ఆద్యోదంతం

0
5

[కరోనా అంటే కొందరికి జ్వరం అని గుర్తు. ఇంకొందరికి అంటురోగమనే కలవరంగా, మరికొందరికి ప్రపంచాన్నే వణికించిన కల్లోలంగా తెలుసు. కానీ అది చాలా మంది బ్రతుకులను తారుమారు చేసి వారి జీవితాంతం వెంటాడు చేదు జ్ఞాపకంగా మిగిలింది. అట్టి ఓ వ్యథకు అక్షరరూపం శ్రీ అనిల్ ప్రసాద్ లింగం గారు రచించిన ‘ఆద్యోదంతం’ అనే ఈ కథ.]

[dropcap]నె[/dropcap]లవారీ సమీక్షా సమావేశం చాలా వేడిగా జరుగుతుండగా ఫోన్ మ్రోగింది. అంతటి ఒత్తిడిలో కూడా ఆ కాల్‍ని ఎత్తకుండా ఉండలేకపోయాడు ఋషి.

“ఆయ్! నాను మల్లిబాబునండీ, బాగున్నారా? వదిన బాగుందాండీ? పిల్లలు స్కూలుకెళ్ళుతున్నారా? ఏం లేదండే కొత్త ఐ ఫోనొత్తందంటగందా, మిమ్మల్నో మాటడిగి తీసుకొమ్మంది మా పిన్ని. మరి మీరేటంటారు?”

కళ్ళు మూసుకొని, దీర్ఘంగా శ్వాస తీసుకొని – విడచిపెట్టి, లేచి బయటకొచ్చి, “మల్లిబాబూ, ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన మీటింగులో ఉన్నాను. నీకు అవసరమైతే తీసుకో లేకపోతే ఇప్పుడున్నది కూడా మంచిదే. తప్పనిసరిగా మార్చాలనేమిలేదు.” చేతనైనంత శాంతంగా చెప్పాడు.

అతడి మాట పూర్తవకుండానే, “అదేటండి బాబూ అట్టంటారు. మీకు తెలవదేమో మా మండలంలోనే మొట్టమొదటి లాండు ఫోను మా బాబాయే పెట్టించాడు. పంతులు శంకరయ్య అప్పటినుండీ ఫోను శంకరయ్య అయ్యిపోయాడండే బాబూ. అవసరమైన చుట్టుపక్కల ఊళ్ళ జనాలందరూ ఒచ్చేసి ఇంటిముందు నిలబడేటోళ్లు ఏదన్నా కబురొత్తాదని. అక్కడేవుంటే పిలవడం, నేకపోతే ఇషయం తెలుసుకొని మనిషిని అంపించడం కూడా చేసీదండీ మా పిన్ని, మహా ఇల్లాల్లు. అయ్యన్నీ మాకింకా గుర్తెనండీ. ఇగ మా అన్న, ఊళ్ళోనే ఫస్టుగా ఐ ఫోను కొన్నాడండీ, తోలి జీతంతోటే, మీకు తెల్సా. నా సామిరంగా ఫలానా వొళ్ళ అబ్బాయి నెల జీతం మొత్తం పెట్టి సెల్లు ఫోనుకొన్నాడని జిల్లా అంతా మోత మోగిపోయిందంటే నమ్మండే. అట్టాంటిది, ఇయ్యాల ఆడు లేడని అవసరం లేదంటారా?” అంటూ విరుచుకుపడ్డాడు అవతలి వాడు.

“మల్లిబాబూ.. తీసుకో.. తప్పకుండా తీసుకో..” పళ్ళు కొరుకుతూ ఒక్కో మాట ఒత్తి పలికాడు ఋషి.

“అదీ.. మీరు తీసుకోమన్నారని పిన్నికి చెప్తాను. మరుంటానండీ.” అని ఫోను పెట్టేసాడు.

నేను తీసుకోమంటమేంట్రా అంటూ తల కొట్టుకున్నాడు ఋషి.

***

ఋషీ, సంతోష్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒకేసారి జాయిన్ అయ్యారు, కాలం కలిసొచ్చి కంపెనీ బాగా పెరిగింది, దాంతో పాటే వాళ్ళూ అభివృద్ధి చెందారు. ఇద్దరూ ఓకే అపార్ట్‌మెంటు సముదాయంలో ఇళ్ళు కొనుక్కున్నారు. ఇరువురి భార్యలు కూడా మంచిగా కలసిపోవడంతో కుటుంబాల మధ్య అనుబంధం బాగా బలపడింది. సంతోష్ ఉద్యోగ బాధ్యతల రీత్యా వివిధ దేశాలు తిరిగొస్తుండే వాడు. ఋషి సంవత్సరానికి ఒకటీ రెండు పర్యటనలకే పరిమితమయ్యేవాడు. కరోనా ప్రబలడానికి ముందు సింగపూరులో ఉన్నా సంతోష్, తిరిగొచ్చాక జరిపిన పరీక్షలలో వ్యాధిబారిన పడినట్టు బయటపడింది. ఇంటికెళ్ళి భార్యతో చనువుగా ఉండటంతో ఆవిడకి కూడా అంటుకుంది. తరువాత ఆసుపత్రిలో చేరినా అప్పటికే ఇరువురికీ లక్షణాలు బాగా ముదిరిపోయాయి. అదృష్టం ఏంటంటే వారి కూతురు ఐదేళ్ళ ఆద్యకి అంటుకోలేదు. సంతోష్ దంపతులని ఆసుపత్రిలో చేర్చి, పిల్లని తన ఇంటికి తీసుకెళ్లిన ఋషి – అది అంటువ్యాదని తెలిసాక ఆ పాపని ఒక గదిలో కట్టడి చేసాడు. వ్యాధి లక్షణాలేవి లేవని నిర్ధారించుకున్నాకే తన కుటుంబంతో ఆమెని కలవనిచ్చాడు. ఇంతలో ముందుగా సంతోష్, తరవాత అతని భార్యా – రోజుల వ్యవధిలో ఇద్దరూ వ్యాధికి బలైపోయారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల వారి కుటుంబాల నుంచి ఎవ్వరూ కనీసం చివరి చూపుకు కూడా రాలేకపోయారు. ప్రభుత్వమే ఆసుపత్రి నుంచి శవాలని తరలించే ఏర్పాట్లు చేసి ఋషికి తెలియపరిచింది.

ఈ పరిణామాలు, వాటి పర్యావసానాలేవి తెలీని చిన్న పిల్ల, స్కూళ్ళు మూసెయ్యడంతో సంతోష్ కూతురూ కొడుకుతో అతని ఇంట్లో జాలీగా గడుపుతుండేది. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన తరవాత సంతోష్ బావమరిది వచ్చి ఆ పిల్లని ఊరికి తీసుకెళ్లాడు. తండ్రి ఇప్పుడు కూడా ఏదో దేశంలో ఇరుక్కుపోయాడనీ, అక్కడ వ్యాధి బాగా ప్రబలడంవల్ల ప్రభుత్వం రానివ్వడం లేదనీ, ఆయన్ని తీసుకురావడానికి తల్లి వెళ్లిందని నమ్ముతుంది ఆ చిన్నిపిల్ల. సదుపాయాలూ, సౌకర్యాలూ ఒక్కటొక్కటిగా దూరమవుతుంటే తన పరిస్థితి పట్ల ఏదో తెలిసీ తెలీని అవగాహన ఏర్పడుతుంది ఆ లేత మనసులో. సంతోష్ తల్లి, అదే ఊళ్ళో ఉండే అతని పెదనాన్న చిన్న కొడుకు వేరే ఊరిలో ఉండే అతని చెల్లీ ఆమె భర్తా – వీళ్ళు ఇప్పుడు ఆ పిల్ల యోగక్షేమాలు చూసేది.

పెద్దావిడ ఏదైనా చెపితే వింటుంది, చెల్లీ బావలు అవసరమైతేనే మాటాడతారు కానీ డిగ్రీ చదివే కుర్రాడు మల్లిబాబు మాత్రం ఋషిని అదనీ, ఇదనీ ఎప్పుడూ వేధిస్తుంటాడు. సంతోష్ ఇంట్లో చాలా ఎలక్ట్రానిక్ సామగ్రి ఉండింది, వాటిని ఊరికి తరలించాక ఒక్కోటి విప్పి చూసి అదేంటీ, దాన్ని ఎలా వాడాలి వంటి ప్రశ్నలతో సమయం సందర్భం లేకుండా ఫోనుచేసి డిస్ట్రబ్ చేసేవాడు. ఫోను లాక్‍కు, వైఫై పాస్‍వర్డు వంటివన్ని మార్చేసుకున్నాడు. పిల్లని జాగ్రత్తగా చూస్తారని, సంతోష్‌తో తనకున్నా స్నేహాన్ని బట్టి అన్నింటినీ భరిస్తుంటాడు ఋషి.

***

దుమ్ము రేపుకుంటూ వేగంగా వచ్చిన వాహనం, ఊళ్ళోని ఒక కూడలిలో చుట్టూ రాతిఅరుగుతో ఉన్న పెద్ద చెట్టుకింద కూర్చుని ఉన్న వాళ్ళ దగ్గరకొచ్చి ఆగింది.

“ఏవండీ, సంతోష్ అనీ హైదరాబాదులో ఉండేవాడు, పోయినేడాది కరోనాకి చనిపోయాడు. వాళ్ళ ఇళ్ళు ఎక్కడ?” తల బయటపెట్టి అడిగాడు ఋషి. ఇంతలో దగ్గర్లో ఆడుకుంటున్నా ఆద్య, “ఋషీ అంకుల్..” అని అరుచుకుంటూ వాహనం దగ్గర కొచ్చింది.

రేగిన జుట్టూ, ఎండకు చెమట, నల్ల రేగడిలో ఆడుతుండటంతో అంటిన మట్టితో తగ్గిన మేని ఛాయా, మాసిన బట్టలు, పెదవుల అంచులకి అంటిన తినుబండారం, మోకాళ్ళ కిందకి దిగిన ముదురు రంగు గౌను – తనేనని తెలుస్తుంది గానీ ఇంతకు ముందు చూసినట్టుగా లేదు.

“హౌ ఆర్ యు అంకుల్? మామ్, డాడ్ వచ్చారా? మనం ఇంటికెళ్లిపోతామా?” పరుగు పెట్టడం వల్ల వచ్చిన అలుపుతో వగరుస్తూ అడిగేస్తుంది పాప.

“ఆద్యా.. మై డార్లింగ్. హౌ ఆర్ యూ? ఎక్కడ నానమ్మ ఇల్లు?” కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తనను తాను సంబాళించుకుంటూ డోర్ తెరిచి, పాపని ఎత్తుకొని ముద్దాడి, పక్కన సీటులో కూర్చో బెట్టుకొని, రెండు చేతులు ఆమె భుజాల చుట్టూ వేసి ఆప్యాయంగా తడుముతూ అడిగాడు ఋషి.

“ఐ విల్ షో యూ. గో స్ట్రెయిట్..” అని చేతులు ముందుకు చాచి చెప్పనారంభించింది. బండి ముందుకు కదిలింది.

షాంపూ చేసి, కండీషనర్ పట్టించిన జుట్టు గాలికి మెత్తగా అల్లల్లాడుతుండగా, వివిధ క్రీములు శరీర రంగుకు మరింత నిగారింపునివ్వగా, చెవులకూ, మెళ్ళో, చేతులకీ మేలిమి బంగారంతో చేసిన ఆభరణాలు శోభాయమానంగా అలంకరించుకొని, ముట్టుకుంటే మాసిపోతాయేమోననిపించే మృదువైన తెల్లని బట్టలు ధరించి ఉండే ఆ గత కాలపు ఆద్యాకీ ఇప్పుడు తన పక్కన కూర్చున్నా పాపకీ అసలు పోలికలేదు. సంతోష్ కూతురు కాబట్టి తన వాహనంలో ఎక్కించుకున్నాడుగానీ ఇంకెవరైనా ఆ స్థితిలో ఉంటే కనీసం బండిని తాకనిచ్చేవాడు కూడా కాదు.

“న్యూ కార్ అంకుల్?” ఉత్సాహంగా అడిగింది పాపా, తలూపాడు ఋషి.

“రియల్లీ నైస్ ఇంటీరియర్ అంకుల్, లెట్ మీ గెస్, వెహికల్ కలర్ మీ ఛాయస్ అండ్ ఈ సీటు కవర్లు ఆంటీ సెలెక్షన్ అయ్యింటది – పింక్ ఈస్ హర్ ఫేవరెట్ కదా. మ్యూజిక్ సిస్టం మీరే పెట్టించుంటారు, డిస్ప్లే స్క్రీన్ చింటూ, థీజ్ బ్యాక్ సీట్ హోల్డింగ్ ట్రే షుడ్ బీ ఫర్ రింకీ – బికాజ్ కార్లో తినడం తనకిష్టం. ఎప్పుడూ అంతే కదా, మీకు గుర్తుందా అన్నం తిననంటే డాడీ తనను మా కారెక్కించుకొని తిప్పుతూ తినిపించేవారు. అప్పుడు సగం కార్లో పడేసేది, మా మమ్మీ ఏమో ఇంకోసారి ఎక్కనివ్వనని కసిరేది.”

“అవునవును. నీకన్నీ గుర్తే” అని మెచ్చుకున్నాడు.

“ఆంటీ బాగుందా?”

“యా ఫైన్. నీకోసం చాకోలెట్ పంపించింది చూడు.” అంటూ తీసిచ్చాడు.

“ఓ థాంక్స్! చాకోలెట్స్ మొబైల్ ఫోన్ అంత పెద్దగా ఉంటాయి అంటే ఇక్కడెవ్వరూ నమ్మడం లేదంకుల్. అన్నీ ఇంత చిన్న చిన్న టాఫీలే ఉంటాయంటాడు బాబీ. వాడికి ఇది చూపించి చెప్తాను. అసలు, ఆయాం నాట్ ఫైండింగ్ గుడ్ చాకోలెట్స్ హియర్.”

“అవునా? బాబీ ఎవరూ?”

“నానమ్మ పక్కింట్లో ఉంటాడు. మొన్న వాడి బర్త్ డే. గిఫ్ట్ ఇద్దామని తెమ్మంటే మల్లి బాబాయి దొరకవంటాడే. ఇది ఇచ్చేస్తాను వాడికి.”

“వద్దు వద్దు నువ్వే తిను. వాడికి ఇంకోసారి నేను తెస్తానులే.”

“నో ఐ నీడ్ టూ ప్రూవ్. సో ఐ హావ్ టూ.” నిశ్చయంగా అంది పాప.

“సరేలే, నానమ్మా ఎలా చూసుకుంటుంది? మీ అత్త వస్తుందా?”

“ఇక్కడంత బాలేదంకుల్, స్కూల్ కూడా. బై ద వే డిడ్ దే స్టార్ట్ మై స్కూల్ అంకుల్? టాబ్‌లో ఆన్‌లైన్ క్లాసులకి లాగ్ ఇన్ అవ్వడం లేదు. ఆఫీసుకి కాల్ చేసి కంప్లైన్ చెయ్యమంటే మల్లి బాబాయి ఫోన్ లాక్ చేంజ్ చేసేసాడు. ద స్కూల్ టీచర్ హియర్ టీచెస్ తెలుగు. ఐ యాం టోటలీ బోర్డ్ హియర్. నో టీవీ, నో ఇంటర్నెట్, నో మూవీస్, నో మమ్మీ, నో పాపా. ఇట్స్ డామ్ హెల్. డాడీకి తగ్గిందంటా? ఎప్పుడొస్తారు?” అమాయకంగా అడుగుతూనే ఒక దగ్గర ఆపమని సైగ చేసింది అమ్మాయి.

దారి పక్కకి తీసి బండి ఆపి, కిందకి దిగి మరో వైపు వచ్చి డోర్ తెరిచి పాపని కిందకి దించి, తాను తీసుకొచ్చిన వస్తువులు పట్టుకొని లోనికి నడిచాడు ఋషి. చుట్టూ ప్రహరీ గోడ, ముందువైపు మధ్యలో గేటు, అక్కడినుంచి ఇంటి అరుగు వరకూ నాపరాళ్లు పరిచిన మార్గం, నాలుగు మెట్ల ఎత్తులో వరండా, సంతోష్ ఎంతో ముచ్చటపడి కట్టించిన ఇల్లు. మొదటి అంతస్తులో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న అటాచెడ్ బాత్రూంతో కూడిన ఏసీ గది. పెళ్ళప్పుడు ఆ గదిని ప్రత్యేకంగా అలంకరించడం ఇంకా గుర్తుంది ఋషికి. అప్పుడు రావడమే మళ్ళీ ఇదిగో ఇలాగ ఈ వేళ. ఇంతలో గేటు పక్కనుంచి చిన్నగా కుక్క మొరగడం వినపడింది. తిరిగి చూస్తే జామ చెట్టుకి కట్టి ఉంది స్నూపీ, ఎదురుగా ఒక సత్తుగిన్నెలో ఈగలు ముసిరిన అన్నం. యూరోప్ నుంచీ సంతోష్ ముచ్చటపడి తెచ్చుకున్నాడు లేత నారింజ రంగు పోమ్ [పోమేరియన్ డాగ్]. ఒకప్పుడు తామందరమూ ఎత్తుకు తిరిగిన కుక్క పిల్ల, ఇప్పుడు తన ప్రత్యేకతైన రంగు దుమ్మూ ధూళికి కలిసిపోయి, దెబ్బలు తగిలి, బక్క చిక్కిపోయి – కనీసం దగ్గరకు కూడా రానిచ్చేలా లేదు. ఇంట్లో సోఫాలమీద, ఆద్యతో బెడ్డు మీదా గడిపి, తన కోసం తయారై ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినేది – ఈ వేళ ఎండకూ, వానకూ ఆరుబయట ఉంటూ, ఇంట్లోవాళ్ళు తినగా మిగిలిన అన్నం తింటూ ఉంది. పాప లోపలికెళ్ళి నానమ్మను పిలుస్తుండగా, ఋషి ముందుకెళ్ళి స్నూపీకి చెయ్యి ఊపాడు. అది రెండు కాళ్ళూ ఎత్తి ముందుకురకడానికి ప్రయత్నించింది, కానీ మెడకు కట్టివున్నా తాడు దాన్ని బలంగా నిలువరిస్తుంది.

***

పలకరింపులు అయ్యాక, వరండాలో అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి, ఎదురుగా మంచం మీద కూర్చుంది సంతోష్ తల్లి. “అమ్మాయీ, పిల్లలూ బాగున్నారా? తీసుకురావాల్సింది.” అంది పెద్దావిడ.

“బాగానే ఉన్నారమ్మా, తనకీ ఉద్యోగం, పిల్లలకీ స్కూలు ఇంకోసారి ఎప్పుడన్నా వస్తాం. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది. మనవరాలు బాగా అల్లరి చేస్తుందా?” అడిగాడు ఋషి.

“హా.. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయా? అందుకే వచ్చారా నన్ను తీసుకెళ్లడానికి?” వెంటనే అందుకుంది పిల్ల. ఏం చెప్పలేక పోయాడతను.

“ఇదేనయ్యా గొడవ. ఏదేదో మాటాడతది నాకేమో అర్థం కాదు. నువెళ్ళీ మల్లి బాబాయిని పిలుచుకురా.” అని పిల్లని పంపించి, “ఏంటయ్యా పనిగట్టుకునొచ్చావు?” అనడిగింది.

కంపెనీ నుంచీ రావాల్సిన డబ్బులు అప్పుడే వచ్చేసాయి. కూతురు పేరున బ్యాంకులో వేసారు. గార్డియన్‌గా తన పేరు కూడా పెట్టాడు ఋషి. అపార్ట్‌మెంట్ అద్దెకిచ్చి నెలనెలా సగం, ఖర్చులకి పిల్లకి అందేలా ఏర్పాటు చేసారు. ఇక అత్తగారి ఊరిలో కొంత పొలం కొని భార్య పేరున పెట్టాడు సంతోష్. ఆ ఊళ్ళోనే ఉండే భార్య తమ్ముడు దానిని తానే చేస్తానని, లేదు తాము వేరొకరికి కౌలుకి ఇచ్చుకుంటామని తల్లీ, చెల్లీ – కాసేపు అటువైపు, మరికాసేపు ఇటువైపు ఉండే మల్లీ, ఈ గొడవ కొన్ని రోజులుగా జరుగుతుంది. అపార్టుమెంటూ, పొలమూ రెండూ అమ్మేసి పిల్ల పేరున బ్యాంకులో వెయ్యమనీ కొందరూ ఇలా ఎవరికి తోచిన సలహాలు వాళ్ళిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడూ ఊరికొచ్చి గొడవపడటం, తనకూ కాల్ చేసి ఎవరి వాదన వారినిపించడం ఇవన్నీ ఋషికి తెలుసు.

“అదేనమ్మా, మా హెచ్.ఆర్ మేనేజర్‌కి – సంతోష్ అంటే ఎంతో అభిమానం. ఆయన నిన్న వచ్చి నాకో మాట చెప్పాడు. అది మీకు చెప్దామని.. కరోనాతో తల్లిదండ్రులిరువురినీ కోల్పోయిన పిల్లల్ని కేంద్రప్రభుత్వం అనాథలుగా గుర్తించి వారి సంరక్షణా, చదువు బాధ్యతలు తీసుకుంటుంది. కాగితాలు తయారు చేసి తెచ్చాను, మీరు సంతకాలు చేసి పిల్లని పంపిస్తే కేంద్ర స్కూళ్లల్లో చదువూ అన్ని వాళ్ళే చూసుకుంటారు.”

“అనాథా.. అదేంటయ్యా అంతమాటనేసావు. నేనున్నాను, మేనత్తా – ఏదో పాడు బుద్ధి పుట్టిందిగానీ అమ్మ తమ్ముడు సొంత మేనమామ రేపు ఊళ్ళో వాళ్ళు ఉమ్మేస్తే దానికి మంచీ చెడు చెయ్యడానికి ముందుకు రాకుండా ఉంటాడా? అది అనాథెలా అవ్వుద్ది? ఏదో ఖర్మకాలి అమ్మానాన్న పోయారు గానీ మేమంతా లేమా?” ఉద్విగ్నంగా చెప్పుకు పోయింది పెద్దావిడ.

“నా ఉద్దేశం అదికాదమ్మా. ఎందుకు లేము మనమంతా తనకెప్పుడూ అండగానే ఉంటాము. సుప్రీం కోర్టు చెప్పిందని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఆపదలో పడ్డ పిల్లలకి తనవంతు సాయంగా ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఆ పసిదాని భవిష్యత్తు బాగుంటదని మీకు చెప్పడానికి వచ్చానంతే.” శాంతంగా చెప్పాడు వచ్చినతను.

లేచి నిలబడి, కళ్ళ జోడు తీసి కొంగుతో అద్దాలు తుడుచుకుంటూ, “సంతోష్ పట్ల నీ అభిమానం నాకు తెలుసు నాయనా. నువ్వు చెప్పకపోయినా ఆ పిల్ల ఎదుగుదల గురించి నువ్వు పడే ఆతృత కూడా నాకు కనిపిస్తుంది. లోకం చూసినదాన్ని నా మనవరాలికి మంచి ఎలా చెయ్యాలో నేనాలోచించనా?” వరండా గట్టు మీద కూర్చుంది పెద్దావిడ. ఏమీ మాట్లాడకుండా వింటున్నాడు ఋషి.

“ఇది కడుపున పడ్డప్పుడే నా పెనిమిటి కాటికెళ్ళిపోయాడు. అయిదేళ్లకే తల్లితండ్రుల్ని మింగేసింది. దీని జాతకంలో ఏదో లోపం ఉందేమోనని అందరంటాంటే మొన్న సిద్ధాంతికి చూపించి శాంతి చేయించమన్నాను. ఆయన చూసి, పెద్దమనిషయ్యాక ఆ అశుచి పోవడంతోనే ఈ పిల్లని పట్టిన దరిద్రం వదులుద్దన్నాడు. అప్పటిదాకా గండాలు తప్పవన్నాడు. సిటీలో పుట్టి పెరిగింది, కాలుకింద పెట్టకుండా సౌకర్యాలు మరిగింది ఈ పల్లెటూళ్ళో గెటానవ్వడం కష్టమే. కానీ తప్పదు. నా కూతురు అన్న బిడ్డని తన పిల్లలతో కలిపి పెంచుతానంది, అమ్మాయి మనదేగానీ అల్లుడు ఎప్పుడేమాటంటాడో తెలీదు కదా, వద్దన్నాను. పొలం తనకే ఇవ్వాలని పట్టుదల నా కోడలి తమ్ముడికి, మా అక్క సొమ్ము నేను తింటే తప్పా అని అతని వాదన. లెక్క తప్పు చెప్పుతున్నాడు, పంట వర్షాలకు పోయిందని అబద్ధమాడుతున్నాడని మనోళ్ళ గొడవ. అసలు బుద్ధున్నవాడెవడన్నా అత్తారూరిలో పొలం కొంటాడా? మన జుట్టు వాడి చేతిలో పెట్టి, ఇప్పుడు మెల్లగా అంటే ఎట్టా? ఇక మా బావకోడుకు మల్లిబాబూ, అందరికన్నా చిన్నోడు. నాకు బాగా అలవాటు. ఏంటేంటో కరంటు సామాను కొన్నాడు సంతోషు. ఫోనులూ, సినిమాలు చూసే పలకలు, చెవిలో మోగేయి, చేతికి కట్టుకొనే వాచీలు ఏవేవో. వయసులో ఉన్నా కుర్రోడు, వాడికవసరమైనాయి తీసి వాడుకుంటన్నాడు. ఈ పిల్లదాని బాగోగులు చూసుకుంటున్నాడు, ప్రతీసారీ బ్యాంకుకి వెళ్లకుండా సెల్లు ఫోనులోనే అన్ని పనులు చేసిపెడుతున్నాడు అదీకాక రేపు నేను పోతే వాడే నాకు తలకొరివి పెడతాడు. అందరూ మంచోళ్ళే గానీ ఎంతో కొంత ఆశ వుంటాది గందా. దాన్ని మనం అనుకూలంగా చేసుకోవాల. ఆద్య – నా కూతురి బిడ్డని చేసుకుంటే ఈ ఇల్లు కూడా వాళ్ళకే ఇస్తానని రాసాను. బైటోళ్లని చేసుకుంటే ఈ ఊళ్ళో నాకున్నా పొలంలో సగం నా కూతురికి చెందాలని చెప్పాను. మిగతా సగం మనవరాలికి అంతేగానీ ఇల్లు మాత్రం ఇవ్వను. బయటోళ్లని చేసుకుంటే ఈ ఇల్లు, నా మనవడిని చేసుకుంటే పొలమూ మల్లిబాబుకి చెందుతుంది. మీరిచ్చిన డబ్బూ, అక్కడి అపార్టుమెంటు, ఇంకా సంతోషు బ్యాంకులో వేసింది, వాళ్ళ అమ్మగారి ఊళ్ళోని పొలమూ అన్నీ అది పెద్దయ్యాక తన తెలివితేటలూ, నీ బోటోళ్ల సాయంతో నిలుపుకుంటుందో, తెగనమ్ముకుంటుందో దానిష్టం. ఇదీ నేను చేసిన ఏర్పాటు. వయసులో పెద్దదాన్ని నాకూ తెలుసు.” నిబ్బరంగా తెలియచేసింది పెద్దావిడ.

తాను పిల్లకి మంచి విద్య దొరుకుతుందని చెప్పాలనుకుంటే, ఆవిడ ఎంతో ముందు చూపుతో వాస్తవికంగా ఆలోచించి భవిష్యత్తు ప్రణాళిక చూపించింది. తోడుగా ఇంతటి అనుభవజ్ఞులున్న పాపకి ఏ దిగులు ఉండదని నమ్మి, పెద్దావిడ ఆలోచనలను మెచ్చుకున్నాడు. చదువు గురించి అడిగితే, తన కొడుకూ ఇక్కడ చదివే ఆ స్థాయికొచ్చాడంది ఆ తల్లి. మరింకేమి చెప్పాలో తెలీలేదు ఋషికి. స్నూపీ ఇంకా తాడు వదిలించుకోవాలని చూస్తుంది ఉంది కుయ్, కుయ్ మంటూ, తానైనా దెగ్గరకెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు ఋషి కానీ ఎందుకో ఆద్యా, స్నూపీ ఇద్దరి పరిస్థితులు తలచుకుంటే కళ్ళు చెమర్చాయి తనకి.

ఈ లోపు సంతోష్ కొనుకున్న బుల్లెట్టు మీద ఆద్యని ఎక్కించుకొచ్చాడు మల్లిబాబు. రాగానే, వస్తున్నట్టు తనకు చెప్పక పోవడాన్ని తప్పు పట్టాడు. “ఒక్కమాట చెపితే అసలు వేరేగా ఉండేది గదండీ. ఎన్ని వంటలు చేయిచ్చే వాళ్ళం. ఇలా చెప్పాపెట్టకుండా వచ్చెత్తే ఎట్టండే బాబూ?” అని మొదలెట్టాడు.

“మరేం పర్లేదులేవయ్యా. నీ పెళ్ళికి వస్తాగా, అప్పుడు చేద్దువుగానీ మర్యాద. మరిక నేను వెళ్తాను” అంటూ లేచాడు ఋషి.

“అయిబాబోయి తప్పకుండానండీ. మీతో చాలా పనులున్నాయండీ. ఐ ఫోనుకి పిల్లదాని ముఖమైడీ పెట్టుందండీ. దాన్ని బ్రేక్ చేయడమెలాగో తెలీడం లేదు. అలాగే ట్యాబు, అలెక్సా ఇయన్ని ఇక్కడ పనిచెయ్యడం లేదు. సిటీలో చూపిస్తే ఆ టెక్నాలజీ ఇంకా ఇక్కడ వాడకంలో లేదంటున్నారు. మీరైతే ఏదో చేసి ఆట్ని వాడకంలో పెడ్తారని.” తన బాధలు చెప్పుకు పోయాడు మల్లి బాబు. ఏదోలా అతనికి సర్ది చెప్పి బయలుదేరాడు ఋషి.

“అదేంటీ మమ్మీ డాడీ నన్ను తీసుకురమ్మనలేదా? స్కూల్ స్టార్ట్ అయ్యిందన్నారుగా?” ఆందోళనగా అడిగింది ఆద్య. “ఇంకా టైం పడుతుందమ్మా.” గద్గద స్వరంతో చెప్పాడు ఋషీ. “పోనీ మీ ఇంట్లో ఉంటానంకుల్. చింటూ, రింకీతో కలిసి స్కూల్ కెళ్ళతాను.” మారం చేసింది పసిపాప.

“అలా కాదులే, నువ్వాగమ్మా. అంకుల్ మళ్ళొస్తార్లే.” సర్ది చెప్పింది నానమ్మ. పెద్దవాళ్ళు ఏవో మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తుండగా, పాప వెళ్ళి, కుక్కని విప్పి తీసుకొచ్చింది.

“పోనీ అంకుల్, రింకీకి స్నూపీ చాలా ఇష్టం కదా, దీన్నన్నా తీసుకెళ్ళతారా? మేమింటికొచ్చాక తీసుకుంటాను.” నిస్సహాయంగా అడిగింది అమ్మాయి.

“నేను ఆఫీసు పనిమీద వేరే ఊరు వెళ్ళాలమ్మా. నెక్స్ట్ టైం తీసుకెళ్ళతాను.” తన వల్ల కావడంలేదు ఈ క్షోభ, కానీ తప్పడం లేదు.

“ఆఫీసు పని మీదా, మరి ఓన్ బండి తీసుకొచ్చారేంటంకుల్, డాడీ చెప్పేవారు కదా ఆఫీసు టూర్ అంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే క్యాబ్ తీసుకొని బిల్లు పెట్టాలని – మర్చిపోయారా?” అంది పాప. వెంటనే మల్లిబాబు ఆమె తల మీద మొట్టి, “పెద్ద ఆరింద.” అన్నాడు.

బలవంతంగా నవ్వు పులుముకుని అందరికీ టాటా చెబుతూ బండి స్టార్ట్ చేశాడు ఋషి. “అంకుల్, అట్‍లీస్ట్ ‘అవతార్2’ రిలీజ్ టైంకి డాడీ రాకపోతే నన్ను ఐమాక్స్‌కి తీసుకెళ్ళి మూవీ చూపిస్తావా?” దీనంగా అడిగింది పసి పాప.

“హా.. తప్పకుండా తీసుకెళతా” దుఃఖం నిండిన గొంతుతో జవాబిచ్చాడు ఋషి. పిల్లను వెనక్కు లాగిన మల్లిబాబు, “టౌనులో నేను చూపిస్తాన్లేమ్మా” అన్నాడు.

అడుగు వెనక్కి వేసిన అమ్మాయి, స్నూపీని రెండు చేతుల్లోకి తీసుకొని ఋషికి కనపడేలా ఎత్తుకుంది. కారు కదలడం, చేతిలోని కుక్కపిల్లని ఆద్య ముందుకిసరడం, బండికి మధ్యన పడిన స్నూపీ పైనుంచీ వెనుక టైరు ఎక్కి వెళ్ళిపోవడం అంతా రెప్పపాటులో జరిగిపోయాయి. అవాక్కయిన నాయనమ్మ, బాబాయి నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. కానీ ఎంతో సంతోషంగా చేతులూపుతూ కారుతో బాటు కొంత దూరం ముందుకు పరుగు పెట్టింది పాపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here