ఆకాశంలో సగమా..?

0
8

[శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ రచించిన ‘ఆకాశంలో సగమా..?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]ణిపూర్ వీధుల్లో ఉన్మాద ముష్కరులచే
నగ్నదేహాలతో ఊరేగింపబడి
మానభంగం కాబడిన మాననీయ మానవతుల
కడగండ్లను కనులు తెరచి కనరండి..

జంతరుమంతర్ సాక్షిగా కర్కశ
కసాయి మూకల పాదాల క్రిందపడి
నలిగిన విశ్వవిజేత
మహిళా రెజ్లర్లను చూడండి..

ఢిల్లీ నగర నడివీధుల్లో పాశవికంగా
చెరచబడ్డ నిర్భయ
దేహం చిందించిన
రక్తపుటేరులు కనపడలేదా!

హైదరాబాదు నగరంలో మృగాళ్లచే
దారుణంగా రేప్ చేయబడి
బూడిదై మిగిలిన దిశ
ఆక్రందనలు వినపడలేదా!

తాడిత పీడిత బడుగు
బలహీన వర్గాల మగువలపై
ప్రతినిత్యం జరుగుతున్న
అత్యాచారాలకు అంతం ఎప్పుడు?

ఆకాశంలో సగం అంటూనే
అతివలను
అధఃపాతాళానికి
తొక్కేస్తుంటే

మరో ముప్పదిమూడు సంవత్సరాలకైనా
వస్తుందా ముప్పదిమూడు శాతం
మహిళా రిజర్వేషన్ బిల్లు
చట్టమై శాసనమై?

లింగ అసమానత్వం
తొలగిపోలేదిక్కడ
సమానపనికి సమానవేతనం
లేదిక్కడ

‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి’
నాటి మనువు కాలం
నుండి నేటి వరకు

మహిళాస్వావలంబన అంటూనే
ముసుగులో వుంచేస్తున్నారు

కళ్లు తెరచి కనరండి
అర్ధరాత్రి స్వాతంత్ర్యం
మహిళలు అందరికీ
రాలేదని

చట్టాలు శాసనాలు
మహిళలపై జరిగే హింసలను,
అత్యాచారాలను ఆపలేవు

ఓ మగవాడా
మహిళా ఓ మనిషేనని
తెలుసుకుని మసులుకో..

మానవ ప్రగతిలో,
సంపద సృష్టిలో
తన కృషి వుందని
మరువకు..

స్త్రీ జాతిని
అణగ దొక్కితే
రేపు నీవే వుండవని
తెలుసుకో..

స్త్రీ ని పూజించ నక్కరలేదు
గౌరవించటం నేర్చుకో.
వేదికలెక్కి పొగడ నక్కరలేదు
నీతో సమానంగా చూడటం అలవర్చుకో.

మనిషి మనిషిలో
మంచితనం మానవత్వం
సమానత్వం మొలకలై
అంకురించాలి

మహిళలందరూ
మనసారా చిరునవ్వులు
వెదజల్లేరోజు
అప్పుడే వస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here