ఆఖరి క్షణాలు

0
10

[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘ఆఖరి క్షణాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వా[/dropcap]ర్ధక్యం పైన బడినా పర్లేదు
బాగా చూసుకుంటామన్న‌‌‌
భరోసాను విశ్వసించి
ఆత్మీయ ప్రాణిని
హోమ్‌లో విడిచి పెట్టాం
మూడు రోజులు మాత్రమే!
పని మీద మరో
ఊరు పయనమవగా
మూడవ రోజు ఉదయాన
వచ్చింది ఫోన్ కాల్
జీవి కోమాలోకి వెళ్ళిందని
వచ్చి తీసుకెళ్ళమని
ఆఘమేఘాల మీద
ఆత్రంగా చేరుకుని
నిద్రావస్థలో ఉన్న దేహాన్ని
డాక్టర్ల కప్పగించగా
టెస్టులన్నీ చేసి
ఇంజెక్షన్లు పొడిచి
సెలైన్‌లు ఎక్కించి
బోలెడంత చార్జ్ చేసి
ఇక లాభం లేదు
వృద్ధురాలు మరి అన్నారు!
ఆశ వదుల్కోలేక
ప్రయత్నం సాగించమని
ప్రాధేయపడగా
నాల్గవ రోజున
ఎప్పుడైనా పోవచ్చు
ఇంటికి తీసుకెళ్ళమని
ఎమోషన్‌లెస్‌గా
నిక్కచ్చిగా చెప్పారు
పెద్ద పెద్ద మొత్తాలు
కట్టించుకుని వదిలారు

ఇంట్లో ———
క్షణమొక యుగంలా
గడిపాం నిరీక్షణలో
మధ్య మధ్య కదుల్తూ
ఆక్రోశంతో ఆర్తితో అరిచే
అవస్థ చూడలేక తల్లడిల్లి పోయాం
అంత వేదన లోనూ
మేం తాగించిన సూపు
కళ్ళు మూసుకుని ఆత్రంగా చప్పరించడం
మా పిలుపుకు స్పందించడం
చూసి కొంత సంతృప్తి పడ్డాం —

చివరికి ఆత్మ శాంతించింది
జీవం నిర్జీవమైంది
శరీరం బాధా విముక్తమైంది
పదిహేనేళ్ల ఋణానుబంధం
తెగిపోయింది గాలిపటంలా!

పరిపూర్ణ జీవనయానంలో
ప్రేమానురాగాలు పంచింది
తోడు నీడగా నిలిచింది
కుటుంబ వ్యక్తిలా మెలిగింది
అసూయా ద్వేషాలతో
మగ్గే మనుష్యుల కంటే
నిష్కల్మష మూగజీవి
మా ఒబ్లీయే మిన్న‌‌‌
అని భావించే మా మనసుల్లో
మరపురాని స్మృతులు
మిగిల్చి వెళ్లిపోయింది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here