ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-9

0
9

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

54. శ్లో.

లక్ష్మణేమాం మయా సార్ధం ప్రశాధిత్వం వసుంధరామ్।

ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా॥

(అయోధ్యకాండ, 4. 43)

యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నదన్న సందర్భంలో శ్రీరాముడు లక్ష్మణుడితో అంటాడు, “ఓ లక్ష్మణా! నీవు నా బహిః ప్రాణము. కావున ఈ రాజ్యము నిన్నును చేరినట్లే. కనుక నాతో గూడి, నీవును ఈ వసుధను పాలింపుము.. నీ కొరకే వీటన్నింటినీ కోరుకుంటున్నాను..” అని.

55. శ్లో.

జ్ఞాతిదాసీ యతో జాతా కైకేయ్యాస్తు సహోషితా।

ప్రాసాదం చంద్రసంకాశమ్ ఆరురోహ యదృచ్ఛయా॥

(అయోధ్యకాండ, 7. 1)

మంథర అనే ఆవిడ కైకేయితో వెంట వచ్చిన అరణపు దాసి. ఈమె పుట్టుపూర్వోత్తరాలు తెలియరావు. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తం ముందు అటూ ఇటూ తిరుగుతూ నిర్మలమైన ప్రాసాదం మీదకి ఎక్కింది.

మంధర చెప్పిన మాటలు:

56. శ్లో.

అపవాహ్య స దుష్టాత్మా భరతం తవ బంధుషు।

కావ్యే స్థాపయితా రామం రాజ్యే నిహత కంటకే॥

(అయోధ్యకాండ, 7. 26)

శత్రుః పతిప్రవాదేన మాత్రేవ హితకామ్యయా।

ఆశీవిష ఇవాంకేన బాలే పరిధృతస్త్వయా॥

(అయోధ్యకాండ, 7. 27)

సా ప్రాప్తకాలం కైకేయి క్షిప్రం కురు హితం తవ।

త్రాయస్వ పుత్ర మాత్మానం మాం చ విస్మయదర్శనే॥

(అయోధ్యకాండ, 7. 30)

మంథరాయా వచః శ్రుత్వా శయనా స శుభాననా।

ఉత్తస్థౌ హర్ష సంపూర్ణా చంద్రలేఖవ శారదీ॥

(అయోధ్యకాండ, 7. 31)

అతీవ సా తు సంహృష్టా కైకేయీ విస్మయాన్వితా।

ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభమ్॥

(అయోధ్యకాండ, 7. 32)

కైక మనసును పూర్తిగా పెడదారి పట్టించే విధానం ఈ మాటల చాతుర్యంలో కనిపిస్తుంది. కైకేయి మనస్తత్వంలో పూర్తి ఆనందం, కోపం, ఆక్రోశం.. ఎక్కువగా చిన్న పిల్లలలో ఉండే లక్షణాలు కనిపిస్తాయి. భావోద్రిక్తత అనునది నిగ్రహం తక్కువ ఉన్నవారి వద్ద ఎక్కువగా చూస్తాం. వ్యక్తిగత సామర్థ్యాలు, గుణగణాల మీద అమితమైన అభిమానం ఉన్నవారికి కూడా ఇవి ఎక్కువగా చూస్తాం.

మంథర ఎంచుకున్న మార్గం చూద్దాం..

“కపటియైన నీ భర్త భరతుని కేకయ రాజ్యమునకు పంపించి నిష్కంటకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజుగా చేయుచున్నాడు. ఓ బాలా! దశరథుడు నీకు పతిరూపములో ఉన్న శత్రువు. అది గ్రహింపక ఆయనకు హితము గోరుచూ పామును ఒడిలో చేర్చుకున్నట్లు  ప్రేమతో లాలించావు. నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలవు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచించు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ భరతుని, నన్ను కూడా రక్షింపుము!”

ఈ మాటలు వింటున్న కైక శ్రీరాముని యువరాజ పట్టాభిషేక వార్తను విని పరమానందభరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనయై లేచి కూర్చుంది.

మెరుపు వంటి ఆ వార్తకు ఆశ్చర్యపడి సంతోషంలో కుబ్జ అయిన ఆ మంథరకు ఒక విలువైన ఆభరణమును బహుకరించింది.

57. శ్లో.

రామే వా భరతే వాహం విశేషం నోపలక్షయే।

తస్మాత్తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి॥

(అయోధ్యకాండ, 7. 35)

కైకేయి అన్నది – రామ భరతులిద్దరూ నాకు సమానులే! నాకు ఆ ఇరువురిలో ఏ మాత్రమును హెచ్చుతగ్గులు గోచరింపవు. అందుచేత శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయు ఈ వార్త విని ఎంతో సంతోషిస్తున్నాను.

మంథర వెంటనే విషయాన్ని కౌసల్య వైపుకు తిప్పింది – స్త్రీల స్వభావం, ఆలోచనా ప్రక్రియలు ఎలా ఉంటాయో ఇక్కడ అద్భుతంగా చిత్రీక్రించాడు మహర్షి.

58. శ్లో.

ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషమ్।

ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాంజలిః॥

ఏవం చేత్‌త్వం సహాస్మాభిః తస్యాః ప్రేష్య భవిష్యసి।

పుత్రశ్చ తవ రామస్య ప్రేష్యభావం గమిష్యతి॥

(అయోధ్యకాండ, 8. 10, 11)

శ్రీరాముడు యువరాజు కాగానే రాజ్యాధికారం యావత్తూ కౌసల్యాదేవి గుప్పిట్లోకి చేరుతుంది. ఆవిడ ‘రాజమాత’ అవుతుంది. సవతులందరిపై ఆమెదే పై చేయి అవుతుంది. నీవు ఆమె వద్ద దోసిలొగ్గి, దాసి వలె ఆమెను సేవించవలసి యుంటుంది! – ఇది మంథర చెప్పిన మాట.

కైక అప్పటికీ చలించలేదు. శ్రీరాముని గురించి ఆమె చెప్పిన మాటలు ఈ సందర్భంలో చాలా గొప్పవి.

59. శ్లో.

ధర్మజ్ఞో గురుభిర్దాంతః కృతజ్ఞ సత్యవాక్ శుచి।

రామో రాజ్ఞః సుతో జ్యేష్ఠో యౌవరాజ్యం అతోర్హతి॥

భ్రాత్రూన్ భృత్యాంశ్చ దీర్ఘాయుః పితృవత్ పాలయిష్యతి।

సంతప్యసే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేచనం॥

భరతస్యాపి రామస్య ధ్రువం వర్షశతాత్ పరమ్।

పితృపైతామహం రాజ్యమవాప్తా పురుషర్షభః॥

(అయోధ్యకాండ, 8. 14, 15, 16)

కైక: శ్రీరాముడు గురువుల వద్ద చక్కగా శిక్షణ పొందినవాడు. ధర్మజ్ఞుడు. చిన్న ఉపకారమైనా ఇతరులు చేసినది మరువడు. సత్యవాది. పవిత్రుడు. పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు. కలకాలం వర్ధిల్లుతూ తమ్ములను, అనుచరులను తండ్రివలె ప్రేమతో పాలిస్తాడు. అటువంటి శుభవార్త విని నీవెందుకు పరితపిస్తున్నావు? శ్రీరాముడు కొన్ని వందల సంవత్సరాలు పాలించిన తరువాత తరతరాలుగా వచ్చే ఈ సామ్రాజ్యం భరతుడు పొందుతాడు.

60. శ్లో.

యథా నే భరతో మాన్యః తథా భూయోపి రాఘవః।

కౌసల్యాతోరిక్తం చ సోను శుశ్రూషతే హి మామ్॥

రాజ్యం యది హి రామస్య భరతస్యాపి తత్తదా।

మన్యతే హి యథాత్మానం తథా భ్రాతౄంస్తు రాఘవః॥

(అయోధ్యకాండ, 8. 18, 19)

శ్రీరాముడు భరతుని వలె – అంత మాత్రమే గాదు, అతని కంటెను నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. శ్రీరాముడు కూడా తన తల్లియైన కౌసల్య కంటెను నన్నే అధికంగా సేవిస్తాడు. తన తమ్ములను కూడా సమానంగా చూసుకుంటాడు. ఈ రాజ్యం శ్రీరాముడిదైనా, భరతునిదైనా ఒక్కటేనని కైక తేల్చి చెప్పింది.

బాగుంది. ఇక్కడ శ్రీరాముని విషయంలో ఏ సందేహం లేదు. అయోధ్యలో అందరికీ ప్రీతిపాత్రుడైన శ్రీరాముడు ఆయన తల్లి కంటె కైకేయిని ఎక్కువగా సేవిస్తాడు అని కైకేయి చెప్పటంలో ఆమె పట్ల ఆమెకు గల అభిమానం కూడా గోచరిస్తున్నది. శ్రీరాముడిని అంతగా మెచ్చుకునే స్వభావం ప్రక్కన ఆయన తల్లి అయిన కౌసల్య పట్ల ఎందుకు అదే భావన ఉండదు? ఇక్కడ కైకేయి మనస్తత్వం చక్కగా ఆవిష్కరింపబడింది – నేను గొప్పదానిని కాబట్టి సృష్టిలోని గొప్ప గొప్ప విషయాలన్నీ నాకు చెందినవి లేదా నాతో అనుబంధం కలవి అను ఆలోచన ఇక్కడ కీలకం. కానీ ఆ గొప్పవి ముందుగా ఎవరికి చెందినవి అన్న సమాలోచన లేకపోవటం వలన బుద్ధి రెండు భాగాలుగా చీలిపోవటం మనం దర్శిస్తాం.

మంథర ఎంతో తెలివిగా ఇపుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో చూద్దాం..

61. శ్లో.

భవితా రాఘవో రాజా రాఘవస్యాను యః సుతః।

రాజవంశాత్తు కైకేయి భరతః పరిహాస్యతే॥

(అయోధ్యకాండ, 8. 22)

మంథర చెప్పింది – ఓ కైకేయీ! శ్రీరాముడు రాజైనచో అతని యనంతరం అతని కుమారుడే రాజగును. ఈ కారణం వలన భరతునకు గానీ, అతని సంతానమునకు గానీ భవిష్యత్తులో రాజ్యాధికారం పొందే అవకాశం లేదు.

62. శ్లో.

బాల ఏవ హి మాతుల్యం భరతో నాయితస్త్వయా।

సన్నికర్షాచ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వపి॥

భరతస్యామవశః శత్రుఘ్నోపి సమా గతః।

లక్ష్మణో హి యథా రామం తథాసౌ భరతం గతః॥

శ్రూయతే హి ద్రుమః కశ్చిత్ ఛేత్తవ్యో వనజీవిభిః।

సన్నికర్షాదిషీకాభిః మోచితః పరమాద్భయాత్॥

(అయోధ్యకాండ, 8. 28, 29, 30)

భరతుడు బాలుడుగా ఉండగానే మేనమామ ఇంటికి పంపి తప్పు చేశావు. దగ్గర లేడు కాబట్టి దశరథునికి అతని మీద మక్కువ కలుగలేదు.

శ్రీరామ భరతుల మధ్య కూడా ఆ అనుబంధం ఏర్పడలేదు.

[శ్రీరామలక్ష్మణులు, భరతశత్రుఘ్నులు – ఈ జంటల మధ్య పరిస్థితులను వేరువేరుగా చూపించింది మంథర.]

63. శ్లో.

తస్మాన్న లక్ష్మణే రామః పాపం కించిత్ కరిష్యతి।

రామస్తు భరతే పాపం కుర్యాదితి న సంశయః॥

తస్మాద్రాజగృహాదేవ వనం గచ్ఛతు తే సుతః।

ఏతద్ధి రోచతే మహ్యం భృశం చాపి హితం తవ॥

(అయోధ్యకాండ, 8. 32, 33)

మంథర: శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమూ తలపెట్టడు. భరతునకు కీడు కలిగించగలడు అనటంలో సందేహం లేదు. ఈ ప్రమాదం ఉన్నది కాబట్టి భరతుడు కేకయ రాజ్యం నుండి నేరుగా అడవులకు పోవుటయే సమంజసం అని తోచుచున్నది!

[శ్రీరాముని అడవులకు పంపవలనన్న ఆలోచన ఇక్కడి నుండి జాగృతమైనది.]

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here