ఆమని-10

0
7

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 10వ భాగం. [/box]

[dropcap]చె[/dropcap]ఱువుజుమ్మలపాలెం, నరసాయపాలెం బోర్డర్ ఏరియాలో వున్న చెంచులు కల్తీ సారా తాగి అనారోగ్యం పాలయ్యారని, వారి పరిస్థితి తీవ్రంగా వుందని సబ్ సెక్షన్‌కి ఫోనొచ్చింది. తనకు కనెక్షనిచ్చారు. ఆ డివిజన్ ఆఫీసర్‍కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నది. అనారోగ్యం పాలయినవారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారని చెప్పారు. ఈ ఏరియాలో చెంచులున్నారు. వీళ్ళకు వేటంటేనే ఇష్టం. అడవిలో తిరిగి దుంపల్నీ, వేళ్ళనూ, తేనెను సేకరిస్తూ వుంటారు. అది గమనించి గవర్నమెంట్ ‘ఎపీకల్చర్’ కింద తేనె పరిశ్రమను వీళ్ళు చేపట్టేటట్లుగా ప్రోత్సహిస్తున్నది. ఐటిడిఎ సహకారంతో వీరందరికి తేనెపెట్టెలందించి వాటిని ఉపయోగించడంపై శిక్షణనిచ్చారు. ఐడిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఐఎఎస్ కాడర్‌కు చెందిన వ్యక్తులుంటారు. వారు అన్ని మండలాల్లో పర్యటిస్తూ సాధకబాధకాలు విచారిస్తూ వుంటారు. ఆ మధ్య తను ఆ ఆఫీసర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. ఆ బోర్డర్ ఏరియాలో వున్న గిరిజనులకు ఇంకా ఏమేం చేస్తే ఉపయోగంగా వుంటుందో అన్న విషయంపై చర్చించింది.

ఎక్కువమంది చెంచులు కల్తీ సారా తాగిన విషయం విని తనే స్వయంగా చెఱువుజుమ్మలపాలెం వెళ్ళింది.  ఆ పరిసరాలన్నింటిని పరిశీలించి చూసింది. పేదరికం, చదువు లేకపోవడం వాళ్ళ వెనుకబాటుతనానికి కారణమనుకున్నది. ప్రభుత్వం చాలా సదుపాయాలు కలగజేసింది. వాళ్ళలోనూ కొంతమంది చదువు బాట పట్టారు. మరికొందరు మాత్రం ఇంకా అలాగే వుండిపోయారు. వీళ్ళు కూడా దురలవాట్లు మాని ఏదైనా వృత్తి పట్ల ధ్యాసపెడితే ప్రభుత్వం ఆశించిన మార్పు వస్తుందనుకున్నది.

అక్కడున్న కొంతమందిని పిలిపించి మాట్లాడింది. “మిగతా వృత్తుల జోలికి పోకుండా, దూరంగా అడవికి వెళ్ళి ఏమైనా ఏరుకుని తెచ్చుకుని వాటితో కాలం గడపాలని అనుకోవద్దు. మరికొద్ది మంది నెమలీకలు పట్టుకుని అక్కడక్కడ కూడళ్ళలో నుంచుని అమ్ముకుంటూనో, అడుక్కుంటూనో బతికే పాత పద్ధతిలోనే వుండిపోతున్నారు. అలా చేయటం తప్పు. కష్టపడి పని చేయటానికి అలవాటు పడండి. ఆడవాళ్ళు కూడా రకరకాల వృత్తుల కలవాటు పడాలి. మీ ఏరియాకు ఈ కల్తీ సారా ఎక్కడి నుంచొచ్చింది?” అని ఆరా తీసింది.

“బట్టీ పెట్టుకుని వాళ్ళే సారా కాసుకున్నారండీ. కైపెక్క లేదని వార్నీష్ కలుపుకుని తాగారండీ. దాంతో జబ్బున పడ్డారండీ” అంటు వివరించారు.

“తాత్కాలికంగా బాగుంటుందని భ్రమపడి ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ వుంటారు. ఇలాంటి పిచ్చిపనులు ఇంకెవరూ చేయకండి” అంటూ జాగ్రత్తలు చెప్పింది.

తిరిగి బయల్దేరి వస్తుంటే అక్కడొక జామచెట్టు దగ్గర పదమూడు పద్నాలుగేళ్ళ పిల్లవాడొకడు చెట్టుకు బాణాలు వేస్తూ ప్రాక్టీసు చేస్తూ కనబడ్డాడు. అభినవ ఏకలవ్యుడా అనిపించేటట్లున్నాడు. వెదురుతో తయారు చేసుకున్న విల్లూ, బాణాలు వుపయోగిస్తున్నాడు. అది మెత్తని కలప కోవకి చెందిన బూరుగ చెట్టు. కాండం లావుగానే వున్నది. ఆ కాండానికి గురి చూసి ఒక దాని తర్వాత ఒకటిగా బాణాలు వేస్తున్నాడు. తన ధ్యాసలో తనున్నాడు. పరిసరాల స్పృహ లేకుండా తదేకంగా తన పనిలోనే నిమగ్నమైపోయున్నాడు.

వెహికల్ ఆపించి ఆ పిల్లవాణ్ణి పిలిపించింది.

“నీ పేరేమిటోయ్?”

“కన్నప్పండీ”

“ఏం చదువుతున్నావ్?”

“ఏడో క్లాసండీ”

“నీకిలా బాణాలు వేయటం ఎవరు నేర్పించారు? ఎవరి దగ్గరన్నా నేర్చుకుంటున్నావా? లేక నువ్వే సరదాగా వేస్తున్నావా?”

“నాకు చాలా ఇష్టమండీ. మా తాత ముత్తాతలు బాగా బాణాలేసి బాణానికొక జంతువును నేల కూల్చేవాళ్ళంట. నేనూ ఆళ్ళ లాగా బాగా బాణాలెయ్యటం నేర్చుకోవాలి. మా స్కూల్లో సారు కూడా బాగా నేర్చుకోమనే చెప్తున్నారు. నేను గోల చేత్తేనే మా అయ్య ఈ ఇల్లూ, బాణాలు చేసిచ్చి, ఈటిని ఏయటం నేర్పాడు. ఇపుడు నాకు నేనే బాణాలు ఏయటం నేర్చుకుంటున్నాను. అక్కడొక కుక్క పడుకునుంది. దాని మీద కేసేదా బాణాన్ని?” అని అడిగాడు.

“వద్దొద్దు. ఏ జంతువు మీదకూ వెయ్యద్దు. నువ్వు చదువు బాగా చదువుకో. ఈ విలువిద్య కూడా నేర్చుకుందువు గాని”

“నాకు చదువు కంటే కూడా ఇదే బాగా ఇష్టంగా వుంది. చాలా దూరంలో వున్నవాటిని కూడా పడగొట్టగలను. చూపించమంటారా?”

“అవసరం వచ్చినప్పుడు చూపించుదువు గాని. నేర్చుకునే సరదాలో పడి కనబడ్డ జంతువుకూ, పిట్టకూ వెయ్యకు. ఒక్కోసారి ఆ బాణాలు మనుషులకు తగిలి గాయాలు చేస్తాయి” అంటూ పక్కకి తిరిగి “చూడండి సుబ్బారావు గారూ! కన్నప్ప పూర్తి పేరు, స్కూలు పేరు, వాళ్ళ మాస్టారుగారి పేరు, అన్నీ నోట్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళకు శాస్త్రీయ పద్ధతిలో కోచింగ్ ఇప్పిస్తే మంచి విలుకాడవుతారు. జాతీయ ఆర్చరీ క్రీడాకారులుగా రాణించేది ఇలాంటి ఆణిముత్యాలే. వీళ్ళే సహజంగా, ప్రకృతి ఒడిలో నేర్చుకుంటూ గొప్పవాళ్ళవడానికి అవకాశమున్నది. ఈ మధ్య ‘గాండీవం’ అనే పథకం క్రింద పాఠశాల నుండి క్రీడాకారుల నెంపిక చేసుకుని కోచింగ్ ఇస్తున్నాను. దానికీ కుర్రాణ్ణి  రికమెండ్ చేద్దాం” అని తన అసిస్టెంట్‌కు ఆదేశాలనిచ్చింది.

‘చెట్టు కాండం చుట్టూ దగ్గర దగ్గరగా ఎంత బాగా వేశాడు బాణాల్ని. నిజంగా ఇలాంటి పిల్లలు మట్టిలో మాణిక్యాలు’ అనుకున్నది.

***

ఆ రాత్రి భోజనం చేసి కూర్చున్నాడు కిషోర్. పక్కనే పిల్లలిద్దరూ ఏదో వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళ డౌట్స్ తీరుస్తూ మధ్య మధ్యలో తల్లీ, తండ్రీతోనూ మాట్లాడుతున్నాడు.

“డాడీ! మమ్మీని ఎందుకక్కడ ఆంధ్రాలో వుంచుతున్నారు? మమ్మీ ఇక్కడకు రాకపోతే, మమ్మల్ని అయినా ఆంధ్రా పంపించండి. మమ్మీ లేకుండా ఇంకా ఎన్నాళ్ళుండాలి? మమ్మీ ఇంట్లో లేకపోతే అసలేం బాగుండటం లేదు” అన్నాడు నిర్మల్ బెంగగా.

“అవును డాడీ. నాకు అన్నమే తినాలనిపించటం లేదు. మమ్మీని ఇంకా చూడకపోతే నాకు ఏడుపే వచ్చేస్తున్నది. మేం ఎప్పుడు ఫోన్‍లో మాట్లాడినా ఏదో ఒక వంక చెప్తున్నది. ఇప్పుడేమో తాతగారికి ఏక్సిడెంట్ అయింది గదమ్మా, ఒక వారం ఆగి వస్తానని పెద్ద వంక చెప్తున్నది. నాకిదేం బాగుండలేదు డాడీ. మమ్మీని రేపే పిలుచుకురండి డాడీ” అంటూ దాదాపు ఏడ్చినంత పని చేస్తున్నది అనూష.

“నిజంగా కిషోర్! పిల్లల బాధ చూస్తుంటే జాలేస్తోంది. మాటి మాటికీ సౌందర్యనే గుర్తు చేసుకుంటున్నారు. తన ఆరోగ్యం అసలే అంతంత మాత్రంగా వున్నది. దానికి తోడు అన్నయ్యకిపుడు ఏక్సిడెంట్ అయి కాలు ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్లో వుండలేదు. ఇంట్లో ఒక్కతీ వుండలేదు. ఇబ్బందులన్నీ ఇట్లా ఒకదాని వెంట ఒకటి వస్తూనే వున్నాయి. ఎప్పటికి సరవుతాయో అర్థం కావటం లేదు” అన్నది తల్లి ఈశ్వరమ్మ.

“అవుతాయమ్మా. ఓపిక పట్టాలి. మధ్యాహ్నం కొరియర్ ఏమన్నా వచ్చిందా?”

“మర్చిపోయాను కిషోర్. పార్శిల్ ఏదో వచ్చింది. టీపాయ్ మీదుంచాను” అంటూ తెచ్చిచ్చింది.

“సౌందర్య ఫోన్ చేసి చెప్పిందమ్మా” అంటూ పార్శిల్ విప్పి పిల్లలకు ఎవరి బట్టలు వాళ్ళకిచ్చాడు. ప్రస్తుతం పిల్లల మూడ్ మార్చాలి. ఆ వుద్దేశంతోనే “బట్టలు వేసుకురండి. సరిపోతాయో లేదో చూద్దాం” అన్నాడు.

పిల్లలిద్దరూ వెంటనే వేసుకొచ్చారు. బాగా సరిపోవటమే గాక ఆ డ్రెస్‌లలో చూడముచ్చటగా కూడా వున్నారు. వాళ్ళ నలాగే ఫోటో తీసి స్నేహలతకు, సౌందర్యకూ వాట్సప్‌లో పంపాడు.

మంచి సెలెక్షన్. స్నేహలత మనసులానే మెత్తగా వుండి లేత రంగుల్లో కంటికి ఆహ్లాదంగా వున్నాయనుకున్నాడు. పిల్లలిద్దరికీ కూడా ఆ డ్రెస్‌లు బాగా నచ్చాయి. “కంఫర్ట్‌గా వున్నాయి డాడీ, చూట్టానిక్కూడా బాగా రిచ్‌ అప్పియరెన్స్‌గా వున్నాయి” అన్నారు.

“ఫోన్ చేసి ఆ డ్రెస్‌లు పంపిన ఆంటీకి థాంక్స్ చెప్పండి” అంటూ ఫోన్ కలిపాడు.

స్నేహలత లైన్లోకొచ్చింది. “హలో కిషోర్!” అంది.

“పిల్లలకు డ్రెస్‌లు పంపినందుకు థ్యాంక్స్. వాళ్ళకు బాగా నచ్చాయిట. వాళ్ళూ థ్యాంక్స్ చెప్తామంటున్నారు” అంటూ ఫోన్ నిర్మల్‌కి ఇచ్చాడు.

“నమస్తే ఆంటీ! థాంక్స్ ఆంటీ! మంచి డ్రెస్ పంపినందుకు. మీరెక్కడుంటారు? మేం మిమ్మల్నెపుడూ చూడలేదు.”

“ఈసారి వచ్చినప్పుడు నన్ను చూద్దురుగని, నేను ఆంధ్రా లోనే వుంటాను. నీ పేరేంటి? ఏం చదువుతున్నావ్?”

“నా పేరు నిర్మల్. ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నాను. మీరు మాకు చుట్టాలా ఆంటీ?”

“మీ డాడీ, నేనూ కలిసి చదువుకున్నాం. ఈ మధ్య మీ అమ్మతో కూడా మాట్లాడాను.”

“అమ్మతో మాట్లాడారా? త్వరగా ఇక్కడికొచ్చేయమని చెప్పండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ.”

“అమ్మమ్మ కొన్ని రోజులుండమంటే అమ్మ ఇక్కడ వున్నది. ఈలోగా తాతగారి కాలుకు దెబ్బ తగిలింది. తాతగారు హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ బెంగళూరు వచ్చేస్తుంది. నీకు మార్క్స్ ఎలా వస్తాయి? ఏ గ్రేడ్‌లో వుంటావు? మీ డాడీ చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ అట. నీవూ అంతేనా?”

“ఎ 1లో ఉంటానాంటీ” అంటూ, “మీతో చెల్లి మాట్లాడుతుందట” అన్నాడు.

అనూష ఫోన్ తన చేతిలోకి తీసుకున్నది. “హలో ఆంటీ! నమస్తే ఆంటీ!” అంది.

“నమస్తే చిట్టి తల్లీ! నీ పేరేంటి? నువ్వేం చదువుతున్నావు?”

“నా పేరు అనూష. థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాను. నా ఫ్రాక్ చాలా బావుంది ఆంటీ. థాంక్ యూ. ఆంధ్రాలో మంచి డ్రెస్‌లుంటాయా ఆంటీ?”

“నీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఆంధ్రాలో మంచి డ్రెస్‌లే వుంటాయి. మరోసారి కొని మమ్మీకిచ్చి పంపిస్తాను సరేనా?”

“మమ్మీని ఆంధ్రా నుండి త్వరగా బెంగళూరుకు పొమ్మని చెప్పండి ఆంటీ. ఇంట్లో అందరు బెంగపెట్టేసుకున్నారని చెప్పండి. నిర్మల్‌కూ, నాకూ రోజూ ఏడుపొస్తుందని చెప్పండి ఆంటీ.”

“ఏడవ్వద్దు. త్వరలోనే వచ్చేస్తుంది. నానమ్మను, తాతగారిని, డాడీని ఎవ్వరినీ విసిగించకూడదు. నీకు కథలెవరు చెప్తున్నారు?”

“నేనెవర్నీ విసిగించనాంటీ. డాడీయే ఎప్పుడన్నా చెప్తారు స్టోరీస్‌ను. మమ్మీ వుంటే ఎప్పుడూ చెప్పేది. చక్కదనాల చుక్కా అని పిలిచేది నన్నెప్పుడూ. డాడీ యేమో లవ్‌లీ అండ్ క్యూట్ బేబీ వమ్మా అంటారు. కాని డాడీతో పాటు మమ్మీ కూడా మా దగ్గరే వుండాలంటీ. మా మమ్మీ వుంటేనే మాకు బావుంటుందాంటీ” అని చెప్తుంటే అనూష గొంతు జీరపోతున్నది.

“బెంగపెట్టుకోవద్దు తల్లీ. అవునూ నిజంగా భలే ముద్దుగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వు బాగా చదువుతావా? అన్నయ్యా? ఎవరికెక్కువ మార్కులు వస్తాయ్?”

“నేనే బాగా చదువుతాను. మీరు మా ఇంటికెపుడైనా వచ్చినప్పుడు నా గ్రేడ్స్ అన్నీ చూపిస్తాను. మా మమ్మీ ఆంధ్రాలో మీకు కనిపిస్తుందిగా, తొందరగా రమ్మని చెప్తారుగా?”

“అలాగే చెప్తాను. ‘పిల్లలు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు, వెంటనే బెంగళూరు వెళ్లండి’ అని చెప్తాను. సరేనా?”

“ఇంక చాల్లే అనూ, కబుర్లు. ఆంటీని బాగా విసిగించేస్తున్నావు” అంటూ ఫోన్ తీసుకున్నాడు కిషోర్.

“నేనేం విసిగించలా. అడిగినవాటికి సమాధానం చెప్పానంతే” అంటూ బుంగమూతి పెట్టింది.

స్నేహలత ఇంకా లైన్‌లోనే వున్నది.

“స్నేహలతా! పిల్లలు బోర్ కొట్టించినట్లున్నారు.”

“ఛ. ఛ. అలా అనకండి కిషోర్. చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు. లేత గొంతులతో, పసి మనస్సులతో వాళ్లు మాట్లాడే మాటలు వినడానికి చాలా హాయిగా వున్నాయి. రెస్ట్ తీసుకోండి. వుంటాను. బై” అంటూ ఫోన్ పెట్టేసింది.

వీళ్ళిద్దరితో తనూ చిన్నపిల్లయిపోయి వీళ్ళతో కబుర్లు చెప్పింది. పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు. ఎవరితో మాట్లాడినా, ఎదుటివాళ్ళను నొప్పించకుండా ఆకట్టుకునేలా మాట్లాడడం స్నేహలత స్వంతం. ఆ మాటలకు, ఆ ప్రవర్తనకే తను అంతగా ముగ్ధుడయింది ఆ రోజుల్లో అనుకుంటూ నిట్టూర్చాడు.

కిషోర్, సౌందర్యల పిల్లలు ఎంతో ముద్దుగాను, తెలివిగానూ మాట్లాడుతున్నారు. ఈ వయసులోని పిల్లలందరూ అలాగే మాట్లాడుతారా? సుమబాల పిల్లలూ బాగా హుషారైన పిల్లలే. ఇప్పటి జెనరేషనే అంతేమో! తల్లిదండ్రులు కూడా చాలా శ్రద్ధగా పిల్లల్ని పెంచుతున్నారు. ఇలాంటి చిన్నారి పిల్లలతో మాట్లాడుతుంటే మనసుకి నచ్చిన సన్నని సంగీతం వింటున్నట్లుగా వున్నది. రోజూ వాళ్ళ సమక్షంలో గడిపే తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. అందుకే తెలుగులో అంటారనుకుంటా – ‘పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలూ’ అని. ‘గత జన్మ ఉందనీ చెప్తున్నారు. ఆ జన్మలో నేనూ ఆ రెండూ చేసి వుండను. అందుకే భర్తా లేడు, పిల్లలూ లేరు. ఈ ఒంటరి జీవితం గడపటం నాకు నేనుగా తీసుకున్న నిర్ణయమే. ఇప్పటికైనా తనెప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ ఒంటరి జీవితం నుండి బయటపడొచ్చు. ఇంకా తనే తన మనస్సును సిద్ధం చేసుకోవటంలో విఫలమవుతున్నది’ అనుకుంటూ ఆ ఆలోచనలను పక్కనబెట్టి పుస్తకాల రాక్‌లో నుంచి రవీంద్రుని గీతాంజలి ఇంగ్లీష్ వెర్షన్ తీసింది. పేజీలను తిరగేస్తున్నది. ఒక చోట ఆగిపోయింది – ఒక కన్య అంటున్నట్టుగా కవికి వినిపించిందట “నాకు పురుషునితో పనేం లేదు. అతడి అవసరం రాదు. ఎందుకంతే నేను యవ్వనాన్ని నా మనసులోకి రానివ్వను” అని. ఆ వాక్యాలు చదివి స్నేహలత నవ్వుకుంది. ‘అది నాలాంటి వారికీ వర్తిస్తుందా? నేనూ అలాంటి కోవకే చెందుతానా? కాలమే చెప్పాలి’ అని అనుకుంటూ మరో పేజీ తిప్పింది. ఒక చోట కళ్ళు ఆగిపోయాయి. ‘ప్రేమలో కలిగిన బాధే అనేక బిందువులుగా చింది పడి ఒక రూపం ధరిస్తున్నది. విశ్వవ్యాప్తమైన ప్రేమే ఎంతో తేజస్సు పొంది అడవి లోను, అడవిలో వున్న పక్షి కూతలోను, స్నేహితుల స్నేహంలోనూ, తల్లి ప్రేమలోనూ తొంగి చూసి మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అంటే నా విఫల ప్రేమ బాధ బిందురూపంలో వుండి ఇంతమంది వాత్సల్యంతో ఊరట పొందుతున్నారన్న మాట. బాగుంది’ అనుకుంటూ మరో పేజి తిప్పింది. ‘నిశ్శబ్దంగా నడిచి వచ్చే అతని అడుగుల సవ్వడి నాకు మాత్రమే వినబడుతుంది. ప్రతిక్షణం, ప్రతి పగలు ప్రతి రాత్రి అతను నా మదిలోకి వస్తూ, పోతూనే వున్నాడు. ఫెళఫెళకాసే చైత్ర మాసపు ఎండలోనూ, ప్రతి పరిమళంలోనూ, నిర్జనమైన అడవి మార్గానబడి అతను నా కోసం వస్తూనే వున్నాడు. అది నాకు మాత్రమే తెలుసు’. నాలాగ భ్రమపడే వారి కోసమే కవి ఈ కవిత వ్రాశాడా? ఇది ప్రేమికుని గురించి అయి వుండదు. భగవంతుని గురించి అనుకోవచ్చు. వెర్రిదానిలా ఎవరి అడుగుల సవ్వడి కోసం వేచి చూస్తున్నాను? ఎవరొస్తాను నా కోసం? ఇలాంటి భ్రమల్ని పూర్తిగా తుడిచెయ్యాలి” అనుకుంటూ లైటార్పి పడుకున్నది.

***

ఆ రోజు మరలా సి.ఎం.గారితో కాన్ఫరెన్స్ వున్నది. ఆయన మాటిమాటికీ అధికారులందరినీ పిలిపించో లేదా టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఎప్పటి విషయాలు అప్పుడు తెలుసుకుంటున్నారు. స్నేహలత తన ఐడియాలు, క్రింది ఆఫీసర్లిచ్చిన రిపోర్టులు, తను స్వయంగా తిరిగి తెలుసుకున్న విషయాలు, వ్యవసాయ, భూసార, వృక్షశాస్త్రజ్ఞులు ఇచ్చిన రిపోర్టులు అన్నింటితో సిద్ధంగా వున్నది. ఆ రోజు కాన్ఫరెన్సులో జిల్లా ఫారెస్ట్ కన్సర్వేటర్స్‌తో పాటు, విశాఖ ఏజన్సీ ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా వున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here