ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-43

0
8

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాపమర్హతి।

దీర్ఘకాలోషితా హీయం రావణాంతఃపురే శుభా॥

బాలిశః ఖలు కామాత్మా రామో దశరథాత్మజః।

ఇతి వక్ష్యంతి మాం సంతో జానకీమ్ అవిశోధ్య హి॥

అనన్యహృదయాం భక్తాం మచ్చిత్తపరివర్తినీమ్।

అహమప్యవగచ్ఛామి మైథిలీం జనకాత్మజామ్॥

ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణాం సత్యసంశ్రయః।

ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనమ్॥

ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజసా।

రావణో నాతివర్తేత వేలామివ మహోదధిః॥

న హి శక్త స దుష్టాత్మా మనసాపి హి మైథిలీమ్।

ప్రధర్షయితుమప్రాప్తాం దీప్తామ్ అగ్నిశిఖామివ॥

నేయమ్ అర్హతి చైశ్వర్యం రావణాంతఃపురే శుభా।

అనన్యా హి మయా సీతా భాస్కరేణ ప్రభా యథా॥

విశుద్ధా త్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజా।

న హి హాతుమ్ ఇయం శక్యా కీర్తిరాత్మవతా యథా॥

(యుద్ధ కాండ, 121. 14-21)

శ్రీరాముడు: హవ్యవాహనా! సీతాదేవి యందు ఎట్టి దోషమూ లేదు. ఈమె పవిత్రురాలు – కానీ రావణుని అంతఃపురము నందలి అశోకవనము నందు చాలా కాలము ఉన్నందున ముల్లోకముల వారికిని ఈమె ప్రాతివత్యమును నిరూపించుటకై, ఈమెను మామూలుగా పరిగ్రహించినచో లోకులు ఈ దశరథ రాముడు కాయపరతంత్రుడు, మూర్ఖుడు అని నిందించగలరు. మైథిలి నాయందే తన మనస్సును నిలుపుకుని యుండునని నా చిత్తమును అనుసరించే ప్రవర్తించునని నాకు కూడా తెలుసును. సర్వదా సత్యవ్రతుడునైన నేను సీతాదేవి యొక్క శీలమును ముల్లోకాలు విశ్వసించుటకై అగ్నిప్రవేశము చేయుచున్నను చూస్తూ ఉన్నాను.

ఈ విశాలాక్షి ప్రాతివత్యమే ఈమెకు భద్రకవచము. సముద్రము గట్లు దాటలేనట్లు రావణుడు ఈమె యెడ అన్యథా ప్రవర్తించజాలడు. సీతాసాధ్వి ప్రజ్వలించుకున్న అగ్నివలె ఇతరులు తాకుటకు అసాధ్యమైనది. రావణుడు మనస్సు చేత గూడా ఈమె పట్ల ఎట్టి అఘాయిత్యమునకు పాల్పడజాలడు. సూర్యుడు, సూర్యకాంతి వేరు కానట్టు మా సంబంధం విడదీయరానిది (ఇదే మాట సీత రావణునితో పలికినది!).

నా ప్రేమ సామ్రాజ్యమునకు అధిదేవతయైన ఈ శుభాంగికి తుచ్ఛమైన రావణుని ఐశ్వర్యముతో పని లేదు. మహాత్ముడు కీర్తిని వలె ఈమెను పరిత్యజించుట అసంభవము.

..తొలుత ఆంజనేయస్వామి ద్వారా ఒక చక్కని సందేశం పంపించి తరువాత ముల్లోకాల కోసం జనబాహుళ్యంలో రాజధర్మానుసారం కొన్ని పలికి సీత చేత కొన్ని పలికించి బ్రహ్మదేవుని చేత కొన్ని చెప్పించి అగ్నిదేవుడు ఇదిగో నీ సీత – ఈమె చెక్కుచెదరదని చెప్పగా శ్రీరాముడు అసలు విషయాన్ని అందరి సమక్షంలో బహిర్గతం చేయటం విశేషం!

ఇదంతా నా భార్య ఐన సీత ప్రాతివత్య మహిమ అని లోకానికి చాటి చెప్పటం సుస్పష్టం!

‘స్వస్య ధర్మస్య, జీవలోకస్య, ధర్మస్య, స్వజనస్య, స్వజన్మస్య చ రక్షితా’ అన్న మాట ఇక్కడ మరల స్ఫురిస్తుంది. స్వధర్మం, స్వజన ధర్మం, లోక ధర్మం మూడింటిని మూటకట్టుకున్నవాడు శ్రీరాముడు! అందుకే త్యాగరాజు ఆయనను ‘జగదానందకారక, జయ జానకీ ప్రాణనాయకా!’ అన్నాడు.

లోకంలో సీత మీద మాట రాకుండా చూసుకోవలసిన ధర్మం ఎవరిది? శ్రీరామునిదే కదా?

శ్లో:

ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం రాఘవేణ సుభాషితమ్।

ఇదం శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వరః॥

పుష్కరాక్ష మహాబాహో! మహావక్షః! పరంతప!।

దిష్ట్యా కృతమిదం కర్మ త్వయా శస్త్రభృతాంవర!॥

దిష్ట్యా సర్వస్య లోకస్య ప్రవృద్ధం దారుణం తమః।

అపావృత్తం త్వయా సంఖ్యే రామ! రావణజం భయమ్॥

ఆశ్వాస్య భరతం దీనం కౌసల్యాం చ యశస్వినీమ్।

కైకేయీం చ సుమిత్రాం చ దృష్ట్వా లక్ష్మణమాతరమ్॥

ప్రాప్య రాజ్యమ్ అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనమ్।

ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల!॥

ఇష్ట్వా తురగమేధేన ప్రాప్య చానుత్తమం యశః।

బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా త్రిదివం గంతుమర్హసి॥

(యుద్ధ కాండ, 122. 1-6)

పరమశివుడు శ్రీరామునితో:

శ్రీరామా! నీ వక్షస్థలము లక్ష్మీ నివాసము. నీవు ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు. రావణుని భయమనెడి చీకట్లను యుద్ధము ద్వారా రూపుమాపితివి. భరతుని ఊరడింపు. కౌసల్య మాతను ఓదార్పుము. కైకేయిని, సుమిత్రని భక్తితో దర్శించి అనునయింపుము. అయోధ్యా రాజ్యమునకు పట్టాభిషిక్తుడవై అందరినీ ఆనందింపజేయుము.

పుత్రపౌత్రాది పరంపరతో ఇక్ష్వాకు వంశమునకు వన్నె దెచ్చిపెట్టుము. అశ్వమేధాది యజ్ఞములను ఆచరించి కీర్తిని గడింపుము. బ్రాహ్మణులను దానదర్మముల ద్వారా సంతోషపరుచుము. ఇలా చక్కని పరిపాలన ద్వారా ధర్మ సంస్థాపనమొనర్చి పిమ్మట పరంధామమునకు చేరుము.

..ఈ విషయాలు ఉత్తరకాండలో వివరించిన అంశాలు. ఇవి ఇక్కడ ప్రస్తావించినప్పుడు వాటి వివరాలు మహర్షి చెప్పకుండా యుద్ధకాండతో కావ్యం ఎలా పూర్తి చేస్తాడు?

శ్లో.

ఇదానీం తు విజానామి యథా సౌమ్య సురేశ్వరైః।

వధార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ॥

(యుద్ధ కాండ, 122. 18)

దశరథుడు విమానంలో వచ్చి శ్రీరాముని ఒడిలోకి చేర్చుకుని కౌగిలించుకున్నాడు. ‘నీకు దూరమైన నాకు స్వర్గసుఖములు గానీ, దేవర్షుల సన్మానములు గానీ రుచింపవు’ అన్నాడు. తరువాత దశరథుడు ‘నీవు రావణుని వధించుట కొరకై దేవతా ప్రముఖులు ఇలా నీ పట్టాభిషేకమునకు విఘ్నాదికములను కల్పించారని నాకు అర్థమైనది’ అన్నాడు.

శ్లో.

కురు ప్రసాదం ధర్మజ్ఞ! కైకేయ్యా భరతస్య చ।

సపుత్రాం త్వాం త్యజామీతి యదుక్తా కైకయీ త్వయా॥

(యుద్ధ కాండ, 122. 26)

శ్రీరాముడు: “ధర్మాత్మా! కైకేయి యెడలను, భరతుని పైనను అనుగ్రహము చూపుము. నీవు ఇంతకు ముందు ఆ దేవితో ‘నిన్ను, నీ పుత్రుడైన భరతుని కూడా త్యజించుచున్నాను’ అని ఆగ్రహ వచనములను పలికియున్నావు. ఆ శాపము ఇరువురిని తాకకుండు గాక.” అని అన్నాడు. దశరథుడు అంగీకరించాడు.

శ్లో.

ఏతే సేంద్రాస్త్రయో లోకాః సిద్ధాశ్చ పరమర్షయః।

అభిగమ్య మహాత్మానమ్ అర్చంతి పురుషోత్తమమ్॥

ఏతత్ తదుక్తమవ్యక్తమ్ అక్షరం బ్రహ్మనిర్మితమ్।

దేవానాం హృదయం సౌమ్య! గుహ్యం రామః పరంతపః॥

కర్తవ్యో న తు వైదేహి! మన్యుస్త్యాగమిమం ప్రతి।

రామేణ త్వద్విశుద్ధ్యర్థం కృతమేతద్ధితైషిణా॥

(యుద్ధ కాండ, 122. 31, 32, 35)

లక్ష్మణుని పొగడి, అతని కీర్తి ప్రతిష్ఠలు భూమి మీద చిరస్థాయిగా ఉంటాయని చెప్పి ‘శ్రీరాముడు ఇంద్రాది దేవతలును, సిద్ధులు, మహర్షులు మొదలగు వారి చేత నిరంతరం సేవింపబడతాడు. శ్రీరాముడు సర్వదేవతలతో అంతర్యామిగా ఉంటాడు, వేదవేద్యుడు, భక్తిహీనులకు తెలియనివాడు. ఆ పరబ్రహ్మమే శ్రీరామునిగా అవతరించాడు. ఆయనను సేవించిన నీకు (లక్ష్మణునకు) అపారమైన కీర్తి, ధర్మాచరణ ఫలము లభించినది’ అన్నాడు దశరథుడు.

సీతతో.. ‘వైదేహీ! శ్రీరాముడు మొదట నిన్ను స్వీకరించనందులకు ఆయనపై కినుక వహించకుము. ఎల్లప్పుడు నీ హితమును కోరుచుండెడి ఇతను నీ పవిత్రత వెల్లడించుటకే అలా చేసాడు. అమ్మా, జానకీ! పతి సేవల గురించి నీకు చెప్పనవసరం లేదు. ఇతడు నీకు పరమదైవము అని మాత్రము చెప్పవలసి యున్నది!’ అన్నాడు.

శ్లో.

న త్వం సుభ్రు సమాధేయా పతిశుశ్రూషణం ప్రతి।

అవశ్యం తు మయా వాచ్యమేష తే దైవతం పరమ్॥

(యుద్ధ కాండ, 122. 36)

ఆ తరువాత విమానముపై దశరథుడు స్వర్గలోకానికి వెళ్ళాడు.

ఇంద్రుడు ఏదైనా సహాయం చేయాలా అని అడిగినప్పుడు ‘ఇంద్రా, వానరయోధుల, గోలాంగూల శ్రేష్ఠుల, భల్లూక వీరుల గాయములు మాన్పి వారిని ఆరోగ్యవంతులను గావింపుము. మృత్యువు పాలైన వానరులు నీవు అనుగ్రహించినచో సజీవులై తమ వారిని సంతోషముతో కలుసుకుందురు గాక’ అని శ్రీరాముడు అడిగినప్పుడు ‘అలాగే’ అన్నాడు ఇంద్రుడు.

శ్లో.

ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః।

సేతుబంధ ఇతి ఖ్యాతం త్రైలోక్యేనాభిపూజితమ్॥

ఏతత్ పవిత్రం పరమం మహాపాతక నాశనమ్।

అత్ర పూర్వం మహాదేవః ప్రసాదమ్ అకరోత్ ప్రభుః॥

(యుద్ధ కాండ, 126. 16, 17)

పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరి ప్రయాణిస్తుండగా సముద్ర తీరంలో గల క్షేత్రాన్ని చూపిస్తూ శ్రీరాముడు సీతతో – “ఈ ప్రదేశము మహిమాన్వితమైన సాగరం యొక్క ఉత్తర తీరము. దీనిని ‘సేతుబంధము’ అని పిలుస్తారు. సేతు నిర్మాణము ఇక్కడి నుండే ప్రారంభమైనది. ఇది ఒక మహాపుణ్యక్షేత్రము. దీనిని దర్శించినవారి సమస్త పాపములును నశించును. పూర్వము ఈ పవిత్ర దేశమునందే పరమశివుడు నన్ను అనుగ్రహించెను. రాక్షస రాజైన విభీషణుడు నన్ను శరణుజొచ్చినది ఇక్కడే..” (అత్ర రాక్షసరాజోయమ్ అజగామ విభీషణః) అన్నాడు.

..కూర్మపురాణంలో లంకకు జేరేముందు శ్రీరాముడు పరమశివుని సేవించుకున్న తరువాత పార్వతీపరమేశ్వరుల దర్శనం చేసుకుని వారి అనుగ్రహం పొందినట్లు చెప్పటమైనది. రావణసంహారం తరువాత అన్నది పద్మపురాణంలోని అంశం. వాల్మీకి మహర్షి తెలిపినట్లు లంకకు ప్రయాణమయ్యే ముందరే సేవించుకున్న విషయం కూర్మ పురాణంతో సమన్వయమగుచున్నది.

ఇక్కడ ‘సేతుబంధము’ అన్న మాట ఈ క్షేత్రానికి శ్రీరాముడే ఆపాదించటం విశేషం. ఆ సేతువు శ్రీరాముడు కట్టించిన సేతువు గురించి కాదు. ఈ క్షేత్రం రామాయణ కాలానికంటే ముందరే ఉన్న దివ్య జ్యోతిర్లింగం. అక్కడ లంక వైపుగా సహజంగానే భూమిలో ఒక సేతువుగా మనం చూడవచ్చు – ఇది పూర్తిగా లంకను తాకదు. ఆ సహజమైన సేతువును కలుపుకుని ఈ క్షేత్రాన్ని సేతుబంధ క్షేత్రం అన్నారు.

వాల్మీకి రామాయణంలో శ్రీరామునికి బ్రహ్మహత్య దోషం గురించి ప్రస్తావన లేదు! పరమశివుడు కూడా రావణుని ‘రాక్షసరాజా’ అన్నాడు కానీ ‘రావణబ్రహ్మ’ ఇత్యాది బిరుదులతో పిలువలేదు. మహర్షులను, బ్రాహ్మణులను హింసించి, హింసింపజేసి యజ్ఞయాగాదులు ధ్వంసం చేసి, చేయించిన రావణుడు కేవలం జన్మ చేత బ్రాహ్మణుడై శ్రీరాముడు అతన్ని వధిస్తే, బ్రహ్మహత్యా దోషం పొందటం హాస్యాస్పదం.

అదే నిజమైతే కుంభకర్ణుని వధ వలన కూడా ఆ దోషం రావాలి కదా?

మరి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ సంగతి ఏమిటి? శివాలయంలో, ముఖ్యంగా గొప్ప క్షేత్రంలో శివుని అర్చించుకునే విధానంలో శివలింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయటం ఒక ఆచారం. లంకకు బయలుదేరేముందు ఇక్కడ ఆ ఆచారాన్ని పాటించినట్టు సీతతో చెప్పటమైనది.

కాలక్రమంలో ఈ క్షేత్రం శ్రీరాముని వలన, రామాయణం వలన రామేశ్వరమని ప్రసిద్ధి గాంచినది!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here