ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-42

0
8

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

యా త్వం విరహితా నీతా చలచిత్తేన రక్షసా।

దైవ సంపాదితో దోషో మానుషేణ మయాజితః॥

సంప్రాప్తమ్ అవమానం యః తేజసా న ప్రమార్జతి।

కస్తస్య పురుషార్థోస్తి పురుషస్యాల్ప తేజసః॥

(యుద్ధ కాండ, 118. 5, 6)

నిన్ను రావణుడు అపహరించి మనకు ఎడబాటు కలిగించటం విధి విలాసం. మానవునకు సాధ్యమైన పురుషార్థముతో దానిని నేను తొలగించాను. అవమానము కలిగినప్పుడు తన ప్రతాపము ద్వారా దానిని తొలగించుకొనని వాడు నిజముగా మందబుద్ధి.

శ్లో.

ప్రాప్తచారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థితా।

దీపోనేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢమ్॥

తద్గచ్ఛహ్యాభ్యానుజ్ఞాతా యథేష్టం జనకాత్మజే।

ఏతా దశదిశో భద్రే కార్యమస్తి న మే త్వయా॥

(యుద్ధ కాండ, 118. 17, 18)

పరుల ఇంట ఇంత కాలము నివసించినందుకు నీ ప్రవర్తన విషయమున నాకు సందేహము కలుగుచున్నది. నేత్రరోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నాకు నీవు ప్రతికూలవైతివి!

కనుక జానకీ! ఈ దశదిశల యందు నీవు నీ యిష్టమైన చోటకి వెళ్ళుటకు నేను అనుమతిస్తున్నాను. నీతో నాకు ఎట్టి పనియు లేదు.

..ఇది చాలా క్లిష్టమైన అంశం. ‘నేత్రరోగికి దీపకాంతి ఇష్టం లేనట్టు’ అన్న మాట కీలకం. నిన్ను శంకించకూడదు అని ఎరిగినా, అలా చేయవలసి వస్తోందని చెప్పకుండా చెబుతున్నాడు శ్రీరాముడు. ఇంతకు ముందు ఆంతరంగికుడైన ఆంజనేయుడి ద్వారా అసలు సందేశం ఇచ్చియేయున్నాడు. పరుల కోసం ఇలా పలికి తిరిగి సీతాదేవి చేత లోకం కోసం పలికింపజేసినట్లు స్పష్టమవుతున్నది. ఇది గ్రహించి సీతాదేవి లోక మర్యాద కోసం ఇరువురి మధ్య గల అన్యోన్యమైన సంబంధాన్ని చాటింది.

శ్లో.

కిం మామ్ అసదృశం వాక్యమ్ ఈదృశం శ్రోత్రదారుణమ్।

రూక్షం శ్రావయసే వీర! ప్రాకృతః ప్రాకృతామివ॥

(యుద్ధ కాండ, 119. 5)

సీతాదేవి: మహావీరా! ఒక నిమ్న శ్రేణికి చెందినవాడు, నిమ్నస్థాయి స్త్రీతో పలికినట్లు, నీవంటి వానికి తగని రీతిగా ఇట్లు కర్ణకఠోరమైన పరుష వచనములను నాతో ఏల పలుకుచుంటివి?

శ్లో.

మదధీనం తు యత్తన్మే హృదయం త్వయి వర్తతే।

పరాధీనేషు గాత్రేషు కిం కరిష్యామ్యనీశ్వరా॥

(యుద్ధ కాండ, 119. 9)

సీతాదేవి: రావణుడు నన్ను అపహరించుకుపోతున్నప్పుడు కూడా నా హృదయం నీయందే నిలచి యున్నది. నా శరీరమును ఇతరులు స్పృశించినప్పుడు అస్వతంత్రురాలినైన నేను ఏమి చేయగలను?

శ్లో.

త్వయా తు నరశార్దూల! క్రోధమేవానువర్తతా।

లఘునేవ మనుష్యేణ స్త్రీత్వమేవ పురస్కృతమ్॥

అపదేశేన జనకాత్ నోత్పత్తిర్వసుధాతలాత్।

మమ వృత్తం చ వృత్తజ్ఞ! బహు తే న పురస్కృతమ్॥

(యుద్ధ కాండ, 119. 14, 15)

సీతాదేవి: పూర్తిగా కోపములో నుండుటచే నీవు ఒక సామాన్యుని వలె నా శీల స్వభావములను విస్మరించితివి. కేవలం నిమ్నశ్రేణికి చెందిన స్త్రీ స్వభావమునే నీ మనస్సునందు నిలుపుకుని యున్నావు. సదాచారమును, సద్వర్తనమును ఎరిగినవాడా! నన్ను జనక మహారాజు పెంచి పెద్ద చేసినందున నాకు జనకుని కూతురుగా లోక ప్రసిద్ధి ఏర్పడినది. వాస్తవముగా నేను అయోనిజను. కానీ వృత్తజ్ఞుడవైన నీవు ఈ విషయమును పరిగణింపనే లేదు.

శ్లో.

స విజ్ఞాయ తతశ్ఛందం రామస్యాకారసూచితమ్।

చితాం చకార సౌమిత్రిః మతే రామస్య వీర్యవాన్॥

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ।

బద్ధాంజలి పుటా చేదమ్ ఉవాచాగ్ని సమీపతః॥

యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్।

తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః॥

యథా మాం శుద్ధచారిత్రాం దుష్టాం జానాతి రాఘవః।

తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః॥

కర్మణా మనసా వాచా యథా నాతిచరామ్యహమ్।

రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః॥

ఆదిత్యో భగవాన్ వాయుః దిశశ్చంద్రస్తథైవ చ।

అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా॥

యథాన్యేపి విజానంతి తథాచారిత్ర సంయుతామ్।

దదృశుస్తాం మహాభాగాం ప్రవిశంతీం హుతాశనమ్।

సీతాం కృత్స్నాస్త్రయో లోకాః పుణ్యామ్ ఆజ్యాహుతీ మివ॥

(యుద్ధ కాండ, 119. 21, 23, 24, 25, 26, 27, 31)

లక్ష్మణుడు దైన్యముతో శ్రీరాముని వైపు చూసాడు. శ్రీరాముని మనోవైఖరిని బట్టి ఆయన ఆంతర్యమును గమనించాడు. ఆయన అభిమతమును అనుసరించి చితిని సిద్ధపరిచాడు.

సీతాదేవి ఆ చితిని సమీపించి ఇలా అన్నది:

నా హృదయము ఒక్క క్షణమైనను శ్రీరామునకు దూరము గాక నిరంతరము ఆ స్వామి ధ్యానము నందే లగ్నమై యున్నచో లోకసాక్షి యైన అగ్నిదేవుడు అన్ని విధములుగా నన్ను కాపాడుగాక! నా చరిత్రము దోషరహితము, పవిత్రము ఐన నా పతిదేవుడు అన్యాయముగా నిరాధారమైన నిందను నాపై మోపియున్నచో లోకసాక్షియైన అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. నేను మనసా, వాచా, కర్మణా సర్వధర్మజ్ఞుడైన రాఘవుని అనుసరించి యున్నచో అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. కర్మసాక్షియైన సూర్యభగవానుడు, వాయుదేవుడు, దిక్పాలకులు, చంద్రుడు, రాత్రింబవళ్లు, ఉభయ సంధ్యలు, భూదేవి, ఇతర దేవతలు నన్ను పవిత్ర చరిత్రముగా ఎరుగుదురు. అదే రీతిగా లోకసాక్షియైన అగ్నిదేవుడు గూడ నా పవిత్ర శీలమును గుర్తించి నన్ను కాపాడుగాక.

..ముల్లోకములలోని వారందరును అగ్నిలో ప్రకాశించుచున్న మహాత్మురాలగు సీతాసాధ్విని చూచి ఆమెను ఒక పవిత్రమైన ఆజ్యాహుతిగా భావించారు.

ఆ సందర్భంలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై శ్రీరామునికి ఆయన అవతార స్వరూపాన్ని గుర్తు చేయటం ప్రారంభించారు.

అప్పుడు శ్రీరాముడు:

శ్లో.

ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్।

యోహం యస్య యతశ్చాహం భగవాంస్తద్బ్రవీతు మే॥

(యుద్ధ కాండ, 120. 12)

‘దశరథ మహారాజు తనయుడైన శ్రీరాముడిగా, సామాన్య మానవునిగా నన్ను నేను తలంతును – నేను ఎవరినో, ఎవరి వాడనో, ఎలా వచ్చానో, నా స్వరూపమేమిటి? లోకములతో నాకు గల సంబధం ఏమిటి? నా ఉనికికి ప్రయోజనం ఏమిటి?..’ అని బ్రహ్మదేవుని వివరింపమని ప్రార్థించాడు.

బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం గొప్పది. ఇక్కడ కథ లౌకికం నుంచి అలౌకికానికి చేరి తాత్త్వికంలో పూర్తిగా కనిపిస్తుంది. ఒక మానవునిలో సత్యధర్మం ద్వారా శ్రీమన్నారాయణుడు ఎలా దర్శనమిస్తాడు అన్నది ఒక అద్భుతం!

శ్లో.

అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ।

లోకానాం త్వం పరో ధర్మో విష్వక్సేనశ్చతుర్భుజః॥

శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః।

అజితః ఖడ్గధృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః॥

సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః సత్త్వం క్షమా దమః।

ప్రభవశ్చాప్యయశ్చ త్వముపేంద్రో మధుసూదనః॥

త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమోంకారః పరంతపః।

ప్రభవం నిధనం వా తే న విదుః కో భవానితి॥

దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ।

దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ॥

సీతా లక్ష్మీర్భవాన్విష్ణుర్దేవః కృష్ణః ప్రజాపతిః।

వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్॥

యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమమ్।

ప్రాప్నువంతి సదా కామానిహ లోకే పరత్ర చ॥

ఇమమార్షం స్తవం నిత్యమితిహాసం పురాతనమ్।

యే నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః॥

(యుద్ధ కాండ, 120. 15, 16, 17, 21, 22, 29, 33, 34)

బ్రహ్మదేవుడు: నీవు నాశము లేనివాడవు, పరబ్రహ్మవు. షడ్భావ వికారములు లేనివాడవు. ఆది మధ్యాంత రహితుడవు. సర్వలోకములకు శ్రేయస్సు గూర్చెడి ధర్మస్వరూపుడవు, జగన్నాథుడవు. ధర్మార్థ కామ మోక్షములనెడి చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించు వాడవు. శార్ఙ్గము అను ధనువును ధరించువాడవు. జితేంద్రియుడవు. అందరిలోని హృదయములలో నివసించువాడవు. నందకమను ఖడ్గమును ధరించువాడవు. విశ్వవ్యాపి ఐనవాడవు. నీవే బలరాముడవు, శ్రీకృష్ణుడవు (రాబోవు). దేవతల సేనకు సర్వాధిపతివి. జగదుత్పత్తికి స్థానము నీవు. ఇంద్రునకు సోదరునిగా అవతరించినవాడవు. ‘మధు’ అను రాక్షసుని సంహరించినవాడవు. యజ్ఞస్వరూపుడవు, వషట్కారుడవు, ఓంకార స్వరూపుడవు, ఉత్కృష్టమైన తపస్సులచే సేవింపబడువాడవు. నీ అనంతమైన మహిమ వలన నీ ఆవిర్భావమును గాని, తిరోభావమును గాని ఎవరూ ఎరుగరు. నీ స్వరూప స్వభావములను ఎవరూ ఎరుగలేరు.

నీవు సర్వాంతర్యామివి. గనుక బ్రాహ్మణులయందును, గోవుల యందును, సకల ప్రాణుల యందును, అన్ని దిక్కుల యందును, ఆకాశంలో, పర్వతములలో, వనములలో వ్యాపించి ఉంటావు.

సీతాదేవియే లక్ష్మీదేవి, నీవు శ్రీమహావిష్ణుడవు. రాబోవు శ్రీకృష్ణుడవు. లోకకంటకుడైన రావణుని వధించుటకై ఈ భూలోకమున మానవ రూపమున అవతరించావు.

రామా! పురాణపురుషుడవు, నిత్యుడవు, పరబ్రహ్మవు ఐన నిన్ను ప్రగాఢమైన భక్తితో సేవించిన వారికి లౌకికమైన సకల భోగములను, అలౌకికములైన మోక్షాదులు లభించును. ఈ శ్రీరామ స్తవము వేద ప్రతిష్ఠితమైనది, పురాతనమైనది, ఇతిహాసము. దీనిని కీర్తించిన (పఠించిన) మానవులకు పునర్జన్మ యుండదు. కైవల్యము ప్రాప్తించును.

~

సీతాదేవిని అగ్నిదేవుడు శ్రీరామునికి సమర్పించే ముందు శ్రీరాముడు శ్రీమహావిష్ణువుగా అందరి సమక్షంలో ప్రతిష్ఠితుడవటం గమనార్హం! ‘యజ్ఞో వై విష్ణుః’, ‘అర్ధో వా ఏష ఆత్మనః యత్ పత్నీ’ అను వేద ప్రమాణములు వివాహ ప్రక్రియను యజ్ఞంగా పేర్కొనడం విశేషం. అగ్నిసాక్షి ఎందుకు హైందవ సంప్రదాయంలో అంత ప్రాధాన్యాన్ని పొందినది, భార్య సహధర్మచారిణి ఎందుకైనది, పురుషుని తేజస్సు గార్హపత్యాగ్నిగా భార్యలో ఎందుకు గూఢమై ఉంటుందన్నది ఇత్యాదులు ఇక్కడ మనలను ఆలోచింపజేస్తాయి. ఎవరి చేతిలోనైతే కన్యను పెట్టి కన్యాదానం చేస్తామో, వారిని సాక్షాత్ శ్రీమన్నారాయణునిగా పేర్కొనటానికి పురుషుడు నిర్వహించవలసిన ధర్మబద్ధమైన పురుషార్థం ఒక కారణం. ముహూర్తుంలో లక్ష్మీనారాయణ సావధానా అని పలకటం కూడా విశేషం. లక్ష్మీదేవిని –  తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనప గామినీమ్ – అన్నారు శ్రీసూక్తంలో. అమ్మవారిని ఆవాహన చేయమని జాతవేదసుని – అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాం!

~

శ్లో.

విశుద్ధభావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీష్వ రాఘవ!।

న కించిదభిధాతవ్యమ్ అహమాజ్ఞాపయామితే॥

(యుద్ధ కాండ, 121. 11)

అగ్నిదేవుడు: రాఘవ! ఈమె హృదయం పవిత్రమైనది, ఎట్టి దోషమూ ఎరుగనిది, నా మాటలకు మారు పలకకు!

ఈమెను స్వీకరించుము, ఇది నా ఆజ్ఞ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here