అపరిమితమైన మథనంలోంచి జనించిన కవితల సంపుటి ‘ఆకాశ సముద్రాలు’

0
9

[శ్రీమతి షహనాజ్ ఫాతిమా గారి ‘ఆకాశ సముద్రాలు’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవయిత్రి,  రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని,  శ్రీమతి షహనాజ్ ఫాతిమా వెలువరించిన 4వ కవితా సంపుటి ‘ఆకాశ సముద్రాలు’. ఈ పుస్తకానికి చిరంజీవి గజాల ఫాతిమా చక్కటి ముఖచిత్రం అందించారు. కవయిత్రి షహనాజ్ ఫాతిమా ‘ఆకాశ సముద్రాలు’ కవితా సంపుటిలో తన గురించి తాను రాసుకున్న పరిచయ వాక్యాలు పాఠకులకు ప్రేరణ కలిగిస్తాయి. “మనిషి ఎప్పటికైనా ఏకాకి కాదు, సంఘజీవి ఒంటరిగా (వేటి) సహకారం లేకుండా ఏదీ సాధ్యం కాజాలదేమో! నేను బాల్యం నుండి (1976) మట్టిలో నుండి జీవం కోసం అన్వేషిస్తున్నాను. ప్రకృతిలోని గాలి, వర్షం, ఆకులు,  పువ్వులు, ముళ్ళతో, పసితనంతో సంభాషించడం నేర్చుకున్నాను. ఆకాశంలోంచి నక్షత్రాలు, సూర్య చంద్రులు, శూన్యాన్ని నాలో నింపుకోవాలని అభిలషిస్తున్నాను. మనిషిలో మానవత్వాన్ని వెదుకుతూ చేజెక్కించుకుంటూ, జారవిడుస్తూ మళ్ళీ మానవత్వం చిరునామా కోల్పోకూడదని ఆశిస్తున్నాను. సముద్రం ఒడ్డు నుండి గులక రాళ్లు, గవ్వలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తపనే ‘ఆకాశ సముద్రాలైనాయేమో! అపరిమితమైన మథనంలోంచి ఇంకా బద్దలవని సహన అగ్నిపర్వతంలోంచి కొద్దిగా బయటికొచ్చిన చిన్న చిన్న స్పందనలు ఈ నా చిన్ని పుస్తకం” అని అన్నారు.

~

‘సంస్కృతీ పరిమళాలు’ కవితలో గుండె గులాబీల్లోంచి/సంస్కృతీ పరిమళాలు/గుబాళిస్తున్నాయి/శ్వాస నాళాల్లోంచి/సహస్ర వర్ణాల మేళవింపు/శాంతి శ్వేత వర్ణ స్వరమై/సౌభ్రాతృత్వంతో/ ప్రకాశిస్తున్నాయి/ దృక్కులు కరుణ వాహిని ప్రవాహాలై/విశ్వాన్ని తడిపి/మానవత్వ ఫలాల్ని/ పండిస్తున్నాయి/ మేధస్సు ఉషస్సై మానవాళికి/విజ్ఞాన లోకంలో కొత్త/మార్గాల్ని చూపిస్తున్నది/ – అంటున్నారు. ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు,  నమ్మకాలు, తరాలలో జరిగే మార్పులు,  తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి సంస్కృతి అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి. ఆ సమాజంలో పాటించే ఆచారాలు,  పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం,  ఆటలు, విశ్వాసాలు, కళలు అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి. మన దేశ ప్రజలు ఒకే తల్లి బిడ్డల వలె కలిసి మెలిసి ఉంటూ మానవత్వానికి ప్రతీకగా నిలిచి ఉంటున్నారు. మన దేశ ప్రజల ఐక్యతకు సంస్కృతి పరిమళాలు ఒక గొప్ప నిదర్శనం అని కవయిత్రి చెప్పిన భావం అద్భుతంగా ఉంది.

‘మనసు-ఉనికి’ కవితలో మనస్సు ఉన్నదే!/నిండు జీవనదిలా/ ప్రవహించడానికి/మనస్సున్నదే!/పండు వెన్నెల్లా/ఉదయించడానికి/మనస్సున్నదే కాలాల్ని గుండె/ గదుల్లోంచి సాఫీగా/ప్రయాణం చేయించడానికి/మనస్సున్నదే!/కన్నుల్లో ఉదయ/సంధ్యల వెన్నెల/ ఉషస్సులు నింపడానికి/మనస్సున్నదే!/ముఖ నభంలో/దరహాస నక్షత్ర/ పుంజాల్ని పూయించడానికి/మనస్సున్నదే!/జీవితపథంలో/ఆనంద మజిలీలు/వెదకడానికి/మనస్సున్నదే!/ పృథ్వీలా జవ జీవాలతో/కళ కళ్ళాడ్డానికి/ అంటున్నారు. మనస్సు యొక్క ఉనికిని తెలియజేసిన తీరు బాగుంది. మనస్సు మాయాజాలంలో చిక్కి బందీగా మారిపోతుంది. మనసును మానవత్వంతో నింపాలని మరియు మనసుకు మహత్తరమైన ఉనికిని కానుకగా ఇవ్వాలని ఉంది అంటూ కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘ఒక ఊహ – వాస్తవం – జీవితం’ కవితలో ఒక ఊహ ఒక వాస్తవం జీవితం/కల్పనను కాలదన్నేది నిజం/ఎన్ని కలలు కన్న/ఎన్ని పరి కల్పనలు చేసిన/ఎన్ని ప్రణాళికలు రచించిన/సత్యానిదే జయం/అదే చేదు నిజం/కల్పితానికి, యథార్థానికి/ప్రతి క్షణం హోరాహోరి పోరాటం/ ఇరువురు సమ ఉజ్జీలే/బ్రతుకు చోదక చక్రాలే/ఏదో ఓ పొరపాటు ఎత్తుతో/ఏదో ఏమరుపాటులో/ఊహే వాస్తవమైపోతే/అదే! జీవిత మహోన్నత విజయం/ అంటున్నారు. ఊహ అనేది తనకు తానుగా తెలియజేసే అనుభూతులు, భావాలు మరియు ఆలోచనల ఉత్పత్తి. సమస్యలను పరిష్కరించడానికి జ్ఞానాన్ని వర్తింప జేయడంలో ఊహ సహాయపడుతుంది. ఊహ వాస్తవ జీవితం అని పేర్కొన్న తీరు బాగుంది.

‘గుండె గతి తప్పితే’ కవితలో గుండె గతి తప్పుతుంది/ఊహల వెలుగునీడల్లో/స్పష్టాస్పష్టమైన ఆకారం/అలుక్కుపోయినప్పుడల్లా/గుండె గతి తప్పుతుంది/సంఘటనల ఆటుపోట్లు హృదయావనిని ఢీకొన్నప్పుడల్లా/గుండె గతి తప్పుతుంది/అసహజ తంత్రుల ఉనికిని తొలగిస్తే/ఎడదలో అవరోధం/నిరోధమవుతుంది/గుండె గతి క్రమబద్ధమవుతుంది/అంటున్నారు. గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. గుండెలోని ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. మానవుని గుండె ఎలా గతి తప్పుతుంది? మానవుని గుండె గతి ఎలా క్రమబద్ధమవుతుంది?అని కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘విశ్వ పుష్పం అమ్మ’ కవితలో వెన్నెల ప్రేమామృతాన్ని పంచే జాబిలి అమ్మ/ అనురాగ సాగర ఉత్తుంగ తరంగిణి తల్లి/సప్తవర్ణ ఉద్వేగ శోభిత హరివిల్లు మాత/నియమిత పరిధిలో విశ్వ పరిక్రియ చేసే/ఖగోళాలను శాసించే గురువు అమ్మ/తనలోంచి మరో త్యాగమయికి/జన్మనిచ్చే సహజ సృష్టికర్త/అమ్మతనానికి భాష్యాన్నివ్వలేని/ ప్రపంచ హృదయ నిఘంటువు/అంటున్నారు. సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. కన్నతల్లి బిడ్డని నవమాసాలు మోసి నయమారా సాకుతుంది. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోకెల్లా తీయని పదం అమ్మ. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. అమ్మను గురించి వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.

‘ఆమె’ కవితలో ఆమె ముఖం/శాశ్వత గ్రహణం పట్టిన/చంద్రబింబం/స్వార్థపూరిత గ్రహాల/గతుల్లో మార్పే లేని/ఎప్పటికీ వెన్నెలే/కానరాని జీవితం/ చేయని నేరానికి/శిక్షించబడుతున్న/జీవిత ఖైదీ ఆమె/అనాదిగా ఆధారపడ్డం/అలవాటు చేసిన/ స్వయం ప్రతిపత్తి లేని/పరాధీన ఆమె/సహనం బద్దలైన క్షణం/స్వయం విస్ఫోటనమైతే ఆమె/సమస్తంలో నువ్వు నేను కూడా/మిగలని శూన్యం/ అంటున్నారు. ఆమె ఎలా వివక్షకు గురవుతుంది? ఆమె సహనం కోల్పోతే ఏమవుతుంది? సమస్తంలో నువ్వు నేను కూడా మిగలని శూన్యం అని కవయిత్రి హెచ్చరిస్తున్నారు.

‘తొలకరి’ కవితలో ఆకాశ సముద్రాలు/మబ్బులు/నిరంతరాయంగా/చలిస్తూ, చరిస్తూ/నారికేళ వృక్షాలను/స్పృశిస్తూ/అల్లరిగా దోబూచులాడే/పసిపాపలా/మేఘాల కేరింతల/చిరునవ్వుల/ విద్యుల్లతలు/రువ్వుతూ/తొలకరి మబ్బులు/పృథ్విని పలకరిస్తూ/ముసిరి మురిసి పోతూ/జీవనాన్నిస్తూ/సాగిపోతున్నాయి/ అంటున్నారు.

తొలకరి అంటే వానల ఆరంభాన్ని సూచిస్తుంది. తొలకరితో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు. ఎండలకు బీడు బారిన పొలాలు తొలకరి వర్షంతో పదునుబారడంతో రైతులు భూమిని దున్ని వ్యవసాయపు పనులను ప్రారంభిస్తారు. తొలకరి వానల వల్ల పుడమి పులకరించి పోతుంది. మనుషులు, పక్షులు, ప్రాణులు అన్ని సంతోషంతో మురిసిపోతాయి. వర్షపు జల ధారలు సోకి ప్రకృతి పరవశించిపోతుంది అని చెప్పిన భావం బాగుంది.

‘జలజీవం’ కవితలో భూమి ఓ నీటి బొట్టు/ఆ చుక్క! నీటి ప్రతిబింబంలో/చమక్కనే చుక్కల్లా/జల జీవంతోనే/ప్రాణి మనుగడ/ఓ పుష్పం/హసిస్తే/ తుషార పలువరస/తళుక్కన్నది/పత్రం, హరిత హారమై/పునరుజ్జీవనం కోసం స్వప్నిస్తున్నది/ అంటున్నారు. అన్ని ప్రాణులకు జలం జీవాన్ని ఇస్తుంది. జలం లేకుంటే ప్రాణికోటికి మనుగడ లేదు. ‘జలజీవం’ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను కదిలిస్తాయి.

‘మృత కణం’ కవితలో చదరంగంలోని పావుల్లా/చుట్టూ ఆంక్షల మోహరింపు/ఐనా నియమోల్లంఘన/కావరంతో కామాంధుల/కబళింపు/తోలుపై తొడుగుల మీద/ తొడుగుల్లో/ ఆడజాతి/నిర్బంధ సమాధి జీవితం/మగాడి నిగ్రహరాహిత్యం/వజ్ర, రజత, స్వర్ణ మౌక్తికాలతో దేహాన్ని సింగారించక/మనస్సును మానవతా/ప్రేమతో అలంకరించు/ఆడ జాతి సమాధులు/క్రూరంగా కడుతున్న/నిగ్రహరాహిత్య/ మగ కామాంధులు/ అంటున్నారు. ఆడ వాళ్ళు తమ శరీరాన్ని నగలు, ఆభరణాలతో సింగారించక మనసును మానవతా ప్రేమతో అలంకరించుకోవాలి. సమాజంలో స్త్రీలపై అత్యాచారాలు రోజురోజుకు పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకు నిత్యము జరుగుతున్నాయి. ఆమె దేహంలోని మనస్సు,  మస్తిష్కం, ఉనికి దేనికి అని ప్రశ్నిస్తున్నారు. కవయిత్రి వ్యక్తం చేసిన భావం స్త్రీలకు సూచనలా ఉంది.

‘పారదర్శక పసితనం’ కవితలో హృదయం ఆల్చిప్పలో/అపురూప ముత్యం బాల్యం/ అమ్మ ఒడి వెచ్చదనం/బాలల స్వర్గం/తల్లి పాలంత స్వచ్ఛత/ పసిపిల్లల్లో సహజం/పావురాయంత ప్రశాంతత/ జగతికి అవసరం/సూర్యునిలోని వెలుగు/చంద్రుని మెత్తని చల్లదనం/మేధస్సులో విశ్వవిజ్ఞాన/ భాండాగారం నిక్షిప్తం/తలుపులు తెరవడమే తరువాయి/పరిశీలన, పట్టుదల/విశ్వం అంతు చూసే తపన/ప్రకృతికి, అనంత విశ్వానికి/సహజ ప్రతినిధులు పిల్లలు/ అంటున్నారు. పిల్లలు దేవుడు చల్లనివారే కల్లాకపటం ఎరుగని కరుణామయులే అని సినీగీతం విన్నాం. కవయిత్రి ఉపాధ్యాయిని పాఠశాలలో పిల్లలకు చదువు చెబుతూ పిల్లలతో గడిపిన అనుభవం ఉంది. పిల్లల పసితనాన్ని బాలల హక్కుల గురించి వ్యక్తం చేసిన భావాలు, పసి పిల్లలను దగ్గర నుండి చూసినట్లుగా అనిపిస్తుంది. పిల్లలతో గడపడం ఒక గొప్ప అనుభూతి. పిల్లలు మీరే జగతికి పునాదులు. భావి భారత పౌరులు. ఈ కవిత బాల సాహిత్యంలో చేర్చదగినదిగా ఉంది.

‘చిరు నవ్వుల రిక్కలు’ కవితలో మేం పిల్లలం పసి పువ్వులం/చిరునవ్వుల రిక్కలతో పూస్తాం/నవ్వుల పరాగాలతో పరిమళిస్తాం/గాలుల ఊయలలల్లో ఊగిసలాడుతాం/పక్షుల రాగాల రెక్కలతో ఎగురుతాం/పిల్లలం పసి పువ్వులం/ఆంక్షల అంకుశాలు మాకొద్దు/పరిమితుల పగ్గాలు మాకొద్దు/ప్రశ్నల పరీక్షల కంపలు మాకొద్దు/ యంత్రాలుగా మార్చే వ్యవస్థలు మాకొద్దు/భావి జవాబుదారులం మేమే/జగతికి పటిష్టమైన పునాదులం మేమే/భూమ్యాకాశం అంచుల వరకు/ నవ్వుల రెక్కలతో విహరించేస్తాం/పిల్లలం మేము పసిపిల్లలం/ అంటున్నారు. పిల్లలు చిరునవ్వుల రెక్కలు అంటూ కవయిత్రి మనలను పిల్లల లోకంలోకి తీసుకువెళ్లిన తీరు తన్మయతను కలిగిస్తుంది.

‘మానవత్వమే సమస్తం’ కవితలో అభ్యుదయ ఆకాశంలో వెదికి/విశ్వానికి మరో ప్రపంచాన్ని/కానుకగా ఇచ్చినవాడు శ్రీశ్రీ/ మానవత్వమే మనిషికి/అత్యంత అవసరం/ మానవత్వమే సమస్తం/అన్న వాడు శ్రీశ్రీ/అని కవయిత్రి కవితలో వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.

‘జీవితం మిళితం’ కవితలో ఋతువులు/సీతాకోకచిలుకలై/నా చుట్టూ/పరిభ్రమణం/ వసంతం/ అంకురాల/అడుగులతో/వన వ్యాహ్యాళి/ఈ దేహం/ఆరు ఋతువుల/ప్రాణాల సమ్మేళనం/అంతిమంగా/ఈ దేహం/అనంతంలో/ఋతువుల్లానే/మిళితం/అంటున్నారు. మానవ జీవితాన్ని ఋతువులతో పోల్చిన తీరు బాగుంది. అంతిమంగా మనిషి జీవితం ఋతువులోనే మిళితం అవుతుంది. ఏమిటి మనిషి జీవితం? ఇలా ఋతువులతో మిళితం అయింది అని ఆశ్చర్యం గొలుపుతుంది. కవయిత్రి కవితలో వ్యక్తం చేసిన భావాలు అబ్బురపరుస్తుంది.

‘సుధా సంజీవని’ కవితలో ఆత్మ విశ్వాసమనే లవణ/జల ధారల్ని గ్రహిస్తున్నాను/పచ్చల పత్రాలతో మూర్తిమత్వ/ప్రాణ వాయువుల నిస్తున్నాను/ ధరణిని సుందరమయం చేస్తూ/మనోల్లాస మకరందాల/పూ పరిమళాల్ని ప్రదానం చేస్తున్నాను/భావి తరాలనే మేధావి/ ఫలాల్ని పృథ్వికి కాన్క/చేస్తున్న నేను తరువుని/ తరగని తరాల అపురూప గనిని/తరుణీమణిని/ ప్రస్తుతం – పరిస్థితి/ప్రపంచీకరణ ముసుగులో నగ్నమై/ఆదిమ జాతులవుతున్న మానవులు/ పురుషాధిక్యత నుండి డబ్బు ఆధిపత్య/విష కోరల్లో చిక్కుకున్న సమాజం/మాతృత్వం ఉనికిని మార్చేస్తున్న/అద్దె గది నా గర్భసంచి/సమస్తాన్ని ఒడిలో వాత్సల్యంతో/సాకుతున్న తల్లిని – మార్గదర్శిని/సదా సజీవమైన మనసున్న మనీషిని నేను/ కవయిత్రి సుధా సంజీవనిగా మహిళను కవితలో చిత్రించిన తీరు వాస్తవాలను తెలియజేస్తుంది. మహిళ జీవితం సమాజానికి ఆదర్శం. మహిళ సమాజానికి సుధా సంజీవని అనేది తిరుగులేని సత్యమని భావించిన కవయిత్రిని అభినందించాలి.

‘శవ పేటికలో మానవత్వం’ కవితలో కాముకుడా!/నీ గమనం/చివరాఖరికి/ అక్కడికే ఐతే/అక్కడే ఆగక/ఇక్కడి కొచ్చావెందుకు?/ నియమాల/ఆచ్ఛాదనలో/పురోగమిస్తూ/కామ కోర,  నఖ/ ఖడ్గాలతో/గీరుతున్నవెందుకు?/మృగాల నుండి/వేరవుదామనే/ఆత్రుతతో/నడుస్తూ/ దాపరికంగానో/బహిర్గతంగానో/మళ్లీ పశువవుతున్నావెందుకు?/మానవత్వాన్ని/శవపేటికలో పెట్టి/ భూస్థాపితం చేయ/ ప్రయత్నిస్తున్నవెందుకు? మానవత్వం మమ్మీలా మారదు/మసి కాలేదు/ధూళి కాబోదు/నిత్య చైతన్య శీలి/మానవత్వానికి చావు లేదు/ఏ శవ పేటికలోను ఇమడదు/ అంటున్నారు. కవయిత్రికి మానవత్వం పట్ల అపారమైన విశ్వాసం ఉంది. కాముకుల దుర్మార్గపు చేష్టలను అణిచివేసే శక్తి ఒక్క మానవత్వానికే ఉంది. మానవత్వం గొప్పది మానవత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

‘ఆత్మపూరణ’ కవితలో విశ్వపాలితవు నీవే/నీవు జననివి/సమాజ నిర్దేశానివి నీవే/ సమయ సారిణివి/విజ్ఞాన విశ్వానివి నీవే/జ్ఞానబోధినివి/సంపూర్ణత్వానివి నీవే/నీలోనే సర్వం కేంద్రీకృతం అంటున్నారు. జగత్తును రక్షించే జననిని కవితలో గొప్పగా ఆవిష్కరించారు.

‘దర్శన ఆశయం’ కవితలో నిన్నలోని నిశ్శబ్దం/నిజంలోని అబద్ధం/నాటి అంచున నేటికీ/అవధులు మీరని ఆశయం/ఆకాశ ఆల్చిప్ప మనస్సున/అవని అసాధారణ ముత్యం/రేపటి దేదీప్యమైన సూర్య ముఖాన/సుప్రభాత వాస్తవ కిరణ దర్శనం/ అంటున్నారు.

‘మూర్ఖ మగతనం’ కవితలో అంతర్జాల, సినీ మాయాజాలం ఎరలో/అశ్లీల గాలానికి చిక్కుకున్న లేత ప్రాయం/గుట్కా గుడుంబాల సుడిగుండంలో/గింగిరీలు కొడుతున్న మానవత భవిత/మత్తుమందుల ఊబిల్లో కూరుకుపోయి/శిథిలమవుతున్న/గ్లోబల్ ప్రపంచ యువత/మగవాడి మెదడుకు/శస్త్ర చికిత్స చేసి/ కామానికి కళ్లెం వేసే/యంత్రాన్ని బిగించాలి/మదపు మగ ఏనుగులను/నియంత్రించే/కఠిన శిక్షలకు/ శంకుస్థాపన చేయాలి/ అంటున్నారు. అంతర్జాలం,  సినిమాల మాయాజాలంలో చిక్కి యువత చిన్న వయసులోనే అశ్లీలతను చూసి చెడిపోతున్నారు. గుట్కాలు తింటూ గుడుంబాలు మత్తు మందులు త్రాగుడుకు అలవాటు పడి యువత తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. యువత నేరాలు, ఘోరాలు చేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దురలవాట్లకు లోనైన యువతకు సరైన శిక్షలు విధించాలి. యువతలో మార్పు రావాలని ఆశించడం బాగుంది. కవయిత్రి కవితలో వ్యక్తం చేసిన భావాలు యువతకు కనువిప్పు కలిగేలా ఉన్నాయి.

‘రెక్కల్లో కూనలు’ కవితలో చుక్కలు రాలి రత్నాలై/బ్రతుకుల్ని మెరిపిస్తాయని/పర్రె బాసిన బతుకుల్లో/వసంతం వస్తుందని/ఎండమావి వంటి ఆశ/ఉన్న ఊరు బీడై బండ బారింది/పచ్చని నేల గొడ్డైంది/కూడు గుడ్డ కరువైంది/ఉసురు తాకట్టు పెట్టి/ఇసుక దేశంలో/ మూగ జీవి జీవితం బానిసైంది/పరాయి లోకంలో/ కాలు పెట్టి మసకై/రాయైన బతుకు/అంటున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువైంది. అలాంటి గడ్డు పరిస్థితిలో ఏం చేయాలో తోచక కన్నవారిని భార్యా పిల్లలను వదిలిపెట్టి పరాయి దేశమైన దుబాయికి వలస వెళుతున్నారు. దుబాయి దేశానికి వలస పోయిన వారి జీవితం బానిస బతుకు అయి పోయింది. అక్కడ కాసులు సంపాదించడం కాదు. దుబాయి దేశంలో కష్టాలే మిగిలినాయి. ఇంటి వద్ద భార్యా పిల్లలు, తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ బతుకు గడుపుతూ దుబాయి దేశం నుండి ఎప్పుడు వస్తాడు అని ఎదురుచూపులు చూస్తూ కాలం గడుపుతున్నారు. దుబాయి దేశానికి వలస పోయిన కార్మికులు అంధకారంలో మగ్గుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు కాన రావడం లేదు. కవయిత్రి కవితలో వ్యక్తం చేసిన భావాలు వాస్తవాలకు అద్దం పడుతున్నాయి.

‘సహజ స్వాగతం’ కవితలో అక్షరాలు పూల పరిమళాలై/మైమరిచి పూస్తున్నాయి/పదాలు లేలేత చివురులై/పూతకాతై మృదుహాసంతో పలకరిస్తున్నాయి/మానవ జీవన ప్రగతి పథంలో/అనుభవాల వికసిత కావ్యాలు/ ఉల్లాస ఉదయాలై/ స్పందిస్తున్నాయి/ అంటున్నారు. కవయిత్రి అక్షరాలకు సహజ స్వాగతం పలికారు. అనుభవాల వికసిత కావ్యాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయని చెప్పిన తీరు బాగుంది.

‘సాకార జ్ఞాపకం’ కవితలో ఉదయ సంధ్య/కలల ఆల్చిప్పల్లో చేరి/కలత చెంది/ముత్యాలైన/నీ జ్ఞాపకాలు/గతం జ్ఞాపకం/ప్రస్తుతం నిజం/ సాకారమవడానికి/ వృథాగా/సమాయత్తమవుతున్న /నీ జ్ఞాపకాలు/అంటున్నారు. ఉదయ సంధ్యలో నీ జ్ఞాపకాలు, ఉదయం పూట నీ జ్ఞాపకాలు, పగలు నీ జ్ఞాపకాలు, సంధ్య వేళలో నీ జ్ఞాపకాలు, రాత్రిపూట నీ జ్ఞాపకాలు, వర్షాల్లో నీ జ్ఞాపకాలు, హేమంత ఋతువులో నీ జ్ఞాపకాలు, శిశిర ఋతువులో నీ జ్ఞాపకాలు, గ్రీష్మ ఋతువులో నీ జ్ఞాపకాలు, గతం జ్ఞాపకం, ప్రస్తుతం నిజం అంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్న తీరు బాగుంది.

‘సిరిశాల’ నా ఊరు కవితలో ధరాతల స్వర్గానికి/చిత్రపట నమూనా నా ఊరు/పచ్చని ప్రకృతికి చిరపరిచిత/చిరునామా నా ఊరు/శ్రామిక జీవన సన్మానార్థం/కప్పే నూలు దుశ్శాల నా ఊరు/చెరువులు, రాఖీ గుట్టల మణులు/పొదిగిన మానేరు కంఠహారం నా ఊరు/ సమాజ శ్రేయస్సుకై స్పందించే సహజాత కవుల మాత నా ఊరు/ప్రగతి పథాన తారా సుమాల/ ఉద్యానవన గగనం నా ఊరు/మానేరు ఇసుక, నీటి పాయల/కుచ్చిళ్ళతో ప్రకృతి చీరలో నా ఊరు/ ప్రకృతి పయ్యెదను కప్పే/పచ్చని అచ్చుల అద్దకపు పై వస్త్రంతో నా ఊరు/ఏకత్వ వర్ణ హరివిల్లు నా ఊరు/మానవత్వ పూర్ణ సిరిశాల నా ఊరు/ అంటున్నారు. సిరిసిల్ల అనే పేరు సిరిశాల నుండి వచ్చింది. సిరిశాల అంటే సంపదకు కేంద్రం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. సిరిసిల్ల మానేరు నది ఒడ్డున ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూమ్‌లు టెక్స్‌టైల్, ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఉన్నందున దీనిని టెక్సటైల్ టౌన్ అని కూడా పిలుస్తారు. నలుబది వేల పవర్ లూమ్‌లతో తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద టెక్స్‌టైల్ హబ్‌గా ప్రసిద్ధి పొందింది. విశాలాంధ్ర ఉద్యమ సమయంలో మొదటి విశాలాంధ్ర మహా సభ,  సిరిసిల్లలోనే జరిగింది. సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి పొందింది. వేములవాడ సిరిసిల్ల పక్కన శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజన్న సిరిపట్టు, సిరి చందన పట్టు చీరలు, సిరిసిల్ల పట్టణంలో తయారవుతున్నాయి. సిరిశాల కవయిత్రికి జన్మనిచ్చిన ఊరు. కన్నతల్లి లాంటి సిరిశాల గురించి కవితలో పేర్కొన్న భావాలు అద్భుతంగా ఉన్నాయి.

‘వెన్నెల’ కవితలో చంద్రుని మైత్రిలో/సూర్యకిరణాలు కరిగి/పూసిన వెన్నెల పూలు/జాబిలి లోంచి జారి/జగతినంత పర్చుకొని/ ఊరించి చంద్రునిలోనే/లీనమైపోతున్న వెన్నెల/ అంటున్నారు. కవయిత్రి సుదీర్ఘంగా వెన్నెల గురించి రాసిన కవితలోని భావాలు వెన్నెల సౌందర్యాన్ని ఆస్వాదించినంత ఆనందంగా ఉంది.

‘సమానమే!?’ కవితలో మాతృగర్భంలోంచి ఉత్సాహంగా/బయటికొచ్చినప్పుడే/మొహమాటాల స్వాగతం నాకు/ప్రకృతిలోని అద్భుతాలన్నీ నాలోనే ఉన్నా/ మొగ్గగా కూడా స్వేచ్ఛగా మసులుకునే హక్కు లేదు/హక్కులన్నీ కాగితాల్లోనే సొల్గుతున్నాయి/ సమాజంలో మాత్రం సమాన హోదా రాదు/ వివక్షతలేని మాతృగర్భం నిహిసంలో ఎంత నిశ్చింత/ ప్రపంచంలో మనుగడ ఎంత ప్రయాస/ఆధారపడ్డం కాకుండా/ఆధారమవుదాం/సమాన హక్కులు/ అవకాశాలు మనమే తీసుకుందాం అంటున్నారు. ఆకాశంలో సగం అవకాశాల్లో కూడా సగభాగం అవుదాం అంటూ కవయిత్రి మహిళా లోకానికి స్ఫూర్తిని కలిగిస్తున్నారు.

‘వాత్సల్య నీరదాలు’ కవితలో స్నేహ వాత్సల్యాలు/అశరీర నదీ నదములై/ ప్రవహిస్తున్నాయి/పరిసరాల్ని పచ్చగా/పలకరిస్తూ వడిగా/ వాలుకే వాలి/ పారుతున్నాయి/ అంటున్నారు.

‘గృహహింస’ కవితలో తెలంగాణ చూరు కింద/పొత్తుల సంసారంలో/బహిరంగ గృహహింసలో/అన్యాయమై పోతున్న/తెలంగాణ పోరికి/వేరు సంసారం పెట్టిద్దాం/వేరుబడ్డ తెలంగాణ/సంసారాన్ని/తీరుబడిగా/తీర్చిదిద్దుకుందాం/ అంటున్నారు.

‘చలన చైతన్యం’ కవితలో ఓ చైతన్యమా!/కదలిరా!/లే! లేచిరా/లే,  పరిసరాల్ని/పల్లవించు అంటున్నారు. మనలో నిండి నిబిడీకృతమై ఉన్న చైతన్యాన్ని కవయిత్రి జాగృతం చేస్తూ తట్టి లేపుతున్నారు.

‘నన్ను నేను పలకరించుకొని’ కవితలో ఎన్నాళ్ళయిందో!/నన్ను నేను పలకరించుకొని/నన్ను నేను విని/శబ్ద కాలుష్యాల బారిన పడిన/నా చెవులు ప్రకంపించడం/నన్ను వినడం మానేసాయి/ ఎన్నాళ్ళకైనా నేను/నాతో నేను మాట్లాడుకోగలనో లేనో/నన్ను నేను వినగలనో లేనో/ అంటున్నారు. సర్వత్ర వ్యాపించిన చప్పుళ్లు ధ్వనులతో ప్రాణికోటి మనుగడకు ముప్పుగా తయారైంది. కవయిత్రి శబ్ద కాలుష్యం గురించి అద్భుతమైన కవితను అందించారు.

‘ఆకాశ సముద్రాలు’ కవితా సంపుటిలోని కవితలు లోతైన భావాలు, గాఢతతో నిండి ఉన్నాయి. కవయిత్రి షహనాజ్ ఫాతిమా హృదయగతమైన భావాలు జీవంతో తొణికిసలాడుతున్నాయి. ఇవి పాఠకుల హృదయాలను పరవశింపజేస్తాయి. కవయిత్రి షహనాజ్ ఫాతిమా మరిన్ని మంచి కవితా సుమాలను విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

***

ఆకాశ సముద్రాలు (కవిత్వం)
రచన: షహనాజ్ ఫాతిమా
ప్రచురణ:
మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల.
పేజీలు: 72
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
కవయిత్రి
శ్రీమతి షహనాజ్ ఫాతిమా
ఎస్.ఎస్.బి. టవర్స్,
కమాన్ దగ్గర
కరీంనగర్ 505001
ఫోన్: 8008333360
email: sha.fa.naaz@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here