ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-48

0
10

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

శ్లో:

సా త్వం త్యక్తా నృపతినా నిర్దోషా మమ సన్నిధౌ।

పౌరాపవాదభీతేన గ్రాహ్యం దేవి న తేన్యథా॥

రాజ్ఞో దశరథస్యైష్టః పితుర్మే మునిపుంగవః।

సఖా పరమకో విప్రో వాల్మీకిః సుమహాయశాః॥

పాదచ్ఛాయామ్ ఉపాగమ్య సుఖమస్య మహాత్మనః।

ఉపవాసపరైకాగ్రా వస త్వం జనకాత్మజే॥

(ఉత్తరకాండ, 47. 13, 16, 17)

లక్ష్మణుడు సీతాదేవిని గంగానది ఆవలి తీరానికి దాటించి: “దేవీ! నీలో ఎట్టి దోషమూ లేదని నాకు తెలుసు. నీవు అగ్నిపునీతవు. అట్టి నీపై పౌరులు మోపిన అపవాదమునకు వెరచి ప్రభువు నిన్ను త్యజించెను. మరొక కారణం ఏమీ లేదు!

బ్రాహ్మణోత్తముడైన వాల్మీకి మహర్షి ఈ ఆశ్రమమునందే నివసించుచున్నాడు. అతడూ మా తండ్రియైన దశరథ మహారాజునకు ఎంతో ఇష్టమైనవాడు, మిత్రుడు, దయాళువు. అమ్మా జానకీ! ఆ మహర్షి పాదములను ఆశ్రయించి హాయిగా ఉండుము. ఉపవాస వ్రతమును ఆచరిస్తూ ధ్యానమగ్నురాలవై ఇక్కడ నివసింపుము!” అన్నాడు.

శ్లో:

అహం త్యక్తా త్వయా వీర ఆయశోభీరుణా జనే।

యచ్చతే వచనీయ స్యాదపవాదసముత్థితమ్॥

మయా చ పరిహర్తవ్యం త్వం హి మే పరమాగ్ గతిః।

వ్యక్తవ్యశ్చేతి నృపతిర్ధర్మేణ సుసమాహితః।

యథా భ్రాతృషు వర్తథా స్తథా పౌరేషు నిత్యదా॥

పరమో హ్యేష ధర్మస్తే తస్మాత్కీర్తిరనుత్తమా।

యత్తు పౌరజనే రాజన్ ధర్మేణ సమవాప్నుయాత్॥

అహంతు నానుశోచామి స్వశరీరం నరర్షభ।

యథాపవాదః పౌరాణాం తథైవ రఘునందన।

పతిర్హి దేవతా నార్యాః పతిర్భంధుః పతిర్గురుః॥

ప్రాణైరపి ప్రియం తస్మాద్భర్తుః కార్యం విశేషతః।

ఇతి మద్వచనాద్రామో వక్తవ్యో మన సంగ్రహః॥

నిరీక్ష్య మాద్య గచ్ఛ త్వమృతుకాలాతివర్తినీమ్।

(ఉత్తరకాండ, 48. 13, 14, 15, 16, 17, 18)

సీతాదేవి లక్ష్మణునికి శ్రీరామునికై చెప్పిన మాట:

“నలుగురిలో అపకీర్తి పాలగుదనను భయంతో నన్ను త్యజించి దిక్కులేని దానినిగా చేసితివి. లోకాపవాదము వలన నీపై వచ్చిన అపనిందను నేనే తొలగింపవలసి యున్నది. ఎందుచేతనంటే నీవే నాకు పరమాగతి. నిత్యము ప్రజలను, నీ సోదరుల వలె ఆత్మీయతతో చూచుకొనుము. దీని వలన నీకు శాశ్వతమైన కీర్తి లభించును. నీ ధర్మనిరతిని బట్టి ప్రజలును ధర్మపరాయణులగుదురు. నా శరీరం గురించి ఏ మాత్రమూ చింతించను.

పౌరులలో అపరాధభావము ఏర్పడకుండా మెలగాలి. స్త్రీకి మాత్రము పతియే దైవము, బందువు, గురువు!

పతి ఆమెకు ప్రాణముల కంటే మిన్న. కనుక స్త్రీ ప్రత్యేకముగా ఆయన ఆజ్ఞనే నెరవేస్తూ ఉండాలి. ఈ విషయములన్నింటినీ ఆయనకు చెప్పు. నేను గర్భవతినను విషయమును పట్టించుకొనక ఇప్పుడే వెళ్ళు!”

..’అపనిందను నేనే తొలగింపవలసి యున్నది’ అని సీతాదేవి పలకటం విశేషంగా గమనించాలి. రాజధర్మంలో ఆమె నిర్వహించ వలసిన పాత్రను గుర్తించి చెప్పిన మాట అది. ఆ రాజ ధర్మమనునది ‘సత్యస్వరూపం’గా శ్రీరాముడు తెలిపియున్నాడు. దాని ముందు ఇతర విషయాలు చాలా చిన్నవన్నది స్పష్టం చేస్తూ సీతమ్మ లక్ష్మణునితో ‘నేను గర్భవతిని అన్న సంగతి పట్టించుకోక వెళ్ళుము’ అన్నది.

లక్ష్మణుడు నీ పాదాలను తప్ప నేను నీ వదనమును ఏ రోజూ చూడలేదని ఈ సందర్భంలో చెప్పాడు.

అన్న, వదిన ఇద్దరూ ధర్మపాలనలో ఏ స్థాయి వారో ఆయనకు తెలుసును! ‘శ్రీరాముడు నీతో లేని నిన్ను ఈ వనములో ఎలా చూడగలను?’ అన్నాడు!

శ్లో:

త్వాం చైవ మైథిలీం చైవ శత్రుఘ్నభరతౌ ఉభౌ।

సంత్యజిష్యతి ధర్మాత్మా కాలేన మహతా మహాన్॥

(ఉత్తరకాండ, 50. 12)

శ్రీరాముడు సీతాదేవిని పరిత్యజించినప్పుడు లక్ష్మణుడు సుమంత్రుని వద్ద బాధపడ్డాడు. సుమంత్రుడు “ధర్మాత్ముడైన ఆ మహాపురుషుడు సీతాదేవినే కాదు, కొంత కాలం తరువాత నిన్ను, భరత శత్రుఘ్నులను సైతం త్యజించును” అన్నాడు.

..ఈ విషయం దుర్వాసుడు దశరథుడికి చెప్పినప్పుడు సుమంత్రుడు విన్నాడు. ఈ మాట గోప్యంగా ఉంచమని దశరథుడు తెలిపాడు. అయినప్పటికీ లక్ష్మణుని ఆవేదన చూసి ఆ రహస్యం తెలిపాడు. మహావిష్ణువు భృగుమహర్షి భార్యను వధించటం, భృగువు శపించటం వంటివి కూడా తెలిపాడు.

ఉత్తరకాండలో ఈ అంశాలు ప్రక్షిప్తాలా కావా అనునవి చర్చలోకి రావచ్చును. పాత్రల దృష్ట్యా దశరథుడు అన్నీ తెలిసి ఎలా బాధపడ్డాడు అని ఆలోచించినప్పుడు కథలోని రసపుష్టి హీనమవుతుందనే ఆలోచన కలుగుతుంది. కౌసల్య ఆయనను ప్రశ్నించినప్పుడు శ్రవణకుమారుని ఉదంతాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ అసువులు బాపాడు దశరథుడు. అంతవరకూ ఎంతో మార్మికంగా కనిపిస్తుంది. పిమ్మట ఈ వియోగాన్ని వివరించేందుకు భృగువు శాపం వంటివి తెచ్చినప్పుడు కించిత్ పేలవంగా అగుపిస్తుంది!

సీతాదేవి పరిత్యాగం అనునది ‘రాజధర్మం సాక్షాత్ సత్యస్వరూపం’ అని శ్రీరాముడు చెప్పటం, ఆ విషయాన్ని సీతాదేవి పునరుద్ఘాటించటంతో సంపూర్ణం చేయటం సమంజసం. ఇదియే సీతాదేవి అవతార సమాప్తికి నాంది కావటం వరకూ ప్రశంసించదగినది – కథాపరంగా!

నృగ మహరాజు కథ, నిమి కథ, ఇక్కడ యయాతి కథ, శునకంతో న్యాయవిచారణ – ఇవి జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామ కథా ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి చేరినట్లు కనిపిస్తాయి.

నిమి చరిత్ర, ఇక్ష్వాకు యొక్క సోదరులు, ఇక్ష్వాకు యొక్క 12వ కుమారుడు నిమి అని పేర్కొనటం వలన జనకుడు ఇక్ష్వాకు వంశం వాడనటం, శ్రీరామునికి సీత ఏమవుతుందన్న మాట రావటం జరిగాయి.

సీతారాముల కళ్యాణంలో వశిష్ఠుడు ప్రవర చెబుతూ ఇక్ష్వాకు కుమారుడు కుక్షి అని చెప్పాడు. 12 పేర్లు చెప్పలేదు. కాకపోతే నిమి చరిత్ర ఇతర పురాణాలలో ఉండడం వలన ఇక్కడ ప్రత్యేకంగా శ్రీరాముని చేత చెప్పించి ఆ గాథకు ముద్ర వేయించారా అనే ఆలోచన కలుగుతుంది!

అయినప్పటికీ ఇక్ష్వాకు, ఆ కథ అంతా కృత యుగానికి చెందినది. శ్రీరాముడు, సీత కేవలం త్రేతా యుగానికి చెందినవారు! యుగాంతరాలు గమనించి బంధుత్వాలను నిర్ధారించవలసిన అవసరం ఉన్నది.

చ్యవన మహర్షి అభ్యర్థన మేరకు శ్రీరాముడు శత్రుఘ్నుని లవణాసుర సంహారానికై వినియోగించాడు. ఆ సందర్భంలో శత్రుఘ్నుడు దారిలో వాల్మీకి ఆశ్రమం చేరాడు. వాల్మీకి మహర్షి కల్మషపాదునిగా ప్రసిద్ధికెక్కిన సౌదాసుని కథ ఆయనకు చెప్పిన తరువాత..

శ్లో:

యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్।

తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయమ్॥

(ఉత్తరకాండ, 66. 1)

శత్రుఘ్నుడు పర్ణశాల యందు గడిపిన ఆ రాత్రి యందే సీతాదేవికి ఇద్దరు కుమారులు (కవలలు) కలిగారు.

శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించి మధుపురాన్ని పునః నిర్మించాడు (మధుర) – ఇది చరిత్రను సూచిస్తుంది.

శంబుకుని వధ:

ఈ ఉదంతం ఉత్తరకాండ యావత్తుకూ ఒక కంటకంగా మారింది. కాలక్రమంలో  దీని మీద చర్చలు సాగి ధర్మాత్ముడైన శ్రీరాముని మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. మామూలుగా కథ చూస్తే నవ్వొస్తుంది – శంబుకుడనే వాడు ‘తల్లక్రిందులు’గా తపస్సు చేశాడట! దేనికి? దేవలోకమును జయింపదలచి! ఇంత మాత్రానికే ఇంద్రుడు ఇత్యాదులు ఇరుకున పడిపోయారుట – ఊర్వశి లాంటి వాళ్ళని కూడా పంపలేదు మరి! ఈ తపస్సు వలన బ్రాహ్మణ బాలకుడు చనిపోయాడుట! అంచాత శ్రీరామచంద్ర ప్రభువు స్వయంగా వచ్చి తల నరికేసాడుట! – ఇంకెవరూ ఆ పని చేయగలిగిన వారు అయోధ్యలో లేరు!

..ఈ ఉదంతాన్ని రావణాధముడిని రావణబ్రహ్మగా తీర్చిదిద్దినవారు, బ్రాహ్మణుల పట్ల శ్రీరాముని ప్రేమను కొత్తగా చాటాలనుకున్నవారు ఏ కాలంలోనూ ఉత్తరకాండలో చేర్చేసినట్లు కనిపిస్తుంది! ఒక ఉదాత్తమైన రీతిలో సాగిన కథాగమనం గాంభీర్యం లేని ఒక పేలవమైన ఘటనను ఈ రీతిలో తెలుపునా?

శ్లో:

ఇమాస్తంత్రీః సుమధురాః స్థానం వాపూర్వదర్శనమ్।

మూర్ఛయిత్వా సుమధురం గాయతం విగతజ్వరౌ॥

ఆదిప్రభృతి గేయం స్యాన్న చావజ్ఞాయ పార్థివమ్।

పితా హి సర్వభుతానం రాజా భవతి ధర్మతః॥

(ఉత్తరకాండ, 93. 14, 15)

వాల్మీకి కుశలవులతో: “ఈ వీణాతంత్రులు మధుర స్వరములను పలుకును. ఇందు షడ్జాది సప్తస్వరములు ఆయా స్థానములలో అపూర్వముగా ఏర్పరచబడినవి. సందర్భానుసారంగా హెచ్చుతగ్గు స్థాయీ భేడములను గమనిస్తూ ఏ మాత్రం తొణకక హాయిగా గానం చేయండి. మొదటి నుండి మహారాజును ఏ మాత్రం నొప్పింపక గానం చేయండి. శాస్త్ర ధర్మమును అనుసరించి సకల ప్రాణులకును రాజు తండ్రి వంటి వాడు.”

..రామాయణ గాథ రామాయణంలో ఒక పాత్ర పోషిస్తుంది.

శ్లో:

వాల్మీకిర్భగవాన్ కర్తా సంప్రాప్తో యజ్ఞ సంవిధమ్।

యేనేదం చరితం తుభ్యమ్ అశేషం సంప్రదర్శితమ్॥

సన్నిబద్ధం హి శ్లోకానం చతుర్విశంత్సహస్రకమ్।

ఉపాఖ్యానశతం చైవ భార్గవేణ తపస్వినా॥

ఆదిప్రభృతి వై రాజన్ పంచసర్గశతాని చ।

కాండాని షట్ కృతానీహ సోత్తరాణి మహాత్మనా॥

కృతాని గురుణాస్మాకమృషిణా చరిత్రం తవ।

ప్రతిష్ఠా జీవితం యావత్తావత్సర్వస్య వర్తతే॥

యది బుద్ధిః కృతా రాజన్ శ్రవణాయ మహారథ।

కర్మాంతరే క్షణీభూతస్తచ్ఛృణుష్వ సహానుజః॥

బాఢమిత్యబ్రవీద్రామస్తౌ చానుజ్ఞాప్య రాఘవమ్।

ప్రహృష్టౌ జగ్మతుః స్థానమ్ యత్రాస్తే మునిపుంగవః॥

(ఉత్తరకాండ, 94. 25 – 30)

కుశలవులు: “మహారాజా! పూజ్యులైన వాల్మీకి మహర్షి దీనిని రచించెను. ఆ మహాముని ఈ యజ్ఞవాటికకు సమీపమునే గలడు. ఆ మహాత్ముడు నీ వృత్తాంతమును తెలిపే రామాయణమును పూర్తిగా రచించెను. ఇది 24 వేల శ్లోకములతో విలసిల్లుచున్నది. భృగు వంశజుడైన వాల్మీకి మహర్షి ఇందులో 100 ఉపాఖ్యానములను పొందుపరిచాడు.

ఈ కావ్యమునందు మొదటి నుండి చివరి వరకు గల సర్గలు 500. ఇందులో ఆరు కాండలున్నాయి. వీటిని మాత్రమే కాక, ఉత్తరకాండమును కూడా రచించినాడు. మాకు గురువైన ఆ మహర్షియే నీ చరితమును మాకు నేర్పెను. కావ్యనాయకుడవైన నీ జీవిత విశేషములు, కీర్తి ప్రతిష్ఠలు ఇందులో పూర్తిగా ఉన్నాయి. పూర్తిగా వినవలెననే సంకల్పమున్నచో యజ్ఞము జరుగునప్పుడు నీ విశ్రాంతి సమయమున సోదరులతో గూడి వినుము.”

శ్రీరాముడు సరేనని ఆమోదించెను.

శ్లో:

శ్వః ప్రభాతే తు శపథం మైథిలీ జనకాత్మజా।

కరోతు పరిషన్మధ్యే శోధనార్థం మమైవ చ॥

(ఉత్తరకాండ, 95. 6)

శ్రీరాముడు: “జనకుని కూతురైన సీతాదేవి రేపు ప్రాతఃకాలమున ఇక్కడికి రావలెను. నన్ను గూర్చిన జనాపవాదమును తొలగించుటకై ఆమె ఈ సభలో ప్రమాణము చేయవలెను.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here