కాజాల్లాంటి బాజాలు-17: ఆడుతూ పాడుతూ టీవీకి..

0
8

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]వ[/dropcap]దిన చెప్పిన సలహాలు పాటించిన వనజ షాప్‌లో సేల్స్ బ్రహ్మాండంగా పెరిగిపోయేయి. అది చూసిన వనజ చెల్లెలు గిరిజ నా వెంట పడింది. అలా పడడం నాకోసం కాదండోయ్, తనని కూడా వదిన దగ్గరికి తీసికెళ్ళి సలహా ఇప్పించమని. అలా అడగ్గానే వదినతో నవ్వుతూ అన్నాను, “వదినా, ఇలా నీ దగ్గరకి సలహాలకి తీసుకొచ్చేవాళ్ల దగ్గర్నుంచి కమిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందీ..” అని వదిన పకపకా నవ్వేసింది. “ఇంతకీ ఈ గిరిజ ఏం చేస్తుందీ!” అనడిగింది.

“ఏమో నాకు తెలీదు..” అన్నాను.

“హూ.. చూసేవా, దీన్ని బట్టే తెలుస్తోంది నీకసలు వ్యవహారం నడపడం తెలీదని. నీదే కనక బిజినెస్ మైండ్ అయితే గిరిజ అలా అడగ్గానే అసలు నువ్వేం చేస్తున్నావూ, ఏ రకమైన సలహా కావాలీ, డబ్బుకి సంబంధించిందా లేక పరపతికి సంబంధించిందా, ఫలానా దయితే ఇంతవుతుందీ, ఇంకోటయితే అంతవుతుందీ అనేదానివి. అందుకని ఇలాంటి కమీషన్ వ్యవహారాలు నువ్వు నడపలేవు కానీ ఆ గిరిజో జలజో ఓ సారి తీసుకురా..” అంది.

సరే తప్పుతుందా, గిరిజనీ తీసికెళ్ళేను వదిన దగ్గరికి. క్రమశిక్షణతో ఉండే టీచర్ ముందు బుధ్ధిమంతుడైన విద్యార్థిలా వదిన ముందు తలొంచుకుని, చేతులు కట్టుకుని కూర్చుంది గిరిజ.

“ఏం చదువుకున్నావు గిరిజా..” అన్న వదిన మాటలకి, “బి.యె.” అంది తలొంచుకునే.

“మరి ఇంకా పైకి చదవొచ్చుగా” అన్న వదిన మాటలకి, “నాకు అంత ఇంటరెస్ట్ లేదు వదినా. ఎంత చదివినా చదువునుబట్టి కాక మన తెలివితేటలని బట్టే కదా సంపాదన. అందుకే ఏదైనా బిజినెస్ చేద్దామనుకుంటున్నాను.”

“ఏం బిజినెస్సనుకుంటున్నావూ”

“అదే వదినా, మిమ్మల్ని అడగాలని వచ్చేను.”

“అంటే నీకంటూ ఏమీ అభిప్రాయాలు లేవా!”

“ఉన్నాయిగా”

“ఏవిటవి?”

“తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే బిజినెస్ ఏదైనా సరే..”

వదిన కాసేపు ఆలోచించింది. “ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ లోనే అలాంటి లాభాలు ఉన్నాయి. ఏదైనా కర్రీ పాయింట్ కానీ, కాటరింగ్ లాంటిది కానీ పెట్టుకుంటావా?”

గిరిజ చేదుమందు తాగినట్టు మొహం పెట్టింది. “అవైతే పూట పూటా జాగ్రత్తగా చూసుకోవాలి. చేతికింద మనుషులని పెట్టుకోవాలి.. చేసేదాన్ని నేనొక్కదాన్నే కనక అలాంటి ఫుడ్ బిజినెస్ వీలుపడదేమో వదినా..” అందినెమ్మదిగా.

“అయితే ఓ పని చెయ్యి.. డాన్స్ స్కూల్ పెట్టు..” అంది సడన్‌గా మా వదిన. నేనూ, గిరిజా కూడా తెల్లబోయేం. నాకు డాన్సు రాదండీ అనబోతున్న గిరిజని మధ్యలోనే ఆపింది వదిన.

“చూడూ, ప్రస్తుతం బాగా లాభాలొచ్చే వ్యాపారాలు రెండే. ఒకటి ఫుడ్, రెండోది టీవీ ప్రోగ్రామ్స్..”అన్న మా వదినని విస్తుపోయి చూసేం ఇద్దరం.

“ఇప్పుడు బోల్డు ప్రైవేట్ చానల్స్ వచ్చేసేయి. ప్రతిదాంట్లోనూ టిఆర్‌పి రేటింగ్ వంటల ప్రోగ్రాములకీ, రియాలిటీ షోలకే ఉంటోంది. ఆ రియాలిటీ షోలో కూడా ఆడవాళ్ళవే ఎక్కువుంటున్నాయి. ప్రతి ఎపిసోడ్ లోనూ కొత్తవాళ్ళుంటారు. వాళ్ళు అందులో ఏదో డాన్స్ చెయ్యాలి.. తప్పదు. అలా ట్యూన్ చేసేసేరు మనని. అందుకోసం అలా రియాలిటీ షోలకి నువ్వు డాన్స్‌లు నేర్పే స్కూల్ పెట్టు. ఇది రెండురకాలుగా కలిసొస్తుంది. మీ అక్క బొటెక్‌లో టీవీ షోలకి ఎంట్రీ పాస్ లిస్తున్నానని సేల్స్ పెంచుకుంది కదా, నువ్వు ఆ షోలకి డాన్స్ చెప్తానని చెప్పు.”

వదిన చెప్తున్నది విస్తుపోయి వింటున్న మాలో ముందుగా గిరిజే తేరుకుంది.

“కానీ నాకు డాన్స్ రాదు కదా వదినా..” అంది నోరు తడారిపోతుంటే.

వదిన గిరిజని సూటిగా చూస్తూ, “నువ్వు చిన్నప్పుడు చెమ్మచెక్కలాడేవా?” అనడిగింది.

అడ్దమో నిలువో అర్థం కాకుండా బుర్రూపింది గిరిజ. “అంతే అది చాలు. కాలు ఓ సారి ఈ పక్కకి వెయ్యడం, ఇంకోసారి ఆ పక్కకి వెయ్యడం, మరోసారి ముందుకీ ఆ పైన వెనక్కీ.. అంతే ఆ నాలుగు స్టెప్సూ చాలు.. ఎన్ని పాటలకైనా డాన్స్ చెయ్యొచ్చు..”

“మరి చేతులో?” నా అతి తెలివిని ప్రదర్శించేను. “అది మరీ సులువు. రెండు చేతులూ ఓసారి నడుం చుట్టూ, ఇంకోసారి పైకీ కిందకీ ఆడిస్తే చాలు..” అంది అంతకన్న తేలిగ్గా మా వదిన.

నమ్మలేకపోయినట్టు చూస్తున్న మా ఇద్దరినీ చూసి వదిన “ఒక పెద్ద యాంకరే అలా చెప్పింది తెల్సా.. ఆవిడకి వచ్చినవి కేవలం మూడే స్టెప్సుట. వాటితోటే వేలకొద్దీ ఎపిసోడ్లు చేసేస్తోందావిడ. ఈ రోజుల్లో నీకేవొచ్చూ, ఎంతొచ్చూ అని ఎవరూ చూడట్లేదు. నీకొచ్చింది పదంకెలే అయినా సరే అవే లక్షలన్నట్టు చెప్పుకుంటూ ముందుకు దూసుకుపోయే రోజులివి. ఎవరూ పెర్ఫెక్షన్ కోసం చూడట్లేదు. గబగబా ప్రోగ్రాములు చెయ్యాలీ, ఇన్ని చేసేమని చెప్పేసుకోవాలీ.. అంతే.. “

వదిన మాటలు వింటున్న గిరిజ మొహం సంతోషంతో విచ్చుకుంది.

నాకిదంతా యేంటో గాల్లో మేడలు కడుతున్నట్టు అనిపించింది. “అయినా టీవీలో ప్రోగ్రామ్ చెయ్యాలంటే అంత తేలిక్కాదు..” అన్నాను నాకూ కొంచెం తెలుసన్నట్టు.

“ప్రోగ్రాం చేయిస్తామనటం లేదుగా.. ఎలా చెయ్యాలో చెప్తున్నాం. ఇప్పుడు ఆడవాళ్లకి ఇదివరకులా కాదు. ఖాళీ టైము చాలా ఉంటోంది. ఆ టైమ్‌లో వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని చూపించుకోడంలో తప్పు లేదుగా! అలా చూపించుకోవాలనుకునే ఆడవాళ్ళు బోల్డుమంది ఉన్నారు. వాళ్లకి ఆ అవకాశం నువ్వు కల్పించు” అంది వదిన.

“వాళ్ళకి ఎలా చెప్పాలి వదినా నా దగ్గరికి రమ్మనీ..” ఆరాటంగా అడిగింది గిరిజ.

“అదే నేను చెప్పేది. నువ్విలా డాన్స్ స్కూల్ పెడుతున్నానూ, మీరు నేర్చుకుందురుగాని రండీ అంటే ఎవరూ రారు.. “

“మరెలా..”

“ఎలా చెప్పాలో సరిగ్గా విను. మీలో ఉన్న బ్రహ్మాండమైన టాలెంట్‌ని వెలికి తియ్యండి. చిన్నతనంలో మీరు స్కూల్లో, కాలేజీల్లో చేసిన డాన్సులూ, డ్రామాలూ మళ్ళీ చేయండి. మీలో ఉన్న ప్రతిభకు మెరుగు దిద్దడానికే మేం వున్నాం.. అంటూ వాళ్ళకోసమే నువ్వు స్కూల్ పెట్టినట్టు చెప్పాలి.”

“మరి దానికి ఏం పేరు పెట్టాలి వదినా..” చాటంత మొహంతో వదిన్ని అడిగింది గిరిజ. నాకు మతిపోయింది. “ఏంటీ, నిజంగా పెట్టేస్తావా!” అన్నాను.

“ఏం ఎందుకు పెట్టకూడదూ! ఇప్పుడు నువ్వే ఉన్నావు. చిన్నప్పుడు నువ్వూ, మా అక్కా ఎంచక్కా బోల్డు పాటలు పాడి డాన్సులు చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెయ్యకూడదు. నువ్వెంత యాక్టివో నాకు తెలీదా!” అంది. నాకు నోట మాట రాలేదు.

వదిన గట్టిగా చప్పట్లు కొట్టేసింది. “గుడ్, వెరీ గుడ్. ఇలాగే వచ్చినవాళ్లందరి దగ్గరా వాళ్ళంతటివాళ్ళు లేరన్నట్టు రెచ్చిపోయి పొగిడెయ్యి. నీ బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది” అంటూ ఆశీర్వదించేసింది వదిన గిరిజని.

అంతే, ఆ మూడోరోజే గిరిజా వాళ్ళ ఫ్లాట్ గుమ్మానికి పైన ఇలా ఫ్లెక్సీ వేళ్ళాడుతూ కనిపించింది..

ఆడుతూ పాడుతూ టీవీకి..

మీలో దాగున్న కళాకారిణిని నిద్ర లేపడానికే ఈ కోర్సు.

టీవీలో జరిగే రియాలిటీ షోలకోసం ట్రైనింగ్.

చీరకట్టూ, నగల గోటూ, ఆటా, పాటా, వన్ మినిట్ గేమ్స్, తూటాల్లాంటి మాటలూ అన్నింటికీ ట్రైనింగ్.

2 వారాల కోర్సు- రూ.1000 మాత్రమే.

మొదటి బ్యాచ్ మొదలైంది. మీదే ఆలస్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here