ఆకాశమంత

0
11

[dropcap]ప్రి[/dropcap]యమైన నాన్నకు,

నమస్సులు.
నాన్నా! ఎలా ఉన్నారు? నేను, శ్రీకాంత్, పిల్లలు క్షేమం. ఉపన్యాసాలు, పుస్తకావిష్కరణలు అంటూ ఊళ్లు తిరిగినవారు తిరుగుతున్నట్లే ఉన్నారు. ఎండల్లో ఆరోగ్యం జాగ్రత! ఉద్యోగ విరమణ తర్వాత మీకిష్టమైన రీతిలో ఉండటానికి పూర్తి అవకాశం కలిగింది. దాన్ని మీరు సద్వినియోగ పరచుకుంటున్నారు. సంతోషం నాన్నా! మీకు ఎప్పుడూ నలుగురితో కలిసిపోవటం, చుట్టూ ఉన్నవారికి చేతనైన సహాయం చెయ్యటం ఇష్టం. ఒంటరితనాన్ని అస్సలు ఇష్టపడరు. కాని, రోజంతా ఉత్సాహంగా అందరితో కలిసి గడిపినా, రాత్రికి ఇంటికి వచ్చేవేళకు ఒంటరితనమేగా! అమ్మ లేని లోటు నా కన్నా మీకే ఎక్కువ. అందుకే, ఈ మధ్య మరిన్ని వ్యాపకాలు కల్పించుకుంటున్నారనుకుంటా.

నేను కూడా ఈ మధ్య ఇక్కడొక సేవా సంస్థలో సభ్యురాలిగా చేరా నాన్నా! పెళ్లిళ్లలో, శుభకార్యాలలో మిగిలిపోయిన భోజన పదార్థాలను రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌ల దగ్గర ఉండే అనాథలకు పంచే కార్యక్రమంలో చేరా! ఆ సంస్థ వాళ్ళు ఫోను చేసినప్పుడు ఉదయమే వెళ్లి, వడ్డించటంలో సాయం చేస్తాను. ఇది నాకెంతో తృప్తిగా ఉంది నాన్నా! ఎప్పుడూ వంట, ఉద్యోగం, ఇల్లు ఇంతేనా జీవితం! ఈ పరిధికి అవతల ఏదైనా చేయాలనిపించింది. ఈ అవకాశం వచ్చింది. అంతేకాదు, నా జీతంలో కొంత భాగం ఇక్కడ ఓ వృద్ధాశ్రమంలో ఇవ్వగలుగుతున్నాను.

ఆ రోజుల్లో మీ చిన్న జీతంతో మమ్మల్ని బాగా చూసుకుంటూనే, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో దేవాలయాల దగ్గర ఉండే భిక్షవులకు పళ్ళు, పులిహోర పాకెట్లు పంచుతూ ఉండేవారు. నా చేత కూడా ఇప్పిస్తూ ఉండేవారు. ‘ఇటువంటి చిన్న చిన్న సంతోషాలు లేకపోతే జీవితం నిస్సారమైపోతుంది’ అనేవారు నాతో. అలాంటి చిన్న చిన్న సంతోషాలు మీ స్ఫూర్తితో నేనూ పొందుతున్నాను నాన్నా!

మీకు గుర్తుందా! నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడు మీరు సైకిల్ కొన్నారు. ఆ రోజు అమ్మ నానమ్మ ‘ఆడపిల్లకు సైకిలెందుకు?’ అంటూ కేకలేశారు. ‘మగైనా, ఆడైనా ఒకటే. సైకిల్ మీద వెళితే దానికి టైం కలిసొస్తుంది,’ అని మీరే నాకు దగ్గరుండి నేర్పించారు. ఇంటర్ దాకా సైకిల్ మీద వెళ్లిన నాకు, డిగ్రీలో చేరిన వెంటనే బైక్ కొనిచ్చారు. అప్పుడు కూడా అమ్మ ఇలాగే గొడవ చేసింది., ఆడపిల్లకు బండేందుకు అని. అప్పుడు మీరు ‘అది రేపు ఆఫీసుకి వెళ్లాలన్న, పెళ్లయ్యాక బైట పనులు చూసుకోవాలన్నా, భర్త మీద ఆధారపడకుండా దానికి అవసరం. ముందు ముందు రోజుల్లో సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ బైటకు వెళ్ళటం ఇంకా కష్టమవుతుంది’ అంటూ నచ్చజెప్పారు. అమ్మ అసంతృప్తిగానే ఉండేది. ఆమె భయం ఆమెది. మీరు ఎంతో చెప్పగా ఎప్పుడో అమ్మ అర్థం చేసుకొంది.

ఇప్పుడు శ్రీకాంత్ ఆఫీస్ సమయాలు, నావి వేరుగా ఉన్నాయి. బైక్ రావటం వల్ల నేను పిల్లలను స్కూల్‌లో దింపి, ఆఫీసుకు వెళ్ళిపోతున్నాను. మీరెంత ముందు చూపుతో నేర్పించారా ఇవన్నీ అనిపిస్తుంది నాకు.

నాన్నా! అమ్మ చివరి రోజుల్లో, మంచంలో వున్నప్పుడు మీరు చేసిన సేవలు చూసాక, శ్రీకాంత్‌లో చాలా మార్పు వచ్చింది. అమ్మని చూద్దామని వచ్చి, మేం అక్కడ రెండు రోజులున్నప్పుడు మిమ్మల్ని బాగా పరిశీలించాడు. మీ ముఖంలో విసుగు గాని, అసహనం గాని కొంచెం కూడా లేకుండా అమ్మ పనులన్నీ ప్రేమగా చేయటం, మేం తిరిగి వచ్చాక కూడా ఎన్నోసార్లు తలచుకున్నాడు. మీ నాన్నగారు గ్రేట్ అని ఎన్నో సార్లు అన్నాడు.

అంతకు ముందంతా భార్యకు వంటింట్లో సాయం చేయటం కాని, ఓ గ్లాసు మంచి నీళ్లు ఇవ్వటం గాని తలవంపులుగా భావించేవాడు. ఇప్పుడలా కాదు, ఈ సారి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సేవా సంస్థ వాళ్ళు ఫోను చేసిన వెంటనే వెళ్లిపోతున్నానంటే అర్థమవుతోందిగా శ్రీకాంత్ ఇంట్లో ఎంత సహకరిస్తున్నాడో!
నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్నా, మీరు చెప్పిన సహనం, నమ్మకం రెండు మాటలు ఎప్పటికి మర్చిపోను నాన్నా!.

క్షణికావేశంతో, పెళ్ళైన ఏడాదికే నేను మీ దగ్గరకు వచ్చి, శ్రీకాంత్ వేరే స్త్రీ తో చనువుగా వుంటున్నాడని, ఇక అతనితో కలిసివుండనని ఏడ్చినప్పుడు అమ్మ కూడా ‘మంచి వాడనుకున్నాం, ఇలాంటి అలవాట్లున్నాయా’ అంటూ ఏడ్చింది. అప్పుడు మీరు ‘శ్రీకాంత్‌లో మగవాడిననే కొంచెం అహంకారం తప్ప, ఇటువంటివి ఉన్నట్లు అనిపించట్లేదమ్మా. పూర్తిగా తెలిసికోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు’, అని నాతో మీరు కూడా వచ్చి ఆఫీస్‌లో తెలిసినవాళ్ళ ద్వారా విచారిస్తే అది ఎవరో గిట్టని వాళ్ళ కల్పన అని, శ్రీకాంత్ అలాంటివాడు కాదని చెప్పారు. ఇంతకీ, ఆ గిట్టని వాళ్లెవరంటే శ్రీకాంత్ మేనమామ కూతురే! తనని పెళ్లి చేసుకోలేదనే అక్కసుతో శ్రీకాంత్ మీద లేనిపోని వన్నీ నాకు చెప్పి, నా మనసు విరిచేయాలని చూసిందని తెలిసింది. అప్పుడు మీరు చెప్పుడు మాటలు విని, నిజమని నమ్మి నిందలు వేయకూడదు. మనం స్వయంగా తెలుసుకోవాలి. కాపురాలు విడగొట్టుకోవటం తేలిక. ప్రేమ బంధంతో శాశ్వతంగా నిలబెట్టుకోవటమే గొప్పతనం అని చెప్పారు. భార్య భర్తలకు పరస్పరం నమ్మకం ఉండాలని చెప్పారు. ఆ రోజు మీరే పూనుకోక పోతే ఏమైవుండేదాన్ని!

నా జీవితం ఇంత పూలనావలా సాగిపోవటానికి మీరిచ్చిన సంస్కారం వ్యక్తిత్వాలే కారణం నాన్నా! ఆకాశమంత మీ ప్రేమను పొందటానికి మీ కూతురిగా పుట్టినందుకు గర్వంగా ఉంది.
ఇవాళ నాకు బాగా గుర్తొస్తున్నారు నాన్నా! ఇంకా పిల్లలు, శ్రీకాంత్ లేవలేదు. ప్రభాత వేళ, పక్షుల కిలాకీలారావాలు కిటికీ దగ్గర కూర్చుంటే చెవులకు అందంగా తాకుతున్నాయి. ఈ ప్రశాంత వేళలో మీకు ఉత్తరం రాసి, వాట్సాప్‌లో పంపాలనిపించింది. ఫోనులో అయితే ఇలా మాట్లాడలేను. చదువుతారు కదూ!
ప్రేమతో,

మీ
చిన్ని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here