ఆమని-12

0
10

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 12వ భాగం. [/box]

[dropcap]”ఈ[/dropcap] బౌద్ధ స్టడీస్ సెంటర్ ఛైర్మన్ గారితో నాకు బాగా పరిచయముంది. గతంలో ఆయన విశాఖపట్టణంలో పనిచేశారు” అని చెప్పాడు. “ఇలాంటి ఫంక్షన్స్ లోనే ఎక్కడెక్కడి వాళ్ళనూ కలుసుకుంటాను, ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా వుంది” అని మనస్ఫూర్తిగా అన్నాడు అశోక్. “మీరు మాట్లాడుతూ వుండండి” అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

“నాన్నగారూ! ఈయనే మహంతి గారు. విశాఖ ఏజన్సీలో ఐటిడిఎ పివోగా పనిచేస్తున్నారు” అని చెప్పింది స్నేహలత.

తొందరగానే ఎరిగున్నవాడిలా కలిసిపోయి మాటలు మొదలుపెట్టాడు. ‘ఈ మహంతి గారు మాటలు మొదలెట్టారంటే టైమ్ కూడా చూసుకోరు’ అనుకుంటూ సున్నితంగా బై చెప్పి తన వాళ్ళతో కలిసి వచ్చేసింది. వచ్చేముందు “మరలా మనం ఎక్కడైనా కలుసుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నా” అన్నాడు.

“ష్యూర్” అంటూ తను వచ్చేసింది.

అందరూ ఇల్లు చేరుకున్నారు. కాస్త నలుగురినీ కలుసుకుని వాళ్ళతో మాట్లాడిన ఉల్లాసం తల్లిదండ్రులిద్దరిలోనూ చూసింది స్నేహలత. అందులోనూ వెళ్ళింది కొడుకు అత్తగారింటి బంధువుల దగ్గరకు.

తెలిసిన వాళ్ళు పెద్దగా లేక అమ్మ మరీ ఒంటరిగా ఫీలవుతున్నది. తను ఒక్కతే వుంటుందని తనకు తోడు వుండడం కోసం అమ్మావాళ్ళు ఇక్కడుంటున్నారు. లేకుంటే నాన్నగారు రిటైరవ్వగానే ఝార్ఖండ్ వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకున్న మాటే. తమ్ముడు కూడా అటువైపే సెటిలయ్యాడు. వాడినీ, వాడి కుటుంబాన్నీ కూడా తన గురించే మిస్ అవుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాన్నీ, ఆ స్టాఫ్‌నీ, అతిథుల్నీ చూసి నాన్నగారు కూడా ఉత్సాహంగా కనబడ్డారు. తన ఉద్యోగపు రోజులు గుర్తుకొచ్చి వుంటాయనుకున్నది.

తీరుబాటుగా కూర్చుని కాఫీలు తాగుతూ కుటుంబ సభ్యులందరూ కబుర్లలో పడ్డారు. బంధువుల గురించీ, అక్కడి ఏర్పాట్ల గురించీ కాస్సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కుంజలత కబుర్లు మొదలుపెట్టింది.

“ఆ ఐజి బాగానే వున్నాడు. మాటామంతీ కూడా బాగున్నది. అతడి ఉద్యోగమూ నచ్చింది. మనమ్మాయి ఐ.ఎఫ్.ఎస్. అయితే, అతను ఐ.పి.ఎస్. కేడర్ అతను. రెండో పెళ్ళివాడంటే బాగా ముదురుగా వుంటాడేమో అనుకున్నాను. మన స్నేహలత పక్కన మరీ అంత పెద్దవాడిగా లేడు” అన్నది.

ఉరుముల్లేని ఈ పిడుగుపాటుకు స్నేహలత ఒక్కసారిగా ఉలిక్కిపడిండి. “ఏంటీ? ఏంతమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వేమీ కలవరించటం లేదుగా?” అన్నది.

“కలవరింతలూ లేవు, పలవరింతలూ లేవు. ఆ ఐ.జి.ని చూశావుగా. అతనికి భార్య పోయిందట. మళ్ళీ పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారట! అతను మరో పెళ్ళీ వద్దు, ఏమీ వద్దు అంటున్నా ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా, వాళ్ళమ్మ మొండిపట్టు పట్టేసరికి మెత్తపడ్డాడట. ఎంత పెద్ద పోలీసాఫీసరు అయినా తల్లి కంట తడి పెడితే కాదంటాడా? అతనికి నిన్నిచ్చి చేస్తే బాగుంటుంది అంటున్నాడు మన వర్ధన్.”

తమ్ముడి వంక తల తిప్పి చూసింది. “ఏం వర్ధన్? నాకే పెళ్ళి చేసేటంత పెద్దవాడివయిపోయావా? అదీ నాకు చెప్పకుండా, నన్ను అడగకుండా!” అంది కోపంగా.

“వాడికీ బాధ్యతున్నదిగా స్నేహా! నీకిష్టమయితేనే” అన్నాడు తండ్రి అనునయంగా.

“ఇంత తెలిసిన పెద్దవారు నాన్నా మీరు. నన్నిలా అసహ్యంగా పెళ్ళిచూపులకు తీసికెళ్ళి నిలబెడతారా? కనీసం నేను చేసే ఉద్యోగానికైనా మర్యాద ఇవ్వాలనిపించలేదా నాన్నా?”

“నువ్వు బయట పెద్ద హోదాలో వుండొచ్చు. కానీ మాకు కూతురివేగా. నీ బాగోగులు ముందు ఈ మర్యాదేలేం గుర్తుకురావు.”

“అక్కా! కోపం తెచ్చుకోకు. నువ్విలా ఒంటరిగా మిగిలిపోవడం మాకందరకూ బాధగానే వున్నది. నీ మరదలు ఎక్కువగా మాట్లాడే మనిషి కాదు. ఆ సంగతి నీకూ తెలుసు. నువ్వు బాగా చదువుకున్నావని, పెద్ద ఉద్యోగంలో ఉన్నావనీ నువ్వంటే తనెప్పుడూ భయం భయంగానే వుంటుంది. కాని తను కూడా ‘మీ అక్కకు పెళ్ళయితే బాగుంటుంది, ఆలోచించండి’ అని తరచూ చెప్తూ వుంటుంది. ఈ ఐ.జి.గారి విషయం తనే చెప్పింది. వాళ్ళమ్మకు దగ్గిర బంధువు” అన్నాడు.

వర్ధన్ భార్య అప్పుడు నోరు విప్పింది. “అశోక్ అన్నయ్య చాలా హానెస్ట్. చత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్ల గొడవలెక్కువన్న సంగతి అందరూ ఎరిగిందే. తరచూ పోలీసులకూ, వాళ్ళకూ మధ్య ఎదురుకాల్పులు జరుగుతూంటాయి. అన్నయ్య నక్సలైట్ల బెదిరింపులకు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా వళ్ళను ఏరిపారేయాలని చూసేవాడు. ఒకరోజు పాపని తీసుకుని వదిన కారులో వస్తుంతే గుర్తు తెలియనివాళ్ళు దగ్గర నుంచి కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఇద్దరూ చనిపోయారు. ఇది జరిగి మూడేళ్ళవుతోంది” అంటూ చెమర్చిన కళ్ళను తుడుచుకున్నది. “అప్పట్నుంచి చెప్పగా, చెప్పగా అన్నయ్య ఇప్పటికి పెళ్ళికి ఒప్పుకున్నాడుట” అంది.

“అతను లక్షణంగా వున్నాడు. ఇన్ని ఏళ్ళు గడిచినాక మనకు మొదటి పెళ్ళివాడు రమ్మంటే ఎలా వస్తాడు? పెళ్ళి చేసుకోకుండా మనమ్మాయి వుందని దేశంలో మనకోసం కాచుకుని ఎవరుంటారు పెళ్ళి కాకుండా? ఇప్పుడు వాళ్ళు మనమ్మాయిని కాదనటానికి ఏ కారణమూ వుండదు. రెండు వైపులా పెద్దవాళ్ళం మాట్లాడుకుని ఖాయపర్చుకుంటే సరి. అన్నిటికీ మించి వర్ధన్ అత్తగారికి బాగా కావలసినవాళ్ళు. తెలిసినవాళ్ళలోనే, పిల్లనిచ్చుకోవటం అన్ని విధాలా మంచిది” అంటూ డిక్లేర్ చేసింది కుంజలత.

వి.సి.గారు మాత్రం నింపాదిగా వున్నారు. ఆయన కళ్ళకు మహంతి అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. అతడు, తన కూతురు మాట్లాడుతుంటే చాలా అభిమానంగా, ఆరాధనగా చూసిన చూపు గుర్తుకొచ్చింది. అతడి చూపులు పెళ్ళయిన వాడి చూపులుగా లేవు. ఒక పెళ్ళి కాని పురుషునిలో కనిపించే ప్రేమ తరంగాలే ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నట్లు అనిపించింది. ‘అశోక్‌కు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు ఈ పెళ్ళిచూపుల సంగతి చెప్పారో లేదో? అతనేమీ బయటపడకుండా చాలా గుంభనంగా వ్యవహరించి వెళ్ళాడు. తన కూతురు బాగా తెలివిగలది. తన జీవనారంభంలో పైకి పాకే ప్రేమలత నిర్దాక్షిణ్యంగా మొదలంటా లాగి వేయబడింది. అది మళ్ళా నిలదొక్కుకుని, కొత్త చిగుళ్ళు వేసి పైకి పాకటానికి కొంత సమయం పడుతుంది. సహజంగా అది తనంతట తాను చిగురించి అల్లుకుపోవాలే గాని బలవంతాన పైకి లాగాలనుకోవడం అవివేకమవుతుంది. వయసు మీరి పోతుందందని తన భార్య ఊరికే కంగారు పడుతున్నది. ఆమెకు తోడు తనూ కంగారు పడి కూతురుని ఒత్తిడి పెట్టడం మంచిది కాదు. ఈలోగా ఐజి సంబంధమంటూ వర్ధన్ ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. రెండో పెళ్ళి వాడిని తెచ్చామంటూ కూతురేమైనా ఫీలవుతుందేమో ఆలోచించుకోవాలి. అసలు ఈ పరిచయాల కార్యక్రమం హడావిడిగా అనుకోకుండా జరిగిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకుని వర్ధన్ ఆంధ్రా కొచ్చినట్టున్నాడు’ అని ఆలోచించసాగారు.

“అమ్మయ్య. విషయమంతా చెప్పేశాం. ఇక నిర్ణయం తీసుకోవటమే ఆలస్యం” అన్నట్టుగా అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు.

“జరిగిందానికి నాకు చాలా సిగ్గుగా వున్నది. ఆ ఐ.జి.గారేమనుకుంటారు? మనమాయన్ని ఇక్కడి దాకా రప్పించి ఏం సమాధానం చెప్పేటట్లు? నాకీ విషయం ముందే తెలిసి అక్కడికి వచ్చానని తప్పకుండా అనుకుంటారు. ఇప్పుడు తనని నేను రిజెక్ట్ చేస్తే ఎంత ఇన్సల్ట్‌గా ఫీలవుతారు? ఛ… ఛ… ఎంత ఫూలిష్‌గా ప్రవర్తించారు? ఒక గౌరవనీయ ఐపిఎస్ ఆఫీసర్‌గా చూశానే గాని ఇప్పుడాలోచించినా నాకు కావలసిన భర్త అనే ఫీలింగ్ ఏ మాత్రం కలగటం లేదు. ఫీలింగ్ లేని చోట నేను ఇమడలేను. ప్లీజ్! నన్నర్థం చేసుకోండి” అంటూ తన రూమ్‌లో కెళ్ళిపోయింది.

ఆ మాటలకు కుంజలతకు పట్టరాని కోపం వచ్చింది. అయినా కోడలి ముందు తమాయించుకున్నది. చిన్నపిల్లలయ్యేటప్పటికి యమున, భరత్‌లు నిద్రకు పడ్డారు. వాళ్ళిద్దర్నీ చెరోకళ్ళు భుజాన వేసుకుని వర్ధన్, అతని భార్య కూడా లోపలికెళ్ళారు.

స్నేహలత సోఫాలో జారగిలపడిపోయింది. మనసంతా భారంగా, చాలా అనీజీగా అయిపోయింది. ‘ఇవాళ తనెంత ఇరకాటంలో పడిందో ఆనాడు కిషోర్‌నూ ఇలాంటి పరిస్థితిలోకో, ఇంకా గడ్దు పరిస్థితిలోకో నెట్టి ఊపిరాడకుండా చేసి ఉంటారు. సబ్జెక్టు విషయంలో ఎంతో షార్ప్‌గా వుండేవాడో, అనుబంధాల విషయాని కొచ్చేసరికి వీగ్గా అనాలా, సున్నితంగా అనాలా అలా అయిపోయాడు. మధ్యలో పరిచయమైన దాన్ని గదా అని నన్ను పక్కన బెట్టేశాడు. కొన్నళ్ళాగి ఎవర్నో ఒకరిని పెళ్ళాడతానులే అనుకున్నాడు. కన్నతల్లికీ, తోడబుట్టిన చెల్లికీ, మిగతా కుటుంబసభ్యులకూ ప్రాధాన్యత ఇచ్చుకున్నాడు. తన వ్యక్తిగత సంతోషం కంటే కుటుంబమంతా సంతోషంగా వుండటం ప్రధానమనుకున్నాడు. ఛ… ఛ… అయిపోయిందేదో అయిపోయింది. ఇదంతా జరిగి దాదాపు పదేళ్ళు కావస్తుంది. ఇదంతా మరుగున పడిపోయిన స్థితికి తను వచ్చింది. అనుకోకుండా మళ్ళీ ఇక్కడ కలిసి పాత జ్ఞాపకాలు మేల్కొనేటట్టుగా చేశాడు. ఏది ఏమైనా ఆనాటి భావాల తీవ్రత ఇప్పుడు తనలో లేదు. ఇప్పుడు కిషోర్ కేవలం తనకొక మిత్రుడు  మాత్రమే. అంతకు మించి మరే ఆలోచనలూ రావు. సౌందర్య సంగతేమిటి? ఆమె కేన్సర్ నుండి బయటపడుతుందా? తప్పకుండా బయటపడాలి. ఆ చిన్నారి పిల్లలు తల్లి ప్రేమకు దూరం కాకూడదు’ అనుకున్నది.

ఆ మర్నాడు వర్ధన్ బయలుదేరుతానన్నాడు. “అక్కా! నాకింకా శెలవు దొరకటం కష్టం. నీక్కోపం వద్దు. నిదానంగా ఆలోచించు. నీకు చెప్పేటంత పెద్దవాడిని కాదు కానీ నీ జీవితం బాగుండాలని మాత్రమే కోరుకుంటాను” అన్నాడు.

“మరో రెండు రోజులన్నా వుండరాదా వర్ధన్? యమునతో, భరత్‌తో ఆడుకున్నట్టే లేదు” అన్నది స్నేహలత.

“మరే, పసిపిల్లలున్న ఇల్లు ఎంత నిండుగా, కళోడుతూ వుంటుందో చూశావుగా, పెళ్ళి చేసుకో. ఒకళ్ళనో, ఇద్దరినో కంటే జీవితానికి నిండుతనం వుంటుందని చెవినిల్లు గట్టుకుని పోరేది అందుకే మరి” అన్నది కుంజలత.

“ఏది మాట్లాడినా అటే మలుపుతావు గదా! మరీ పిచ్చెంకించకమ్మా” అన్నది స్నేహలత విసుగ్గా.

టిఫిన్ తినే కూతుర్ని ఇంకేమన్నా అంటే ఆ టిఫిన్ కూడా తినకుండా వదిలివేస్తుందని అప్పటికి నోరు మూసుకున్నది. వర్ధన్ వాళ్ళు వెళ్ళిపోయారు.

దారిలో, “ఇంత దూరం వచ్చి ఏం తేల్చుకున్నట్టు?” అన్నది వర్ధన్ భార్య.

“చూడగానే మనసు పారేసుకుని నేను కాబట్టి నిన్ను భార్యగా చేసుకున్నాను. ఇక్కడున్నది మా అక్క. ఎంతో ఆలోచించి కాని ఏ విషయమూ తేల్చుకోదూ” అన్నాడు వర్థన్.

***

ఇంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఆఫీసుకెళ్ళి పనిలో పడిపోయింది స్నేహలత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here