ఆకాశమే హద్దు, అవకాశం వదలద్దు-1

0
8

[dropcap]“ర[/dropcap]మణీ శిల్క్స్! పెళ్లిళ్లకి, అన్ని రకాల శుభకార్యాల కోసం, మా ప్రత్యేక వస్త్రాల కోసం, మా షోరూంకి విచ్చేయండి. మా మూడవ షోరూం త్వరలో హైదరాబాద్‌లో” టీవీలో వస్తున్న ప్రకటనలో రమణీ సిల్క్స్ యజమానురాలు రమణి రాజ్ చెపుతోంది.

ఆమె వయసు సుమారు 35-40 ఉండచ్చు. వాళ్ళ మగ్గాల మీద నేసిన నేత చీరలు, పట్టు, నూలు మాత్రమే కడుతుంది. వాళ్ళు అవే అమ్ముతారు. విశాఖపట్నం, విజయవాడలో బాగా ప్రసిద్ధి. ఇప్పుడు హైదరాబాద్‌లో మూడో షాప్ అని ప్రకటన.

రమణి వంక పట్టి పట్టి చూస్తోంది శ్యామల.

“ఏమోరా! నాకు ఎన్ని సార్లు చూసినా నాకు ఈవిడని చూస్తే మన రమణే గుర్తు వస్తుంది.” వందోసారి అంది శ్యామల.

“అమ్మా! నువ్వు ఇంట్లో అంటే అన్నావు గాని, బయట అనకు కొడతారు” శ్యామల కొడుకు వినయ్ అన్నాడు.

“రమణి ఎవరు వినయ్?” అడిగింది వీణ. వీణ వినయ్ భార్య.

“చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న పనిపిల్ల. తనకి 7, 8 ఏళ్ళ వయసులో వచ్చి నాతో ఆడుకునేది, తరవాత 10 యేళ్లపాటు మా ఇంట్లో మాతో ఉండిపోయింది. తరవాత వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసి పంపారు. అతను పల్లెటూర్లో పొలం పనులు చేసేవాడు” చెప్పాడు వినయ్.

వినయ్, వీణ ఆఫీస్‌కి వెళ్ళాక శ్యామల పూజ, తనకి భర్తకి వంట చేసింది. రాజారావు అక్కడే దగ్గర్లో ఉన్న అన్నగారి ఇంటికి వెళ్లి వస్తాను అన్నాడు. వచ్చాక తినచ్చులే అని ఆలోచనలో పడింది.

శ్యామల భర్త రాజారావు రైల్వేస్‌లో చేసి రిటైర్ అయ్యాడు. శ్యామల పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో చేసి రిటైర్ అయ్యింది. ఒక అబ్బాయి వినయ్ తరవాత అమ్మాయి సుష్మ.

రాజారావు చాలా సంవత్సరాలు వైజాగ్‌లో ఉద్యోగం చేసాడు. శ్యామల కూడా అక్కడే చేసి భర్తకి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయ్యాక తాను కూడా ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని వచ్చింది.

వీళ్ళు వైజాగ్‌లో ఉన్నప్పుడు స్టేషన్‌కి దగ్గరగానే ఉండేవారు. వినయ్‌కి అయిదు ఏళ్ళు. సుష్మకి 10 నెలలు ఇంటి పనుల కోసం మనిషిని వెతుకుతుంటే దొరికింది అప్పలమ్మ. అక్కడే 4,5 ఇళ్లల్లో పనిచేసేది. ఆమె భర్త తాగి, తాగి చచ్చిపోయాడు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు, కొడుకులని ఊర్లో తల్లి దగ్గర వదిలేసింది. చిన్న కూతురు రమణకి 8 ఏళ్ళు,ఆ పిల్ల తల్లిని వదిలి ఉండను అని ఏడిస్తే, దాన్ని పట్టుకుని ఇక్కడ ఉంటోంది.

దగ్గర్లోనే ఉన్న గుడిసెల్లో ఉండేది. ఆ చిన్న పిల్లని పట్టుకొని ఇళ్లలో పని చేసేది. ఆ చిన్నది కూడా వాళ్ళ అమ్మకి చిన్న పనులు సాయం చేసేది.

శ్యామల ఆఫీస్ కి వెళితే సుష్మని చూసుకోడానికి శ్యామల అమ్మగారు సీతమ్మ గారు వచ్చారు. వినయ్ స్కూల్ కి వెళ్ళేవాడు. రమణ వచ్చినప్పుడల్లా సుష్మ దగ్గర కూచుని ఆడించేది. శ్యామల వాళ్ళమ్మగారు రమణకి తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉండేవారు. ఒకరోజు పని అయ్యి అప్పలమ్మ వెళ్తుంటే రమణ రానని కొంచెం సేపు సుష్మతో ఆడతాను అని ఏడ్చింది. “పోనిలే ఉండనియ్యి” అని ఆవిడా ఉంచేశారు.

రమణ సుష్మ దగ్గర కూచుని ఆడిస్తూ ఉంటే, ఆవిడ స్నానము, పూజ చేసుకొని కొంచెం స్థిమితంగా తిన్నారు. రమణకి తనతోపాటు భోజనం పెట్టితే తిని మధ్యాహ్నం కాసేపు పడుకుని లేచింది.

శ్యామల సాయంత్రం వచ్చేసరికి ఆరోజు చాల తేటగా ఉన్న తల్లి మొహం చూసి “ఏంటమ్మా ఇవాళ కాస్త రెస్ట్ దొరికిందా, కాస్త హాయిగా ఉన్నావు” అంది శ్యామల.

“అవునే శ్యామా! రమణ చాల చురుకైన పిల్ల. ఎంత సాయం చేసిందనుకున్నావు. మూడొంతులు పిల్లని తానే కనిపెట్టుకుంది. నాకు ఇవాళ చాల రెస్ట్ దొరికింది. నేను వచ్చి 2 నెలలు అయింది. నాన్న ఆ పొలం పనుల కోసం అక్కడే ఉన్నారు, వదిన ఉన్నా నాకు ఇక్కడ మనసు నిలవడం లేదు. నువ్వు రమణని ఉంచుకొని నువ్వు ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అప్పలమ్మ వస్తుందేమో కనుక్కో ఎక్కువ జీతం ఇవ్వు.”

శ్యామలకి ఈ ఐడియా నచ్చింది. అమ్మ కూడా పెద్దది, నాన్నని వదిలి ఎంత కాలం ఉంటుంది, తానే ఏదో ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది.

రాజారావు కూడా “డబ్బులకి చూడకు, పాపం పెద్దావిడని ఎంతకని ఇబ్బంది పెడతాము, అక్కడ మీ నాన్నగారు పాపం ఏమి అనలేక సర్దుకుంటున్నారు.” అన్నాడు .

మర్నాడు అప్పలమ్మని “నువ్వు ఎన్ని ఇళ్లు చేస్తావు? ఎంత వస్తుంది” అని అడిగింది.

“మీది కాక ఇంకా రెండు ఇళ్లు అమ్మా, ఒకళ్ళు 200, ఇంకొకళ్ళు 300 ఇస్తారు. మీరు 300” అంది (ఇది ఒక 30 ఏళ్ళ క్రితం, అప్పటికి చైల్డ్ లేబర్ ఆక్ట్ లేదు).

“రమణని స్కూల్‌లో వెయ్యవా మరి?” అంది శ్యామల.

“అమ్మా నా కొడుకుని చదివించడమే ఎక్కువ, వాడు ప్రభుత్వం పాఠశాలలోనే, కానీ, పై ఖర్చులు ఉంటాయి. పెద్ద పిల్లకి 15 ఏళ్ళు, వచ్చే యేడు పెళ్లి చెయ్యాలి, లేపోతే మావాళ్లు నానామాటలు అంటారు. నేను రమణని చదివించలేను, నెమ్మదిగా పని నేర్పిస్తే ఇంకో రెండేళ్ళకి నాకు సాయం వస్తుంది” అంది అప్పలమ్మ.

“అప్పలమ్మా, నేను చెప్పేది విను. నీకు ఇష్టమైతే రేపటినుంచి నువ్వు పొద్దున్న 7 గంటలకి రమణని ఇక్కడ వదిలి, వేరే రెండు ఇళ్లు చేసుకొని మా ఇంటికి రా. నీకు రమణకి మధ్యాహ్నం భోజనం ఇక్కడే, నేను 5 గంటలకి వచ్చాక నువ్వు వేరే ఇళ్లలో పనులు చేసుకొని రమణని తీసుకెళ్ళు. ఇలా ఉన్నందుకు నేను ఇంకొక 300 ఎక్కువ అంటే మొతం 600 రూపాయలు ఇస్తాను, మీ ఇద్దరికి ఒక పూట భోజనం కూడా వెళ్ళిపోతుంది” అంది శ్యామల.

అప్పలమ్మ అదిరిపోయింది. ఇద్దరి భోజనం కాక ఇంకా 600 రూపాయల జీతం, ఒక నిమిషం కూడా ఆలోచించకుండా “అమ్మా రేపటినుంచి వస్తాను” అంది.

“మీరు ఇద్దరు శుభ్రంగా స్నానం చేసి రండి. నువ్వు పాపని చూడాలి కదా” అంది శ్యామల.

“అలాగే అమ్మా , పొద్దున్న 7 గంటలకి రమణని వదిలి వెళతాను” అంది అప్పలమ్మ.

ఎక్కువసేపు ఉండచ్చు ఇంకా భోజనం ఇక్కడే అని రమణ తెగ సంతోష పడింది.

“అమ్మా! ఒక నాలుగు రోజులు వాళ్ళకి పనులు నేర్పించు, నిన్ను ఊరు పంపుతాను” అని తల్లికి చెప్పింది శ్యామల.

అలా మొదలైన పని, మూడేళ్లపాటు సుష్మ స్కూల్‍కి వెళ్లేవరకు, ఇద్దరూ చేసారు. రమణని, శ్యామల కానీ రాజారావు కానీ, పనిపిల్లలాగా చూడలేదు. ప్రతి పండక్కి పిల్లలకి కొన్నప్పుడు రమణకి కూడా బట్టలు కొనేది.

పిల్లలకి ఏమి పెడితే అదే పెట్టేది. రాజారావు అనేవాడు “మనకి ఇంకో బిడ్డ ఉంటే చూడమా, అలానే అనుకో” అని.

అప్పలమ్మకు కూడా పళ్ళు, స్వీట్స్ ఏమి ఉన్నా ఇస్తూనే ఉండేది. అప్పలమ్మకి కూడా కడుపునిండా భోజనం ఏడాదికి ఒక కొత్త చీర 5,6 పాత చీరలు ఇచ్చేది. చిన్న పిల్ల చదువుకోకుండా పని చేస్తోంది అని సాయంత్రం వినయ్‌కి చదువు చెప్పేటప్పుడు రమణకి కూడా చదువు చెప్పేది. మధ్యాహ్నం కూడా కాసేపు చదవమని చెప్పేది. రమణ కూడా చురుకుగా చదివేది, కానీ స్కూల్‌కి మాత్రం వెళ్లను అనేది.

సుష్మ స్కూల్‌కి వెళ్ళాక కూడా రమణ ఇక్కడే ఉండేది. సుష్మని, వినయ్‌ని స్కూల్ బస్సు ఎక్కించడం, వచ్చాక పాలు ఇవ్వడం సాయంత్రం వాళ్లతో ఆడడం. మూడేళ్ళలో రమణ గుర్తు పట్టలేనట్టు అయింది. మాట, పద్దతి మారిపోయింది. వేసుకునే వస్త్రధారణ మారిపోయింది. పరీక్షలు రాయక పోయినా ఇంగ్లీష్, తెలుగు రాయడం చదవడం నేర్చుకుంది.

కొత్త వాళ్ళు మీ అమ్మాయా అని అడిగేవారు. శ్యామల కానీ రాజారావు కానీ మా పనిఅమ్మాయి అనేవారు కాదు, తెలిసిన వాళ్ళ అమ్మాయి అని చెప్పేవారు.

రమణ అక్క పెళ్లి అయింది. అప్పుడు కూడా వీళ్ళు బాగా సాయం చేసారు. ఒకోసారి రమణ ఇంటికి కూడా వెళ్ళేది కాదు. సుష్మ అయితే రమణ దగ్గరే పడుకునేది, వినయ్ కూడా అక్క అని బాగా ఆడేవాడు. వినయ్ పుస్తకాలు చదివి లెక్కలు కూడా బాగానే చేసేది. పోనీ ప్రైవేట్‌గా అయినా పదో క్లాసు పరీక్షకి కట్టమంటే మాత్రం వద్దు అనేది.

రాజారావుకి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయింది. వెళ్లే అప్పుడు ఇంటి సామాను అక్కరలేనివి, తీసుకెళ్లలేనివి బోలెడు ఇచ్చి వెళ్లారు. అప్పలమ్మ, రమణ స్టేషన్ దాకా వెళ్లి ఒకటే ఏడుపు. అప్పటికి ఇంకా సెల్‍ఫోన్లు లేవు.

అప్పలమ్మ పనిచేసే వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే మొదట్లో అక్కడికి చేసి రమణ గురించి అడుగుతుండేవారు. తరవాత కొద్దిగా తగ్గింది.

ఒక ఆరు నెలల తరవాత అప్పలమ్మ ఫోన్ చేసింది.

“అమ్మగారూ! నేను రమణని మీ దగ్గరికి పంపుతున్నాను, అది మీ అందరి గురించి చాలా దిగులు పడింది. ఎక్కడ పనికి పెట్టలేక పోతున్నాను. నాకు జీతం ఏమీ వద్దు, నా పిల్లని ఉంచుకోండి చాలు.” అని.

శ్యామల, రాజారావుకి వద్దు అనడానికీ కారణం కనపడలేదు. రమణ ఉంటే కొంచెం నయం అని సరే అన్నారు. తెలిసిన వాళ్లతో రమణని పంపింది అప్పలమ్మ. స్టేషన్‍లో దిగిన రమణని పోల్చుకోలేక పోయారు ఇద్దరు.

నల్లబడి, సన్నపడి వేరే అమ్మయిలాగా ఉంది

“అమ్మగారు” అంటూ పట్టుకొని ఏడ్చింది. శ్యామలకి కూడా కళ్లలో నీళ్లు వచ్చాయి.

“ఇలా అయిపోయావు ఏమయింది రమణ” అని దగ్గరికి తీసుకొంది.

“నాకు అక్కడ ఏమి బాగోలేదు. అక్కడ అందరు చాల చెడ్డవాళ్ళు. తాగి పిచ్చిగా చేస్తారు, నేను అక్కడికి వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను” అంటూ ఏడిచింది.

శ్యామలకి కొంత అర్థం అయింది. ఆ బస్తీలో ఆడపిల్లకి రక్షణ తక్కువ, పైగా తమ లాంటి వాళ్ళ ఇంటి నుంచి అక్కడికి వెళ్తే సర్దుకోవడం కష్టం. మూడేళ్ళ నుంచి తమతో ఉన్న రమణ మీద వీళ్ళకి అభిమానం పెరిగింది. పిల్లలు అయితే గంతులు వేశారు “అక్క వచ్చింది” అంటూ.

అలా 12 ఏళ్ళ పిల్లగా వచ్చిన రమణ 18 ఏళ్ళు వచ్చేవరకు వీళ్ళతో ఉంది. అప్పలమ్మ జీతం వద్దు అన్నా, రమణ పేరు మీద బ్యాంకు అకౌంట్ తెరిచి నెల నెలా కొంత డబ్బులు వేసేది. రమణ ఇంట్లో మనిషిలానే ఉండేది. స్నేహితులు, బంధువులు అందరికి రమణ బాగా తెలిసి పోయింది. ఇంటి తాళాలు, బీరువా తాళాలు కూడా రమణ దగ్గరే ఉండేవి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, ఆఖరికి రాజారావు డబ్బులు కావాలన్నా, రమణే బీరువా లోనించి తీసి ఇచ్చేది. శ్యామల ఒక పుస్తకం పెడితే అందులో అన్ని లెక్కలు రాసేది.

వీళ్లంతా ఎవరిదారిన వాళ్ళు స్కూళ్ళకి, ఆఫీసులకి వెళితే పగలంతా ఊరికే ఉండడం ఎందుకు అని, పక్కనే ఒకావిడ టైలరింగ్, కుట్లు, అల్లికలు నేర్పిస్తుంటే అక్కడ రమణని చేర్పించింది శ్యామల. రమణ కూడా కుట్లు, ఎంబ్రాయిడరీ ఇష్టంగా నేర్చుకుంది. శ్యామల జాకెట్లు కూడా రమణ డిజైన్లు వేసి బాగా కుట్టేది. చీరలకి ఫాల్స్ కుట్టడం, ఎంబ్రాయిడరీ చెయ్యడం అన్ని నేర్చుకుని చుట్టుపక్కల వాళ్ళకి చేసేది. అలా వచ్చిన డబ్బులతో కొంత కలిపి చిన్న బంగారువి దిద్దులు రమణకి కొనిపెట్టింది శ్యామల.

చుట్టుపిల్లల్తో మాట్లాడుతూ ఇంగ్లీష్, హిందీ మాట్లాడడం నేర్చుకుంది. తెలుగు బాగా చదివేది. ఇంగ్లీష్ కూడా పరవాలేదు. శ్యామల, రమణని కుట్టు నేర్చుకోడానికి బాగా ప్రోత్సహించింది.

“పెళ్లి చేసుకున్నాక, నువ్వు మీ అమ్మలాగా ఇళ్లలో పనులు చెయ్యలేవు, హాయిగా మెషిన్ పెట్టుకుంటే ఇంట్లోనే కూర్చుని కుట్టుకోవచ్చు. అన్ని రకాల కుట్లు నేర్చుకో” అనేది శ్యామల. రమణ కోసం తెలిసిన వాళ్ళని అడిగి తక్కువ ధరకి కుట్టు మిషన్ తెచ్చింది. శ్యామల ఆఫీసుకి ఎప్పుడూ నూలు, నేత చీరలే కట్టేది. పెళ్లిళ్లు అంటే మంచి జరీ చీరలో, పట్టు చీరలో కట్టేది. ఎక్కువగా గద్వాల్, వెంకటగిరి, కంచి లాంటి చీరలే కొనేది. చీరలు కొనడానికి రాజారావుకి కుదరదని, రమణనే తోడు తీసుకువెళ్లేది.

“అందరు జార్జెట్, షిఫ్ఫాన్ కడతారు, మీరు ఏమిటి ఎప్పుడూ నూలు, నేత చీరలు కడతారు” అన్న రమణతో “నేత, నూలు చీరలలో ఉన్న అందం, హాయి ఎందులోనూ ఉండవు రమణా! ఏ కాలం అయినా ఒంటి చెమట పీల్చి మన శరీరం శుభ్రంగా ఉంటుంది. మనం కట్టే ఈ చీర నేసిన, చేనేత వాళ్ళు బతుకుతారు, అసలు షాపుల వాళ్ళు కూడా మగ్గాల దగ్గరికి వెళ్లి తెస్తే షాప్‌కి లాభం, నేతకారులకి లాభం. మన దేశం, మన రాష్ట్రం, ఒకోచోట ఒకో రకమైన చీరలకి ప్రసిద్ధి. కంచి అనగానే తమిళనాడు గుర్తొచ్చినట్టు, గద్వాల అంటే తెలంగాణ, వెంకటగిరి, ధర్మవరం అనగానే ఆంధ్రప్రదేశ్. ఇలా ప్రతీ రాష్ట్రానికి ఒక చేనేత ఉంది. ఆ చీరలకి గుర్తింపు ఉండాలి. ఈ నేత చీరలు, మంచి జాకెట్లు వేసి కడితే మరింత అందంగా ఉంటాయి.” అంటూ తన నేత చీరలకి సరిపడా మంచి జాకెట్ బట్ట తీసుకొని దానిమీద రమణ చేత ఎంబ్రాయిడరీ, అద్దాలు కుట్టించడం లాంటివి చేయించేది. దానితో ఆ చీర అందం పెరిగేది. చూసే వాళ్ళు అందరు మాకు ఇలా కావాలి అని అడిగి చేయించుకునేవారు.

ఉన్నట్టుండి ఒక రోజు రమణ అన్న ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి కాన్సర్ అని ఆఖరి స్థితిలో ఉంది అని రమణని వెంటనే పంపమని చెప్పాడు. రమణ అయిష్టంగానే వైజాగ్ వెళ్ళింది. అప్పటికి శ్యామల ఇంట్లో ఫోన్ వచ్చింది. రమణ నాలుగు రోజులకి ఒకసారి ఫోన్ చేసి పిల్లల్తో మాట్లాడేది. ఒక వారం తరవాత రమణ తల్లికి బాగా సీరియస్ అయిందని, పోయేలోగ రమణ పెళ్లి చూడాలని రమణ మేనత్త కొడుకుతో పెళ్లి కుదిర్చారు అని డబ్బు సాయం చేయమని ఫోన్ చేసారు. శ్యామల వాళ్ళు బ్యాంకులో వేసినవి దాదాపు 50 వేలు అయ్యాయి. అదికాక శ్యామల, పెళ్ళికి రమణకి పట్టుచీర, తులం పెట్టి గొలుసు, మట్టెలు, మంగళసూత్రం కొని తీసుకువెళ్ళింది.

పాసుబుక్ రమణకి ఇచ్చి డబ్బులు అవసరానికి వాడుకోమంది. ఈ హఠాత్ పరిణామాలకి రమణకి కూడా అయోమయంగా ఉంది. రమణ భర్త వ్యవసాయం చేస్తాడు. మనిషి కూడా నల్లగా సన్నగా ఉన్నాడు. కానీ మెతగ్గా అనిపించాడు. రమణ పెళ్లి అయిన వారానికి వాళ్ళమ్మ పోయింది. రమణ కూడా అత్తగారింటికి వెళ్ళింది.

మొదట్లో నెలకి ఒకసారి చేసే ఫోన్ నెమ్మదిగా తగ్గిపోయింది. రమణ అత్తగారి ఊర్లో ఫోన్ సదుపాయం లేదు. బయట టౌన్‍కి వెడితేనే ఫోన్.

తరవాత వాళ్ళక్క ద్వారా రమణకి కొడుకు పుట్టాడు అని, ఆమె భర్త రాజు చాలా మంచివాడు అని, ఏ చెడ్డ అలవాట్లు లేవు అని, ఊర్లో వ్యవసాయం చేసుకొని బాగానే బతుకుతున్నారు అని తెలుసుకొని సంతోషపడ్డారు.

సంవత్సరాలు గడిచి వినయ్, సుష్మ పెద్దవాళ్ళు అయ్యారు. ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్లు అయ్యాయి. సుష్మ అమెరికాలో, వినయ్ ఇక్కడే. ఇద్దరికీ పిల్లలు.

శ్యామల, రాజారావు రిటైర్ అయ్యారు. ఫ్లాట్ అమ్మి ఇల్లు కొన్నారు. అవడానికి హైదరాబాద్ అయినా, ఉండే ప్రదేశం మారింది, ఫోన్ నంబర్లు మారాయి.

అసలు ఎప్పుడో తప్ప రమణ గుర్తుకి రావటం లేదు. అలాంటిది ఈ మధ్య ఈ కొత్త బట్టల షాప్ ప్రకటనతో రమణ గుర్తు వస్తోంది. వినయ్ అన్నట్టు ఎక్కడ రమణ?ఎక్కడి ఈ రమణి?

నవ్వుకుంటూ లేచింది శ్యామల. ఈలోగా రాజారావు వస్తే భోజనాలు చేసారు.

ఓ మూడు నెలల తరవాత దసరా పండగ ముందు మళ్ళీ అన్ని షాపుల వాళ్ళు రాయితీ ప్రకటించారు.

మాములుగా శ్యామలకి దసరాకి ముందు వెళ్లి చీరలు కొనడం అలవాటు. కూతురుకి, కోడలికి మంచి చీరలు కొన్నా తనకి కట్టుడు చీరలు కొనడం, అవి దసరా, దీపావళి, సంక్రాతికి కట్టి మళ్ళీ ఎండాకాలంలో కొనడం అలవాటు. నూలు చీరలు త్వరగా పోయేవి. పైగా అవి చిరిగే దాక ఉంచకుండా ముందే పనివాళ్ళకి కొత్త చీరతో పాటు ఇవ్వడం చేస్తుంది.

“వీణా మనం దసరాకి చీరలు ఎక్కడ కొందాము?” అంది.

వీణ వెంటనే “అత్తయ్యా! ఆ రమణి సిల్క్స్ చాలా బావుందిట. అక్కడ అన్నీ నూలు, పట్టు నేత చీరలు, మగ్గాల దగ్గరనుంచి తెస్తారుట, పైగా దానికి మాచింగ్ బ్లౌజ్ మగ్గం పని, అద్దాలు కుట్టి ఇలా వాళ్లే ఇస్తారుట. మా స్నేహితులు అందరు అక్కడే కొన్నారు, మనము కొందాము” అంది.

“అలాగే రేపు శని, ఆదివారాల్లో వెళదాము, సుష్మకి కూడా కొన్ని కావాలంది. కొన్ని కాటన్ కొన్ని తేలిక పట్టు కొందాము” అంది శ్యామల.

అనుకున్నట్టుగానే ఇద్దరు షాప్‌కి వెళ్లారు. షాప్ మరీ పెద్దది కాదు, ఎక్కువ ఆర్భాటాలు లేవు. కానీ చీరలు మంచి రంగులతో బావున్నాయి. దానికి తగ్గ వర్క్ చేసిన జాకెట్టు బట్ట. కావాలంటే వాళ్లే కుట్టి ఇస్తారు. అక్కడ తన స్నేహితులు కుట్టించుకుంటే బాగా కుదిరిందని వీణ తనది, సుష్మది ఆది జాకెట్లు కూడా తీసుకొచ్చింది.

ఒకప్పుడు అలా వర్క్ చేసిన జాకెట్లు వేసుకున్నా ఇప్పడు మానేసింది శ్యామల. మళ్ళీ షాపులో ఎక్కడ చూసిన రమణే గుర్తు వచ్చింది శ్యామలకి. మొత్తం మీద అందరి కోసం ఓ పది చీరలు కొన్నారు.

రెండు బ్లౌసులు వీణకి, సుష్మకి కూడా రెండు బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చారు. చీరలు కూడా అంచులు, ఫాల్ మేమే డబ్బులు తీసుకోకుండా చేసి ఇస్తాము అంటే, వీణ అన్ని చీరలు ఇచ్చింది.

“పర్వాలేదా? బిల్ కట్టేశాక మన చీరలు అన్ని వీళ్ళ దగ్గర వదలడం, ఏమి కాదు కదా? 30-40వేల రూపాయల చీరలు” అంది శ్యామల భయంగా.

“లేదు అత్తయ్య, భయం లేదు, మా ఫ్రెండ్స్ దగ్గర, దగ్గర లక్ష రూపాయల చీరలు కొన్నారు. షాప్‌లో పనిచేసే వాళ్లే ఇంటికి వచ్చి ఇస్తారు” అంది వీణ.

ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చి ఇంటికి వచ్చారు. మళ్ళీ శనివారం పొద్దున్న షాప్ నుంచి ఫోన్ వచ్చింది. “మీ చీరలు, జాకెట్లు రెడీగా ఉన్నాయి, పంపుతాము, కానీ ఒక విషయం కనుక్కోడానికి చేసాము” అని అడిగారు.

ఫోన్ ఎత్తిన వీణ “ఏమిటి?” అన్నది.

“మేడం, మీరు పది చీరలుకొన్నారు కదా అన్ని మీకేనా” ఆ అమ్మాయి అడిగింది.

“లేదమ్మా నా కోసం రెండు, మా అత్తగారికి మూడు, మా ఆడపడుచుకి నాలుగు, మా పని ఆమెకి ఒకటి” అంది వీణ.

“మేడం! నేను వీడియో కాల్ చేస్తాను, మీరు ఏవి ఎవరికీ చెపితే, వాళ్ళ పేరు మీద గిఫ్ట్ ప్యాక్ చేసి పంపుతాము. ఇంకా మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది” అంది ఆ అమ్మాయి.

వీణ వెంటనే ఏవి ఎవరికీ అని చెప్పింది.

“మేడం! మీ ఇంటికి సాయంత్రం నాలుగు గంటలకి అన్ని చీరలు పంపుతాము. దయచేసి మీ కుటుంబంలో అందరు ఆ టైంకి ఇంట్లో ఉండండి, మా షాప్ వైజాగ్‌లో మొదలుపెట్టి 5 ఏళ్ళు అయిన సందర్భంలో మేము మా కస్టమర్స్ కుటుంబం ఫోటో తీసుకుంటున్నాము, ఒక బహుమతి కూడా ఉంటుంది” అని చెప్పింది.

వీణ చాల హుషారు పడింది.

“అత్తయ్యా! సాయంత్రం ఆ షాప్ వాళ్ళు వచ్చి మన ఫామిలీ ఫోటో తీసుకొని బహుమతి ఇస్తారట. అందరమూ నాలుగుకి తయారుగా ఉండాలి” అని హడావిడిగా ఏమి చీర కట్టాలి అని వెతకడానికి రూంలోకి వెళ్ళింది.

“ఎక్కడా వినలేదు ఇదేమి వింత? వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫోటోలు ఏమిటి? బహుమతి ఏమిటి?” అని శ్యామల, రాజారావు ఆశ్చర్యపోయారు.

నాలుగు గంటలకి అన్నట్టుగానే రమణీ సిల్క్స్ షాప్ వాళ్ళు కొన్న చీరలు, జాకెట్లు అన్ని పేరు, పేరునా గిఫ్ట్ ప్యాక్ చేసి తెచ్చారు. అందర్ని ఆ చీరలతో రకరకాలుగా ఫోటోలు తీశారు.

“ఇప్పడు మీకు అసలు ఆశ్చర్యం” అంటూ “మా యజమానురాలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు” అని చెప్పారు.

అప్పుడే బయట ఒక ఖరీదైన కారు ఆగింది. అందులోనించి ఇద్దరు అమ్మాయిలు ఇంకో రెండు బట్టల సంచులు పట్టుకొని లోపలపెట్టి బయటికి వెళ్లారు. అప్పుడు లోపలికి వచ్చింది రమణిరాజ్, రమణి సిల్క్స్ యజమానురాలు.

ఫోటోలో కొంచెం తెల్లగా, లావుగా అనిపించింది కానీ చామనచాయ కన్నా ఒక ఛాయ తక్కువ, అంత లావుగా లేదు, కళైన మొహం, మంచి గంధం రంగుకి ఎర్ర బోర్డర్ ఉన్న గద్వాల్ చీర, మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్, మెళ్ళో చిన్న వజ్రం ఉన్న నల్లపూసలు, చెవులకి చిన్న వజ్రాల దిద్దులు సామాన్యంగా ఉన్నా మంచి కళగా, ఆకర్షణీయంగా ఉంది.

ఆమె రూమ్ లోకి రాగానే శ్యామల, రాజారావు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆమెని. రమణి వస్తూనే ఇద్దరి కాళ్ళకి దణ్ణం పెట్టింది.

శ్యామల “రమణా!” అంటూ రెండు చేతులతో గట్టిగా హత్తుకుంది. “నేను చెపుతూనే ఉన్నా! మన రమణేరా అని వీళ్లే అసలు నమ్మలేదు”. కళ్ళలో నీళ్లు వచ్చాయి శ్యామలకి.

“ఎంత పెద్దదానివి అయ్యావు. చాల సంతోషంగా ఉంది రమణా!” సంతోషంగా అన్నారు రాజారావు.

“అయ్యగారు, ఇది మీరు అమ్మగారు పెట్టిన బిక్ష” అంటూ “వినయ్ ఎంత పెద్దవాడివి అయ్యావు” అని, “మీ ఆవిడేనా?” అని అడిగి, “నేను నీకు పెద్ద ఆడపడుచును తెలుసా” అని వీణతో అంది.

వినయ్, వీణ అసలు పూర్తి షాక్‌లో ఉన్నారు. అమ్మ అన్నప్పుడల్లా నవ్వేవాడు, ఎక్కడ రమణ? ఎక్కడ రమణి? అని.

“సుష్మ పాప ఎలా ఉంది? ఎంతమంది పిల్లలు? వినయ్ నీ పిల్లలు ఏరి?” అంటూ ఒకటే హడావిడిగా మాట్లాడుతోంది.

వీణ ముందు తేరుకొని “ముందు మీరు కూర్చొండి, మీకు ఏమైనా తెస్తాను” అంది.

“నీకు మీ అత్తగారిలా కాఫీ పెట్టడం వచ్చా?” అడిగింది రమణ. “వస్తే నాకు కాఫీ ఇవ్వు, రోజు నేను, అమ్మగారు పొద్దున్నే కాఫీ తాగేవాళ్ళం, మా తరవాతే అయ్యగారికి” అని అంది.

“ఇంకా అమ్మగారు, అయ్యగారు ఏమిటే రమణా!”అని “సారీ, పాత అలవాటు, రమణీ” అంది శ్యామల.

“మీరు నాకు ఎప్పటికీ అమ్మగారు, అయ్యగారే, వినయ్ బాబు, సుష్మ పాప, నేను మీకు రమణనే” అంటూ శ్యామల కాళ్ళ దగ్గర కూర్చుంది.

“అయ్యో పైన కూర్చో” అంటూ శ్యామల రమణని లేపి పైన కూర్చోపెట్టుకుంది.

“చెప్పు మీ ఆయన ఎలా ఉన్నాడు? అబ్బాయి ఏమి చేస్తున్నాడు? అసలు ఇంత పెద్ద షాప్ ఎలా పెట్టావు?” ప్రశ్నల వర్షం కురిపిస్తున్న శ్యామలతో

“అది పెద్ద కథ, మీకు చెప్పాలి కానీ ఇప్పుడు కాదు. రేపు మీరు, అయ్యగారు మా ఇంటికి రండి, నేను కార్ పంపుతాను భోజనానికి వచ్చెయ్యండి, మా ఆయనని అబ్బాయిని చూడచ్చు. ఈ నెల విజయదశమి సందర్భంగా ఇక్కడ కొత్త షాపులో ఫంక్షన్ ఉంది, దానికి మా అక్క, అన్న వాళ్ళు అందరూ వస్తారు. వినయ్, వీణా మీరందరు నేను ఇస్తున్న ఈ బట్టలు కట్టుకొని రావాలి. అప్పుడే నాకు సంతోషం, నాకు సుష్మ నెంబర్ ఇస్తే తనతో ఫోన్లో మాట్లాడతాను.” అంటూ తాను తీసుకొచ్చిన బట్టలు, స్వీట్స్, పళ్ళు అందరికి ఇచ్చింది.

“ఏమిటి రమణ ఇవన్నీ ఎందుకు?” అని శ్యామల అంటే

“మీరేమి మాట్లాడద్దు. మీరు ఏమనేవారు, నువ్వు నా పెద్ద కూతురు అని, అవునా కాదా” అంటూ “రేపు తప్పకుండ రావాలి” అని చెప్పి వెళ్ళిపోయింది.

రమణ వెళ్ళాక అందరు ఇది ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోయారు.

వీణ అయితే “ఇదేదో కథలా ఉంది. పనిపిల్ల ఇంత పెద్ద షాప్ యజమాని ఎలా అయిందో?” అంటూ ఆశ్చర్యపోయింది.

కోడలి సంగతి తెలిసిన రాజారావు వినయ్‌తో “వినయ్! మీరు అప్పుడే ఎవరితోనూ అనకండి రమణ వివరం. రేపు మేము వెళ్లి వచ్చాక అప్పుడు ఆలోచిద్దాము” అన్నారు.

ఆ రాత్రి ఎవరికీ సరిగా నిద్ర లేదు.

‘సిండ్రెల్లా కథ లాగా ఉంది’ అనుకున్నారు వీణ, వినయ్.

(మిగతా కథ వచ్చేవారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here