ఆలి కోపం – ఆకలి కోపం

0
13

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]సం[/dropcap]తారి గ్రామంలో నీలమ్మ, నీలకంఠుడు అనే భార్యభర్తులుండేవారు. నీలమ్మ తెల్లగా బొద్దుగా వుంటుంది. నీలకంఠుడు నల్లగా, సన్నగా వుంటాడు. నీలమ్మకు బాగా అలంకరించుకోవడం ఇష్టం. రోజూ స్నానం చేసాక చక్కగా తలదువ్వుకుని, జడ వేసుకుని అందులో పువ్వుల దండను పెట్టుకునేది. ముఖానికి పౌడరు, కళ్లకు కాటుక, నుదుటన తిలకం బొట్టు, చేతికి రంగుల గాజులు వేసుకునేది. పనీపాట బాగా చేస్తుంది. ఇంటి ముందు పూలమొక్కలు పెంచింది. అరటి మొక్కలు నాటగా అవి పండ్ల గెలలు వేశాయి. తండ్రి కొనిచ్చిన కోడి పుంజును రోజు తవుడు, నూకలతో మేపుతుంటుంది. ఆ పుంజు అంటే ఆమెకు ఎంతో ఇష్టం.

నీలకంఠుడు సాదాసీదాగా వుంటాడు. కల్లు త్రాగుతాడు. చుట్టులు కాలుస్తాడు. ఒక రోజు నీలమ్మ నీళ్లు తేవడానికి ఇంటికి దూరంగా వున్న గెడ్డకు వెళ్లింది. అక్కడ తన స్నేహితురాళ్లతో మాట్లాడుతూ కొంతసేపు గడిపింది. నీలమ్మ గెడ్డ నుండి ఇంటికి వచ్చేలోగా నీలకంఠుడు గంపకింద ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లి సంతలో అమ్మేసాడు. ఆ డబ్బులతో కల్లు తాగాడు. పొగాకు కొన్నాడు. నీలమ్మ కోసం జుకిడి(తినే వస్తువు) కొన్నాడు. కొన్ని డబ్బులతో చేపలు కొన్నాడు రాత్రి కూరకోసం. నీలమ్మ ఇంటికి వచ్చే సరికి నీలకంఠుడు కనిపించలేదు. గంప కింద కోడిపుంజూ లేదు. పక్కింటి దుర్గమ్మత్త నీలకంఠుడు సంతకు కోడిపుంజును పట్టుకుని వెళ్లాడని చెప్పింది. నీలమ్మకు కోపం వచ్చింది. కొంత అంబలిని గిన్నెలో పోసి ఉట్టిమీద పెట్టింది. దుర్గమ్మత్తతో తాను పుట్టింటికి వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయింది. ఆమె పుట్టినిల్లు వారి ఊరికి క్రోసు (4 మైళ్లు) దూరంలో వుంది.

సంత నుండి ఇంటికి వచ్చిన నీలకంఠునికి నీలమ్మ కనబడలేదు. ఆకలి ఎక్కువయింది. తెచ్చిన చేపలు తాడుతో దూలానికి వ్రేలగట్టాడు. ఉట్టి మీదనున్న అంబలి త్రాగాడు. నీలమ్మా! నీలమ్మా! అంటూ అరవసాగాడు. కోపంతో చూరులోని కత్తి తీసి ఇంటిముందున్న అరటిచెట్టును నరివేశాడు. పూలమొక్కలు పీకి పారేశాడు. అరచి అరచి గుమ్మం మీద పడుకున్నాడు.

ఆలి మీద కోపంతో ఎంత పని చేసావురా నీలకంఠూ! గెలలు వేసిన అరటిచెట్లను నరికేశావు గదరా! అని గ్రామస్థులు చీవాట్లు పెట్టారు. తన తప్పు నీలకంఠుడికి తెలిసింది. ఉదయం నీలమ్మ ఎర్ర చీరకట్టుకుని నేత్తిమీద తట్టలో అన్నం, అంబలి పట్టుకుని.. జడలో బంతిపువ్వులు, ఎర్రగాజులుతో ఇంటికి వచ్చింది.

ఆలి(నీలమ్మ) మీద కోపంతో, ఆకలితో నీలకంఠుడు ఇంటి అరుగుమీద పెద్దగా కేకలు వేస్తున్నాడని ఆ వీధిలోని వారు చెప్పకోసాగారు. వారి మాటలు ‘ఆలి కోపం, ఆకలి కోపం’ అనే సామెతగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here