్రయౌ॥

(యుద్ధ కాండ, 35. 12)

సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు దేవతలు, రాక్షసులను సృష్టించాడు. ధర్మము సురులను ఆశ్రయించును. అధర్మము రాక్షసులను ఆశ్రయించును.

శ్లో:

ధర్మోహి శ్రూయతే పక్షో హ్యమరాణాం మహాత్మనామ్।

అధర్మో రక్షసాం పక్షో హ్యసురాణాం చ రావణ॥

(యుద్ధ కాండ, 35. 13)

ధర్మము మంచి స్వభావము గల దేవతల పక్షమున నిలుచును. అధర్మము దుష్ట స్వభావము గల అసురుల పక్షమును వహించును అని లోక ప్రసిద్ధి.

శ్లో:

ధర్మోవై గ్రసతే ధర్మం తతః కృతమభూద్యుగమ్।

అధర్మో గ్రసతే ధర్మం తతస్తిష్యః ప్రవర్తతే॥

తత్త్వయా చరయాలోకాన్ ధర్మో వినిహతో మహాన్।

అధర్మః ప్రగృహీతశ్చ తేనాస్మద్బలినః పరే॥

స ప్రమాదావది వృద్ధస్తే ధర్మోభిగ్రసతేహినః।

వివర్థయతి పక్షం చ సురాణాం సురభావనః॥

విషయేషు ప్రసక్తేన యత్కించాత్కారిణా త్వయా।

ఋషీణామ్ అగ్నికల్పానామ్ ఉద్వేగో జనితో మహాన్॥

తేషాం ప్రభావో దుర్ధర్షః ప్రదీప్త ఇవ పావకః।

తపసా భావితాత్మానో ధర్మస్యానుగ్రహే రతాః।

ముఖ్యర్యజ్ఞైర్యజం త్యేతే నిత్యంతైస్సైర్ద్విజాతయః॥

జుహ్వత్యనగీంశ్చ విధివత్ వేదాంశ్చోచ్చైరధీయతే।

అభిభూయ చరక్షాంసి బ్రహ్మఘోషాన్ ఉదైరయన్॥

దిశోపి విద్రుతాః సర్వాః స్తనయిత్నురివోష్ణగే।

ఋషీణామ్ అగ్నికల్పానామ్ అగ్నిహోత్రా సముత్థితః॥

అదత్తే రక్షసాం తేజో ధూమో వ్యాప్య దిశో దశ।

తేషు తేషు చ దేశేషు పుణ్యేష్వేవ దృఢవ్రతైః।

చర్యమాణం తపస్తీవ్రం సంతాపయతి రాక్షసాన్॥

(యుద్ధ కాండ, 35. 14-22)

మాల్యవంతుడు: కృత యుగమున అధర్మమును అణచివేసి ధర్మము వృద్ధి చెందుతుంది. తరువాత ధర్మమును కబళించుచు అధర్మము పెల్లుబుకును. సమస్త లోకములను జయింపవలెనను కోరికతో నీవు శుభములకు మూలమైన ధర్మమును పూర్తిగా అణచిపెట్టితివి. పైగా అశోభహేతువైన అధర్మమును తలకెత్తుకుంటివి. ధర్మపక్షము వహించిన శ్రీరాముడు, ఆయన అనుచరులు మనకంటెను బలవంతులు. నీవు విచక్షణను కోల్పోయినందున అధర్మము వృద్ధి చెంది మనలను పూర్తిగా కబళించి వేయుచున్నది. దేవతలు ధర్మమును అవలంబించినందున వారి పక్షము వృద్ధి చెందుతున్నది. ఋషీశ్వరులు అగ్నిదేవుని వలె తేజోమూర్తులు. ఇంద్రియలోలుడవైన నీవు విశృంఖలముగా ప్రవర్తించి అట్టి మహాత్ములకు తీరని భయమును పుట్టించావు. ఆ ఋషుల ప్రభావము అగ్నిజ్వాలల వలె ఆర్పుటకు శక్యము కానిది. బ్రాహ్మణోత్తములు యజ్ఞములను ఆచరిస్తూ ధర్మ నిరతులై ఉంటారు. అందువలన రాక్షసులందరును గ్రీష్మంలో మేఘముల వలె చెల్లాచెదురైపోతారు. పవిత్ర ప్రదేశముల యందు దృఢవ్రతులైన మహాత్ములు ఆచరించుచుండెడి తీవ్రమైన తపస్సు రాక్షసులను పరితపింపజేయుచుండును.

శ్లో:

విష్ణుం మన్యామహే రామం మానుషం రూపమాస్థితమ్।

నహి మానుష మాత్రోసౌ రాఘవో దృఢ విక్రమః॥

(యుద్ధ కాండ, 35. 37)

ఈ వీరుడు నరుని రూపములో వచ్చిన నారాయణుడని నేను భావిస్తున్నాను. ఈ రాఘవుడు మానవమాత్రుడు కానే కాడు.

శ్లో:

ఆనీయ చవనాత్ సీతాం పద్మహీనామివ శ్రియమ్।

కిమర్థం ప్రతిదాస్యామి రాఘవస్య భయాదహమ్॥

(యుద్ధ కాండ, 36. 8)

రావణుడు: పద్మశోభలకు దూరమైన లక్ష్మీదేవి వలె ఒప్పుచున్న సీతను దండకవనము నుండి తీసుకొని వచ్చి కేవలం రామునకు భయపడి ఆమెను ఎలా అప్పగింతును?

శ్లో:

ద్విధా భజ్యేయమప్యేవం న నమేయం తు కస్యచిత్।

ఏష మే సహజో దోషః స్వభావో దురతిక్రమః॥

(యుద్ధ కాండ, 36. 11)

రావణుడు: నా శరీరం రెండు ముక్కలైనను నేను ఎవ్వరికినీ లొంగను. ఇది నాకు సహజమైన దోషము (సహజ గుణము). స్వభావమును ఎవ్వరును అతిక్రమింపజాలరు గదా!

శ్లో:

దైత్యదానవ సంఘానామ్ ఋషీణాం చ మహాత్మనామ్।

విప్రకారప్రియః క్షుద్రో వరదాన బలాన్వితః॥

పరిక్రమతి యః సర్వాన్ లోకాన్ సంతాపయన్ ప్రజాః।

తస్యాహం రాక్షసేంద్రస్య స్వయమేవ వధే ధృతః॥

(యుద్ధ కాండ, 37. 29, 30)

శ్రీరాముడు: నీచ బుద్ధి గల రావణుడు బ్రహ్మ నుండి వరములను పొంది మిగుల గర్వముతోనున్నాడు. అతడు దైత్యులకును, దానవులకును, మహాత్ములైన మహర్షులకును అపకారము చేయుచు ఆనందించువాడు, ఆ దుష్టుడు ప్రజలను బాధలకు గురిచేయుచు సకల లోకముల లోను విశృంఖలముగా ప్రవర్తించుచున్నాడు. అట్టి దుర్గార్ముడైన ఆ రాక్షసరాజును వధించుటకు నేను గట్టిగా నిశ్చయించుకొని యున్నాను.

శ్లో:

ఉత్తరం నగర ద్వారమ్ అహం సౌమిత్రిణా సహ।

నిపీడ్యాభిప్రవేక్ష్యామి సబలో యత్ర రావణః॥

(యుద్ధ కాండ, 37. 31)

శ్రీరాముడు: రావణుడు తన బలములతో గూడి లంకా నగరము యొక్క ఉత్తర ద్వారమును రక్షించుచున్నాడు గదా! కనుక నేను లక్ష్మణునితో గూడి ఆ ద్వారము కడ ఆ రాక్షసేంద్రునిపై దెబ్బ తీసి ఆ మార్గమున లంకలో ప్రవేశింతును.

శ్లో:

అథ హరివరనాథః ప్రాప్య సంగ్రామకీర్తిం

నిశిచరపతి మాజౌ యోజయిత్వా శ్రమేణ।

గగనమతి విశాలం లంఘయిత్వార్కసూనుః

హరిగణ మధ్యే రామ పార్శ్వం జగామ॥

(యుద్ధ కాండ, 40. 29)

సుగ్రీవుడు యుద్ధరంగమున రావణుని ముప్పతిప్పలు పెట్టి విజయమును సాధించిన కీర్తిని పొందెను. ఆ రవి సుతుడు విశాలమైన ఆకాశమునకు ఎగిరి వానర యోధుల మధ్య యున్న శ్రీరాముని ప్రక్కన నిలిచెను.

రావణుని భవనంలో చూసి సుగ్రీవుడు ఒక్కసారిగా మీదకి దూకి యుద్ధం చేశాడు. రావణుడు బలం పుంజుకుంటుండగా ఆకాశమునకు ఎగిరి వెనక్కు వచ్చాడు. అలా తొందరపడకూడదని శ్రీరాముడు తరువాత వారించాడు.

శ్లో:

అత్ర సామృగశావాక్షీ మత్కృతే జనకాత్మజా।

పీడ్యతే శోక సంతప్తా కృశాస్థండిల శాయినీ॥

పీడ్యమానాం స ధర్మాత్మా వైదేహీమ్ అనుచింతయన్।

క్షిప్రమ్ ఆజ్ఞాపయామాస వానరాన్ ద్విషతాం వధే॥

(యుద్ధ కాండ, 42. 8, 9)

శ్రీరామునికి లంకను చూచినంతనే స్మృతిపథమున సీతాదేవి మెదలెను.

‘మృగాక్షి యైన ఆ జానకి నా కొరకై నిరీక్షించుచు మిగుల శోకమగ్నయై, కృశించి భూతలమున శయనించుచు బాధల పాలైనది గదా!’ అని తలచుతూ శత్రువులను వధించుటకై వానరులను ఆజ్ఞాపించెను.

శ్లో:

జయత్యతి బలో రామోలక్ష్మణశ్చ మహాబలః।

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః॥

(యుద్ధ కాండ, 42. 20)

ఇది ‘జయమంత్రం’గా ప్రసిద్ధి.

వానరులు – ‘తిరుగులేని పరాక్రమశాలియైన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము, జయము. మిక్కిలి బలవంతుడైన లక్ష్మణస్వామికి జయము జయము. శ్రీరాముని అనుగ్రహమునకు పాత్రుడైన వానరేంద్రుడగు సుగ్రీవునకు జయము జయము’ అని జేజేలు పలుకుతూ సింహ గర్జనలు గావిస్తూ లంక ప్రాకారముల వైపు చకచకా సాగిపోయారు.

శ్లో:

తత్రకాంచన చిత్రాంగైశ్శరైరగ్నిశిఖోపమైః।

దిశశ్చకార విమలాః ప్రదిశశ్చ మహాబలః।

రామ నామాంకితైర్బాణైః వ్యాప్తం తద్రణ మండలమ్॥

(యుద్ధ కాండ, 44. 22)

చిత్రములైన బంగారు వన్నెలతో ఒప్పుచు అగ్నిశిఖల వలె తేజోవంతములైన తన బాణములచే మహా పరాక్రమశాలి యగు శ్రీరాముడు ఎనిమిది దిక్కులయందును వెలుగులను నింపెను. ఇట్లు ఆ రఘువరుని పేరు గల బాణములన్నియును ఆ రణరంగమున పూర్తిగా వ్యాపించాయి.

శ్లో:

సరామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగమయైః శరైః।

బిభేద సమరే క్రుద్ధః సర్వగాత్రేషు రాక్షసః।

మాయయా సంవృతస్తత్ర మోహయన్ రాఘవౌయుధి॥

అదృశ్యః సర్వభూతానాం కూటయోధీ నిశాచరః।

బబంధ శరబంధేన భ్రాతరౌ రామలక్ష్మణౌ॥

(యుద్ధ కాండ, 44. 38, 39)

ఇంద్రజిత్తు యుద్ధమున రామలక్ష్మణులపై దారుణమైన నాగాస్త్రములను ప్రయోగించి వారి శరీరములను ఎంతయో గాయపరచాడు. మాయా విద్యలో ఆరితేరిన ఇంద్రజిత్తు రణరంగమున ఎవ్వరికిని కనబడకుండ కపట యుద్ధమునకు పాల్పడి, రామలక్ష్మణులను మూర్ఛిల్లజేసి, నాగాస్త్రములతో వారిని బంధించెను.

శ్లో:

పర్యవస్థాపయాత్మానమ్ అనాథం మాం చ వానర।

సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయమ్॥

(యుద్ధ కాండ, 46. 34)

శ్రీరామలక్ష్మణులను ఇంద్రజిత్తు నాగాస్త్రంతో (శరబంధములతో) కట్టివేసినప్పుడు సుగ్రీవుడు ఎంతో భయపడ్డాడు. ఆ సమయంలో విభీషణుడు ధైర్యం చెబుతూ..

“వానర రాజా! నిన్ను నీవు నిగ్రహించుకొనుము. శరణాగతుడనైన నాకును ధైర్యమును గూర్పుము. సత్యముపై విశ్వాసముగల వారికిని, ధర్మనిరతులకు మృత్యు భయం ఉండదు” అన్నాడు.

శ్లో:

న కాలః కపిరాజేంద్ర! వైక్లబ్యమ్ అనువర్తితుమ్।

అతి స్నేహోప్యకాలేస్మిన్ మరణాయోపకల్పతే॥

తస్మా దుత్సృజ్య వైక్లబ్యం సర్వకార్య వినాశనమ్।

హితం రామపురోగణాం సైన్యానామ్ అనుచింత్యతామ్॥

(యుద్ధ కాండ, 46. 38, 39)

విభీషణుడు: ఇది అధైర్యపడుటకు సమయం కాదు. అతి ప్రేమను చూపుట వలన మృత్యువు చేరువ యగును. అధైర్యము వలన సమస్త కార్యములు దెబ్బ తినును. కనుక దానిని విడిచి పెట్టుము. ధైర్యమును అవలంబించి, శ్రీరామునకును, ఆయనను శరణుజొచ్చిన వారికిని, వానర యోధులందరికిని మేలు కలుగునట్లు ఆలోచింపుము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here