ఆకాశం నిండా ఆవరించిన ఇంద్రధనుస్సు – విశ్వనాథ సాహితీ స్రోతస్సు

0
8

[box type=’note’ fontsize=’16’] శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా శ్రీ కోవెల సుప్రసన్నాచార్య సంచిక కోసం ప్రత్యేకంగా  రచించిన ఈ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఇ[/dropcap]రవయ్యో శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ఒక ప్రతిభా విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం పేరు విశ్వనాథ సత్యనారాయణ. ఒక కవి రాకతో పూర్వ కవుల మార్గాలు స్థానాలు మారిపోతాయని టీ ఎస్ ఇలియట్ చెప్పిన సందర్భమది. నన్నయ్య నుండి తెనాలి రామకృష్ణుడి దాకా విస్తరింపబడిన కవుల అంతస్తులు ప్రతిభాస్థానాలు అనూహ్యంగా మారిపోయాయి. కొత్త అంచనాలకు స్థానం ఏర్పడింది.

మతి దివిషద్గురుల్ నను సమాహిత చిత్తు అనంత కల్పనా

చతురుని దేశభక్తి గుణ సాంద్రుని నిత్య సరస్వతీకుడనని

ఝాన్సీరాణి అంకిత పద్యాల్లో ఆయన చెప్పుకున్నారు. సర్వతోముఖమైన ఆయన సృష్టించిన సాహిత్య ప్రపంచానికి పూర్వం గానీ, సమకాలంలోకానీ, సమానులెవరూ లేరు. ఆయన కల్పనాచాతురి చిన్న కథనుండి మహేతిహాసం దాకా ఉజ్వలంగా కొనసాగింది. ఆయన రచనావేగం రెండు మూడు రోజులలో రెండు నవలలు డిక్టేట్ చేసిన ఉదంతం, ఒక చాంద్ర మాసంలో (28 రోజులు) వెయ్యి పడగల వంటి అద్భుతమైన అసదృశమైన తెలుగు జీవితాన్ని అచ్చెరువు కొలిపేట్లు చిత్రించి మన సంస్కృతికి దర్పణ ప్రాయమైన మహా గ్రంథాన్ని వెలయించిన విశ్వనాథకు ఎవరిని సాటి అని చెప్పలేము. ఒక రచయిత చేతి మీదుగా ఒకటి పద్యంలో రెండవది గద్యంలో రెండు మహేతిహాసాలు రచింపబడటం సాహిత్య చరిత్రలోనే సాటివచ్చిన సందర్భాలు వెతుక్కోవలసినవే.

మా అధ్యాపకులు విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు ఒక సందర్భంలో మేము మట్టి పిసికి తిన్నవాళ్లం అన్నారు. ఆ మాట నాకు అప్పుడు అర్థం కాలేదు. భూమిని నమ్ముకొని జీవించిన వాళ్లమని అర్థమని తరువాత తెలుసుకొన్నాను. విశ్వనాథ రచనలన్నింటిలో కూడా సజీవ ప్రకృతి చరాచరమైన చెట్లు, గుట్టలు, జంతువులు, పశు పక్షులు, మొదలైనవన్నీ అద్భుతంగా దర్శనమిస్తాయి. శార్వరి నుండి శార్వరికి కానీ, తెలుగు రుతువులు కానీ, వేగై నది సజీవంగా ప్రవహించిన ఏకవీరలో కానీ మబ్బుల వర్ణనతో విశ్వాధారము కాలము ఏ సమయమావిర్భూతమౌ తత్కళా శశ్వల్లక్షణమావహించు అని కాలస్వరూపాన్ని వ్యాఖ్యానించిన ఝాన్సీరాణిలో కానీ, మృత్యు స్వరూపాన్ని, దాని నిత్యత్వాన్ని, అపరిహార్య లక్షణాన్ని వివరించిన, చర్చించిన రురు చరిత్రలో కానీ, దాన్లో అంతర్నిహితమైన మాస్టర్ సీవీవీ యోగ లక్షణాన్ని గురించి కానీ, మా బాబులోని మానుషజీవితంలోని అప్రమేయమైన వ్యథను గురించి కానీ, చెలియలి కట్టలో వర్ణింపబడిన సముద్రమూ, చెలియలి కట్టలలోని ప్రతీకాత్మకతను గురించి కానీ, జేబు దొంగలలోని మనశ్శాస్త్ర పరిశీలన గురించి కానీ, సముద్రపు దిబ్బలోని సామాజిక రాజకీయ వ్యవస్థలలోని నిత్య పరివర్తన శీలాన్ని, మ్రోయు తుమ్మెదలోని సంగీత అనుభవాలను, గిరిక ప్రకటించిన నాట్యానుభవాన్ని…..

ఇలా ఎంతని చెప్పగలం? జడమయమైన, ప్రాణమయమైన, మనోమయమైన చైతన్యంలోని సహస్రాధిక స్తరాలను ప్రకటించిన బ్రాహ్మీమయమూర్తిని ఎలా అంచనావేయగలం? కవితారంగంలో అనేకములైన విశేషచ్ఛందాలను ప్రయోగించి వాటిని నిలబెట్టడమే కాకుండా ఎప్పుడో నన్నయ అరుదుగా ఎర్రన ప్రయోగించిన మధ్యాక్కఱను వేలకొలదిగా రచించి దానికి నిత్యత్వాన్ని కల్పించి తరువాతి తరం వారు దాన్ని సజీవంగా ప్రయోగించే దశకు తీసుకొచ్చిన మహానుభావుడు ఆయన. తెలుగు పదాల వినియోగంలో పాల్కురికి సోమన తరువాత, తిక్కన తరువాత, వారికంటే అధికంగా తాళ్లపాక కంటే విలక్షణంగా అచ్చ తెనుగు పదాలను ప్రయోగించిన భాషాప్రపంచ నిర్మాత. అంతేకాదు. తత్సమ పదాల ప్రయోగంలోనూ, ఆయనది అనన్య సామాన్యమైన రీతి.

ఆయన గురువుగారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ..

నా మార్గంబును కాదు.. శిష్యుడైనన్, నాతత ముత్తాతలం
దే మార్గమున్ గాదు.. వీనిదెదియో ఈ మార్గమట్లౌటచే
సామాన్యుండనరాదు. కవితా సమ్రాత్వమీ రీతిలో
ఈ మచ్ఛిష్యుని తా వరించినది. నేనెంతే ముదంబందెదన్

కవిసమ్రాట్ బిరుదము తానై విశ్వనాథను వరించినదని ఎవరో ఇచ్చినది కాదని అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత పేర్కొన్నాడు. నిత్య సరస్వతీకుడనని అన్న మాట మరొకరికెవరికి చెల్లుతుందని నాకు తోచడం లేదు. ఆయన రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము.. ఆదిమమైన దైవాసుర సంఘర్షణను ప్రతిభాపూర్ణంగా చిత్రించింది. ఆధునిక కాలంలో బ్రిటిష్‌వారు మన దేశంపై చేసిన దండయాత్రలు దోపిడీలు దీనిలో ప్రతిఫలించాయి. జీవితాన్ని భౌతికమైన ఇంద్రియ సుఖాలకు పరిమితం చేసి శరీర నిష్టతో బతుకుతున్న ఈనాటి సమాజానికి దేవభావ నిష్టతో ఉన్నత దివ్య జీవన నిశ్శ్రేణిక నెక్కి సృష్టిలోని తమోగుణాన్ని, రజో గుణాన్ని అథ:కరించి సత్వ మయంగా పరిణమింపజేయవలసిన అవసరాన్ని భూమిని దు:ఖ రహితంగా తీర్చి దిద్దే ప్రయత్నాన్ని కల్పవృక్షం నిరూపించింది. నేటి కాలంలో మానవ సంబంధాలు ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు వ్యత్యస్తమైన సన్నివేశంలో దానిలోని సామరస్యాన్ని నిలబెట్టవలసిన అవసరాన్ని కల్పవృక్షం ప్రబోధించింది. ఇంతేకాక ఎంతటి దోషభూయిష్టమైన తమోమయమైన అహంకార పూరితమైన జీవితం కూడా పరిణామంలో రజస్తమో భూమికలను దాటి దివ్యజీవనాభిముఖంగా ప్రయాణించగలదని రావణ పాత్రలోని పరిణామాన్ని సంశయ, నిస్సంశయ ఖండాల ద్వారా నిరూపించింది. ఈ రకమైన పరిణామాన్ని బలపరిచే సన్నివేశం ఎక్కడో అరుదుగా తప్ప పూర్వ కావ్యాలలో, ఇతిహాసాలలో ప్రకటితం కాలేదు. ఏ జీవునికైనా భగవత్ సాక్షాత్కారం లభించగలదని వైదిక సందేశాన్ని శిరోధార్యంగా చేసికొని ఈ కల్పవృక్షం వెలువడింది.

ఆకాశం నిండా ఆవరించిన ఇంద్రధనుస్సులాగా రోదసిలో రెక్కలు విప్పి ఆడే హంస మిథునంలాగా భూమండలాన్ని క్రిమీడితం చేసే మయూర నృత్యం లాగా విశ్వనాథ సాహిత్యం ప్రతిభా వైదుష్యం అసామాన్యమైనవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here