ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-49

0
9

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

శ్లో:

బహువర్ష సహస్రాణి తపశ్చర్యా మయా కృతా।

నోపాశ్నీయాం ఫలం తస్యా దుష్టేయం యది మైథిలీ॥

మనసా కర్మణా వాచా భూతపూర్వం న కిల్బిషమ్।

తస్యాః ఫలముపాశ్మామి ఆపాప మైథిలీ యది॥

అహం పంచాసు భూతేషు మనష్షష్ఠేషు రాఘవ।

విచింత్య సీతా శుద్ధేతి జగ్రాహ వననిర్ఝరే॥

ఇయం శుద్ధసమాచారా ఆపాపా పతిదేవతా।

లోకాపవాదభీతస్య ప్రత్యయం తవ దాస్యతి॥

తస్మాదియమ్ నరవారాత్మజ శుద్ధభావా

దివ్యేన దృష్టివిషయేణ మయా ప్రదిష్టా।

లోకాపవాదకలుషీకృతచేతసా యా

త్యక్తా త్వయా ప్రియతమా విదితాపి శుద్ధా॥

(ఉత్తరకాండ, 96. 20-24 )

వాల్మీకి: నేను పెక్కు వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడను. ఈ సీతాదేవి యందు ఏ మాత్రమైన దోషమున్నచో నా తపః ఫలము అంతయును నాకు చెందకుండుగాక. నేను ఇంతవరకును మనసా, వాచా, కర్మణా ఎట్టి పాపమును చేసి యుండలేదు. సీతాదేవి పరమ పవిత్రురాలు – అని భావించియే ఈమె రక్షణ భారమును చేపట్టాను.

ఈ సాధ్వి వనమున సెలయేటి సమీపముగా ఉండగా ఆశ్రమమునకు చేర్చాను. ఈమె పతినే దైవముగా భావించునది. ఈ పతివ్రతకు ఎట్టి పాపమూ అంటదు. లోకాపవాద భయమునకు లోనైన నీకు ఈమె తన సచ్చరిత్ర విషయమున విశ్వాసము కలిగించగలదు. ఈమె నీకు ప్రాణముల కంటేను ప్రియమైనది. ఈమె పరిశుద్ధురాలనియు నీవు ఎరుంగుదువు. ఐనను లోకాపవాద భయముచే మనస్సు వ్యాకులము కాగా నీవు ఈమెను పరిత్యజించినావు. ఈమె యొక్క నిర్మలభావములను తెలుసుకున్నాను. ఆ విషయమునే నీకు తెలుపుచున్నాను.

శ్లో:

వాల్మీకినైవమ్ ఉక్తస్తు రాఘవః ప్రత్యభాషత।

ప్రాంజలిర్జగతో మధ్యే దృష్ట్యా తాం వరవర్ణినీమ్॥

ఏవమేతన్మహాభాగ యథా వదసి ధర్మవిత్।

ప్రత్యయస్తు మమ బ్రహ్మన్ తవ వాక్యైరకల్మషైః॥

ప్రత్యయశ్చ పురావృత్తో వైదేహ్యాః సురసన్నిధౌ।

శపథశ్చ కృతస్తత్ర తేన వేశ్మ ప్రవేసితా॥

లోకాపవాదో బలవాన్యేన త్యక్తా హి మైథిలీ।

సేయం లోకభయద్బృహ్మన్ అపాపేత్యభిజానత।

పరిత్యక్తా మయా సీతా తద్భవాన్ క్షన్తుమర్హతి॥

జానామి చేమౌ పుత్రౌ మే యమజాతౌ కుశీలవౌ।

శుద్ధాయం జగతో మధ్యే మైథిల్యాం ప్రీతిరస్తు మే॥

(ఉత్తరకాండ, 97. 1-5 )

సీతాదేవి సచ్చరిత్ర విషయమున వాల్మీకి పల్కిన సత్యవాక్యములను విన్న తరువాత శ్రీరాముడు:

మహాత్మా! నీవు ధర్మవేత్తవు. నీవు చెప్పినది యథార్థము. పూర్వం అగ్ని పరీక్షా సమయమున సకల దేవతలు సమక్షమున శపథములు చేసి, నా పూర్తి విశ్వాసముతో నాతో అయోధ్యలోకి ప్రవేశించినది సీత. లోకాపవాదము ప్రబలమైనది కదా! దానికి వెరచి సీతాదేవిని పరిత్యజింపవలసి వచ్చినది. నాడు అగ్నీపునీత అయిన ఈ సీత ఏ పాపమూ ఎరుగనిది అని తెలిసి కూడా లోకానికి భయపడి పరిత్యజించాను. అందులకు పూజ్యుడవైన నీవు నన్ను క్షమింపుము. కవలలైన ఈ కుశలవులు నా కుమారులేనని నాకు తెలుసు! (‘తస్మిన్ గీతే తు విజ్ఞాయ సీతాపుత్రే కుశలవౌ’ (95. 2) – వారి గీతం, గానం బట్టి గ్రహించాడు).

శ్లో:

సర్వాన్ సమాగతాన్ దృష్ట్యా సీతా కాషాయవాసినీ।

అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యమ్ అధోదృష్టిరవాఙ్ముఖీ॥

యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతయే।

తథా మే మాధవీ దేవీ వివరం దాతుమర్హసి॥

మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే।

తథా మే మాధవీ వివరం దాతుమర్హతి॥

యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం న చ।

తథా మే మాధవీ దేవీ వివరం దాతుమర్హసి॥

తథా శపంత్యాం వైదేహ్యాం ప్రాదురాసీత్ తదద్భుతమ్।

భూతలాదుత్థితం దివ్యం సింహాసనమనుత్తమమ్॥

ధ్రియామాణం శిరోభిస్తూ నాగైరమితవిక్రమైః।

దివ్యం దివ్యేన వపుషా దివ్యరత్న విభూషితైః॥

తస్మింస్తు ధరణీదేవి బాహుభ్యాం గృహ మైథిలీమ్।

స్వాగతేనాభినందన్యామ్ ఆసనే చోపవేశయత్॥

తామ్ ఆసనగతాం దృష్ట్యా ప్రవిశంతీం రసాతలమ్।

పుష్పవృష్టిః అవిచ్ఛిన్నా దివ్యా సీతామ్ అవాకిరత్॥

సాధుకారశ్చ సుమహాన్ దేవానం సహసోత్థితః।

సాధు సాధ్వితి వై సీతే యస్యాస్తే శీలమీదృశమ్॥

(ఉత్తరకాండ, 97. 14-22 )

సీతాదేవి క్రిందకి చూస్తూ ఇలా అన్నది:

పతిదేవుడైన శ్రీరాముని దప్ప నా మనస్సునందును ఇతరుని తలంపకున్నచో నా తల్లియైన భూదేవి నన్ను తన ఒడిలోకి చేర్చుకొనుగాక. నేను త్రికరణ శుద్ధిగా శ్రీరామునే ఆరాధించుచున్నతో భూమాత నన్ను తన ఒడిలోకి చేర్చుకొనుగాక. నేను శ్రీరాముని తప్ప ఇతరుని ఎరుగని విషయము సత్యమే అయినచో భూమాత నన్ను తన ఒడిలోకి చేర్చుకొనుగాక.

అలా అంటుండగా ఒక దివ్యమైన సింహాసనం భూమి నుండి బయటకు వచ్చినది. అందులోనున్న భూదేవి సీతాదేవిని తన రెండు చేతులతో ఒడిలోకి చేర్చుకున్నది. స్వాగత పూర్వకంగా అభినందించి కూర్చోబెట్టుకుంది. ఆ సింహాసనం రసాతలానికి వెళ్ళిపోతుండగా అందరూ కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డారు. పూలవాన కురిసింది. బ్రహ్మాది దేవతలు ముక్తకంఠంలొ జయజయధ్వానాలు చేసారు. వారు సీతామాత సౌశీల్యమును పదే పదే కొనియాడారు.

..కొన్ని అంశాలు ముందరికి వస్తున్నాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here